కర్నూలు సభలో రాహుల్
దశాబ్దాలుగా ఉన్న సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి ఏమేం చేయాలో బోధ పరుచుకో కుండా... రాజకీయ స్వప్రయోజనాలు తప్ప మరి దేనిపైనా ధ్యాస లేకుండా... విభజన తర్వాత ఏర్పడబోయే నూతన రాష్ట్రం ఎలా మనుగడ సాగిస్తుందన్న అవగాహన అసలే లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలను ఏర్పరిచిన కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో రెండుచోట్లా బోల్తా పడింది. ఆంధ్ర ప్రదేశ్‌లో అయితే నామరూపాల్లేకుండా కనుమరుగైంది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడ దీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఏ రాజకీయ పార్టీకైనా ఇది సహజమే.
కానీ ఆ పని చేసే ముందు ప్రజాభీష్టాన్ని తుంగలో తొక్కడం, స్వీయప్రయోజనాలు ఆశించి ఇష్టానుసారం ప్రవర్తించటం, ముందుచూపు కొరవడటం తమ పార్టీ పరంగా జరిగిన ఘోరమైన తప్పిదాలని ఒప్పుకోవాలి. వాటికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసమున్నదని చెప్పే ఏ రాజకీయపక్షానికైనా ఇది కనీస బాధ్యత. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అదేం పట్ట లేదు. కర్నూలు నగరంలో మంగళవారం ఒక్క సందర్భంలో కూడా తమ పార్టీ చేసిన ఈ పొరబాట్ల గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు. వాటిని ఆయన మరిచారో, జనం మరిచిపోయార నుకుంటున్నారో రాహుల్ చెబితే తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు.
ఆంధ్రప్రదేశ్‌కు సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రకృతి ప్రసాదించిన విశాలమైన కోస్తా తీరం ఉంది. కానీ వాటిని సమర్ధవంతంగా వినియోగించుకోవడానికి అనువైన భారీ పరి శ్రమలు అక్కడ పెద్దగా లేవు. అవన్నీ హైదరాబాద్ చుట్టుపట్ల కేంద్రీకృతమయ్యాయి. ఫలితంగా ఉపాధి కోసం ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌ను ఆశ్రయించక తప్పనిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితుల్లో విభజనకు దిగేటపుడు కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి ఎలాంటి సమస్యలుంటాయన్న విషయంలో స్థూలంగానైనా కేంద్రం అంచనాకు రావాలి. వాటిని తీర్చడానికి అనుసరించే మార్గాలపై స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆ ప్రతిపాదనల్ని ప్రజల ముందుంచి వారిలో భరోసా కల్పించాలి.
కానీ యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన కాంగ్రెస్ ఇందులో ఏ ఒక్కటీ చేయలేదు. పైపెచ్చు పార్టీలో ఇరు ప్రాంతాల నేతలూ ఎవరికి తోచిన రీతిలో వారు మాట్లాడేలా ప్రోత్సహించి, పరిస్థితిని గందరగోళపరిచే ప్రయత్నం చేశారు. పర్యవసానంగా అటు సీమాంధ్ర ప్రాంతం ఆందో ళనలతో అట్టుడికింది. ఇటు తెలంగాణ ప్రాంతంలో అనేకమంది యువకులు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ బలిదానాలు చేసుకున్నారు. కనుకనే 2014లో జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు ప్రాంతాల ప్రజలూ కాంగ్రెస్‌ను అసహ్యించుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీలా తాను అబద్ధాలు చెప్పడానికి రాలేదని చెబుతూ, 2019లో తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తమ తొలి సంతకం ప్రత్యేక హోదా అమలుపైనేనని చెప్పారు. సంతోషం. మరి ఇంత ముఖ్యమైన ప్రత్యేక హోదా విషయంలో తమ నిర్వాకమేమిటో కూడా ఆయన చెప్పి ఉంటే బాగుండేది. లోక్‌సభలో విభజన బిల్లు ప్రతిపాదించినప్పుడూ, దానికి ఆమోదముద్ర వేయించు కున్నప్పుడూ ఈ ప్రత్యేక హోదా ఊసే రాలేదన్న సంగతి ఎవరూ మరిచిపోలేరు.
అది రాజ్యసభలో ప్రవేశించాక ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టింది. అప్పటికే లోక్‌సభలో బిల్లును అయిందనిపించినందువల్ల ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్య సభలో నోటి మాటగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అటుపై కేబినెట్ తీర్మానం చేసింది. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి కాంగ్రెస్‌కు కాస్తయినా ఆదుర్దా ఉండి ఉంటే ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలోనే పొందుపరిచి ఉండేది. అదే జరిగుంటే రాష్ట్రంలో 2014లో అధికారంలోకొచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంతో ఆటలాడే స్థితి ఏర్పడేది కాదు. తాను ఇరుక్కున్న ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి బయటపడటం కోసం కేంద్రం చెప్పినట్టల్లా విని ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన తాకట్టు పెట్టారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి హోదావల్ల ఒరిగేదేమీ ఉండదని ఒకసారి, అదేమైనా సంజీవనా అని మరోసారి, 14వ ఫైనాన్స్ కమిషన్ ఇవ్వొద్దన్నదని ఇంకోసారి తర్కం చేస్తూ కాలక్షేపం చేశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాలుగేళ్ల విలువైన కాలాన్ని పోగొట్టుకోవాల్సివచ్చింది. అది చట్టబద్ధమైన హామీ అయి ఉంటే జనం న్యాయస్థానానికి వెళ్లి ప్రభుత్వాల మెడలు వంచేవారు.
కాంగ్రెస్ నిర్వాకం ఇక్కడితో ముగియలేదు. విభజన చట్టంలో పొందుపరిచిన కీలకమైన హామీల విషయంలో సైతం అస్పష్టమైన పదజాలాన్ని వాడి అనంతర ప్రభుత్వాలు తప్పించుకోవ డానికి ఆస్కారం కల్పించింది. కాంగ్రెస్ హయాంలో రూపొందిన విభజన చట్టంలోని అస్పష్టతను ఆసరా చేసుకుని విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, చమురు శుద్ధి కర్మాగారం, పారిశ్రామిక కారిడార్ వంటి ముఖ్యమైన అంశాలను ఎన్‌డీఏ ప్రభుత్వం పక్కనబెట్టింది. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనడానికి బదులు దాని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని మాత్రమే విభజన చట్టం నిర్దేశించింది.
వీటన్నిటిపైనా రాహుల్‌గాంధీ తాము చేసింది తప్పేనని అంగీకరించి క్షమాపణ చెప్పి ఉండే హుందాగా ఉండేది. అది లేకపోగా మరోసారి గాలివాటు హామీ ఇవ్వడంలోని ఆంతర్యమే మిటి? అధికారంలోకొస్తే సవరణ ద్వారా విభజన చట్టంలోని అస్పష్టతను తొలగిస్తామన్న వాగ్దా నాన్ని ఆయన ఎందుకివ్వలేకపోయారు? 2014లో ఈ నిరర్ధక చట్టాన్ని తెచ్చి తప్పు చేశామని ఆయన ఎందుకు ఒప్పుకోలేదు? ఇవేమీ లేవు సరిగదా... చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అవి నీతిమయంగా మారిందన్న సంగతే తెలియనట్టు నటించి, ఆయనగారి ఊసే ఎత్తకుండా రాహుల్ గాంధీ కర్నూలు నుంచి నిష్క్రమించారు. ఇటువంటి వంచనాత్మక విన్యాసాల పర్యవసానంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్‌ను గత ఎన్నికల్లో సమాధి చేశారు. దాన్నుంచి కాస్తయినా గుణపాఠం గ్రహించకుండా తగుదునమ్మా అంటూ ఏపీలో అడుగుపెట్టడం రాహుల్‌కే చెల్లింది.
Comments
Please login to add a commentAdd a comment