దశాబ్దం తర్వాత శిక్షలు | Sakshi Editorial On Supreme Court Verdict Of Gokul Chat Blast | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 11 2018 12:55 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Sakshi Editorial On Supreme Court Verdict Of Gokul Chat Blast

హైదరాబాద్‌తోపాటు దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతి పరిచిన గోకుల్‌చాట్, లుంబినీ పార్కు జంట పేలుళ్ల కేసులో ఇద్దరు నిందితులు అనిక్‌ షఫీక్‌ సయీద్, మహమ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌కు ఉరిశిక్ష విధిస్తూ సోమవారం ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఇదే కేసులో నిందితులుగా ఉండి తప్పించుకు తిరుగుతున్న రియాజ్‌ భత్కల్, అతని సోదరుడు ఇక్బాల్‌ భత్కల్‌లకు ఆశ్రయమిచ్చిన మరో నింది తుడు తారిక్‌ అంజుమ్‌కు యావజ్జీవ శిక్ష విధించింది. మరో ఇద్దరు నిందితులు నిర్దోషులని న్యాయ స్థానం ప్రకటించింది. 44మంది అమాయకులను పొట్టనబెట్టుకుని, 77మందిని తీవ్రంగా గాయపరి చిన ఈ జంట పేలుళ్ల ఉదంతాలు జరిగి పదకొండేళ్లు దాటింది. ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) ఉగ్రవాదులు మహారాష్ట్రలోని పుణేలో ఈ దారుణానికి పథక రచన చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దిల్‌సుఖ్‌నగర్‌లో సైతం బాంబు పేలుడుకు కుట్ర పన్నినా అదృష్టవశాత్తూ బాంబుకున్న టైమర్‌ సరిగా పనిచేయకపోవడంతో అక్కడ పెను విషాదం తప్పింది.

ఇప్పుడు దోషులిద్దరికీ పడిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. అక్కడ వచ్చే ఫలితాన్నిబట్టి రాజ్యాంగం ప్రకారం వారికి ఇతరత్రా మార్గాలు అందుబాటులో ఉంటాయి. చివరికి ఏం జరుగుతుందన్న సంగతి అలా ఉంచి ఈ పేలుళ్ల కేసు దర్యాప్తులో ఎడతెగని జాప్యం చోటు చేసుకున్న తీరు మన పోలీసు యంత్రాం గం సమర్ధతను ప్రశ్నిస్తుంది. ఏమాత్రం సంబంధం లేని అమాయకులను లక్ష్యంగా చేసుకుని కేవలం ఉన్మాదంతో ఇంత దారుణానికి ఒడిగట్టినవారిని వెన్నాడి సత్వరం పట్టుకోగలిగితే, వారిపై పకడ్బందీ సాక్ష్యాధారాలతో కేసులు పెట్టగలిగితే న్యాయస్థానాల పని సులువవుతుంది. అక్కడ కూడా త్వరగా విచారణ ముగిసి శిక్షలు పడతాయి. అది నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అలాంటి నేరం చేయ డానికి మరెవరూ సాహసించరు. ఉగ్రవాద ముఠాల ఆట కడుతుంది. విషాదమేమంటే ఇవన్నీ సక్ర మంగా సాగటం లేదు. ఈ జంట పేలుళ్ల కేసులో దాదాపు వందమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఎన్నో నెలలపాటు కాస్తయినా  పురోగతి సాధించలేక పోయింది. ఈలోగా రియాజ్‌ భత్కల్, ఇక్బాల్‌ భత్కల్‌ దేశం సరిహద్దులు దాటి పాకిస్తాన్‌ పరారయ్యారు.

ఈ జంట పేలుళ్ల ఉదంతాలు ఎందరికో గర్భశోకం మిగిల్చాయి. ఆప్తులను పోగొట్టుకున్నవారు, అనాథలైనవారు ఎందరో! సజావుగా బతుకుబండి ఈడుస్తున్నవారూ, జీవితంలో ఒక స్థాయికి ఎది గివచ్చిన పిల్లలు, మరికొన్ని రోజుల్లో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లదల్చుకున్నవారు... ఇలా ఎందరెందరో ఈ పేలుళ్లకు బలయ్యారు. లుంబినీ పార్క్‌లో లేజర్‌ షో చూడటానికొచ్చినవారు, గోకుల్‌చాట్‌లో అల్పాహారం తిందామని వచ్చినవారితోపాటు ఆ రోడ్డు పక్కనుంచి నడిచి వెళ్తున్న     వారు సైతం పేలుళ్లకు బలయ్యారు. ఈ ఉదంతాల్లో గాయపడిన కుటుంబాలవారిది మరో రకం విషాదం. నిన్నటివరకూ ఎంతో చురుగ్గా, సమర్ధవంతంగా పనిచేస్తూ తలలో నాలుకలా మెలగిన వారు శాశ్వత అంగవైకల్యంతో, కదల్లేని స్థితిలో, అయినవారిని గుర్తుపట్టలేని స్థితిలో పడటం తీరని దుఃఖాన్ని మిగులుస్తుంది. ఈ కుటుంబాలు తమవారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలన్న ఆశతో లక్షలాది రూపాయలు వెచ్చించాయి. ఎన్నో కుటుంబాలు ఆ క్రమంలో ఉన్న ఆస్తుల్ని కూడా పోగొట్టుకున్నాయి. అప్పులపాలయ్యాయి. కొందరు క్షతగాత్రులు తాము కూడా చనిపోయి ఉంటే బాగుండేదని వివిధ చానెళ్ల ముందు వాపోయారంటే వారు పడిన కష్టాలు ఎటువంటివో అర్ధమ వుతుంది. ఆ కుటుంబాలు చెబుతున్న ప్రకారం వారికి ప్రభుత్వాల నుంచి కూడా తగిన ఆసరా లభిం చటం లేదు. ఇది అత్యంత ఘోరం.

ఉగ్రవాదుల ఉద్దేశం ప్రజల్లో భయోత్పాతం సృష్టించి, సమాజాన్ని కల్లోలపరచడం. ప్రభు త్వాలు ఇలాంటి ఉన్మాద ముఠాల కార్యకలాపాల గురించి, వారి పోకడల గురించి ప్రజల్లో అవ గాహన కల్పించటంతోపాటు పటì ష్టమైన నిఘా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తే ఉగ్రవాదుల ఎత్తుగడలు విఫలమవుతాయి. పేలుళ్ల కోసం ఉగ్రవాదులు సాధారణంగా జనసమ్మర్థంగల ప్రాంతా లను ఎంచుకుంటారు. కనుక అలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా అవసరమవుతుంది. హైదరాబాద్‌ నగరంలో దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాన్ని ఉగ్రవాదులు మూడుసార్లు లక్ష్యంగా ఎంచుకుంటే 2002, 2007 సంవత్సరాల్లో ఏదో ఒక కారణం వల్ల వారు విఫలమయ్యారు. కానీ 2013లో అక్కడ రెండు బాంబులు పేలి 17మంది చనిపోయారు. 130 మందికిపైగా గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత తాము ముందస్తు హెచ్చరికలు చేశామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. ప్రభుత్వ యంత్రాం గాల్లో కనబడే ఇటువంటి నిర్లక్ష్యమే నేరగాళ్లకు వరమవుతోంది. ఉగ్రవాదులు ఏదీ చెప్పి చేయరు.

కానీ ప్రభుత్వ యంత్రాంగంతోపాటు జనంలో కూడా తగినంత అప్రమత్తత ఉంటే వీరి కుట్రలను వమ్ము చేయటం ఎంతో సులభం. సమాజంలో అరాచకం ప్రబలకుండా, సంక్షోభాలు తలెత్తకుండా, అమాయకుల ప్రాణాలు బలికాకుండా చూడటం రాజ్యం మౌలిక బాధ్యత. తమకు రక్షణ లభిస్తుం దని, తమ జీవనం సజావుగా సాగుతుందని ఆశించే పౌరుల్లో ఉగ్రవాద ఉదంతాలు అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఆ దుస్థితి తలెత్తకుండా ఉండాలంటే రెప్పవాల్చని నిఘా అవసరం. లుంబినీ పార్క్‌ పేలుళ్ల ఉదంతంలో ఒక ఉగ్రవాది బ్యాగ్‌తో పాటు వచ్చి కూర్చోవటం, దాన్ని అక్కడ వదిలి వెళ్లడం యాదృచ్ఛికంగా ఒక విద్యార్థి గమనించి పేలుళ్ల తర్వాత అతగాడి రూపురేఖలపై సమాచారమిచ్చాడు. మరికొందరు సాక్షులు కూడా నిందితులను గుర్తుపట్టగలిగారు. కనుకనే ఇప్పుడీ శిక్షలు సాధ్యమయ్యాయి. ఈ పేలుళ్ల ఉదంతం నుంచి తగిన గుణపాఠాలు తీసుకుని మరె ప్పుడూ ఇలాంటివి జరగకుండా చూడటమే ప్రాణాలు కోల్పోయినవారికి నిజమైన నివాళి అవు తుంది. క్షతగాత్రులైనవారి కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుని, ఆ కుటుంబాల్లో అర్హులైన వారికి ఉపాధి కల్పించటం తమ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. వారికి అన్నివిధాలా ఆసరాగా నిలబడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement