ఇల్లాలి ఇల్లు | Kamala Got A Small Job | Sakshi
Sakshi News home page

ఇల్లాలి ఇల్లు

Published Mon, Oct 29 2018 12:08 AM | Last Updated on Mon, Oct 29 2018 8:24 PM

Kamala Got A Small Job - Sakshi

పెద్దగా చదువుకోని కమలకు చిన్న ఉద్యోగం దొరికింది. కష్టపడి ఏ పనైనా చెయ్యటానికి సిద్ధపడే వారికి ఏదో ఒక ఉద్యోగం దొరకకపోదు. ఉద్యోగం దొరికిన కొన్నాళ్లకి తనకంటూ తనదైన ఒక ఇల్లు ఎంత చిన్నదైనా సరే, అద్దెకు సంపాదించాలనుకుంది. కాని ఇల్లు దొరకటం ఉద్యోగం దొరకటమంత సులభంగా లేదు. మీరెంతమంది వుంటారు? నేనొక్కతినే! మీవారు, పిల్లలూ ఈ ఊళ్లో ఉండరా? మావారుంటారు. పిల్లలు పెళ్లిళ్లయి దూరంగా ఉన్నారు.’’ మీవారు మిమ్మల్ని విడిచిపెట్టారా? లేక విడాకులిచ్చారా?’’ లేదు’’ మీవారేం చేస్తూ వుంటారు?’’ కమల చెప్పింది. అంత పెద్ద ఉద్యోగస్థుడి భార్య అయిన మీరు ఇంత చిన్న ఇంట్లో ఉండగలరా?’’ అనే అనుకుంటున్నాను’’ మీ ఇద్దరు దెబ్బలాడుకున్నారా?’’లేదు’’ మీకు స్వంత ఇల్లుందా?’’లేదు’’ మీరో అద్దె ఇంట్లోనూ, మీ ఆయనో అద్దె ఇంట్లోనూ ఉంటారా?’’కాదు. నేను అద్దె ఇంట్లోనూ, ఆయన తన స్వంత ఇంట్లోనూ ఉంటాము.’’ ఆయన స్వంత ఇల్లు మీది కాదా?’’ కాదుట’’ ఎవరన్నారు?’’

ఆఖరికి కమల వయస్సే ఉన్న ఒక అవివాహిత స్త్రీ కమల ఆఫీసులోనే పనిచేస్తున్న ఆవిడ చిన్న ఇంట్లో చిన్న భాగం విడిగా ఏర్పాటు చేసి కమలకి అద్దెకిచ్చింది, కంపెనీ కోసం. ఆ మర్నాడు కమల ఆఫీసుకు సెలవు పెట్టి బాంకుకు వెళ్లింది. బాంకులో ఆమె పేర్న తండ్రి పోతూ పోతూ వేసిన పదివేల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఉన్నాయి. దానిమీద అయిదు వేలు అప్పు తీసుకుని ఇంటికి కావలసిన మంచం, పరుపు, స్టౌ, పప్పులు, ఉప్పులు కొనిపెట్టుకుంది. ఆ పైన భర్త ఇంటికి వెళ్లింది. ‘‘ఇన్నాళ్లూ మీరు నన్ను పోషించారు. నేను చాకిరీ చేసాను. రెండింటికీ చెల్లు. ఇందులో నా ఎడ్రస్‌ ఇస్తున్నాను. ఆ ఇల్లు అద్దెది. కాని అది ‘నా’ అద్దె ఇల్లు. మీకెప్పుడైనా రావాలనిపిస్తే రండి’’ అని చీటి వ్రాసిపెట్టి, తాళం వేసి, చెవి పక్కింట్లో ఇచ్చింది. ఊరు వెళ్తున్నారా?’’ ‘‘లేదు. నా ఇంటికి వెళ్తున్నాను.’’ కమల భర్త కమల పెట్టిన ఉత్తరం చూసుకున్నాడు. ఆ కోపంలో కమల చేసిన తెలివితక్కువ పని గురించి ఆమె తమ్ముడికి, తన సంతానానికి ఉత్తరాలు వ్రాసిపడేసాడు. ఉత్తరం అందగానే కమల తమ్ముడు కృష్ణ పరిగెత్తుకు వచ్చాడు. బావగారు చెప్పినది విన్నాడు.

చిరునామా తీసుకున్నాడు. ‘‘నువ్వు చేసిన పనేం బాగాలేదక్కా. బావగారు ముక్కోపే! ముప్పై యేళ్లు సర్దుకొన్నదానివి. అయినా బావకి దూరంగా కొన్నాళ్లుందాం అని నువ్వనుకొంటే వచ్చి నా దగ్గరుండరాదా? నీ కొడుకు దగ్గరకు వెళ్లరాదా? (అయినా) అది నీ ఇల్లు కాదా? అంతింటికి యజమానురాలివి ఈ దోసెడు కొంపలో ఎందుకు ఇరికావు?’’ కమల తాపీగా జవాబు చెప్పింది. ‘‘అది నా ఇల్లు కాదు, ఒకప్పుడు నాదే అనుకున్నాను. ఆయన పెంచుకుంటున్న కుక్కదెట్లా కాదో, నాదీ అట్లానే కాదు. ఆయన కుక్కనీ ఆపేక్షగానే చూసుకొంటారు, నన్నూ ఆపేక్షగానే చూసుకొంటారు. అంతమాత్రాన మాకు ఇంటిమీద హక్కులుండవు.’’
‘‘ఎందుకక్కా అంత నిష్ఠూరంగా మాట్లాడ్తావు! ఏదో విషయంలో నీ మనస్సుకి నొప్పి కలిగింది. ఆ నొప్పి తగ్గేవరకు వచ్చి నాతో ఉండు.’’ ‘‘అది నా ఇల్లు కాదని విడిచిపెట్టాను. నీ ఇల్లూ నాది కాదు కనుక రాను.’’
కమలకు పెళ్లయిన కొత్తలో పుట్టింటికి వెళ్లినప్పుడు, పాత అలవాటు ప్రకారం వాళ్లమ్మ పాత న్యూస్‌ పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బును అక్కా తమ్ముడికీ సమానంగా పంచినప్పుడు కృష్ణ, ‘‘ఆడపిల్లకి పెళ్లవగానే అత్త వారింట్లో హక్కు లేర్పడ్తాయి. పుట్టింట్లో పోతాయి. ఏదో ఒక ఇంటి సంపదలోనే వాటా వస్తుంది. అవ్వాబువ్వా ఎలా వస్తాయి!’’ అన్నాడు. ‘‘రెండ్రూపాయలకెన్ని మాటలన్నావురా! రేపు నీ ఇంటికి నన్ను రావద్దంటావురా!’’ అంది కమల బాధగా. ‘‘అదేమిటక్కా! నీకీ ఇంట్లో ఎప్పుడూ స్థానముంటుంది’’ అన్నాడు నొచ్చుకుంటూ. కమలకి నిజానికి పుట్టింట్లో ఏ లోటూ జరగలేదు. కానీ కమలని బాధిస్తున్నది హక్కుగా ఏదీ రాకపోవటం. అన్నీ బహుమానాలుగానే రావటం. బహుమానాలు అవతలి వాళ్లు ఆపేక్షతో పెట్టే భిక్షలు. ‘‘అది మన ఇల్లు కాదురా! అది నీ ఇల్లు. అక్కడ నేను అతిథిని. మీ బావగారింట్లో దాసిని.’’


‘‘బావగారు మంచివారని నువ్వూ ఒప్పుకుంటున్నావు కదా!’’‘‘అది మంచికి నువ్విచ్చే నిర్వచనం మీదుంటుంది. నేను కోరుకునే స్వేచ్ఛని బట్టీ ఉంటుంది. ఆయన ఇచ్చింది నేను తీసుకొంటున్నంత కాలం ఏ సమస్యా ఉండదు. నేను నాకింత కావాలని అడిగి ఆయన ఇవ్వకపోతే సమస్యలు మొదలవుతాయి.’’ ‘‘అన్నీ ఆయన అమరుస్తుంటే నీకు ఇంకా డబ్బెందుకు?’’ ‘‘నువ్విక్కడ రెండ్రోజులుండు. నీ జేబులోని డబ్బు నాకివ్వు. నీ అవసరాలు గమనించి నేనే నీకు అన్నీ అమరుస్తాను. ఆ స్వర్గం అనుభవిస్తే గాని అర్థం కాదు.’’ ‘‘నువ్వు లేని సమయంలో నాకు కాఫీ తాగాలనిపిస్తే?’’ ‘‘ఆయన లేని సమయంలో నాకనిపిస్తే?’’ ‘‘ఇంట్లోనే ఉంటావు కదా కలుపుకొంటావు!’’ ‘‘ఇప్పుడు నువ్వూ ఇంట్లోనే కదా ఉండబోతున్నది. కలుపుకుంటావు. ఎంత జాగ్రత్తగా కలుపుకుంటావంటే పాలవాడు పోసిన పాలు అన్ని అవసరాలకి సరిపడేలాగా జాగ్రత్తగా కలుపుకుంటావు. నేను ఆఫీసునుంచి వచ్చి ఓ కప్పు కాఫీ కోరవచ్చునన్న స్పృహతో కలుపుకొంటావు. పాలు వలకకుండా కలుపుకుంటావు. కొలిచి కలుపుకుంటావు.’’


కమల మాటలకి కృష్ణ అప్రతిభుడయ్యాడు. అక్కడ భోంచేసి, బావగారైన రామారావు దగ్గరకు వెళ్లి రాయబారం విఫలమైనదని చెప్పాడు. రామారావు వెంటనే వెళ్లలేదు. తన భార్య విడిగా ఉండటం గురించి అందరూ అడుగుతుంటే అవమానం అయిపోతోందని ఓ పదిరోజుల తరవాత వెళ్లాడు. ‘‘ఇంటికి రా!’’ అన్నాడు. ‘‘ఎవరింటికి?’’ అని అడిగింది కమల. ‘‘మనింటికి’’ అన్నాడు రామారావు. ‘‘అది మన ఇల్లు అన్న విషయం మీ నోటంట మొదటిసారి వింటున్నాను’’ ‘‘ఎప్పుడు కాదన్నాను?’’‘‘లక్షసార్లు’’ కమల ఒక్కొక్క సందర్భం చెప్పుకు వచ్చింది. కమల పుట్టింటి విషయం వచ్చినప్పుడల్లా ‘‘మీ ఇంట్లో అట్లాగేమో కాని...’’ అంటూ ఉంటాడు. కమలను వేరు చేస్తూ ‘‘మా ఇంట్లో అట్లా కాదు’’ అంటూ ఉంటాడు. ఎన్నాళ్లయినా ‘మీ’ ‘మా’లు పోయి మన అన్న మాట ఏర్పడలేదు. ఏదన్నా భేదాభిప్రాయం వ్యక్తం చేస్తే, ‘‘ఇది నా యిల్లు. నా ఇంట్లో నా మాటే నెగ్గాలి’’ అనేవాడు. ‘‘నా పుట్టింట్లో ఇది నా యిల్లంటారు. మీరేమో నా పుట్టింటి గురించి ‘మీ ఇల్లు’ అంటూ ఉంటారు. ఈ రెండింటిలో ఏది నా యిల్లు?’’ అడిగింది కమల ఓరోజు. ‘‘ఆడవాళ్లకేమిటి! అన్నీ వాళ్ల ఇళ్ళే’’ అని దాన్ని హాస్యంలోకి దింపి కొట్టిపారేసాడు. కమల ఇంట్లోంచి బయటికి వచ్చిన నెల రోజులకి తల్లిని ఒప్పించి తీసుకు వెళ్లటానికి కొడుకు నారాయణ వచ్చాడు.

‘‘అమ్మా పోనీ వచ్చి నా దగ్గర ఉండు’’ అన్నాడు. ‘‘నీ ఇంట్లో ఉంటే నా ఉద్యోగం ఏమవుతుంది! ఉద్యోగం వదులుకొని వచ్చినా నీ ఇంటి పద్ధతి నాకు పడదు. నాకోసం మీ పద్ధతులు మార్చుకోలేరు కదా’’ అంది కమల. ‘‘అమ్మా! నా ఇంట్లో నా భార్యకుగాని నాకు గాని పూర్తి స్వేచ్ఛ ఉందా?’’ అన్నాడు నారాయణ. ‘‘కావచ్చు, కాని నువ్వు నీ ఇంట్లో బానిసవు కావు’’ అంది కమల. ‘‘అమ్మా, భార్య భర్తకి బానిస. భర్త మొత్తం కుటుంబానికి బానిస. పూర్తి స్వేచ్ఛ ఎక్కడా ఉండదు. పరిమితుల్ని గుర్తించటమే స్వేచ్ఛ అంటారు’’ అన్నాడు నారాయణ. ‘‘నాకు పెద్ద విషయాలు అర్థంకావురా నారాయణా! వ్యవస్థ మారితేగానీ మారనివి కొన్ని వున్నాయి నిజమే. కాని కొన్ని వ్యక్తులు మారటం ద్వారా మారగలిగినవి ఉన్నాయి. మగవాళ్లు మాటల్లో, ప్రవర్తన్లో కొంత అహంకారాన్ని వదులుకుంటే, స్త్రీలకి ఓ మనస్సుందని గుర్తిస్తే చాలు స్త్రీల జీవితంలో మల్లెలు పూస్తాయి.’’ ‘‘ఇది నీ ఇల్లా అమ్మా?’’ నారాయణ అడిగాడు. ‘‘అవును. ఇక్కడ నా మాట చెల్లుతుంది’’ అంది కమల.



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement