డీఎల్‌ఎఫ్ పై కొరడా! | Market regulator Sebi | Sakshi
Sakshi News home page

డీఎల్‌ఎఫ్ పై కొరడా!

Published Tue, Oct 14 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

Market regulator Sebi

సంవత్సరాల తరబడి కాగితం పులిగా అపవాదు మూటగట్టుకున్న మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి (సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఈ మధ్యకాలంలో పంజా విసురుతున్నది. సహారా గ్రూప్ అధిపతి సుబ్రోతోరాయ్, సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజులపై కొరడా ఝుళిపించిన సెబి... తాజాగా రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌పై విరుచుకుపడింది. నిబంధనల ఉల్లంఘనల కేసుల్లో  గతంలో చిన్నపాటి జరిమానాలతో సరిపెట్టే నియంత్రణా సంస్థ డీఎల్‌ఎఫ్ ప్రమోటర్లు, ఇతర అధికారులను మూడేళ్లపాటు క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధించింది. ఇప్పటికే భారీ రుణభారంతో సతమతమవుతున్న డీఎల్‌ఎఫ్‌కు ఇది అశనిపాతమే.
 ఐదు దశాబ్దాలకుపైగా రియల్ ఎస్టేట్ కార్యకాలాపాలు నిర్వహిస్తున్న ఈ ఉత్తరాది కంపెనీ 2007లో తొలి పబ్లిక్ ఇష్యూ జారీచేసిన సమయంలో కొంత సమాచారాన్ని దాచిపెట్టిందన్న కేసులో సెబి తాజా ఆదేశాలు జారీచేసింది. డీఎల్‌ఎఫ్ అనుబంధ కంపెనీ సుదీప్తి ఎస్టేట్స్‌తో  జరిగిన భూ లావాదేవీలో 35 కోట్ల రూపాయల నష్టపోయినట్లు ఒక వ్యక్తిచేసిన ఫిర్యాదు ఫలితంగా సుదీర్ఘకాలం దర్యాప్తు జరిపింది. సుదీప్తితో పాటు మరో రెండు అనుబంధ కంపెనీల ద్వారా భూలావాదేవీలు జరిపిన డీఎల్‌ఎఫ్ పబ్లిక్ ఇష్యూ జారీ ప్రాస్పెక్టస్‌లో ఆ మూడు అనుబంధ కంపెనీల సమాచారాన్ని ఇన్వెస్టర్లకు తెలియపర్చలేదన్నది ప్రధాన అరోపణ. పన్ను ఎగవేత లావాదేవీల రూపంలో ఆ అనుబంధ కంపెనీల్లో వున్న వాటాలను బదిలీచేసి, వాటితో డీఎల్‌ఎఫ్ సంబంధం తెంపుకొందన్నది సెబి మరో ఆరోపణ.
 తాజా నిషేధంపై డీఎల్‌ఎఫ్  ప్రమోటర్లు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లొచ్చుగానీ మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో జరిగిన షేరు పతనం నుంచి ఆ కంపెనీ లేదా ఆ ప్రమోటర్లు కోలుకోవడం అంత తేలికకాదు. దేశంలో రియల్టీ వ్యాపారం ఎప్పటినుంచో వున్నా, ఈ రంగానికి చెందిన కంపెనీలు కార్పొరేటైజ్ కావడం, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌కావడం మాత్రం 2000వ దశకంలోనే. డీఎల్‌ఎఫ్ దేశంలో పెద్ద రియల్టీ కంపెనీ మాత్రమే కాదు.... భారత్ స్టాక్ సూచీల్లో భాగంగా వున్న ఏకైక రియల్టీ కంపెనీ.  బీఎస్‌ఈ సెన్సెక్స్-30, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50ల్లో ఐటీ, ఫార్మా, ఆయిల్, మెటల్, టెలికాం, పవర్ తదితర రంగాలకు చెందిన షేర్లు ఒకటికి మించి వున్నా, రియల్టీ రంగానికి చెందిన షేరు డీఎల్‌ఎఫ్ మాత్రమే ఈ సూచీల్లో భాగం. సూచీలు దాదాపు రికార్డు గరిష్టస్థాయిల్లో ట్రేడవుతుండగా, డీఎల్‌ఎఫ్ మాత్రం గతంలో ఎన్నడూ చూడని కనిష్టస్థాయికి పడిపోయింది. డీఎల్‌ఎఫ్‌కు దేశవ్యాప్తంగా 10,000 ఎకరాలకుపైగా భూములున్నాయి. వీటితో పాటు ప్రముఖ నగరాలన్నింటిలోనూ డజన్ల కొద్దీ ఆఫీస్, షాపింగ్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. ప్రస్తుత షేరు ధర రూ. 105 ప్రకారం లెక్కగడితే కంపెనీ మార్కెట్ విలువ రూ. 18,700 కోట్లకు క్షీణించింది. మంగళవారంనాటి పతనం కారణంగానే కంపెనీ రూ. 6,000 కోట్ల విలువను కోల్పోయింది.

కంపెనీ లిస్టయిన సంవత్సరం ఒకదశలో మార్కెట్ విలువ రూ. 2,00,000 కోట్లు దాటింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీతో సహా దేశంలో ఎంతోమంది ప్రముఖులు ఈ షేరు పబ్లిక్ ఇష్యూలో దరఖాస్తుచేశారు.  ఇప్పుడా కంపెనీ మార్కెట్ విలువను మించి రూ. 19,800 కోట్ల రుణం వుంది. రుణం తగ్గించుకునేందుకు క్యాపిటల్ మార్కెట్లో కొత్తగా వాటాలు విక్రయించడం, రుణ పత్రాల జారీద్వారా నగదు సమీకరించడం వంటి ద్వారాలన్నీ తాజా నిషేధంతో డీఎల్‌ఎఫ్ ప్రమోటర్లకు మూసుకుపోతాయి. డీఎల్‌ఎఫ్‌కున్న రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌ను లిస్ట్‌చేయడం ద్వారా నగదు సమీకరించే అవకాశం కూడా పోతుంది. షేరు పతనం కారణంగా కంపెనీ మార్కెట్ విలువ పడిపోయినందున, గతంలో అప్పులిచ్చిన బ్యాంకులు, ఇతర రుణదాతలు కంపెనీని ఇకపైన ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడిని తప్పించుకునేందుకు డీఎల్‌ఎఫ్ ఆస్తుల్ని తక్కువ విలువకైనా తెగనమ్మాల్సివుంటుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి అల్లుడైన రాబర్ట్ వాధ్రాతో జరిపిన లావాదేవీల ఫలితంగా డీఎల్‌ఎఫ్‌పై రాజకీయ రంగు కూడా పడింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎల్‌ఎఫ్ ప్రభ క్రమేపీ మసకబారుతూ వచ్చింది. సకాలంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు పూర్తిచేయనందుకు కొనుగోలుదార్ల నుంచి కేసుల్ని, కాంపిటీషన్ కమిషన్ నుంచి రూ. 630 కోట్ల పెనాల్టీని కంపెనీ ఎదుర్కొంటున్నది. పంజాబ్, హర్యానా కోర్టు గుర్‌గావ్‌లో డీఎల్‌ఎఫ్‌కు చెందిన 350 ఎకరాల భూ కేటాయింపును ఇటీవల రద్దుచేసింది. గుర్‌గావ్‌ను అతిపెద్ద కార్పొరేట్ హబ్‌గా మార్చివేసిన డీఎల్‌ఎఫ్ బుధవారంనాటి ఎన్నికల తర్వాత హర్యానాలో హుడా ప్రభుత్వం అధికారం కోల్పోతే మరింత ఇబ్బందులు పాలుకావొచ్చన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి.

న్యూఢిల్లీ కేంద్రంగా 60వ దశకంలో చౌదరి రాఘవేంద్ర సింగ్ నెలకొల్పిన డీఎల్‌ఎఫ్‌ను ఇప్పుడు రెండు, మూడవతరం కుటుంబాలు నడుపుతున్నాయి. ప్రస్తుతం ఆయన అల్లుడు కుషాల్ పాల్ సింగ్ (కే పీ సింగ్) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కే పీ సింగ్ కుమారుడు రాజీవ్ వైస్ ఛైర్మన్‌గానూ, కుమార్తె పియా సింగ్ పూర్తికాలపు డెరైక్టరుగానూ వున్నారు. వీరు ముగ్గుర్నీ క్యాపిటల్ మార్కెట్ నుంచి సెబి నిషేధించింది.  డీఎల్‌ఎఫ్ ప్రమోటర్ల సంగతెలా వున్నా, ఇన్వెస్టర్ల ప్రయోజనాల్ని పరిరక్షించడానికి సెబికి వున్న సంపూర్ణ అధికారాల్ని ప్రయోగిస్తూ తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల తాత్కాలికంగా కొన్ని షేర్ల ధరలు పతనం కావొచ్చుకాక. వారసత్వ కంపెనీలు రాజ్యమేలుతున్న భారత్ కార్పొరేట్ ప్రపంచంలో ఈక్విటీ సంస్కృతి పెరగాలన్నా, తద్వారా దేశాభివృద్ధి జరగాలన్నా సెబి ఒక కాగితం పులిగా వ్యవహరించకూడదు. నిబంధనల ఉల్లంఘనకు తగిన శిక్ష ప్రమోటర్లకు పడాల్సిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement