గత కొన్ని నెలలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తారాట్లాడుతున్న ఉగ్రవాద భూతం పట్టు చిక్కింది. నల్లగొండ జిల్లాలో శనివారం ఉదయం మూడు నాలుగు గంటలపాటు ప్రాణాలకు తెగించి పోలీసులు సాగించిన హోరాహోరీ పోరాటం ఫలించింది. ఆయుధాలతో చెలరేగుతూ పరారవడానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు జానకీపురం గ్రామంవద్ద మట్టుబెట్టగలిగారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ నాగరాజు గౌడ్ మరణించగా సీఐ బాలగంగిరెడ్డి, ఎస్‌ఐ సిద్ధయ్య తీవ్రంగా గాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, పొరుగునున్న తమిళనాడులోనూ ఈ ఉగ్రవాదుల కదలికలు అక్కడక్కడ కనబడుతున్నాయి. కానీ, ఇంతవరకూ వారికి సంబంధించిన నిర్దిష్ట సమాచారం మాత్రం పోలీసులకు లభిం చలేదు. కరీంనగర్ జిల్లాలో ఒక బ్యాంకు దోపిడీ... మరోచోట దోపిడీ యత్నం... నిరుడు మే నెలలో చెన్నైలో ఒక రైలులో బాంబు పేలుడు...ఇలా ఎక్కడో ఒకచోట కదలికలు తెలుస్తూనే ఉన్నాయి. ఇందులో చెన్నై ఘటన ఉగ్రవాదుల పనేనని స్పష్టం గా అర్థమైనా బ్యాంకు దోపిడీ విషయంలో సందిగ్ధత నెలకొంది. బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండులో జరిగిన ఘటన వీటన్నిటికీ పరాకాష్ట. అర్థరాత్రి తనిఖీలు చేస్తున్న పోలీసులు ఒక బస్సునుంచి ఇద్దరు అనుమానితులను దించి ప్రశ్నిస్తుండగానే వారు కాల్పులకు తెగబడి కానిస్టేబుల్‌నూ, హోంగార్డునూ పొట్టనబెట్టుకున్నారు. ఒక సీఐతోపాటు మరో హోంగార్డును కూడా గాయపరిచారు. హతులైన ఇద్దరూ కాక మరికొందరు ఉగ్రవాదులు పోలీసుల కన్నుగప్పి పరారై ఉండొచ్చునని జరిగిన ఉదంతాలను గమనిస్తే తెలుస్తోంది.
ఆ ఘటన జరిగిన తర్వాత జిల్లా వ్యాప్తంగా పోలీసులు 17 బృందాలతో పట్టు దలగా గాలించబట్టి... ప్రజలనుంచి వారికి సహాయసహకారాలు అందబట్టి శనివా రం ఉదయం ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టడం సాధ్యమైంది. అయితే, పోలీ సుల్లో ఉన్న పట్టుదలకూ, అంకితభావానికీ తగినట్టుగా వారి చేతుల్లో మెరుగైన ఆయుధాలు లేవు. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు లేవు. అన్నిటికన్నా ముఖ్యమైన పకడ్బందీ వ్యూహం లేదు. ఎస్సారెస్పీ కాలువ సమీపంలో తుంగతుర్తి సీఐ ఉగ్రవాదులను గుర్తించి కాల్పులు జరిపినా కొద్దిసేపటికే ఆ తుపాకి మొరాయించిందంటున్నారు. ఆ తర్వాత ఉగ్రవాదుల బారినుంచి అతి కష్టంమీద పోలీసులు తప్పించుకున్నారు. మరో సందర్భంలో పోలీసులు తమ వద్ద ఆయుధాలు లేక కర్రలు, రాళ్లు పట్టుకుని గట్టిగా అరుస్తూ ముందుకురికారు. ఇలాంటి దీనస్థితిని నివారించగలిగితే ఆ తర్వా త కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేది కాదు. అన్నిటికన్నా మించి ఉగ్రవాదులను వేటాడటానికి వెళ్లిన ఒక వాహనంలో ఒకరిద్దరు సిబ్బందికి మినహా మిగిలినవారివద్ద ఆయుధాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మిగిలిన బృం దాల పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా ఉండి ఉండదు. ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగివుంటే వేరు. కానీ, సూర్యాపేట ఉదంతంలో అప్పటికే ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసు ఉన్నతాధికారవర్గం సూర్యాపేట ఉదంతాన్ని ఒక సవాల్‌గా తీసుకుని చర్యలకు ఉపక్రమించింది. వీటిని స్వయంగా ఐజీ, డీఐజీలు పర్యవేక్షించారు. ఇంతగా చేస్తున్నట్టు కనిపించినా ఆచరణ మాత్రం లోపాలమయం గా ఉంది. గాలింపులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని మాత్రం అభినందించాలి.
తాము నరరూప రాక్షసులతో వ్యవహరించాల్సి ఉన్నదని తెలిసినా, తమ వద్ద సరైన ఆయుధాలు, ఆత్మరక్షణకు అవసరమైన ఇతర సరంజామా లేదని తెలిసినా వారు ముందుకురికారు. ఉగ్రవాదులవైపునుంచి కాల్పులు జరుగుతున్నా తెగించి వెంబ డించారు. ఇదంతా వృత్తిపట్ల వారికున్న అంకితభావాన్ని తెలుపుతుంది. వారి ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలుస్తుంది. అయితే పకడ్బందీ వ్యూహం ఉన్నట్టయితేనే ఈ అంకితభావమూ, ఈ ధైర్యసాహసాలూ రాణింపునకు వస్తాయి. తమవైపుగా ఎలాంటి ప్రాణనష్టమూ లేకుండా ఉగ్రవాదాన్ని, ఇతర నేరస్తముఠాలను కూకటి వేళ్లతో పెకిలించడం సాధ్యమవుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే అన్ని జిల్లాల్లోని పోలీసులకూ కొత్త వాహనాలు కొనిచ్చారు. బడ్జెట్‌లో హోంశాఖకు కేటాయింపులు కూడా పెంచారు. కానీ, సరిదిద్దాల్సిన లోపాలెన్నో ఉన్నాయని తాజా ఉదంతాలు తెలియపరుస్తు న్నాయి.
ఉగ్రవాదం వేళ్లూనుకోవడానికి ప్రయత్నిస్తున్న వేళ అన్ని స్థాయిలలోనూ ఎంతో అప్రమత్తత అవసరమవుతుంది. ఉదాహరణకు సూర్యాపేట ఉదంతంలో సీఐ గన్‌మాన్‌నుంచి కార్బయిన్ దొంగిలించి తీసుకెళ్లినా వారు యూపీ దొంగల ముఠావారే అయి ఉంటారని చివరివరకూ పోలీసు ఉన్నతాధికారులూ, హోంమంత్రి నమ్మారు. వారు ఉగ్రవాదులు అయివుండొచ్చునన్న అంచనాకొచ్చి ఉంటే బహుశా ఈ ఆపరేషన్ మరింత పకడ్బందీగా జరిగేదేమో! గతంలో హైదరా బాద్‌లో లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్‌సుఖ్‌నగర్ తదితరచోట్ల ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడి పౌరుల ప్రాణాలు తీశారు. కొన్ని జిల్లాల్లో వారి కదలికలు కనబడ్డాయి. ఈమధ్యే బెంగాల్‌లో జరిగిన బుర్ద్వాన్ పేలుడు కేసు మూలాలు హైదరాబాద్‌లో ఉన్నాయని వెల్లడైంది. ఇక ఉగ్రవాద స్లీపర్ సెల్స్ అక్కడక్కడ ఉండొచ్చని, ఇవి ఎప్పుడైనా మారణహోమం సృష్టించే పరిస్థితులుంటాయని నిఘా వర్గాల హెచ్చరికలున్నాయి. కనుక ఏమరుపాటు పనికిరాదు. సూర్యాపేట, జానకీపురం ఉదంతాల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి. ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆత్మరక్షణకు అవసరమైన సాధనాసంపత్తిని పోలీసు యంత్రాంగానికి సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడం తోపాటు తగిన శిక్షణనిచ్చినప్పుడే ఉగ్రవాదాన్ని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనడం పోలీసులకు సాధ్యమవుతుంది. పాలకులు ఈ అంశాలపై దృష్టి సారించడమే ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి నిజమైన నివాళి అవుతుంది.
బహుపరాక్!
Published Mon, Apr 6 2015 12:30 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement