పాలన పడకేసినచోట ఏం జరగాలో అదే జరుగుతోంది. రాష్ట్రంలో మద్యం మాఫియా రెచ్చిపోయి చాపకింద నీరులా వ్యాపారాన్ని విస్తరించుకుంటూ జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. అడిగేవారూ, ఆరాతీసేవారూ లేకపోవడంతో నిత్యమూ పచ్చనోట్ల పండగ చేసుకుంటోంది. ‘సాక్షి’ గురువారం బయటపెట్టిన స్టింగ్ ఆపరేషన్‌ను గమనిస్తే ఈ వ్యాపారం విస్తృతి, లోతు ఎంత ఉన్నదో అర్ధమవుతుంది. రాష్ట్రం భవిష్యత్తు ఏమవుతుందోనని అందరూ కలవరపడుతుంటే మద్యం మాఫియా పేద, దిగువ తరగతివారు ఉపయోగించే కొన్ని బ్రాండ్లకు నకిలీలను సృష్టించి లారీలకు లారీల సరుకును రాష్ట్రం నలుమూలలకూ తరలిస్తోంది. అటు గోవానుంచి మాత్రమే కాదు...ఇటు కర్ణాటక, మహారాష్ట్రలనుంచి రోజూ రెక్కలు కట్టుకుని వాలుతున్న నకిలీ మద్యం మందుబాబులను ముంచేస్తోంది. రూ.3,200 ధర పలికే మద్యం బాటిళ్ల కేసును రూ.1,800కే మాఫియా సరఫరా చేస్తున్నది. ఈ దారిలో నెలకు కనీసం రూ. 100 కోట్ల వ్యాపారం సాగుతున్నదంటే ఈ మాఫియాకు ఏ స్థాయిలో అండదండలందుతున్నాయో అంచనా వేసుకోవచ్చు. మద్యం అమ్మకాలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక విధానమంటూ లేకపోవడంవల్ల ఏ రాష్ట్రానికా రాష్ట్రం తమ తమ సొంత విధానాలను రూపొందిం చుకుంటున్నాయి. ఏటా మద్యం విధానాన్ని ప్రకటించేటపుడు సర్కారు గంభీరమైన మాటలు వల్లిస్తుంది. ఈ ఏడాది కూడా అదే మోతమోగించింది. మద్య సేవనంవల్ల కలిగే అనర్ధాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తామని, ప్రతి జిల్లాకూ మద్యం వ్యవసాన్ని మాన్పించే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. వాటి సంగతలా ఉంచి సర్కారీ మద్యానికి పోటీగా దిగుతున్న నకిలీ మద్యం దందాను అరికట్టలేక బిక్కమొహం వేస్తోంది.
ఇరుగు పొరుగు రాష్ట్రాలనుంచి నకిలీ మద్యం ఎలా ప్రవహిస్తున్నదో ‘సాక్షి’ ససాక్ష్యంగా బయటపెట్టింది. గోవా డిస్టిలరీల్లో దొంగచాటుగా తయారైన మద్యాన్ని లారీల్లో రాష్ట్రంలోని కోస్తాంధ్ర జిల్లాల దుకాణాలకు తరలిస్తున్న వైనాన్నీ....కర్ణాటక, మహారాష్ట్రల నుంచి చాటుగా వస్తున్న మద్యం ముడిసరుకును మద్యంగా మార్చి తెలంగాణ, రాయలసీమ జిల్లాలకు సరఫరా చేస్తున్న తీరునూ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన నిఘా నెట్‌వర్క్ ఉండి, అందుబాటులో అవసరమైన బలగాలుండి, ఎన్నెన్నో ప్రాంతాల్లో చెక్‌పోస్టులుండి ప్రభుత్వం ఇంత చేతగానట్టుగా ఉండిపోయిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది నిద్రపోవడమా, నిద్ర నటించడమా అన్న అనుమానం కలుగుతుంది. మాఫియాలపై ఉక్కుపాదం మోపి, సిబ్బందిని ఉరుకులెత్తించి నకిలీమద్యం పనిపట్టిన ఎక్సైజ్ కమిషనర్ సమీర్ శర్మ అక్కడినుంచి బదిలీ అయ్యారు. దానికి రాష్ట్ర విభజన అంశం తోడైంది. ఇకనేం... మాఫియాలకూ, వారిని మేపేవారికి కావలసినంత స్వేచ్ఛ! స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా ‘సాక్షి’ ప్రతినిధి అడిగిన రూ.32 లక్షల విలువైన నకిలీ మద్యాన్ని ఒక్క రోజులోనే సరఫరా చేస్తామని మాఫియా హామీ ఇచ్చిందంటే ఇది