ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతున్నదో తెలుసుకొనేందుకు ఆత్రంగా ఏదైనా చానెల్ చూడబోయినవారిని జీవితంపై విరక్తి కలిగే స్థితికి తీసుకెళ్లిన పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. మొత్తంగా ఈ 15వ లోక్‌సభ పనితీరునూ, మరీ ముఖ్యంగా సభ చివరి సమావేశాలనూ చూసినవారికీ చట్టసభలపైనా, ప్రజాస్వామ్యంపైనా అపనమ్మకం ఏర్పడే స్థితి ఏర్పడుతుందనడంలో వింతేమీ లేదు. చేసినవన్నీ, చూసినవన్నీ మరిచిపోయి ‘ఈ లోక్‌సభ సోనియా హుందాతనం, ప్రధాని మృదుత్వంవల్ల సజావుగా సాగింద’ని బీజేపీ నేత, విపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ అంటే...అంతకు కొన్ని రోజులముందు ‘నా రాజకీయ జీవితంలో ఇలాంటి సభను చూడలేద’ని ఆ పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ వ్యాఖ్యానించారు. సమయం, సందర్భం కొన్ని అభిప్రాయాలను మార్చేస్తాయి. రాజకీయ నాయకుల విషయంలో ఇది మరీ ఎక్కువ. బహుశా ఇద్దరూ మాట్లాడిన సందర్భాలు వేర్వేరు గనుక ఇలా విరుద్ధ వ్యాఖ్యలు వెలువడినట్టున్నాయి. అయితే, ఈ లోక్‌సభ పనితీరు గురించి సామాన్యులకు నిశ్చితమైన అభిప్రాయాలు ఏర్పడి ఉన్నాయి. అవి మాత్రం ఎన్నటికీ మారవు. భవిష్యత్తులో ఇంతకన్నా దిగజారే స్థితి ఏర్పడితే తప్ప ఈ సభ మొత్తంగా నడిచిన తీరుపై మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం లేదు. సామాన్యులు ఇలాంటి నిర్ణయానికి రావడానికి కారణం ఏ ఒక్కరో అని చెప్పడానికి లేదు. సభను నడిపిన స్పీకర్‌నుంచి సభా నాయకుడిగా ఉన్న ప్రధాని, విపక్ష నేతగా ఉన్న సుష్మాస్వరాజ్ వరకూ...వివిధ పార్టీల సభ్యుల వరకూ అందరి బాధ్యతా ఇందులో ఉంది. దేశాన్నేలుతున్న యూపీఏ సర్కారుకు అసలు అందుకు అవసరమైన సాధికారత ఉన్నదో, లేదో తేలలేదు. రెండు దఫాలుగా జరిగిన ఈ ఆఖరి సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం నోటీసుల స్వీకరణపై చర్చ జరగడమే సాధ్యంకాలేదు. సభలో గందరగోళం నెలకొని ఉన్నప్పుడు ఆ తీర్మానంపై చర్చ జరగరాదన్న నిబంధన ప్రభుత్వానికి బాగా ఉపయోగపడింది. ఉపయోగపడటం కాదు...కొందరు సభ్యుల ద్వారా సర్కారే ఆ గందరగోళాన్ని సృష్టించిందని సాక్షాత్తూ ఆ పార్టీ ఎంపీలే అన్నారు. చట్టసభ మౌలిక బాధ్యతే ఏలుబడిలో ఉన్న సర్కారుకు సాధికారత ఇవ్వడం. ఆ మౌలిక బాధ్యతనే నిర్వర్తించలేని స్థితికి సభ వెళ్లిందంటే...అందుకు స్వయంగా సర్కారే పథకం వేసిందంటే అది మన ప్రజాస్వామ్యానికే అవమానకరమైన విషయం. ఎక్కడో బనానా రిపబ్లిక్‌లలో మాత్రమే సాధ్యంకాగలవన్నీ ఇక్కడా జరుగుతున్నాయనుకోవాలి.
అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఉన్న నిబంధనేమీ బిల్లులకు లేదు. అందువల్ల వాటికి ఆమోదముద్ర పెద్ద కష్టంకాలేదు. తీవ్ర భావోద్వేగాలను రగిలించిన రాష్ట్ర విభజన విషయంలోనైనా, రూ. 18 లక్షల కోట్ల బడ్జెట్ విషయంలోనైనా గందరగోళ దృశ్యాలమధ్యే, మూజువాణి ఓటుతోనే అంతా పూర్తయిపోయింది. ముఖ్యంగా విభజన బిల్లుకు సభ ఆమోదం తీసుకునే సమయంలో లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయిన తీరు పౌరులందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు అలాంటి ఆమోదం తీసుకొనేటపుడు సంబంధిత ప్రాంత ఎంపీలు సభలో ఉండేలా చూడటం కనీస బాధ్యతన్న సంగతినే విస్మరించారు. ఇదే సమస్యపై సభలో అంతకు కొన్నిరోజులముందు సభ్యులు పరస్పరం తలపడటం, పెప్పర్ స్ప్రే ప్రయోగించడంవంటివి మన పార్లమెంటును ప్రపంచంలో నవ్వులపాలయ్యేలా చేశాయి. భిన్నాభిప్రాయాలను పార్టీ వేదికల్లో పరిష్కరించలేని వివిధ పార్టీల అధినేతల అసమర్ధతే ఇందుకు కారణమని కూడా సరిపెట్టుకోలేం... ఎందుకంటే అలాంటి గలాటా సృష్టించమని ప్రోత్సహించిందే వారు. వాస్తవం ఇదికాగా... దేశం క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోగలదని తెలంగాణ బిల్లు చాటిచెప్పిందని ప్రధాని మన్మోహన్ ఎలా అనగలిగారో అంతుపట్టని విషయం. ఆ మాటలు ఆత్మ వంచన, జనవంచన కూడా అవుతాయి.
ఈ లోక్‌సభ అయిదేళ్ల కాలంలోనూ 326 బిల్లులను పరిశీలించి 177 బిల్లులను ఆమోదించింది. ఇది గడిచిన కాలంలోని ఏ సభతో పోల్చినా తక్కువే. అయితే, కేవలం ఆమోదించిన బిల్లుల సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకుని సభ పనితీరును లెక్కేయడం కూడా సబబు కాదు. ఎన్ని బిల్లులపై సమగ్ర చర్చ జరిగిందో, సభ్యులు వ్యక్తంచేసిన అభిప్రాయాల్లో ఎన్నింటికి ప్రభుత్వం విలువనిచ్చిందో చూడాలి. అలా చూసినా పాత సభలతో పోలిస్తే ఇది తీసికట్టే. అత్యంత ప్రధానమైన 18 లక్షల కోట్ల రూపాయల సాధారణ బడ్జెట్‌పైనే సరిగా చర్చ లేదంటే ఇక మిగిలినవాటి సంగతి చెప్పేదేముంది? 20 బిల్లులపై అయిదు నిమిషాల కంటే తక్కువ సమయమే చర్చ జరిగింది. సర్కారు వైఖరి కారణంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లకు వీలుకల్పించే బిల్లు మురిగిపోయింది. ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభ ఆమోదంపొంది, దాన్నుంచి లోక్‌సభకు వచ్చింది. అయితే, యూపీఏ ప్రభుత్వ చేతగానితనం కారణంగా అది కాస్తా వ్యర్థమైంది. మళ్లీ కొత్త లోక్‌సభ ఏర్పడి బిల్లును ప్రవేశపెడితే తప్ప మహిళలకు కోటా సాధ్యపడదు. ఈ లోక్‌సభకు ఆటంకాలే ఆనవాయితీగా మారాయి. ప్రతి సమావేశాల సమయంలోనూ ఏదో ఒక కుంభకోణం బయటపడటం, దానిపై విచారణకు యూపీఏ సర్కారు ససేమిరా అనడం...ఫలితంగా సమావేశాలన్నీ వాయిదాల్లో గడిచిపోవడం సర్వసాధారణమైంది. 2జీ కుంభకోణం మొదలుకొని బొగ్గు కుంభకోణం వరకూ ప్రతి స్కాంపైనా ప్రభుత్వం మొండివైఖరినే అవలంబించింది. న్యాయస్థానాల జోక్యం తర్వాతే ఆయా స్కాంలపై విచారణలు మొదలయ్యాయి. మొత్తానికి ఏరకంగా చూసినా ఈ లోక్‌సభ నిరంతర అంతరాయాలతో...కనీవినీ ఎరుగని దిగ్భ్రాంతికర దృశ్యాలతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తినే మిగిల్చింది.
సభకో నమస్కారం!
Published Sat, Feb 22 2014 11:51 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement