యాదృచ్ఛికమే అయినా పాఠశాల విద్యా వ్యవస్థలో ఇప్పుడున్న ‘నో డిటెన్షన్’ విధానాన్ని కొనసాగించాలా, ఎత్తేయాలా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్న సమయంలోనే... ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మన విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్న క్లేశాలేమిటో, వాటిని సరిదిద్దడానికి అవసరమైన చర్యలు ఎలా ఉండాలో బొత్తిగా అర్ధంకాని మన పాలకులకు ఈ తీర్పు చెంపపెట్టు. ఎనిమిదో తరగతి వరకూ విద్యార్థులు చదివినా, చదవకున్నా వారిని ఫెయిల్ చేయరాదని విద్యా హక్కు చట్టంలోని నిబంధన చెబుతున్నది. ఇందువల్ల విద్యార్థుల్లో ఒక విధమైన అలసత్వం ఏర్పడుతున్నదనీ, ఫెయిల్ అవుతామన్న భయం లేకపోవడంవల్ల అధిక శాతంమంది విద్యార్థులు చదవడం మానేశారనీ కొందరి వాదన.
విద్యార్థుల్ని మదింపువేసే విధానం లేకపోవడంవల్ల బాగా చదివే విద్యార్థికీ... చదవని విద్యార్థికీ, ఆసక్తిగల విద్యార్థికీ... అది కొరవడిన విద్యార్థికీ తేడా లేకుండా పోతున్నదనీ, ఇద్దరూ పై తరగతులకు వస్తుండటంవల్ల ఉపాధ్యాయుడికి బోధన కష్టమవుతున్నదని వారంటున్నారు. చదువులో వెనకబడిన పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని బోధించాలా, వెంటవెంటనే అందుకోగలిగినవారిని ఉద్దేశించి బోధించాలా అన్నది తెలియడంలేదని చాలా మంది ఉపాధ్యాయులు ఫిర్యాదు చేస్తున్నారట. ఈ ‘నో డిటెన్షన్’ విధానం వాస్తవానికి అయిదేళ్ల క్రితం అమల్లోకొచ్చిన విద్యా హక్కు చట్టంలోనిదే అయినా దాంతో సంబంధం లేకుండా చాలా రాష్ట్రాలు దశాబ్దాలుగా దాన్ని అమలు చేస్తున్నాయి.
సమస్య ఉన్నదనుకున్నప్పుడు దాని మూలాల్లోకి వెళ్లి కారణాలు తెలుసుకోవడం, పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయడం పాలకుల ధర్మం. జిల్లా విద్యా సమాచార వ్యవస్థ( డైస్) గణాంకాల ప్రకారం తొమ్మిదో తరగతిలో అధిక శాతంమంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. దీన్ని సరిదిద్దడానికి ఏం చేయాలని ఆలోచించిన కేంద్ర విద్యా విషయాల సలహా బోర్డు (సీఏబీఈ) 2012లో అప్పటి హర్యానా విద్యామంత్రి గీతా భుక్కాల్ నేతృత్వంలో ఒక సబ్ కమిటీని నియమించింది. ఎనిమిదో తరగతి వరకూ అమల్లో ఉండే ‘నో డిటెన్షన్’ విధానంవల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని ఆ కమిటీ విశ్లేషించి, దాన్ని ఎత్తిపారేస్తే అంతా సర్దుకుంటుందని సిఫార్సు చేసింది. రెండు రోజులక్రితం సమావేశమైన సీఏబీఈ సభ్యులంతా ఈ కమిటీ సిఫార్సులను ‘ఏకగ్రీవం’గా ఆమోదించారనీ, రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులందరూ కూడా దీన్నే కోరుతున్నారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెబుతున్నారు.
మనకు 2010లో విద్యా హక్కు చట్టం అమల్లోకొచ్చింది. అది ఈనాటికీ అరకొరగానే అమలవుతున్నదని గత నెలలో ఒక అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాంటిది చట్టం అమలు ప్రారంభించిన రెండేళ్లలోనే ఫెయిలవుతున్నవారి సంఖ్యను చూసి గుండెలు బాదుకుని కమిటీ నియమించడం...ఆ కమిటీ చట్టాన్నే దోషిగా చేయడం వింతగొలిపే విషయం. ఆ పని చేయడానికి బదులు అసలు ఆ చట్టంలోని ఇతర నిబంధనలను ఆచరణలో ఏమేరకు పాటిస్తున్నారో, వాటిని పాటించని సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అధ్యయనం చేస్తే గీతా భుక్కాల్ కమిటీకి సమస్య కాస్తయినా అవగతమయ్యేది.
14 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరి విద్య అమలు కావాలన్నదే ‘నో డిటెన్షన్’ విధానంలోని ఉద్దేశం. ఆ విధానంవల్ల చదువుపై శ్రద్ధపెట్టని విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదనుకుంటే అలాంటివారిని మెరుగుపర్చడానికి ఏం చేయాలో ఆలోచించాలి. బ్రిడ్జి కోర్సులవంటి వాటిని అమలు చేయాలి. ఉపాధ్యాయుడు పిల్లలందరిపైనా దృష్టి పెట్టడానికి వీలుగా ఒక తరగతికి పరిమిత సంఖ్యలో పిల్లలుండేలా చూడాలి. చదువులో మందకొడిగా ఉంటున్న పిల్లల కోసం తొమ్మిదో తరగతిలో రాష్ట్రీయ మాథ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ)కింద మూడు నెలల కోర్సును ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. తొమ్మిదో తరగతిలో మాత్రమే నిర్వహించే ఈ కోర్సులవల్ల వెనువెంటనే ఆశించిన ఫలితాలు రావు. కనీసం అయిదో తరగతి మొదలుకొని అన్ని తరగతుల్లోనూ చదువులో వెనకబడినవారిని గుర్తించి వారి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విధానం ఉంటే తొమ్మిదో తరగతికొచ్చేసరికి ఆ తరహా విద్యార్థులు మెరుగవుతారు.
‘నో డిటెన్షన్’ విధానం ఒక్క మన దేశంలోనే కాదు...బ్రిటన్‌లో కూడా అమల్లో ఉంది. అక్కడ కూడా పరీక్షా ఫలితాలతో నిమిత్తం లేకుండా పిల్లలు తదుపరి తరగతులకు వెళ్తారు. అయితే మెరుగ్గా ఉండనివారిని గుర్తించి, వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచించే విధానం అక్కడ అమలవుతున్నది. భవిష్యత్తులో అలాంటి పిల్లలు బాగా తయారు కావాలంటే తీసుకోవాల్సిన చర్యలేమిటో ఉపాధ్యాయులు విశ్లేషించి పరిష్కారాలను సూచిస్తారు. మన దగ్గర పిల్లలపై అలాంటి శ్రద్ధ పెట్టడానికి ఎన్నో అవరోధాలున్నాయి. తరగతి గదులు బహిరంగసభల్ని తలపించేలా ఉంటాయి. అవసరమైన సంఖ్యలో ఉపాధ్యాయులుండరు. విద్యార్థులు అవగాహనను పెంచడానికి తోడ్పడే బోధనోపకరణాలుండవు. పాఠశాలకెళ్తే మరుగుదొడ్డి, మంచినీరు మొదలుకొని అన్నీ సమస్యలే. అలాంటి వాతావరణంలో చదువుపై ఆసక్తి ఎలా కలుగుతుందో...టీచర్లు ఎలా బోధించగలుగుతారో అనూహ్యం. గీతా భూక్కాల్ కమిటీ వీటి జోలికి పోలేదు.
ఈ విషయంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అక్కరకొస్తుంది. ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారి మొదలు సామాన్య ఉద్యోగి వరకూ....అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులూ తమ పిల్లలను సర్కారీ బడులకు పంపడం మొదలుపెడ్తే అక్కడున్న సమస్యలు అందరికీ అవగాహనకొస్తాయి. పలుకుబడిగల వర్గాలు గనుక ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిల్చి, సమస్యలను పరిష్కరించుకో గలుగుతారు. అందరిలో జవాబుదారీతనం పెరుగుతుంది. మళ్లీ సర్కారీ బడులు వెలుగులీనుతాయి. అప్పుడు ‘నో డిటెన్షన్’ విధానం ఉన్నా, లేకున్నా పట్టించుకునే వారుండరు. అలహాబాద్ హైకోర్టు తీర్పులోని స్ఫూర్తిని అవగాహన చేసుకుని ప్రభుత్వాలు తమ లోపాలను సరిదిద్దుకుంటే విద్యా హక్కు చట్టం ఆశయం నెరవేరుతుంది. అందరికీ మెరుగైన, ప్రామాణికమైన విద్య అందుబాటులోకి రావడం సాధ్యమవుతుంది.
‘అందరికీ విద్య’ ఎలా?!
Published Sat, Aug 22 2015 12:20 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement