ఫ్రాన్స్‌లో జనాగ్రహం | Sakshi Article On Protest In France | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 4 2018 12:47 AM | Last Updated on Tue, Dec 4 2018 12:47 AM

Sakshi Article On Protest In France

యూరప్‌ యూనియన్‌(ఈయూ)లో జర్మనీ, బ్రిటన్‌ల తర్వాత మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఫ్రాన్స్‌ నిరసనలతో అట్టుడుకుతోంది. దేశాధ్యక్షుడు మేక్రాన్‌ ప్రభుత్వం పెంచిన డీజిల్‌ పన్నుతో జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పక్షం రోజులక్రితం ప్రారంభమైన ఈ నిరసనలు క్రమేపీ కొడిగట్టడం ఖాయమని అంచనా వేసుకున్న ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతిపరుస్తూ పారిస్‌ నగ రంలో ఆదివారం భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ‘పసుపు కోటు’ నిరసనలుగా పిలుస్తున్న ఈ ఉద్యమంలో చెలరేగిన హింసలో ముగ్గురు చనిపోగా, దాదాపు 260మంది గాయపడ్డారు. 400 మందిని అరెస్టు చేశారు. ఆందోళనకారులు పలు వాహనాలకు, భవంతులకు నిప్పెట్టడంతోపాటు దుకాణాల్ని లూటీ చేశారు. పారిస్‌ వీధులు యుద్ధరంగాన్ని తలపించాయి.

వీటిని అదుపు చేయ డానికి అవసరమైతే అత్యవసర పరిస్థితి విధించాలని ఫ్రాన్స్‌ ప్రభుత్వం భావిస్తున్నదంటే వీటి తీవ్రత ఎంతో అంచనా వేయొచ్చు. అర్ధ శతాబ్దం తర్వాత...అంటే 1968నాటి విద్యార్థి తిరుగుబాటు తర్వాత ఈ స్థాయిలో హింస చెలరేగడం ఇదే ప్రథమం. ఈయూకు భవిష్యత్తులో తానే సారథ్యం వహించాలని ఉవ్విళ్లూరుతున్న మేక్రాన్‌కు సహజంగానే ఈ ఆందోళనలు మింగుడుపడటం లేదు. నిరుడు ఫ్రాన్స్‌ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మధ్యస్థ మితవాద పక్షానికి నేతృత్వం వహించిన మేక్రాన్‌ 66.06 శాతం ఓట్లతో విజయం సాధించారు.

లీ పెన్‌ వంటి తీవ్ర మితవాదులు అధికారం చేజిక్కించుకునే ప్రమాదం ఉన్నదని ఆందోళనపడ్డవారంతా ఈ విజయంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ అదంతా త్వరలోనే ఆవిరైంది. జీడీపీలో 56 శాతంగా ఉన్న ప్రజా సంక్షేమ పథకాల వ్యయాన్ని 52 శాతానికి తగ్గిస్తానని, కార్మిక సంస్కరణలు తీసుకొస్తానని గద్దెనెక్కిన అనంతరం మేక్రాన్‌ ప్రక టించారు. ఆ బాణీలోనే ఆయన పాలన సాగుతోంది. నిరసనలకు లొంగి సంస్కరణల పథం విడిచి పెట్టే ప్రసక్తి లేదని ఆయన పలుమార్లు ప్రకటించారు. అయితే ఈ సంస్కరణలు జనంలో నానాటికీ ఆగ్రహాన్ని పెంచుతున్నా ఆయన ఖాతరు చేయలేదు. దేశం ఆర్థిక శక్తిగా ఎదగాలంటే తీవ్ర చర్యలు అవసరమని చెబుతూ వచ్చారు. 

డీజిల్‌పై అదనపు పన్ను విధించిన కొన్ని గంటల్లోనే దేశం నలుమూలలా అసంతృప్తి రాజుకో వడం, ఆ తర్వాత ఒకటి రెండురోజులకే అది ఉద్యమ రూపం సంతరించుకోవడం ఆశ్చర్యకరమై నదే. అంతకన్నా ఆశ్చర్యమేమంటే ఈ ఉద్యమానికి చెప్పుకోదగ్గ నాయకులు, సంఘాలూ లేక పోవడం. కేవలం ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలే ఉద్యమానికి నారూ నీరూ పోశాయి. రహదార్ల మధ్యన ఉండే ట్రాఫిక్‌ ఐలాండ్‌లే ఆందోళనకారుల స్థావరాలు. అక్కడ టార్పాలిన్లతో శిబిరాలు ఏర్పాటు చేసుకుని మంచు కురుస్తున్నా, వర్షం పడుతున్నా వందలాదిమంది రాత్రింబగళ్లు నిరసనల్లో పాల్గొంటున్నారంటే వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తిని అంచనా వేయొచ్చు.

ఈ అసంతృప్తి డీజిల్‌పై తాజాగా విధించిన పన్నుతో రాజుకున్నది మాత్రమే కాదు. మేక్రాన్‌ వచ్చాక ఎన్నో పరిశ్రమలు మూతబడ్డాయని, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని సాధారణ పౌరులు ఆరోపిస్తున్నారు. రెండు నెలలక్రితం మేక్రాన్‌తో ఒక యువకుడు ఈ మాటే చెప్పినప్పుడు ఆయన దాన్ని కొట్టిపారేశారు. ఏదో ఒక పని చేయాలన్న సంకల్పం ఉంటే ఉద్యోగం దొరకడం కష్టమేమీ కాదని హితబోధ చేశారు. హోటళ్లు, కెఫెలు, రెస్టరెంట్లు, నిర్మాణ రంగ సంస్థలు వగైరాలన్నీ పని వాళ్లకోసం ఎదురుచూస్తున్నాయని వాదించారు. అలాగని ఉద్యోగవర్గాలు కూడా సంతోషంగా లేవు. అన్నిటి ధరలూ ఆకాశాన్నంటడం వల్ల నెలకు 1,500 యూరోలు సంపాదిస్తున్నవారు సైతం నెలాఖరుకు అప్పులు చేయాల్సి వస్తున్నది.

పారిస్, కొన్ని ఇతర నగరాల్లో జీవన వ్యయం ఎక్కువ కావడం వల్ల అక్కడ పనిచేసేవారిలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాలనుంచే వస్తారు. వారికి  రవాణా సదుపాయాలు అంతంతమాత్రం. ప్రపంచంలో రైల్వే నెట్‌వర్క్‌ విస్తృతంగా ఉన్న దేశాల్లో ఫ్రాన్స్‌ కూడా ఉంది. కానీ ఆ రైల్వేలైన్లు గ్రామీణ ప్రాంతాలకు దూరంగా ఉంటాయి. కనుక నగ రాల్లో పనిచేసేవారు సొంత వాహనాలపైనే ఆధారపడతారు. పర్యవసానంగా యూరప్‌లో వేరే దేశాలతో పోలిస్తే డీజిల్‌ కార్లు అత్యధికంగా వాడేది ఫ్రాన్సే. పారిస్‌లో నిరుడు జరిగిన వాతావరణ శిఖరాగ్ర సదస్సులో కాలుష్య నివారణ కోసం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం వాహన వినియోగాన్ని తగ్గించాలని  మేక్రాన్‌ ప్రభుత్వం నిర్ణయించుకుంది.

అయితే ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాల గురించి ఆలోచించకుండా పన్నులు పెంచుకుంటూ పోవడం పరిష్కారమని అను కోవడం వల్లే పరిస్థితి వికటించింది. జీవన వ్యయం బాగా పెరిగిందని, ఆర్థికంగా జనం ఇబ్బం దులు పడుతున్నారని మేక్రాన్‌కు తెలియందేమీ కాదు. 2008నాటి ఆర్థిక మాంద్యం ప్రభావంతో దెబ్బతిన్న మధ్యతరగతి ఇంకా కోలుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు దెబ్బ తినడంతో నగరాలకు వలసలు పెరిగాయి. 

మేక్రాన్‌ అధికారంలోకొచ్చి ఏడాది దాటుతున్నా సమస్యలకు మూలం ఎక్కడున్నదో, దాన్ని సరిచేయడానికి ఏం చేయాలో సక్రమంగా ఆలోచించలేకపోయారు. సంపద పన్ను భారీగా తగ్గిం చారు. అదే సమయంలో ఇతరత్రా పన్నులు బాగా పెంచారు. విద్య, వైద్యం వంటి సామాజిక సంక్షేమ పథకాల వ్యయంపై కోత విధించారు. ఉద్యమకారులతో చర్చించి వారి సమస్యలు తెలుసు కుని పరిష్కరించడానికి సిద్ధమని ఇప్పుడాయన చేసిన ప్రకటనకు మొదట సానుకూల స్పందనే వచ్చింది. అయితే ఆ చర్చల్ని వీడియో తీసేందుకు అనుమతించబోమని ప్రభుత్వం చెప్పడంతో ఉద్యమకారులు వెనక్కి తగ్గారు. తాము నిలదీసే అంశాలేమిటో, వాటికి పాలకుల సంజాయిషీ ఏమిటో దేశ పౌరులందరికీ తెలియాలని వారు భావిస్తున్నారు. ఈయూకు సారథ్యం వహించాలని కలలుగంటున్న మేక్రాన్‌ తొలుత స్వదేశంలో తలెత్తే సంక్షోభాలను చక్కదిద్దుకోవడం నేర్చుకోన ట్టయితే అసలుకే ఎసరు వస్తుంది. తాజా ఉద్యమం చెబుతున్నది అదే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement