సంపాదకీయం: కేబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమం సాధారణంగా సామాన్యులకు పెద్దగా పట్టదు. కానీ, నరేంద్ర మోడీ నాయకత్వంలో సోమవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ ప్రమాణస్వీకారం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు...ప్రపంచవ్యాప్తంగా కూడా అందరినీ ఆకర్షించింది. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ ప్రమాణస్వీకారోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని అత్యధికులు వీక్షించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం సర్వస్వమూ మోడీ చుట్టూ అల్లుకుని సాగడంవల్ల కావొచ్చు... ఇలాంటి కార్యక్రమానికి తొలిసారి ఇరుగు పొరుగు దేశాధినేతలను ఆహ్వానించడంవల్ల కావొచ్చు...దాదాపు మూడు దశాబ్దాల త ర్వాత మిత్రుల సాయం అవసరంలేనంత స్థాయిలో బీజేపీ సొంతంగానే మెజారిటీ సంపాదించుకున్నందువల్ల కావొచ్చు ఈ కార్యక్రమం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
అందుకు తగినట్టుగానే ఆయన మిత్రపక్షాలనుంచి నలుగురైదుగురికిమించి తీసుకోలేదు. కనుక దీన్ని బీజేపీ కేబినెట్‌గా...ఇంకా చెప్పాలంటే నరేంద్రమోడీ కేబినెట్‌గా పరిగణించవచ్చు. సమర్ధవంతమైన, ప్రభావశీలమైన రీతిలో తన ప్రభుత్వం ఉండాలని సంకల్పించుకున్నందువల్ల అందుకు తగిన వ్యక్తులనుకున్నవారిని ఆయన ఎంపిక చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీచేయని నిర్మలా సీతారామన్ వంటివారికి ఆ కారణంవల్లే కేబినెట్‌లో చోటు కల్పించారు. వీరిలో మోడీ అంచనాలను ఎందరు అందుకుని భవిష్యత్తులో పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా పొందగలుగుతారో చూడాలి.
ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ తరచు ‘కనీస ప్రభుత్వం-గరిష్ట పాలన’ గురించి ప్రస్తావించారు. ఇప్పుడు 45మందితో కేబినెట్ ఏర్పాటుచేయడం అందులో భాగమేననుకోవాలి. యూపీఏ రెండు దఫాలూ ఏర్పాటుచేసిన మంత్రివర్గాల్లోనైనా, గతంలోని ఎన్‌డీఏ కేబినెట్‌లోనైనా 70కి మించే మంత్రులున్నారు. కూటమిలో లెక్కకు మించి ఉండే పార్టీలను సంతృప్తిపరచడం కోసం ఇంత పెద్ద కేబినెట్‌ల అవసరం ఏర్పడిందనేది నిజం. ఇప్పుడు నరేంద్ర మోడీకి అలాంటి బాదరబందీ లేదు. కనుకనే ఆయన చిన్న టీమ్‌కు పరిమితం కాగలిగారు.
అయితే, ఈ క్రమంలో ఆయన కేవలం ఒక వ్యక్తి పూర్తిగా దృష్టిపెట్టినా సమయం సరిపోనంతగా పనివుండే రెండేసి మంత్రిత్వశాఖలను కొందరికి అప్పగించారు. ఉదాహరణకు అధికారికంగా ప్రకటించకపోయినా అరుణ్ జైట్లీకి ఆర్ధిక మంత్రిత్వ శాఖతోపాటు మరో పెద్ద బాధ్యత రక్షణ శాఖను కూడా అప్పగించారని చెబుతున్నారు. ప్రాధాన్యత రీత్యా ఈ రెండూ అత్యంత కీలకమైనవి. విడివిడిగా ఉండదగినవి. అలాగే, న్యాయ మంత్రిత్వ శాఖ, టెలికాం శాఖలను రవి శంకర్ ప్రసాద్‌కు కేటాయించారంటున్నారు. తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగా ఎప్పుడైనా ఇలాంటి శాఖలను ఒకరివద్ద ఉంచాల్సివచ్చినా వాటిని తర్వాత వేరేవారికి కేటాయించడం ఆనవాయితీ. అందుకు భిన్నంగా మోడీ దాదాపు 51 శాఖలను 36మందికి అప్పగించారు. భవిష్యత్తులో విస్తరణకు వీలుండటానికి ఈ పనిచేశారా లేక చిన్న కేబినెట్ ఉండాలన్న పట్టుదలతో చేశారా అన్నది చూడాల్సివుంది.
నరేంద్ర మోడీ రంగంలోకి రాకముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిత్వానికి బలంగా వినిపించిన పేరు సుష్మా స్వరాజ్. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకుని కావొచ్చు... ఆమెకు అత్యంత ప్రధానమైన విదేశీ వ్యవహారాల శాఖను అప్పగించారు. బీజేపీలో ఆమె అంచెలంచెలుగా ఎదిగి ముఖ్య నాయకురాలిగా రూపొందారు. గత లోక్‌సభలో ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేశారు. మొదటినుంచీ బీజేపీలో ముఖ్యపాత్ర పోషిస్తూ వస్తున్న వెంకయ్యనాయుడుకు కూడా ఈ కేబినెట్‌లో స్థానం కల్పించారు. ఆయనకు కీలకమైన భారీ పరిశ్రమల శాఖ కేటాయించారంటున్నారు. టీడీపీనుంచి అశోక్‌గజపతి రాజుకు కేబినెట్ మంత్రి పదవి దక్కింది. అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, సుష్మా స్వరాజ్ కాక కేబినెట్‌లో మరో కీలక నేత రాజ్‌నాథ్‌సింగ్. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌నాథ్‌సింగ్ నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థి కావడంలో కీలక పాత్ర పోషించారు.
రాజ్‌నాథ్ కృషివల్లే అద్వానీ వంటి కురువృద్ధుడు మోడీపై ఆగ్రహాన్ని చల్లార్చుకున్నారు. ఇక కేబినెట్‌లో మహిళలకిచ్చిన ప్రాధాన్యత గమనించదగ్గది. 23మంది కేబినెట్ మంత్రుల్లో ఆరుగురు మహిళలు. వీరుకాక నిర్మలా సీతారామన్ సహాయమంత్రి కాగా, ఆమె స్వతంత్రంగా తన శాఖను చూస్తారు. మొత్తానికి కేబినెట్‌లో 25 శాతంమంది మహిళలన్నమాట! బీజేపీని మెచ్చి అధిక స్థానాలు అందజేసిన యూపీ, మహారాష్ట్రలకు కేబినెట్‌లో సింహభాగం దక్కింది. యూపీనుంచి 9మందికి, మహారాష్ట్రనుంచి ఆరుగురికి మంత్రి పదవులు లభించాయి. చాలాకాలంగా సంకీర్ణ యుగం నడుస్తున్నందున మంత్రివర్గ కూర్పులో మిత్రపక్షాల అలకలు, బెదిరింపులు తరచుగా వినబడేవి. ఇతర బాధ్యతలు వదిలి వారిని బుజ్జగించడం ప్రధానికి తలకు మించిన బరువయ్యేది.
కేబినెట్ ప్రమాణస్వీకారం కంటే ఈ కథనాలే పతాక శీర్షికలయ్యేవి. కానీ, నరేంద్ర మోడీ అదృష్టవంతుడు. ఆయన ఇలాంటివాటికి దూరంగా, ప్రశాంతంగా తన పని చేసుకోగలిగారని చెప్పవచ్చు. ఉంటే గింటే బీజేపీకి మార్గదర్శకత్వంవహించే ఆరెస్సెస్ సలహాలూ, సూచనలూ ఆయనకు అంది ఉండొచ్చు. ఇప్పుడు నరేంద్రమోడీ ప్రభుత్వం ముందు పెను సవాళ్లున్నాయి. అన్ని రంగాల్లోనూ పెరిగిపోయిన అవినీతి, అస్తవ్యస్థంగా తయారైన ఆర్ధిక వ్యవస్థ, నిరుద్యోగం, అధిక ధరలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. పారిశ్రామిక రంగం దాదాపు పడకేసింది. ఈ దుస్థితిని మార్చగలరని విశ్వసించబట్టే బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నరేంద్రమోడీ ప్రభుత్వానిదే.
నరేంద్రమోడీ కేబినెట్!
Published Tue, May 27 2014 1:30 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement