విద్యార్థి ఆత్మహత్య ఘటనపై నిరసన
రామచంద్రాపురం: మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో గురువారం రాత్రి క్యాంపస్ విద్యార్థులు వీరంగం సృష్టించారు. తోటి విద్యార్థి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన విద్యార్థి సూరజ్ మెదక్ జిల్లా అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మార్కులు తక్కువగా వస్తున్నాయని క్యాంపస్‌లో యాజమాన్యం సూరజ్‌ను వేధించారు. దీంతో అతను జనవరి 29న క్యాంపస్ భవనంపై నుంచి దూకాడు.
తీవ్రంగా గాయపడిన విద్యార్థిని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత సూరజ్ తల్లిదండ్రులు వసంత్‌రావు, సంగీతలు తమ కుమారుడ్ని సికింద్రాబాద్ సన్‌షైన్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే, పరిస్థితి విషమించడంతో సూరజ్ ఈ నెల 14న మృతి చెందాడు. అదే రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు, కళాశాల యాజమాన్యం రహస్యంగా ఉంచారు. సూరజ్ తల్లి సంగీత తన కుమారుడు ఎలా కింద పడ్డాడని ఆరా తీసేందుకు గురువారం రాత్రి ఘటన స్థలానికి రాగా.. విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు ఆమె నుంచి సూరజ్ మృతి వార్త తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంపస్‌లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
కాలేజీ ఫర్నిచర్ ధ్వంసం చేసిన విద్యార్థులు
Published Fri, Feb 19 2016 3:51 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement