ఆయనేమీ అమెరికా సైనికుల అకృత్యాలను ఆన్‌లైన్‌లో రచ్చకీడ్చిన జులియన్ అసాంజ్ కాదు. దేశదేశాల్లోని కోట్లాదిమంది పౌరులపై నిఘా ఉంచుతున్న అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఏ) తీరుతెన్నులను బట్టబయలు చేసి రష్యాలో తలదాచుకుంటున్న ఎడ్వర్డ్ స్నోడెన్ కాదు. ఆయన వేలాది కోట్ల డాలర్ల విలువైన అతి పెద్ద మెసేజింగ్ సంస్థ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ ద్యురోవ్.
రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ పోలీసులు పారిస్‌లో ఆయన్ను అరెస్టు చేసి నిర్బంధించారని తెలియగానే ట్విటర్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ ఖండించారు. పావెల్ విడు దల కోసం ట్విటర్ వేదికగా ‘ఫ్రీ పావెల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రపంచాధినేతల్లో ఎంతో పలుకుబడిగల మస్క్ గతంలో ఎప్పుడూ ఇలాంటి వివాదాల జోలికిపోలేదు. ఆరు నూరైనా... ఎలాంటి పర్యవసానాలూ, పరిణామాలూ ఎదురైనా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ ఉండితీరాలని వాదించటంలో పావెల్‌కి ఎవరూ సాటిరారు.
నిజానికి అది వివాదాస్పదం కావటంతోనే అతను జైలుపాలయ్యాడు. కారణాలు వెల్లడి కాకపోయినా పసివాళ్లతో రూపొందించిన బూతుచిత్రాల పంపిణీకీ, మాదకద్రవ్య ముఠాల కార్యకలాపాలకూ, ఉగ్రవాద కార్యకలాపాలకూ, అక్రమమార్గాల్లో ద్రవ్య చలామణీకీ టెలిగ్రామ్ అవకాశమిస్తోందన్నది చాన్నాళ్లుగా ఉంటున్న అభియోగాల సారాంశం.
భావప్రకటనా స్వేచ్ఛకు ఏమేరకు హద్దులుండాలి... దానివల్ల ఎదురయ్యే దుష్పరిణామాలకు బాధ్యులెవరు... ఈ విషయంలో ప్రభుత్వాల ప్రమేయాన్ని ఎంతవరకూ అనుమతించాలి వంటి ప్రశ్నలు ఎప్పటినుంచో అందరినీ వేధిస్తున్నాయి. ఇప్పుడు పావెల్ అరెస్టుతో అవి మరింత ప్రము ఖంగా చర్చకొస్తున్నాయి.
పావెల్ రష్యా పౌరుడని పేరునిబట్టి ఎవరైనా గుర్తుపడతారు. అయితే ప్రస్తుతం ఆయనకు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల పౌరసత్వం ఉంది. అసమ్మతిని అణిచేయటంలో సిద్ధహస్తుడైన రష్యా అధ్యక్షుడు పుతిన్ చాన్నాళ్లుగా అతన్ని బంధించాలని ప్రయత్నిస్తున్నారు. పావెల్‌ను అప్పగించాలని, కనీసం మాట్లాడటానికి అనుమతించాలని తాజాగా ఫ్రాన్స్‌ను రష్యా డిమాండ్ చేస్తోంది.
2011లో రష్యా నిర్వహించిన ఎన్నికలు పూర్తిగా బోగస్ అంటూ బయ ల్దేరిన ‘మంచు విప్లవం’ (స్నో రివల్యూషన్) దేశం నలుమూలలా విస్తరించటానికి పావెల్ దోహద పడ్డాడు. ఆ క్రమంలో ఏర్పడిన మెసేజింగ్ యాప్ కాస్తా తర్వాతకాలంలో టెలిగ్రామ్‌గా రూపుదిద్దు కుంది. పావెల్ ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను ఖండించే అభిప్రాయాలకు చోటిచ్చాడు.
అంతేకాదు... ఇజ్రాయెల్ గాజాలో సాగిస్తున్న అకృత్యాలను బట్టబయలు చేసే వీడియోలను వెల్లడించేందుకు అనుమతించాడు. ఇతర దిగ్గజ సంస్థలు మొహం చాటేసిన ఈ అకృత్యాలు టెలి గ్రామ్ లేకపోతే బాహ్య ప్రపంచానికి బహుశా తెలిసేవి కాదు. వాట్సాప్ వంటి ఇతర సంస్థలకు లేని వెసులుబాటు– రెండు లక్షలమందితో గ్రూప్ నిర్వహించటం– టెలిగ్రామ్‌లోనే సాధ్యం.
అయితే ఇందువల్ల అనర్థాలు తలెత్తటం కూడా వాస్తవం. ఆమధ్య పారిస్, బెర్లిన్ నగరాల్లో పేలుళ్లకు, దాడులకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ టెలిగ్రామ్ యాప్‌ను వాడుకుంది. ఆ తర్వాత సంస్థ సాంకేతిక సిబ్బంది దాన్ని కట్టడిచేశారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటీయని వ్యవస్థ ఏర్పర్చు కోవాలని, నేరగాళ్ల ఆనుపానులు ఎప్పటికప్పుడు తమకు అందించాలని అనేక దేశాలు టెలిగ్రామ్‌ను కోరుతున్నాయి.
యూరప్ దేశాలు ఈయూ డిజిటల్ సర్వీసుల చట్టాన్ని రెండేళ్ల క్రితం తీసు కొచ్చాయి. పర్యవసానంగా చాలా మాధ్యమ సంస్థలు దారికొచ్చాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధా రంగా ‘అవాంఛిత’ సందేశాలను జల్లెడ పడుతున్నాయి. వాటిని నిలిపేస్తున్నాయి. అయితే సమస్యే మంటే... ఈ వంకన అనేక మాధ్యమాలు సహేతుకమైన అసమ్మతికి కూడా తలుపులు వేస్తున్నాయి. నియంతలకు వంత పాడుతున్నాయి.
కొన్ని సంస్థలైతే సంకేత నిక్షిప్త సందేశాల(ఎన్‌క్రిప్షన్)కు అవకాశమున్నదని పైకి చెబుతూ తమ వినియోగదారుల ఆనుపానులు తెలుసుకోవటానికి ప్రభు త్వాలకు అవకాశమిస్తున్నాయి. కానీ టెలిగ్రామ్ లొంగటం లేదు. ప్రతి దేశంలోనూ స్థానిక చట్టాల లొసుగులను వాడుకుని బయటపడుతోంది. అలాగని తన వేదికపై వినియోగదారులు పరస్పరం పంపుకునే సందేశాలు టెలిగ్రామ్‌కు తెలియక కాదు. వాటిని అవసరమనుకున్నప్పుడల్లా చూస్తోంది.
భావప్రకటనా స్వేచ్ఛకూ, బాధ్యతకూ మధ్య సన్నని విభజన రేఖ ఉంటుంది. స్వేచ్ఛ మాటున వదంతులు సృష్టించటం, అల్లర్లకు ఆజ్యం పోయటం ఎవరు చేసినా తప్పే అవుతుంది. అలాంటి వారు చట్టం ముందు తలవంచాల్సిందే. ఆ మధ్య గోరక్షణ పేరుతో బృందాలు ఏర్పడి వ్యక్తులను కొట్టిచంపిన ఉదంతాలు పెరిగాక సందేశాల పంపిణీపై వాట్సాప్ అనేక పరిమితులు విధించింది.
మన దేశంలో టెలిగ్రామ్‌కు 50 లక్షలమంది చందాదారులున్నారు. మాదకద్రవ్యాలు, జూదం, బెది రించి డబ్బులు గుంజుకోవటం వంటి కార్యకలాపాలకు అది వేదిక వుతున్నదని మన ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇటీవల నీట్ ప్రశ్నపత్రాల లీకు పుణ్యం టెలిగ్రామ్‌దే. కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ఆ వ్యవహారాలపై దృష్టి సారించింది.
ఇది ఒక కొలిక్కి వస్తే టెలిగ్రామ్ నిషేధానికి కూడా గురికావొచ్చన్నది విశ్లేషకుల అంచనా. ఏదేమైనా తనవల్ల సమాజానికి నష్టం కలుగుతున్నదని గ్రహించాక టెలిగ్రామ్ బాధ్యత గుర్తెరగవలసింది. కనీసం ఆ పని ఇప్పుడైనా జరగాలి. అదే సమయంలో ఆ వంకన ప్రభుత్వాలు సహేతుక విమర్శ లకూ, అసమ్మతికీ పాతరేయకుండా చూడటం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం.
కటకటాల్లో టెలిగ్రామ్ చీఫ్
Published Thu, Aug 29 2024 5:44 AM | Last Updated on Thu, Aug 29 2024 5:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment