దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుల్లో భగత్‌సింగ్, ఆయన అనుచరుల స్థానం విశిష్టమైనది. భగత్‌సింగ్ అనగానే అందరికీ ఆయన సాహసోపేత చర్యలు గుర్తొస్తాయి. ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఉరికంబమెక్కిన ఆయన త్యాగనిరతి స్ఫురణకొస్తుంది. అన్నిటికీ మించి ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలపైనా, వాటి పరిష్కార మార్గాలపైనా 23 ఏళ్ల చిరుప్రాయంలోనే భగత్‌సింగ్‌కున్న అవగాహన అబ్బురపరుస్తుంది. అందువల్లే అంతటి మహోన్నతుణ్ణి ఎవరైనా ‘విప్లవ ఉగ్రవాది’(క్రాంతికారి ఆటంక్‌వాద్) అని ముద్రేస్తే ఆగ్రహం కలగడంలో, వివాదం సాగడంలో వింతేమీ లేదు. ఢిల్లీ యూనివర్సిటీ తన చరిత్ర విద్యార్థుల కోసం నిర్దేశించిన పాఠ్య ప్రణాళికలో చదవదగిన గ్రంథమంటూ సూచించిన ‘ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్’, దాని హిందీ అనువాదం‘భారత్ కా స్వతంత్ర సంఘర్ష్’ పుస్తకాలపై ప్రస్తుత వివాదం నడుస్తోంది.
ఇందులో కొన్నిచోట్ల భగత్‌సింగ్‌నూ, ఆయన అనుచరులనూ విప్లవ ఉగ్రవాదులుగా అభివర్ణించారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో ఆరోపించారు. వారినలా అభివర్ణించడమంటే ఆ వ్యక్తుల త్యాగనిరతిని ‘అకడమిక్‌గా’ హత్య చేయడమేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. భగత్‌సింగ్ కుటుంబీకులనుంచి సైతం తమకు ఫిర్యాదులందాయని ఆమె చెప్పారు. రాజ్యసభలో ఉపాధ్యక్షుడు పీజే కురియన్ స్పందిస్తూ ఆ గ్రంథాల్లోని అభ్యంతరకర ప్రస్తావనలను తొలగించేలా చూడాలని కోరారు. ఢిల్లీ యూనివర్సిటీ వెనువెంటనే రంగంలోకి దిగి ఆ గ్రంథాల పంపిణీ, అమ్మకం నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. నిజానికి ఒక్క ఢిల్లీ యూనివర్సిటీ మాత్రమే కాదు...దేశంలోని అనేక యూనివర్సిటీలు వాటిని చదవదగిన పుస్తకాలుగా సూచిస్తున్నాయి.
భగత్‌సింగ్ పట్ల ఈ దేశ ప్రజల్లో ఉండే ఆదరాభిమానాలు సామాన్యమైనవి కాదు. అవి మన నేతల ఆగ్రహావేశాల్లో వ్యక్తం కావడంలో వింతేమీ లేదు. అయితే ఇప్పుడు చెలరేగిన వివాదం కేవలం అందుకు మాత్రమే పరిమితమైనది కాదని ఇంకొంచెం లోతుల్లోకి వెళ్తే అర్ధమవుతుంది. విఖ్యాత చరిత్రకారుడు బిపన్‌చంద్ర మరికొందరితో కలిసి ఈ గ్రంథాన్ని రచించారు. వీరంతా చరిత్ర రచనలో లబ్ధప్రతిష్టులైనవారు. జాతీయోద్యమంపై వీరు సాగించిన పరిశోధన, అధ్యయనం...ఎన్నో కొత్త కోణాలను ఆవిష్కరించాయి. ఆ ఉద్యమంలో భిన్న వర్గాల ప్రజలు పాల్గొన్న తీరుపైనా, అది వలస పాలకులను వణికించిన తీరుపైనా ఈ చరిత్రకారులు చేసిన నిర్ధారణలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందాయి. ముఖ్యంగా బిపన్ చంద్ర వలసవాదం, సమకాలీన చరిత్ర, మతతత్వ వ్యతిరేక ఉద్యమాలువంటి అంశాలపై విస్తృతంగా రచనలు చేశారు.
ఆధునిక భారత చరిత్రను సాధారణ ప్రజానీకానికి సుబోధకం చేశారు. అలాంటివారు త్యాగాల, సాహసాల కలబోత అయిన భగత్‌సింగ్ ప్రభృతులను అంత బాధ్యతారహితంగా ఉగ్రవాదులతో ఎలా పోల్చారన్న సంశయం మన నేతలకు రావలసింది. పుస్తక రచయితల్లో ఒకరైన బిపన్‌చంద్ర 2014లో కన్నుమూశారు. ఇప్పుడు వివాదం తలెత్తింది గనుక ఆ గ్రంథ రచనలో పాలుపంచుకున్న ఇతర రచయితలను సంప్రదించడం, వారి వివరణ తీసుకోవడం పెద్ద కష్టం కాదు. ఉగ్రవాది అనే పదం పఠితల్లో కలగజేసే భావనను వారు గ్రహించలేకపోయారా లేక దాన్ని ఉపయోగించడానికి ప్రత్యేకమైన కారణమేమైనా ఉన్నదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించాల్సింది. ఆ పని జరగలేదు. పార్లమెంటు చర్చలో మాట్లాడినవారు కూడా పరస్పరం విమర్శించుకోవడానికే ఈ వివాదాన్ని ఉపయోగించుకున్నారు. పాతికేళ్లకు పైబడి వివిధ యూనివర్సిటీల్లోని చరిత్ర విద్యార్థులు ఉపయోగిస్తున్న పుస్తకంలోని వివాదాస్పద అంశం ఇంతకాలం ఎందుకు మరుగున పడిపోయిందో ఎవరూ చెప్పలేకపోయారు.
జాతీయోద్యమంలో భిన్న స్రవంతులున్నాయి. ఈ దేశానికి స్వాతంత్య్రం రావడానికి అనుసరించాల్సిన పద్ధతులపై నాయకుల్లో వేర్వేరు అభిప్రాయా లున్నాయి. వలసపాలకులను ఒప్పించి, నిష్ర్కమించక తప్పని పరిస్థితులు కల్పించి అహింసా విధానంలో స్వాతంత్య్రం సాధించడం సాధ్యమేనని కాంగ్రెస్, మహాత్మాగాంధీ విశ్వసిస్తే...ఖుదీరాం బోస్, మదన్‌లాల్ ధింగ్రా వంటివారు తుపాకులు, బాంబులతో దాడులు చేస్తేనే వారి పాలన విరగడవుతుందని భావించారు. 1908-1918 మధ్య అలాంటి హింసాత్మక విధానాలకు పాల్పడిన అనేకమందిని పాలకులు ఉరితీశారు. ఖైదు చేశారు. ఆ తర్వాత అలాంటి ఘటనల తీవ్రత తగ్గిపోయింది.
మహాత్ముడి నేతృత్వంలో సాగుతున్న సహాయ నిరాకరణోద్యమం చౌరీచౌరాలో హింసకు దారితీయడం పర్యవసానంగా నిలిపేసినప్పుడు 1922లో భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు రంగంలోకొచ్చారు. వారి చర్యలను విప్లవకర ఉగ్రవాదమని వ్యవహరించేవారు. ప్రజలను నిలువుదోపిడీ చేస్తూ, వారిపై అణచివేత చర్యలకు పాల్పడే వలస పాలకులపై హింసను ప్రయోగించి, భీతావహుల్ని చేసి దేశంనుంచి తరిమికొట్టడమే వీరి ధ్యేయం. బిపన్‌చంద్ర విప్లవకర ఉగ్రవాదం పదాన్ని పుస్తకంలో తొలిసారిగా వినియోగించినప్పుడే అందుకు సంబంధించిన వివరణనిచ్చారు. దాన్ని అవమానకర అర్ధంలో వినియోగించడంలేదని చెప్పారు. అయినప్పటికీ నిస్సహా యులైన పౌరులను నిర్దాక్షిణ్యంగా హతమార్చడంవంటి ఉన్మాద చర్యలు అంతర్జాతీ యంగా పెచ్చుమీరాక దాని అర్ధమే పూర్తిగా మారిపోయింది. కనుక ఆ పదాన్ని తొలగిస్తున్నట్టు రచయితలు ప్రకటించి ఉంటే వేరుగా ఉండేది.
వారు ఆ పని చేయలేదు. అయితే 2006లో భగత్‌సింగ్ రచనల సంపుటిని వెలువరించినప్పుడు ఆయనను బిపన్‌చంద్ర విప్లవ సామ్యవాదిగా అభివర్ణించారు. అనంతర రచనల్లో సైతం దాన్నే కొనసాగించారు. ఇలాంటి నేపథ్యంలో బిపన్‌చంద్ర వంటి విఖ్యాత చరిత్రకారుడిలో అవగాహనా లోపం ఏమైనా ఉంటే విమర్శించడంలోగానీ, దానితో విభేదించడంలోగానీ తప్పు లేదు. కానీ ప్రపంచం మెచ్చే మేధావులకు ఉద్దేశాలు ఆపాదించడం సబబనిపించుకోదు. ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు ఆదరణ పెరిగి తరగతి గదులనుంచి నిష్ర్కమిస్తున్న ‘చరిత్ర’ పార్లమెంటుకెక్కడం మంచిదే అయినా ఆ చర్చ భగత్‌సింగ్ వ్యక్తిత్వం, ఆదర్శాలు, ఆయన కలలుగన్న సమాజం తదితరాలపై సాగాలని... అది మెరుగైన విధానాల రూపకల్పనకు దోహదపడాలని ఆశిద్దాం.
చరిత్ర-చర్చ
Published Tue, May 3 2016 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM
Advertisement