ఎంతగా వేళ్లూనుకున్నదో, ఏ స్థాయిలో పనిచేస్తున్నదో అర్ధమవుతుంది. నకిలీ మద్యంతో రెండు రకాల ప్రమాదాలున్నాయి. సర్కారు పర్యవేక్షణ ఉండే డిస్టిలరీల్లో తయారయ్యే మద్యానికి బదులుగా దుకాణాలవారు చవగ్గా దొరికే నకిలీ మద్యాన్ని అమ్ముతారు. నెల తిరిగే సరికి ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. మరోపక్క ఈ నకిలీ మద్యంలో ఏమాత్రం మిథైల్ ఆల్కహాల్ కలిసినా అది సేవించినవారు మృత్యువాతపడతారు. గతంలో ఇలాగే తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో పలువురు మరణించారు. ఎక్కడే బ్రాండ్లు ఎక్కువగా అమ్ముడు పోతున్నాయో తెలుసుకుని ఆ బ్రాండ్ల లేబిళ్లు అతికించి, అవసరమైన సీళ్లు తగిలించి, బ్యాచ్ నంబర్లు సైతం వేసి నిత్యం కావలసినచోటకు ఈ నకిలీ మద్యాన్ని చేరేయగలుగుతున్నారు. చిత్రమేమంటే, ఆ నకిలీ మద్యం హైగ్రో మీటర్‌కు కూడా దొరకడంలేదు.
రెండేళ్లక్రితం ‘సాక్షి’ లిక్కర్ మాఫియా వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. ఒక పెద్దమనిషి అండదండలతో లిక్కర్ సిండికేట్ సామ్రాజ్యం ఎలా విస్తరించిందో చెప్పింది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో బినామీల రాజ్యాన్ని నడిపిస్తున్న తీరును వివరించింది. జిల్లా జిల్లాకూ సిండికేట్లు విస్తరించి ఖజానాకు ఏటా రూ.4,000 కోట్ల మేర చిల్లు పెడుతున్న వైనాన్ని వెల్లడించింది. అప్పుడు ఏసీబీ చురుగ్గా రంగంలోకి దిగి ఏవో చర్యలు ప్రారంభించినా రాజకీయ ఒత్తిళ్లు క్రమేపీ పెరగడంతో అవి మరుగునపడ్డాయి. బినామీ దుకాణాల సంగతలా ఉంచి ఇప్పుడు నకిలీ మద్యం ఏరులై పారుతోంది. వివిధ జిల్లాల్లో దాదాపు 10 మాఫియా గ్యాంగులు గుట్టుచప్పుడు కాకుండా, ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతున్నాయి. ‘సాక్షి’ కథనం తర్వాత వివిధ జిల్లాల్లో ఎక్సైజ్ ప్రత్యేక బృందాలు తనిఖీలు ప్రారంభించాయని సమాచారం అందుతున్నది. స్టింగ్ ఆపరేషన్ సంగతి బయటపడగానే మాఫియా బృందాలన్నీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయి గనుక ఈ తనిఖీలవల్ల తక్షణం ఒనగూడే ప్రయోజనం ఉండకపోవచ్చు. అసలు సవాలు దుకాణాల్లో కొలువుదీరిన నకిలీ మద్యం బాటిళ్లను పసిగట్టి స్వాధీనం చేసుకోవడం. ప్రజల జీవన ప్రమాణాలనూ, పోషకాహార స్థాయిని పెంచడమనే రాజ్యాంపరమైన కర్తవ్యాన్ని ప్రభుత్వాలు గాలికొదిలిన పర్యవసానంగానే ఇలాంటి వైపరీత్యాలు పుట్టుకొస్తున్నాయి. రాబడే ధ్యేయంగా ఎక్కడబడితే అక్కడ మద్యం దుకాణాలను పెట్టడం, వాటిపై కనీస పర్యవేక్షణ లోపించడం పర్యవసానంగా మాఫియాల విజృంభణకు అవకాశం ఏర్పడింది. మద్యపానంపై సంపూర్ణ నిషేధం సంగతిని ఎప్పుడో మరిచాం. నియంత్రించడం మాట కూడా ఎటో పోయింది. ఇప్పుడిక మద్యం మాఫియా సరుకే యధేచ్ఛగా దుకాణాలకు చేరుతోంది. వారికి కోట్లాది రూపాయల రాబడి తెస్తోంది. ఇక ఇక్కడ ప్రభుత్వం ఉన్నట్టా... లేనట్టా అని ఎవరికైనా అనుమానం వస్తే అందులో వింతేముంది?
మాయదారిలో మద్యం!
Published Fri, Dec 27 2013 12:15 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement