దిగజారుడు రాజకీయం! | Political degrading! | Sakshi
Sakshi News home page

దిగజారుడు రాజకీయం!

Published Tue, Jun 2 2015 12:06 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

పుట్టుకతో వచ్చిన బుద్ధులు అంత త్వరగా మాసిపోవు. అందుకే అటు సూర్యుడు ఇటు పొడిచినా పొడవచ్చునేమోగానీ..

పుట్టుకతో వచ్చిన బుద్ధులు అంత త్వరగా మాసిపోవు. అందుకే అటు సూర్యుడు ఇటు పొడిచినా పొడవచ్చునేమోగానీ...చంద్రబాబు వైఖరిలో మాత్రం మార్పు రాదు. హైదరాబాద్ మహానగరంలో తిరునాళ్లను తలపించిన మహానాడు నిర్వహించి, ఆ వేదికపైనుంచి రాజకీయ విలువల గురించి, నైతికత గురించి లెక్చెర్లు దంచి మూడురోజులు కాలేదు...ఈలోగానే ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకు కరెన్సీ నోట్ల కట్టలను ఎరజూపుతూ కెమెరాలకు చిక్కారు. ఆయన చర్యగానీ, ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలుగానీ ఈ దేశంలో నెలకొల్పుకున్న ప్రజాస్వామిక వ్యవస్థలకూ, విలువలకూ పెను సవాల్ వంటివి. రేవంత్‌రెడ్డి ఆద్యంతమూ తన గురించీ, తన బాస్‌గురించీ, ఆయన రాజకీయపుటెత్తుల గురించీ చెప్పిన మాటలు వింటే ఎవరికైనా దిమ్మదిరగాల్సిందే. వేదికలపై మైక్‌ల ముందు వల్లించే ఆదర్శాలకూ, తెరవెనక సాగించే కుతంత్రాలకూ ఎంత వ్యత్యాసం ఉంటుందో ఆ సంభాషణలు పట్టిస్తాయి. తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో ఎన్నిక కావలసిన ఆరుగురు ఎమ్మెల్సీల కోసం జరిగే ఈ ఎన్నికల్లో గెలవడం, ఓడటం వల్ల ఒరిగేదేమీ లేదని టీడీపీకి కూడా తెలుసునట.

కానీ, చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ నడుస్తోంది గనుక...ఈ గేమ్ మొదలైందట! గెలుపోటముల ప్రమేయమేలేని ఒక ‘ఆట’లో ఒక్క ఓటు కోసం రూ. 5 కోట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధపడిందంటే ఆ పార్టీ డబ్బుతో ఎంతగా మదించిందో, విలువల్లో పాతాళప్రమాణానికి ఎలా పడిపోయిందో అర్థమవుతుంది. అసలు ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో ఉన్నది రేవంత్ ఒక్కరేనా లేక మిగిలిన నేతలూ ఉన్నారా...వారు ఈ ఒక్క ఎమ్మెల్యేనే కలిసి ఊరుకున్నారా లేక మిగిలినవారితో కూడా మాట్లాడారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.  ఈ ఎమ్మెల్యే ముందస్తు సమాచారం ఇచ్చారు గనుక ఏసీబీ వలపన్ని పట్టుకోవడం సాధ్యమైంది.

 ఓటు హక్కు అనేది రాజ్యాంగంలోని 19(1)(ఏ) అధికరణం హామీ ఇస్తున్న భావ ప్రకటనాస్వేచ్ఛలోనూ, 21వ అధికరణం హామీ ఇస్తున్న వ్యక్తి స్వేచ్ఛలోనూ అంతర్భాగమని రెండేళ్లక్రితం ఒక కేసులో తీర్పునిస్తూ సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. కనుక టీడీపీ చర్య ఒక ప్రజాస్వామిక ప్రక్రియను వమ్ము చేయడం మాత్రమే కాదు...ఎమ్మెల్యేల భావప్రకటనా స్వేచ్ఛకూ, వ్యక్తి స్వేచ్ఛకూ ముప్పు కలిగించే చర్య కూడా అవుతుంది. మన ఓటింగ్ విధానంలోని లోపాల గురించి, ఆచరణలో ఎదురవుతున్న సమస్యలగురించి ఎన్నికల సంఘం పట్టించుకుని పరిష్కారాలను అన్వేషిస్తుంటే వాటిని సైతం భ్రష్టుపట్టించేందుకు బాబువంటి నేతలు ప్రయత్నిస్తున్నారు.
 మహానాడుకు హాజరైనవారి మాడు పగిలేలా చంద్రబాబు మూడురోజులక్రితం ఉపన్యసించారు. టీడీపీ ఓ యూనివర్సిటీ లాంటిదన్నారు. ఇందులో కార్యకర్తలను నేతలుగా  తర్ఫీదునిచ్చి తీర్చిదిద్దుతుంటే ప్రత్యర్థి పార్టీలవారు ‘సంతలో పశువుల్లా’ వారిని కొంటున్నారని వాపోయారు. ఎందరిని తీసుకుపోయినా కొత్తవారిని తయారుచేసుకోగల సత్తా తమకున్నదని చెప్పారు. ఆదివారం చానెళ్లలో ప్రసారమైన దృశ్యాలే ‘టీడీపీ యూనివర్సిటీ’లో ఇస్తున్న తర్ఫీదు ఎలాంటిదో... అక్కడ రూపొందుతున్న పట్టభద్రులు ఏ బాపతో  పట్టిచూపాయి. ‘సంతలో పశువుల్లా’ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నదెవరో కళ్లకు కట్టాయి. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సాగిన సంభాషణల్లో రేవంత్ నోటివెంబడి వెలువడిన మాటలు వింటే మన రాజకీయాలు భ్రష్టుపట్టిన వైనం వెల్లడవుతుంది. అవి మాఫియా నాయకుడు పంపగావచ్చిన ఏజెంటు వల్లించిన పలుకుల్లా మాత్రమే అనిపిస్తాయి. ఇందుకు పాత్రధారిని అని లాభంలేదు...సూత్రధారినే తప్పుబట్టాలి. స్వర్గీయ ఎన్టీరామారావు నుంచి అధికారం గుంజుకున్నది మొదలు చంద్రబాబు ఈ బాపతు రాజకీయాలనే అమలు చేస్తున్నారు. ఒకపక్క వేదికలెక్కి రాజకీయాల్లో డబ్బు ప్రభావం గురించీ, అవినీతి గురించీ, సంతలో పశువుల్లా అమ్ముడైపోతున్నవారి గురించి వాపోయే చంద్రబాబు సరిగ్గా దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆ పనిలో సిద్ధహస్తులైనవారిని అక్కున చేర్చుకుని రాజకీయాలు నడిపిస్తున్నారు.
 రేవంత్ రెడ్డి ఉదంతం చంద్రబాబు గతంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాల గురించి కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నది. తెరచాటు ఒప్పందాలూ, చీకటిచాటు మంతనాలూ మాత్రమే అలవాటైన బాబు రెండున్నరేళ్లనాడు మల్టీబ్రాండ్ చిల్లరవర్తకంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ)లను అనుమతించే బిల్లుపై జరిగిన ఓటింగ్ సమయంలో రాజ్యసభ నుంచి తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను గైర్హాజరు చేయించి కేంద్రంలో ఆనాటి యూపీఏ సర్కారును కాపాడారు. రెండేళ్లక్రితం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా తటస్థత పాటించి ఆ మైనారిటీ సర్కారును నిలబెట్టారు. సాధారణ సమయాల్లో నీతులు మాట్లాడుతూ కీలకమైన  సందర్భం వచ్చేసరికి అందుకు భిన్నమైన వైఖరిని తీసుకునే చంద్రబాబు నిర్ణయాల వెనక సరిగ్గా ఇప్పుడు జరిగినట్టుగానే ‘ఓటుకు నోటు’ లాలూచీలు ఏమైనా నడిచాయా అనే సందేహం అందరిలోనూ కలుగుతున్నది. చంద్రబాబు వంటి అపారానుభవం కలిగిన నాయకుడు తన విశ్వసనీయత దెబ్బతింటుందనిగానీ, తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగవచ్చుననిగానీ ఆలోచించకుండా చివరి నిమిషంలో అభిప్రాయాలను మార్చుకోవడానికి ఇవికాకపోతే ఇంకేమి కారణాలున్నాయో ఆ పార్టీవారే చెప్పాలి. వాస్తవానికి ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా  డబ్బులు కుమ్మరించడానికి తగిన సందర్భం కానే కాదు. ఎందుకంటే  తగిన ఆదాయ వనరులు లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నదని చంద్రబాబే చెబుతున్నారు. వీటిని అధిగమించడానికి త్యాగాలు అవసరమని కూడా ఉద్బోధిస్తున్నారు. ఈ కష్టాలను సాకుగా చూపే ఎన్నికల హామీలకు మంగళం పాడారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వచ్చిన పంతం కారణంగా ఎమ్మెల్యేల ఓట్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చుపెట్టడానికి వెనకాడకపోవడమంటే జనంతో పరిహాసాలాడటమే. వ్యవస్థలను ఏమార్చి ఎన్నాళ్లయినా నెట్టుకురాగలమనుకోవడం చెల్లదని తాజా ఉదంతం తేటతెల్లం చేస్తున్నది. దీన్నుంచి అయినా బాబు గుణపాఠం గ్రహిస్తారా?!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement