special stutus for andhra pradesh
-
చంద్రబాబు మీరు చేసింది 420 పని అర్థం కావడం లేదా..?: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: 14 ఏళ్లలో తాను చేయనిది ఒక దమ్మున్న ముఖ్యమంత్రి చేస్తున్నాడని చంద్రబాబుకి నిద్ర పట్టడం లేదని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఈ మేరకు శనివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు.. 420 అశోక్ బాబు ఇంటికి వెళ్లి మాపై రుబాబు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఘీంకరిస్తున్నాడు. అశోక్ బాబు అనే వ్యక్తి ఒక 420 పనిచేశాడు. అది రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు. తప్పుడు సర్టిఫికెట్తో పదోన్నతి పొందారని పిర్యాదు అందింది. ఆ ఫిర్యాదును లోకాయుక్త విచారణ చేసి సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ దానిని విచారించి అది నిజమే అని నిర్దారణ చేశాక అరెస్ట్ చేశారు. దీన్ని నిన్నటి నుంచి చంద్రబాబు అండ్ కో నానా యాగీ చేస్తోంది. దీనికి సీఎం జగన్‌కు ఏమి సంబంధం. అసలు ఆయన చేసిన పనిని ఎవరు సమర్థిస్తారు..?. మీరు చేసింది 420 పని అని చంద్రబాబుకి అర్థం కావడం లేదా. ఎవర్ని బెదిరిస్తావ్.. ఇక్కడ ఎవ్వరూ బెదిరిపోరు. చదవండి: (టీడీపీ నాయకుల బూతుపురాణం.. వాట్సాప్‌లో వైరల్) చంద్రబాబు నిద్రపోవట్లేదు.. నిద్రపోడు కూడా. 14 ఏళ్లలో తాను చేయనిది ఒక దమ్మున్న ముఖ్యమంత్రి చేస్తున్నాడని ఆయనకి నిద్ర పట్టదు. నువ్వు ఎవ్వరి గుండెల్లో నిద్రపోలేవు చంద్రబాబు.. ఇక్కడెవరూ భయపడరు. ఇక్కడ ఉన్నది ఒక ధీశాలి నాయకత్వంలో పనిచేస్తున్న కోదమ సింహాలు. నువ్వు ఎన్ని దొంగ ఏడుపులు ఏడ్చినా 25 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉంటారు. అప్పులు అంటున్నాడు.. తెచ్చిన అప్పులు మీలా దోచుకోలేదు. ప్రతి పైసాకి మా దగ్గర లెక్క ఉంది.. ప్రతి ఇంటికి ఆ డబ్బు చేరింది. అభివృద్ది ఒకచోటే కావాలా..? అమరావతిలోనే అభివృద్ది చేయాలా..?. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అభివృద్ది కావాలని తపించే వ్యక్తి జగన్. సమసమాజ స్థాపన కోసం పాటుపడుతున్నది జగన్. చదవండి: (‘అశోక్‌బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే..’) ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నావ్...మళ్లీ తెరిచిన పుస్తకంగా నిలబెట్టిన వ్యక్తి జగన్. ప్రధాని మోదీ నోటి వెంట విభజన వల్ల ఏపీ నష్టపోయింది అంటూ వచ్చిన మాటలు జగన్ పోరాటం వల్లే. ఈ రోజు సబ్ కమిటీ అజెండాలో చేర్చి చర్చించేలా చేసింది జగన్. ఇది జగన్ విజయం. ప్రత్యేక హోదా అంశం ఎప్పటికీ మరుగున పడదు. తెరిచిన పుస్తకంలా ఉంచిన జగన్‌కి ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. ఇలాంటివి మరుగున పెట్టాలని 420 అశోక్ బాబు వివాదాలను తెస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దమ్మున్న పార్టీ.. మీలా చేవ చచ్చిన పార్టీ కాదు. మీకు దమ్ముంటే ప్రజా సమస్యలపై పోరాడండి. ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టాలనే ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారు. ముగిసిన అధ్యాయాన్ని మళ్లీ మాట్లాడుకుంటున్నాం అంటే అది మేము చేసిన పోరాటమే. తప్పనిసరిగా దీనిపై చర్చ జరుగుతుంది. మనకు మంచి జరిగే రోజు వస్తుంది. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం అని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. -
ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తెస్తూనే ఉన్నాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్యాకేజీ, ఓటుకు కోట్లు కేసు కోసం గత పాలకులు హోదాను తాకట్టు పెట్టారని సీఎం అన్నారు. గత ప్రభుత్వంలోని ఇద్దరు పెద్దలు కేంద్రమంత్రి పదవులు కూడా చేపట్టారని.. గత ప్రభుత్వం మాటలతో భ్రమ కల్పించిన విషయం అందరికీ తెలుసునని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశతో ఉన్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. చదవండి: ఏపీ: జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్ ‘చంద్రబాబు దొంగల ముఠా నాయకుడు’ -
ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తునే ఉన్నాం: సీఎం జగన్
-
ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి : సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుమారు 45 నిముషాల పాటు కొనసాగింది. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. రాష్ట్రాభివృద్ధికి ఆర్థికి సాయం చేయాల్సిందిగా విన్నవించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం చేసిన, చేయబోతున్న కార్యక్రమాలు... కేంద్రం అందించాల్సిన సహాయసహకారాలపై సీఎం జగన్ ప్రధానమంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలు ఉన్నారు. వినతిపత్రంలో ముఖ్యాంశాలు ‘ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. సామాజిక భద్రత కల్పించేలా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్దిపై ప్రత్యేక దృష్టిపెట్టాం. పాదర్శకత, అవినీతి రహిత పాలనకోసం ప్రభుత్వంలో అనేక సంస్కరణలు చేపట్టాం. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా నవరత్నాలు తెచ్చాం. గడచిన ఐదేళ్లుగా రాష్ట్రంలోని విద్యుత్ రంగంలో అస్తవ్యస్త విధానాలు అనుసరించారు. అధిక ధరలకు సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి సంస్థలనుంచి.. ముఖ్యంగా పవన విద్యుత్ కంపెనీల నుంచి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సంప్రదాయేతర విద్యుత్ కొనుగోలు పరిమితి 5–10శాతం ఉంటే, ఆ పరిమితిని దాటి 23.6 శాతం వరకూ కొనుగోలు చేశారు. దీనివల్ల ఏటా విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 2,654 కోట్లు నష్టం వాటిల్లింది. రోజూ రూ. 7 కోట్లు డిస్కంలు నష్టపోతున్నాయి. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో భాగంగా సంప్రదాయేతర విద్యుత్‌ను తప్పక ప్రోత్సహించాల్సి ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనికోసం ఉద్దేశపూర్వకంగా గ్రిడ్ స్టెబిలిటీని కూడా పణంగా పెట్టారు. గత ఐదేళ్లలో అనుసరించిన అస్తవ్యస్త విధానాల వల్ల రూ.20వేల కోట్ల రూపాయల మేర ఉత్పత్తిదారులకు బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు విద్యుత్ వినియోగదారులపై భారం మోపే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే ఛార్జీలు హెచ్చుస్థాయిలో ఉన్నాయి. విభజన కారణంగా రాష్ట్ర ఆదాయాలకు గండిపడింది. 2014–15 నాటికి రూ. 97వేల కోట్లు ఉన్న అప్పులు 2018–19 నాటికి రూ. 2.58 లక్షల కోట్లకు చేరాయి. వెనుకబడిన 7 జిల్లాలకు ఆరేళ్ల కాలానికి యాభై కోట్ల చొప్పున ఇప్పటికి రూ. 2100 కోట్లు అందాల్సి ఉండగా, రూ.1050 కోట్లు మాత్రమే విడుదలచేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం కేబీకే తరహాలో మిగిలిన రూ.23,300 కోట్ల నిధులు ఇవ్వండి. పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రలో చెరువుల అనుసంధానం కార్యక్రమానికి సాయం చేయండి. గోదావరి, కృష్ణా అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాకే కాకుండా కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి జలాలు అందించి తాగునీరు, సాగునీటి కొరతను నివారించడానికి పూనుకున్నాం. దీనికీ సాయం చేయండి. కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిపోయింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గోదావరిలో వరదజలాలను తరలించాల్సిన ఆవశ్యకత నెలకొంది. గోదావరి–కృష్ణా అనుసంధానానికి సాయం చేయండి. రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇది పరస్పర ప్రయోజనకరం. ఇంటింటికీ రక్షిత తాగునీటి కల్పించడానికి వాటర్ గ్రిడ్‌ను తీసుకొస్తున్నాం. 2050 వరకూ ప్రజల అవసరాలను తీర్చిదిద్దేలా గ్రిడ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దాదాపు రూ.60వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దీనికి తగురీతిలో సాయమందించండి. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వబోతున్నాం. సెక్ డేటా సరిగ్గా లేకపోవడంవల్ల రాష్ట్రం నష్టపోతోంది. ఈ డేటా వల్ల కేవలం 10.87లక్షల మంది లబ్ధిదారులను మాత్రమే కేంద్రం ఎంపిక చేసింది. సెక్ డేటాను సరిచేసి అర్హులైన వారందరినీ ఎంపికచేయాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రాయితీలు ఇవ్వండి. పదేళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇవ్వండి. పదేళ్ల పాటు ఇన్‌కంట్యాక్స్ మినహాయింపులు ఇవ్వండి.10 ఏళ్లపాటు 100శాతం ఇన్సూరెన్స్ ప్రీమియం రియంబర్స్మెంట్ ఇవ్వండి. రెవెన్యూ లోటు రూపేణా రూ.22,948 కోట్లను పూడ్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుకోసం గతంలో ఖర్చుచేసిన రూ. 5,103 కోట్లను రీయంబర్స్ చేయండి. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, పునరావాసం కోసం రూ.16వేల కోట్లు మంజూరు చేయండి. కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామంటూ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. ఇది ఈ ప్రాంతానికి చాలా అవసరం. ఇనుప గనులు, నీటి వసతి లభ్యత ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేశాం. దీనికి పోర్టు, రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావాలి. దుగ్గరాజపట్నం వద్ద పోర్టును ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. దుగ్గరాజ పట్నం పోర్టు ఏర్పాటు సాధ్యంకాదని, ప్రత్యామ్నాయ స్థలం చూడాలంటూ నీతి ఆయోగ్ చెప్పింది. దీనికి బదులుగా రామాయపట్నం వద్ద పోర్టును నిర్మించండి. రాజధాని నిర్మాణంకోసం రూ. 2500 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికి రూ.1500 కోట్లు ఇచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నాం. విచారణ పూర్తయ్యాక శాస్త్రీయ దృక్పథంతో రాజధాని నిర్మాణానికి కావాల్సినవి కోరుతాం’ -
పార్లమెంట్లో ఇచ్చిన మాట శాసనమే
సాక్షి, సింహాచలం (పెందుర్తి): రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది..పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాట ఒక శాసనమే..దానికి కట్టుబడి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం హోదా ఇవ్వాల్సిందే అని అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి అన్నారు. సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం ఆమె కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడారు. నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రానికి అన్ని సదుపాయాలు కలుగజేస్తామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పినా హోదా మాత్రం కచ్చితంగా ఇవ్వాల్సిందేనని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఎంపీలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని దిశానిర్దేశం చేశారన్నారు. రాష్ట్రంలోని 22 మంది ఎంపీలు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో హోదా కోసం పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. రైల్వేజోన్‌పై కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో మాట్లాడటం జరిగిందని..రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తక్షణం ఇస్తామని చెప్పారన్నారు. వాల్తేరు డివిజన్‌ను విశాఖ జోన్లోనే ఉంచాలని తామంతా ఫ్లోర్‌లీడర్ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే వినతిపత్రం కూడా ఇచ్చామన్నారు. వాల్తేరు డివిజన్ అనేదే లేకుండా చేయడం సరికాదన్నారు. అనకాపల్లి–ఆనందపురం ఆరులైన్లు రోడ్డు మార్గం త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి సోమవారం తీసుకెళ్లనున్నట్టు వెల్లడించారు. రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తిచేయడం, టోల్గేట్వద్ద స్కూల్ బస్సులు, ప్రభుత్వ వాహనాలకు ఫీజుల మినహాయింపు విషయాలని గడ్కరీని కోరుతామని చెప్పారు. తిరుమలలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో సింహాచలంలో అలాంటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం తరపున తనవంతు సహకారం అందిస్తానని ఎంపీ చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు. సత్యవతి దంపతులు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరంపూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. -
‘కడప స్టీల్ ఫ్యాక్టరీ సీఎం రమేష్‌దే’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా’ అంశంపై గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు పునరుద్ఘాటించారు. శుక్రవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్ వ్యయం రూ.18 వేల కోట్లుగా చెప్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం నిర్మించాలనుకున్న ప్రాజెక్టు.. దాంతో మీకేం పని అని ప్రశ్నించారు. అది చంద్రబాబు బినామీ అయిన సీఎం రమేష్ స్టీల్ ఫ్యాక్టరీ అని వ్యాఖ్యానించారు. ‘ఏం చేశాడు బాబు ఏపీకి. ప్రపంచంలో ఉన్న అందమైన బిల్డింగ్‌ల ఫొటోలు తెచ్చి గ్రాఫిక్స్ ప్రజెంటేషన్ ఇస్తాడు. వాటికి డీపీఆర్ రిపోర్టులు ఉండవు. ఎంత ఖర్చో ఉండదు. రాజధాని నిర్మాణానికి 48 వేల కోట్లు ఖర్చు అని అంచనా వేశారు. అభివృద్ధిని గ్రాఫిక్స్‌లో చూపిస్తున్నారు. ప్రణాళిక వ్యయంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయడం లేదు. పేద ప్రజల నోళ్లు కొట్టి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నాడు. లంచాలు దండుకుంటున్నాడు. ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తీరని ద్రోహం.. ఏపీకి ద్రోహం చేసింది బాబు మాత్రమేనని మాజీ ఎంపీ వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 ఏళ్లు ప్రత్యేక హోదా సాధిద్దామని ఓట్లు వేయించుకొన్న బాబు తర్వాత ప్లేటు ఫిరాయించాడని మండిపడ్డారు. ‘హోదా సంజీవని కాదని చెప్పి ప్యాకేజీకి సై అన్నారు. హదా కోసం పోరాడుతుంటే వైఎస్సార్సీపీ నేతల్నిహేళన చేశారు. ఏపీకి తీరని ద్రోహం చేశారు. విభజన హామీలను సాధించలేదు. ఎన్నికల వేళ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు’ అని నిప్పులు చెరిగారు. నిరసన కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. -
రాహుల్ వంచనాత్మక విన్యాసం!
దశాబ్దాలుగా ఉన్న సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి ఏమేం చేయాలో బోధ పరుచుకో కుండా... రాజకీయ స్వప్రయోజనాలు తప్ప మరి దేనిపైనా ధ్యాస లేకుండా... విభజన తర్వాత ఏర్పడబోయే నూతన రాష్ట్రం ఎలా మనుగడ సాగిస్తుందన్న అవగాహన అసలే లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలను ఏర్పరిచిన కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో రెండుచోట్లా బోల్తా పడింది. ఆంధ్ర ప్రదేశ్‌లో అయితే నామరూపాల్లేకుండా కనుమరుగైంది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడ దీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఏ రాజకీయ పార్టీకైనా ఇది సహజమే. కానీ ఆ పని చేసే ముందు ప్రజాభీష్టాన్ని తుంగలో తొక్కడం, స్వీయప్రయోజనాలు ఆశించి ఇష్టానుసారం ప్రవర్తించటం, ముందుచూపు కొరవడటం తమ పార్టీ పరంగా జరిగిన ఘోరమైన తప్పిదాలని ఒప్పుకోవాలి. వాటికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసమున్నదని చెప్పే ఏ రాజకీయపక్షానికైనా ఇది కనీస బాధ్యత. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అదేం పట్ట లేదు. కర్నూలు నగరంలో మంగళవారం ఒక్క సందర్భంలో కూడా తమ పార్టీ చేసిన ఈ పొరబాట్ల గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు. వాటిని ఆయన మరిచారో, జనం మరిచిపోయార నుకుంటున్నారో రాహుల్ చెబితే తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రకృతి ప్రసాదించిన విశాలమైన కోస్తా తీరం ఉంది. కానీ వాటిని సమర్ధవంతంగా వినియోగించుకోవడానికి అనువైన భారీ పరి శ్రమలు అక్కడ పెద్దగా లేవు. అవన్నీ హైదరాబాద్ చుట్టుపట్ల కేంద్రీకృతమయ్యాయి. ఫలితంగా ఉపాధి కోసం ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌ను ఆశ్రయించక తప్పనిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితుల్లో విభజనకు దిగేటపుడు కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి ఎలాంటి సమస్యలుంటాయన్న విషయంలో స్థూలంగానైనా కేంద్రం అంచనాకు రావాలి. వాటిని తీర్చడానికి అనుసరించే మార్గాలపై స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆ ప్రతిపాదనల్ని ప్రజల ముందుంచి వారిలో భరోసా కల్పించాలి. కానీ యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన కాంగ్రెస్ ఇందులో ఏ ఒక్కటీ చేయలేదు. పైపెచ్చు పార్టీలో ఇరు ప్రాంతాల నేతలూ ఎవరికి తోచిన రీతిలో వారు మాట్లాడేలా ప్రోత్సహించి, పరిస్థితిని గందరగోళపరిచే ప్రయత్నం చేశారు. పర్యవసానంగా అటు సీమాంధ్ర ప్రాంతం ఆందో ళనలతో అట్టుడికింది. ఇటు తెలంగాణ ప్రాంతంలో అనేకమంది యువకులు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ బలిదానాలు చేసుకున్నారు. కనుకనే 2014లో జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు ప్రాంతాల ప్రజలూ కాంగ్రెస్‌ను అసహ్యించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీలా తాను అబద్ధాలు చెప్పడానికి రాలేదని చెబుతూ, 2019లో తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్కిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తమ తొలి సంతకం ప్రత్యేక హోదా అమలుపైనేనని చెప్పారు. సంతోషం. మరి ఇంత ముఖ్యమైన ప్రత్యేక హోదా విషయంలో తమ నిర్వాకమేమిటో కూడా ఆయన చెప్పి ఉంటే బాగుండేది. లోక్‌సభలో విభజన బిల్లు ప్రతిపాదించినప్పుడూ, దానికి ఆమోదముద్ర వేయించు కున్నప్పుడూ ఈ ప్రత్యేక హోదా ఊసే రాలేదన్న సంగతి ఎవరూ మరిచిపోలేరు. అది రాజ్యసభలో ప్రవేశించాక ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టింది. అప్పటికే లోక్‌సభలో బిల్లును అయిందనిపించినందువల్ల ఆనాటి ప్రధాని మన్మోహన్సింగ్ రాజ్య సభలో నోటి మాటగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అటుపై కేబినెట్ తీర్మానం చేసింది. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి కాంగ్రెస్‌కు కాస్తయినా ఆదుర్దా ఉండి ఉంటే ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలోనే పొందుపరిచి ఉండేది. అదే జరిగుంటే రాష్ట్రంలో 2014లో అధికారంలోకొచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంతో ఆటలాడే స్థితి ఏర్పడేది కాదు. తాను ఇరుక్కున్న ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి బయటపడటం కోసం కేంద్రం చెప్పినట్టల్లా విని ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన తాకట్టు పెట్టారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి హోదావల్ల ఒరిగేదేమీ ఉండదని ఒకసారి, అదేమైనా సంజీవనా అని మరోసారి, 14వ ఫైనాన్స్ కమిషన్ ఇవ్వొద్దన్నదని ఇంకోసారి తర్కం చేస్తూ కాలక్షేపం చేశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాలుగేళ్ల విలువైన కాలాన్ని పోగొట్టుకోవాల్సివచ్చింది. అది చట్టబద్ధమైన హామీ అయి ఉంటే జనం న్యాయస్థానానికి వెళ్లి ప్రభుత్వాల మెడలు వంచేవారు. కాంగ్రెస్ నిర్వాకం ఇక్కడితో ముగియలేదు. విభజన చట్టంలో పొందుపరిచిన కీలకమైన హామీల విషయంలో సైతం అస్పష్టమైన పదజాలాన్ని వాడి అనంతర ప్రభుత్వాలు తప్పించుకోవ డానికి ఆస్కారం కల్పించింది. కాంగ్రెస్ హయాంలో రూపొందిన విభజన చట్టంలోని అస్పష్టతను ఆసరా చేసుకుని విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, చమురు శుద్ధి కర్మాగారం, పారిశ్రామిక కారిడార్ వంటి ముఖ్యమైన అంశాలను ఎన్డీఏ ప్రభుత్వం పక్కనబెట్టింది. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనడానికి బదులు దాని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని మాత్రమే విభజన చట్టం నిర్దేశించింది. వీటన్నిటిపైనా రాహుల్‌గాంధీ తాము చేసింది తప్పేనని అంగీకరించి క్షమాపణ చెప్పి ఉండే హుందాగా ఉండేది. అది లేకపోగా మరోసారి గాలివాటు హామీ ఇవ్వడంలోని ఆంతర్యమే మిటి? అధికారంలోకొస్తే సవరణ ద్వారా విభజన చట్టంలోని అస్పష్టతను తొలగిస్తామన్న వాగ్దా నాన్ని ఆయన ఎందుకివ్వలేకపోయారు? 2014లో ఈ నిరర్ధక చట్టాన్ని తెచ్చి తప్పు చేశామని ఆయన ఎందుకు ఒప్పుకోలేదు? ఇవేమీ లేవు సరిగదా... చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అవి నీతిమయంగా మారిందన్న సంగతే తెలియనట్టు నటించి, ఆయనగారి ఊసే ఎత్తకుండా రాహుల్ గాంధీ కర్నూలు నుంచి నిష్క్రమించారు. ఇటువంటి వంచనాత్మక విన్యాసాల పర్యవసానంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్‌ను గత ఎన్నికల్లో సమాధి చేశారు. దాన్నుంచి కాస్తయినా గుణపాఠం గ్రహించకుండా తగుదునమ్మా అంటూ ఏపీలో అడుగుపెట్టడం రాహుల్‌కే చెల్లింది. -
హోదా సాధనకు జేఏసీ ఏర్పాటు: పవన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని ప్రజా సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం చేసిన తరహాలోనే ఏపీలో కూడా ప్రత్యేక హోదా జేఏసీ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని సంఘాలను కలిసి మద్దతు కోరతామన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి వస్తే మంచిదని, వారిని కూడగట్టి పోరాటం చేస్తామన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్, జేపీలతోపాటు ఇతర మేధావులను త్వరలో కలుస్తానని చెప్పారు. కాకినాడ, తిరుపతి సభల సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని చెప్పామని, అయితే ఆ విషయంలో చంద్రబాబు వైఖరి అయోమయంగా ఉందని వ్యాఖ్యానించారు. వచ్చేదెంతో... ఖర్చెంతో?: కేంద్రం ఎన్ని నిధులు ఇస్తోందో సృష్టత లేకుండా పోయిందని, వాటిని ఏ రకంగా ఖర్చు చేస్తోందో రాష్ట ప్రభుత్వం కూడా చెప్పలేకపోతోందని పవన్ పేర్కొన్నారు. పారదర్శకత లేకుండా పోయిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో జేఏసీ ఏర్పాటు తప్పనిసరి అయిందని ప్రకటించారు. దీని ద్వారానే పోరాటం చేస్తామని వెల్లడించారు. -
వామపక్షాల బంద్‌కు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు కోసం ఈ నెల 8న వామపక్షాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, దుగరాజపట్నం పోర్టు, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుతోపాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నదని, వీటికి మద్దతుగా ఏ పార్టీ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా మద్దతు ఇవ్వనున్నట్లు పార్టీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే, బంద్‌కు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ, సీఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఇతర కార్మిక సంఘాల నేతలు జి.ఓబులేసు, వి.ఉమామహేశ్వరరావు, కె.రామారావు మాట్లాడారు. బంద్‌కు కార్మిక, ఉద్యోగ, వర్తక, వాణిజ్య సంఘాలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మద్దతు తెలపాలన్నారు. -
హోదా, హామీలు అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేయాలని, విభజన చట్టం హామీలు నెరవేర్చాలని కోరుతూ 184 నిబంధన కింద తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారు. ఇదీ తీర్మానం... ‘2014 ఫిబ్రవరి 20న నాటి ప్రధాని ఇచ్చిన హామీ మేరకు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయాలని ఈ సభ తీర్మానించింది. ప్రత్యేక హోదాను 15 ఏళ్లకు పొడిగిస్తూ కూడా సభ తీర్మానించింది. ఈ తీర్మానం స్వీకరించిన మూడు నెలల్లోగా ఇది అమలులోకి వస్తుంది. ప్రకాశం జిల్లా సహా ఉత్తరాంధ్ర, రాయలసీమకు కోరాపుట్–బొలంగిర్–కలహండి ప్రత్యేక ప్యాకేజీ, బుందేల్‌ఖండ్ ప్రత్యేక ప్యాకేజీ తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ మంజూరు చేయాలని సభ తీర్మానించింది. తదుపరి సాధారణ ఎన్నికలకు ముందుగా లేదా ఏడాదిలోగా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ప్రతి నిబంధనను ప్రభుత్వం అమలు చేయాలని సభ తీర్మానించింది. మే 2019లోగా పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని సభ తీర్మానించింది. దుగరాజపట్నం పోర్టుకు సాంకేతికంగా, ఆర్థికంగా యోగ్యత లేనందున రామాయపట్నం పోర్టును నిర్దిష్ట కాల వ్యవధిలోగా పూర్తి చేయాలని సభ తీర్మానించింది..’అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వీలుగా ఆయన ఈ నోటీసులు ఇచ్చారు. -
వైఎస్ఆర్ సీపీ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు
-
వైఎస్ఆర్ సీపీ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు
అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఆగస్ట్ 2న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శనివారమిక్కడ మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ చేపట్టిన ఏపీ బంద్ విజయవంతం కావాలన్నారు. టీడీపీ, బీజేపీ చీకటి ఒప్పందాల వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఎంపీలకు అసెంబ్లీ సీట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదాపై లేదని రఘువీరా విమర్శించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, టీడీపీలు వ్యవహరిస్తున్న దుర్మార్గ వైఖరికి నిరసనగా ఆగస్టు 2న ఏపీ బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు.