ఇసుక రీచ్‌లూ కొల్లగొట్టేశారు | Sand mining has started in more than 30 reaches: sand tender in Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఇసుక రీచ్‌లూ కొల్లగొట్టేశారు

Published Thu, Oct 17 2024 5:25 AM | Last Updated on Thu, Oct 17 2024 5:25 AM

Sand mining has started in more than 30 reaches: sand tender in Andhra pradesh

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల గుప్పెట్లోకే..

ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి సిండికేట్లు 

వారికి రీచ్‌లు కేటాయించేందుకే షార్ట్‌ టెండర్లు పిలిచిన ప్రభుత్వం 

అన్నిచోట్లా ప్రభుత్వ పెద్దలు చెప్పిన వారికే ఇసుక కాంట్రాక్టులు 

సిండికేట్ల ద్వారా ఇసుక కొల్లగొట్టేందుకు ముఖ్యనేత పక్కా ప్లాన్‌

వారి నుంచి నేరుగా దండుకునేందుకు సర్వం సిద్ధం 

30కి పైగా రీచ్‌లలో బుధవారం నుంచి తవ్వకాలు షురూ 

తూర్పు గోదావరిలో రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే చెప్పిన వారికే రీచ్‌లు  

జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే మనుషులే ఇసుక కాంట్రాక్టర్లు  

పామర్రులో టీడీపీ నేతల్ని టెండర్‌ దాఖలు చేయనివ్వని ఎమ్మెల్యే  

సాక్షి, అమరావతి: మద్యం మాఫియాతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైన టీడీపీ ప్రభుత్వం ఇప్పు­డు ఇసుక దోపిడీకి రాచమార్గం నిరి్మంచుకుంది. రా­ష్ట్రంలోని ఇసుక రీచ్‌లన్నీ తమ వారికే దక్కేలా చేసు­కుని వాటిపై గుత్తాధిపత్యం సాధించింది. 108 మా­న్యు­వల్‌ ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు ఏర్పాట్లుచేసు­కుని ఇప్పటికే 80కి పైగా రీచ్‌లకు షార్ట్‌ టెండర్లు పిలిచారు. జిల్లా ఇసుక కమిటీల ద్వారా వాటిని హస్తగతం చేసుకున్నారు. వాటిలో బుధవారం సుమారు 30 వరకు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభించా­రు.

అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పి­న వారికే అన్నిచోట్లా జిల్లా ఇసుక కమిటీలు రీచ్‌లు కట్టబెట్టాయి. ఒక పథకం ప్రకారం దసరా పండుగ ముందు ఎటువంటి హడావుడి లేకుండా ఈ రీచ్‌లకు షార్ట్‌ టెండర్లు పిలిచారు. దానికిముందే వాటి వివరాలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇవ్వడంతో వారు ఏ రీచ్‌కి ఎవరు టెండర్లు వేయాలి, ఎంతకి వేయాలో నిర్ణయించారు. వారు సిద్ధమైన తర్వాత జిల్లా కలెక్టర్లు వెంటనే టెండర్లు పిలిచి దాఖలు చేయడానికి రెండే రెండ్రోజుల సమయం ఇచ్చారు. ఈ సమాచారం తెలియక చాలామంది టెండర్లు దాఖలు చేయలేకపోయారు. ఆఖరి నిమిషంలో తెలు­సు­కుని ఎవరైనా టెండర్‌ వేయడానికి వస్తే వారికి టెండర్‌ డాక్యుమెంట్‌ ఇవ్వడానికి నానా ఇబ్బంది పెట్టారు.

రోజంతా కూర్చోబెట్టి ఎందుకు టెండర్‌ దాఖలు చేయాలనుకుంటున్నారు? ఎవరి కోసం వేస్తున్నారు? తవ్వకాలకు కావల్సిన సరంజామా మొత్తం ఉన్నాయా అంటూ తెగ విసిగించారు. వేచి ఉన్న వారికి చివర్లో ఏదో ఒక సాకు చెప్పి పంపించేశారు. అన్నీ తట్టుకుని నిలబడిన కొద్దిమంది టెండర్లు దాఖలు చేసినా వారిని అధికారులే బెదిరింపులకు గురిచేసినట్లు తెలిసింది. ఇక అధికార పార్టీ వాళ్లను కాదని మీరెలా టెండర్లు వేస్తారు? వేసినా ఉపయోగం ఉండదని చెప్పడంతో కొందరు వెనక్కి తగ్గినట్లు సమాచారం. టెండర్లు వేసిన వారికీ నిబంధనల ప్రకారం ఏ విషయం చెప్పకుండా పంపించేశారు. చివరికి.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వా­రికే ఇసుక కాంట్రాక్టులన్నింటినీ కట్టబెట్టేశారు. వారి ద్వారా ముఖ్యనేతకు ముడుపులు అందేలా పక్కా ప్రణాళిక రూపొందించారు. ఈ నెలాఖరులోపు మిగి­లిన రీచ్‌లకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి వాటిని సొంతం చేసుకునేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.  

ఎమ్మెల్యేలు చెప్పినట్లే చేసిన ఇసుక కమిటీలు.. 
అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే జిల్లా స్థాయి ఇసుక కమిటీలు రీచ్‌లను కట్టబెట్టాయి. అత్యధికంగా 17 రీచ్‌లు ఉన్న తూర్పుగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలు బయట వ్యక్తులను కనీసం టెండర్లు వేయడానికి సైతం అనుమతివ్వలేదు. వారికి టెండర్‌ డాక్యుమెంట్లు ఇవ్వడానికి అధికారులు భయపడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు.  

కడియపులంక రీచ్‌ను రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన బినామీకి ఇప్పించినట్లు సమాచారం.  
రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో మూడు రీచ్‌లు ఉండగా ఒకదాన్ని అక్కడి ఎమ్మెల్యే బత్తుల బలరామయ్య చేజిక్కించుకున్నట్లు తెలిసింది. మరో మూడు రీచ్‌లను ఆయనతోపాటు బుచ్చయ్యచౌదరి చెప్పిన వారికి కేటాయించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.  

 నిడదవోలు నియోజకవర్గంలోని ముక్కామల, కాకరపర్రు, మల్లేశ్వరం, తీపర్రు 2, 3, మందలపర్రు, జీడిగుంట రీచ్‌లుండగా వాటిని 
జనసేన, టీడీపీ నేతలు కలిసి పంచుకుని అందుకనుగుణంగా టెండర్లు దాఖలు చేయించి దక్కించుకున్నారు.  
 మంత్రి కందుల దుర్గేష్‌ రెండు రీచ్‌లను తన వారికి ఇప్పించుకోగా మిగిలిన వాటిని టీడీపీ నేతలు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వాటిల్లో టీడీపీ నేతలు చెప్పినట్లే జరిగింది. దీంతో స్థానిక జనసేన నాయకులు టీడీపీ వాళ్లతో వాగ్వాదానికి దిగినా ప్రయోజనం కనిపించలేదని చెబుతున్నారు. 

కొవ్వూరు నియోజకవర్గంలోని కుమారదేవం–1, 2, 3, చిడిపి, వేగేశ్వరపురం ఇసుక రీచ్‌లను స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇతర నేతలతో కలిసి సిండికేట్‌గా ఏర్పడి తమ వారికి ఇప్పించినట్లు సమాచారం.  
 ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆరు రీచ్‌లకు టెండర్లు పిలవగా ఒకటి ఎంపీ కేశినేని శివనాథ్‌ చెప్పిన వారికి దక్కేలా చేశారు. మిగిలినవన్నీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తన మనుషులకు కేటాయించేలా చేసుకున్నారు.  
 నందిగామ నియోజకవర్గంలో తొమ్మిది రీచ్‌లకు రెండు మినహా మిగిలినవన్నీ స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించిన వారికి కేటాయించారు.  

 అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని శ్రీకాకు­ళం 3, 5 రీచ్‌లకు టెండర్లు పిలవగా రెండింటి­నీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ బినామీ పే­ర్లతో సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఒక రీ­చ్‌ను తన సొంత బంధువుకి, మరో రీచ్‌ను తన అనుంగు అనుచరుడికి కట్టబెట్టినట్లు సమాచారం. బయట వ్యక్తులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడంతో ఖరారైన రీచ్‌లన్నీ టీడీపీ వారి పరమయ్యాయి.  

పామర్రులో టీడీపీ నేతలకు ఎమ్మెల్యే వార్నింగ్‌..
ఇక కృష్ణాజిల్లా పామర్రులో ఐదు రీచ్‌లు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా చెప్పిన వారికే ఖరారు చేశారు. టెండర్లు దాఖలు చేయడానికి వెళ్లిన టీడీపీ నేతలను ఎమ్మెల్యే ఫోన్‌చేసి తిట్టిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. తోట్లవల్లూరు ఇసుక రీచ్‌ కోసం మొవ్వ మండల నేత కాకర్ల బెనర్జీ తదితరులు వెళ్లగా ఆ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయనకు ఫోన్‌చేసి వార్నింగ్‌ ఇచ్చారు.

 టెండర్‌ వెయ్యొద్దని, తనకు తెలీకుండా ఎలా టెండర్‌ దాఖలు చేస్తారని ఎమ్మెల్యే బెనర్జీకి వార్నింగ్‌ ఇస్తున్న వీడియోను కొందరు టీడీపీ నేతలే రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టారు. తాను ఎంతోకాలం నుంచి పార్టీలో ఉన్నానని, ఎప్పుడూ ఇలాంటివి చూడలేదని బెనర్జీ చెబుతుంటే ఎమ్మెల్యే ఆయన్ను గట్టిగా హెచ్చరించారు. మొత్తం మీద ఇసుక రీచ్‌లకు తన సొంత మనుషులతో టెండర్లు వేయించిన ఎమ్మెల్యే.. సొంత పార్టీ వారితో సహా ఇతరులెవరూ టెండర్లు వేయకూడదని హకుం జారీచేశారు. చివరికి ఆయన చెప్పిన వారికే టెండర్లు ఖరారయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement