ప్రిగోజిన్‌ ఉత్థాన పతనాలు! | Sakshi Editorial On Yevgeny Prigozhin Death | Sakshi
Sakshi News home page

ప్రిగోజిన్‌ ఉత్థాన పతనాలు!

Published Sat, Aug 26 2023 3:23 AM | Last Updated on Sat, Aug 26 2023 3:23 AM

Sakshi Editorial On Yevgeny Prigozhin Death

కిరాయి సైన్యం అధిపతి యెవ్‌గనీ ప్రిగోజిన్‌ బుధవారం విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడని రెండు రోజుల తర్వాత రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. రెండు నెలల క్రితం తిరుగుబాటు ప్రకటించి మాస్కోవైపు శతఘ్నులతో దూసుకెళ్లిన ప్రిగోజిన్‌ అధ్యక్షుడు పుతిన్‌ మినహా ఇతర ఉన్నత స్థాయి నాయకగణంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చాడు. కానీ ఉన్నట్టుండి జూన్‌ 23న నేరుగా తన కిరాయి సైనికులతో మాస్కో దిశగా దండయాత్రకు తరలివెళ్లి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

బహుశా పుతిన్‌ మినహా మిగిలినవారిపైనే తాను ఆగ్రహిస్తున్నట్టు నమ్మించ గలుగుతున్నానని ప్రిగోజిన్‌ భ్రమపడి వుండొచ్చు. ఈ అలజడి పుతిన్‌ను భయోత్పాతంలో ముంచిందనీ, ఆయన అజ్ఞాతానికి పోయారనీ ప్రచారం జరిగింది. ఆ మర్నాడు మీడియాతో మాట్లాడిన పుతిన్, ప్రిగోజిన్‌ను ‘నమ్మక ద్రోహి’గా అభివర్ణించారు. ఇలా ప్రకటించటం మరణ శాసనమేనని అప్పట్లో చాలామంది జోస్యం చెప్పారు.

రష్యాలో లేదా విదేశాల్లో ఉంటూ విమర్శలు గుప్పించే రాజకీయ ప్రత్యర్థులు కావొచ్చు, దేశ రహస్యాలను వేరే దేశాలకు విక్రయించినవారు కావొచ్చు పుతిన్‌ దృష్టిలో నమ్మక ద్రోహులే. ఆ హిట్‌ లిస్ట్‌లోని వారిలో తప్పనిసరై ఒకరిద్దరిని జైల్లో పడేశారు తప్ప ఇంతవరకూ ఎవరినీ ప్రాణాలతో వదల్లేదు. ఇతరేతర అంశాలైతే వేరుగానీ, నమ్మక ద్రోహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోనని గతంలో పుతిన్‌ చేసిన ప్రకటనను ప్రిగోజిన్‌ వ్యవహారంలో కొందరు గుర్తుచేశారు.

నిజానికి బెలారస్‌ మధ్యవర్తిత్వంతో ప్రిగోజిన్‌ శాంతించారని, అతనికీ, ప్రభుత్వానికీ అంగీకారం కుదిరిందని ప్రకటన వచ్చినప్పుడు ప్రిగోజిన్‌కు రోజులు దగ్గరపడినట్టేనని చాలామంది అనుకున్నారు. అదే సమయంలో పుతిన్‌ అతన్ని క్షమిస్తారన్న విశ్లేషణలూ వచ్చాయి. ఎందుకంటే ఉక్రెయిన్‌పై ఏడాదిన్నర క్రితం దురాక్రమణ యుద్ధం మొదలెట్టాక రష్యా చేజిక్కించుకున్న పెద్ద నగరం బఖ్‌మూత్‌. వేరే నగరాలు చిక్కినట్టే చిక్కి చేజారగా, బఖ్‌మూత్‌ మాత్రం ఇంకా రష్యా నియంత్రణలోనే ఉంది.

ఈ విజయం నిస్సందేహంగా ప్రిగోజిన్‌దే.అందుకే అతన్ని మళ్లీ తన దారికి తెచ్చుకుని ఉక్రెయన్‌ను ముప్పుతిప్పలు పెట్టడానికి పుతిన్‌ వినియోగించుకుంటారని భావించారు. కానీ ప్రిగోజిన్‌ తలరాతను పుతిన్‌ అప్పటికే వేరే రాశారు. తన 23 యేళ్ల ఏలుబడిలో పుతిన్‌ కఠినాత్ముడన్న పేరు తెచ్చుకోవటానికే మొగ్గుచూపారు. కానీ ప్రిగోజిన్‌ విషయంలో దాన్నంతటినీ తాత్కాలికంగానైనా దిగమింగి అతను క్షేమంగా వెళ్లిపోవటానికి అంగీకరించి, ఆ ఇమేజ్‌ను పోగొట్టుకున్నారు. చివరకు క్రెమ్లిన్‌లో అతని కిరాయి సైన్యంతో సమావేశమైనప్పుడు అందులో ప్రిగోజిన్‌ సైతం పాల్గొనటానికి పుతిన్‌ అనుమతించారు. 

ఈ ఆధునిక కాలంలో కూడా రాజ్యాలు తమ మనుగడ కోసం కిరాయి సైన్యాలపై ఆధారపడటం వింతగానే ఉంటుంది. అమెరికాలో పోలీసు విధులు కాంట్రాక్టులకు ఇచ్చే అలవాటున్నా సైన్యం విషయంలో ఆ విధానం పెట్టుకోలేదు. ఆఫ్రికా ఖండంలో ప్రస్తుతం అనేక దేశాలు ప్రిగోజిన్‌ సేవ లను వాడుకుంటున్నాయి. వాస్తవానికి పాశ్చాత్య దేశాల మీడియా చాన్నాళ్లుగా ప్రిగోజిన్‌ గురించి కథనాలు వెలువరిస్తున్నా ఆ సైన్యం ఉనికిని పుతిన్‌ ధ్రువీకరించలేదు. ఆఫ్రికా ఖండ దేశాల్లో అతని సైనికుల ఆగడాలపై అనేకానేక కథనాలు వచ్చాయి.

ఆఖరికి ఉక్రెయిన్‌ దురాక్రమణ యుద్ధ సమయంలోనూ కిరాయి సేనల ఉనికిని రష్యా అధికారికంగా అంగీకరించలేదు. తమ చట్టాలు ప్రైవేటు సైనిక కంపెనీలను అంగీకరించబోవన్నదే పుతిన్‌ చెబుతూవచ్చిన జవాబు. కానీ జూన్‌ 23 నాటి తిరుగుబాటు ఈ వ్యవహారాన్ని బజారున పడేసింది. మాస్కోలో మాఫియా తరహా రాజ్యం నడు స్తోందన్న పాశ్చాత్య మీడియా ప్రచారానికి బలం చేకూర్చింది. రెండు దశాబ్దాలపైగా పుతిన్‌ అటు వంటి రాజ్యాన్నే నడుపుతున్నారనడానికి ఆయన వ్యతిరేకుల అనుమానాస్పద మరణాలను చాలామంది ఉటంకిస్తుంటారు.

పుతిన్‌ అవినీతిపై కథనాలు రాస్తున్న మహిళా జర్నలిస్టు అనా పొలిటికోవ్‌స్కియాను 2006లో కాల్చిచంపారు. ఫెడరల్‌ సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తూ 2006లో బ్రిటన్‌ పరారైన అలెగ్జాండర్‌ లిత్వినెంకో లండన్‌లోని దుకాణంలో రేడియో ధార్మిక పదార్థం కలిసిన టీ తాగి మరణించారు. పుతిన్‌ అధికారానికి రావటానికి తోడ్పడిన బోరిస్‌ బెరిజోవ్‌స్కీ ఆయన ఆగ్రహానికి గురై బ్రిటన్‌ వెళ్లిపోయినా 2013లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

2015లో బోరిస్‌ నెమ్ట్స్‌నోవ్‌ అనే భౌతిక శాస్త్రవేత్తను క్రెమ్లిన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఒకప్పుడు పుతిన్‌కు సన్నిహితంగా మెలిగి తర్వాత అతనికి బద్ధ వ్యతిరేకి అయిన అలెక్సీ నవాల్ని సైతం 2020లో ఒక రేడియో ధార్మిక పదార్థం బారినపడ్డారు. ఆయన చచ్చి బతికాడనుకుంటే ఇప్పుడు నిరవధికంగా జైల్లో మగ్గుతున్నాడు. 

చట్టసభలూ, ఇతర వ్యవస్థలూ సజావుగా పనిచేస్తున్నట్టు కనబడే రాజ్యాల్లో నియంతలు బయల్దేరి వాటిని భ్రష్టుపట్టించటం, అధికారంలో శాశ్వతంగా కొనసాగేట్టు చూసుకోవటం కొత్తేమీ కాదు. కానీ పుతిన్‌ తీరే వేరు. రాజ్య వ్యవస్థలకు సమాంతరంగా చట్టాలతో సంబంధం లేకుండా పటిష్టమైన సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని వాటిద్వారా వ్యతిరేకులను అణచివేసే విధానం ఆయనది.

ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఒకప్పుడు జర్మనీ నియంత హిట్లర్‌ను మట్టికరిపించే క్రమంలో 87 లక్షల మంది సైనికులతో సహా దాదాపు 2 కోట్ల 70 లక్షలమంది ప్రాణాలు పోగొట్టు కున్న దేశానికి ఈ పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించివుండరు. ఏదేమైనా ప్రిగోజిన్‌ ఉత్థాన పతనాలు వర్తమాన ప్రపంచ దుఃస్థితికి అద్దం పడతాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement