ఉత్తరప్రదేశ్, జమ్మూ–కశ్మీర్ రాష్ట్రాల్లో వెల్లడైన రెండు అత్యాచార ఉదంతాల్లో అక్కడి ప్రభుత్వాలు దేశ పౌరులంతా సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించాయి. ఈ దేశంలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదా అనే సందేహం కలగజేశాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉండగా, జమ్మూ–కశ్మీర్‌లో బీజేపీ–పీడీపీ కూటమి సర్కారు ఉంది. కానీ రెండుచోట్లా అధికారంలో ఉన్నవారు బాధిత వర్గాలపై చూపిన నిర్లక్ష్యం, నిందితులను కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నించిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన బాధితురాలు పదహారేళ్ల బాలిక. తనపై అధికార పార్టీ ఎమ్మెల్యే అత్యాచారం చేశాడని, చర్య తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. కనీసం అప్పుడైనా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించి, ఆరోపణలొచ్చినవారిని అరెస్టు చేయించి ఉండాల్సింది.
కానీ అందుకు విరుద్ధంగా ఎమ్మెల్యేకు చెందిన గూండాలు ఆమె ఇంటిపై దాడి చేసి ఆ బాలిక తండ్రిని అపహరించి తీసుకుపోయి అమానుషంగా కొట్టారు. నిలువెల్లా నెత్తురోడుతూ పోలీస్ స్టేషన్‌లో అతడు చెప్పిన మాటలు వీడియోలో రికార్డయి ఉన్నాయి. ఎమ్మెల్యే సోదరుడి నాయకత్వంలో గూండాలు తనను హతమార్చే ఉద్దేశంతో తీవ్రంగా కొట్టారని స్పష్టంగా వెల్లడించాడు. ఆ తర్వాత తనువు చాలించాడు. ఇంత జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు. ఆ వీడియో మీడియాలో వెల్లడై జనమంతా ఛీత్కరించాక ఎమ్మెల్యే సోదరుణ్ణి అరెస్టు చేశారు. కానీ ఇంతవరకూ ఎమ్మెల్యే జోలికి పోలేదు. ఆ ఎమ్మెల్యే బోర విరుచుకు తిరుగుతూ బాధిత కుటుంబం ‘తక్కువ స్థాయి’దంటూ నోరుపారేసు కుంటున్నాడు.
జమ్మూ–కశ్మీర్ ఉదంతం మరింత ఘోరమైనది. అందులో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు... ప్రధాన పార్టీల నేతలు, మొత్తంగా అక్కడి సమాజమూ కూడా బాధ్యులే. గొర్రెల్ని, మేకల్ని మేపుకుంటూ సంచార జీవనం సాగించే బఖేర్వాల్ తెగకు చెందిన ఎనిమిదేళ్ల బాలిక అసిఫాను గత జనవరి 10న కొందరు దుండగులు నమ్మించి అడవికి తీసుకుపోయి అక్కడ ఆమెపై దౌర్జన్యం చేసి, మత్తు పదార్ధాన్నిచ్చి నాలుగురోజులపాటు సామూహిక అత్యాచారం జరిపి రాళ్లతో కొట్టి చంపిన తీరు గురించి వింటే ఎలాంటివారైనా కంటతడి పెట్టకమానరు. కథువా పట్టణానికి సమీపంలోని రసన గ్రామంలో జరిగిన ఈ దురంతంలో పాలుపంచుకున్నవారిలో ఇద్దరు మైనర్లు, మరో ఇద్దరు పోలీసు విభాగానికి సహకరించే ప్రత్యేక పోలీసు అధికారులు(ఎస్‌పీఓలు) ఉన్నారు. బాలిక గురించి ఆమె కుటుంబసభ్యులు వెదు కుతున్న సమయానికి స్థానిక పోలీసుల్లో కొందరికి ఆమెను ఎక్కడ బంధించారో తెలుసు. అయినా వారు రక్షించేయత్నం చేయలేదు.
అంతేకాదు... ఆ బాలికను చంపేశాక కీలకమైన సాక్ష్యాధారాలను మాయం చేయడానికి కూడా వారు ప్రయ త్నించారు. ఇవన్నీ ఘటనపై దర్యాప్తు చేసిన రాష్ట్ర క్రైం బ్రాంచ్ విభాగం చార్జిషీ టులో ఉన్నాయి. జనవరిలో ఈ ఉదంతం జరిగాక తొలుత మైనర్‌ను అరెస్టు చేసిన ప్పుడు దర్యాప్తు సక్రమంగా జరగడంలేదని, దీన్ని క్రైం బ్రాంచ్‌కు అప్పగించాలని మెహబూబా కేబినెట్‌లోని ఇద్దరు బీజేపీ మంత్రులు డిమాండ్ చేశారు. క్రైంబ్రాంచ్ దర్యాప్తు ప్రారంభమయ్యాక ఇతర నిందితుల గుట్టు రట్టు కావడం మొదలయ్యే సరికి దీన్ని సీబీఐకి అప్పగించాలంటూ స్వరం మార్చారు. దర్యాప్తు కోసం నింది తులను అదుపులోకి తీసుకున్న సమయంలోనే ఒక మంత్రి అంత చిన్న వయసున్న వారిని ఎలా అరెస్టు చేస్తారంటూ పోలీసులపై విరుచుకుపడ్డాడు. మరో మంత్రి ఒక బాలిక మృతిపై ఇంత రాద్ధాంతం చేస్తారా... ఎంతమంది మహిళలు ఈ ప్రాంతంలో చనిపోవడంలేదని నిలదీశాడు. వీరిద్దరే కాదు... కథువా బార్ అసో సియేషన్, హిందూ ఏక్తా మంచ్ సైతం ఈ విషయంలో ఒత్తిళ్లు తీసుకొచ్చాయి. బీజేపీ, ఏక్తామంచ్ జాతీయ పతాకంతో ర్యాలీలు నిర్వహించాయి. ఇందులో స్థానిక కాంగ్రెస్ నేతలు సైతం పాలుపంచుకున్నారు. చార్జిషీటు దాఖలు చేయడానికొచ్చిన అధికారులను బార్ అసోసియేషన్ అడ్డగించింది.
రాష్ట్రాలు వేరైనా అత్యాచారం కేసుల విషయంలో ఎలాంటి పోకడలు కని పిస్తున్నాయో ఈ రెండు ఉదంతాలు చూస్తే అర్ధమవుతుంది. అత్యాచారాలు జరగడానికి ఆడవాళ్ల ప్రవర్తన, వారి వస్త్ర ధారణ వగైరాలన్నీ కారణాలని ఇన్నా ళ్లనుంచి రాజకీయ నాయకులు మొదలుకొని ఎందరో చెబుతున్నారు. ఈసారి కుల, మతాలు కూడా ఆ జాబితాలో చేరినట్టున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బాధితురాలి కుటుంబం ‘తక్కువ స్థాయి’దని అక్కడి ఎమ్మెల్యే అన్నాడు. జమ్మూలో బాధి తురాలు ముస్లిం గనుక జరిగిన ఉదంతాన్ని ఆసరా చేసుకుని మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు క్రైం బ్రాంచ్ ప్రయత్నిస్తున్నదని బీజేపీ, హిందూ ఏక్తా మంచ్, స్థానిక బార్ అసోసియేషన్‌లు ఆరోపిస్తున్నాయి. క్రైం బ్రాంచ్ దాఖలు చేసిన చార్జిషీటు సవివరంగా నిందితుల ప్రమేయాన్ని ప్రస్తావించింది. వారి వాంగ్మూ లాలతో సరిపోలే ఆధారాలన్నిటినీ సేకరించింది. డీఎన్‌ఏ పరీక్షలు చేయించి మైనర్లతోసహా నిందితులందరి గుట్టునూ విప్పింది.
వారు పరస్పరం మాట్లాడు కున్న ఫోన్ సంభాషణల రికార్డుల్ని సంపాదించింది. ఇన్ని ఆధారాలతో చార్జిషీటు దాఖలు చేసినప్పుడు ఉద్దేశాలు అంటగట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతకన్నా ఆశ్చర్యకరం... మూడు నెలలుగా దర్యాప్తు విషయంలో తరచు అడ్డుతగలడమే కాక, అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన మంత్రులిద్దరూ ఇంకా పదవుల్లో కొన సాగటం. దేశ రాజధాని నగరంలో ఆరేళ్లక్రితం ‘నిర్భయ’ ఉదంతం జరిగినప్పుడు అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసిన పార్టీల్లో బీజేపీ ముందుంది. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మంత్రుల తీరు ఇలా ఉన్నా, సాక్షాత్తూ ఎమ్మెల్యేపై ఆరోపణలొచ్చినా కనీస స్పందన మాట అటుంచి ఇంతవరకూ చర్యలు లేవు. పార్టీలు ఇలా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ సమాజాన్ని ఎలా ఉద్ధరిస్తాయో, ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షిస్తామని చెప్పగలవో అనూహ్యం.
Comments
Please login to add a commentAdd a comment