
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ప్రకటన
ఉక్రెయిన్ సార్వబౌమత్వాన్ని పణంగా పెట్టొద్దన్న మాక్రాన్
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ‘నియంత’ అని పిలవడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఓవల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ‘పుతిన్‌ను నియంతగా భావిస్తున్నారా’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పై సమాధానమిచ్చారు. తాను ఆ పదాలను అంత తేలికగా ఉపయోగించనని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అనంతరం సోమవారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తెలివిగా వ్యవహరిస్తే ఉక్రెయిన్‌లో యుద్ధం తొందరగా ముగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
‘‘మనం స్మార్ట్ కాకపోతే అది కొనసాగుతూనే ఉంటుంది. లేదంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించాల్సి ఉంటుందా అనేది కీలక చర్చనీయాంశమైంది. దీనిపై ట్రంప్‌ను ప్రశ్నించగా.. ‘‘సంప్రదింపులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అయితే.. రష్యా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందం సంతకం చేయడానికి త్వరలోనే జెలెన్‌స్కీ అమెరికా వస్తారని ఆశిస్తున్నా’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఏరోస్పేస్, వైద్య, సాంకేతిక పరిశ్రమలలో ఉపయోగించే కీలకమైన ఖనిజాలు ఉక్రెయిన్‌లో ఉన్నాయి. అయితే.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కీవ్‌కు అందించిన 180 బిలియన్ డాలర్ల అమెరికన్ సహాయంలో కొంత భాగాన్ని భర్తీ చేయడానికి ఖనిజాలపై ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చల అనంతరం పుతిన్‌ను కలుస్తానని ట్రంప్ తెలిపారు. శాంతి ఒప్పందానికి పుతిన్ అంగీకరిస్తారని, అతను మరింత యుద్ధాన్ని కోరుకోవడం లేదని ట్రంప్ చెప్పుకొచ్చారు.
శాంతి అంటే ఉక్రెయిన్ లొంగిపోవడం కాదు: మాక్రాన్
అయితే.. ఉక్రెయిన్ సార్వబౌమత్వాన్ని పణంగా పెట్టి ఏ శాంతి ఒప్పందం జరగకూడదని మాక్రాన్ స్పష్టం చేశారు. ఏ శాంతి ఒప్పందంలోనైనా భద్రతా హామీలు ఉండాలని, శాంతి అంటే ఉక్రెయిన్ లొంగిపోవడం కాదని మాక్రాన్ హెచ్చరించారు. ఒప్పందం కుదిరితే ఉక్రెయిన్‌కు శాంతి పరిరక్షక దళాలను పంపే ప్రతిపాదనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో కలిసి పనిచేస్తామని మాక్రాన్ తెలిపారు. సుస్థిరత్వాన్ని ఏర్పరచడానికి యూరప్ సిద్ధంగా ఉందని, ఆ శాశ్వత శాంతిని సాధించడానికి బలమైన అమెరికా జోక్యం అవసరమని మాక్రాన్ నొక్కి చెప్పారు. అట్లాంటిక్ విభేదాలున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడితో చర్చలు ముందుకు సాగాయని మాక్రాన్ నొక్కి చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక కొత్త దౌత్య అవకాశం లభించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment