
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని ప్రజా సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం చేసిన తరహాలోనే ఏపీలో కూడా ప్రత్యేక హోదా జేఏసీ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని సంఘాలను కలిసి మద్దతు కోరతామన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి వస్తే మంచిదని, వారిని కూడగట్టి పోరాటం చేస్తామన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్, జేపీలతోపాటు ఇతర మేధావులను త్వరలో కలుస్తానని చెప్పారు. కాకినాడ, తిరుపతి సభల సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని చెప్పామని, అయితే ఆ విషయంలో చంద్రబాబు వైఖరి అయోమయంగా ఉందని వ్యాఖ్యానించారు.
వచ్చేదెంతో... ఖర్చెంతో?: కేంద్రం ఎన్ని నిధులు ఇస్తోందో సృష్టత లేకుండా పోయిందని, వాటిని ఏ రకంగా ఖర్చు చేస్తోందో రాష్ట ప్రభుత్వం కూడా చెప్పలేకపోతోందని పవన్ పేర్కొన్నారు. పారదర్శకత లేకుండా పోయిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో జేఏసీ ఏర్పాటు తప్పనిసరి అయిందని ప్రకటించారు. దీని ద్వారానే పోరాటం చేస్తామని వెల్లడించారు.