నియంతకు ‘క్లీన్ చిట్’ | Shogun 'clean chit' | Sakshi
Sakshi News home page

నియంతకు ‘క్లీన్ చిట్’

Published Mon, Dec 1 2014 12:33 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Shogun 'clean chit'

మూడు దశాబ్దాలపాటు ఈజిప్టును తన ఉక్కు పిడికిట్లో బంధించి, మూడేళ్లక్రితం వెల్లువెత్తిన ప్రజాస్వామ్య ఉద్యమంలో కొట్టుకుపోయిన నియంత హోస్నీ ముబారక్‌ను దాదాపు అన్ని నేరాలనుంచీ విముక్తుణ్ణి చేసే దిశగా పావులు కదులుతున్నాయి. చరిత్రాత్మకమైన తాహ్రిర్ స్క్వేర్ వద్ద పద్దెనిమిది రోజులపాటు హోరెత్తిన ప్రజాస్వామ్య ఉద్యమంపై కాల్పులు జరిపి 239మందిని కాల్చిచంపిన ఘటనలకు సంబంధించి అతనిపై వచ్చిన నేరారోపణలను అక్కడి కోర్టు ‘సాంకేతిక’ కారణాలతో తోసిపుచ్చుతున్నట్టు ప్రకటించింది. ఈ కేసులో రెండేళ్లక్రితం ముబారక్‌కు యావజ్జీవ శిక్ష విధించగా, అప్పీల్‌లో నిరుడు ఆ కేసును కొట్టేసి, పునర్విచారణకు ఆదేశించారు.

ఆ తంతు కూడా ముగిశాక హత్య, అవినీతితోసహా అన్ని ఆరోపణలనుంచి ముబారక్‌ను విముక్తుణ్ణి చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ముబారక్‌తోపాటు ఆయన పాలనలో మంత్రి, మరో ఆరుగురు సలహాదార్లు, ఆయన కుమారులిద్దరు కూడా నిర్దోషులయ్యారు. వాస్తవానికి ప్రభుత్వ లెక్కల ప్రకారమే తాహ్రిర్ స్క్వేర్‌వద్ద 900మంది మరణించారు. కానీ, నేరారోపణ పత్రంలో 239మంది వివరాలను మాత్రమే పొందుపరిచారు. అయిదునెలలక్రితం ముబారక్ ఒక అవినీతి కేసులో మూడేళ్ల జైలు శిక్ష పొందారు.

ఆ శిక్ష కింద ప్రస్తుతం ఉన్న గృహనిర్బంధం కూడా త్వరలోనే ముగిసిపోతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ముస్లిం బ్రదర్‌హుడ్ నాయకుడు మహమ్మద్ మోర్సీ నేతృత్వంలో నిరుడు ఏర్పడిన పౌర ప్రభుత్వాన్ని కూలదోయడంతో మొదలుపెట్టి సైనిక మండలి సాగిస్తున్న బృహత్తర నాటకంలో తాజా పరిణామం మరో అంకం. మోర్సీ తొలగింపును నిరసిస్తూ నిరుడు ఆగస్టులో సాగిన ఉద్యమంపై సైనికులు జరిపిన కాల్పుల్లో 3,000మందికి పైగా మరణించారు.

మరిన్ని వేలమంది గాయపడ్డారు. ఆందోళన చేస్తున్నవారిపై సైన్యం బుల్‌డోజర్లు, హెలికాప్టర్లతో దాడికి దిగింది. అలాంటి సైనిక పాలకుల కనుసన్నల్లో పనిచేస్తున్న న్యాయస్థానానికి ముబారక్‌పై వచ్చిన  నేరారోపణలు పనికిమాలినవని అనిపించడంలో ఆశ్చర్యంలేదు. ఒకపక్క 2011 నాటి ప్రజాస్వామ్య ఉద్యమాన్ని కీర్తిస్తున్నట్టు కనబడుతూనే ఆ ఉద్యమాన్ని నెత్తురుటేర్లలో ముంచిన నియంతను దోష విముక్తుణ్ణి చేయడం ఆ న్యాయమూర్తి కపటత్వానికి నిదర్శనం.
 
దేశాన్ని అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకు పెరడుగా మార్చి, అందుకు అడ్డొచ్చినవారినల్లా ైఖైదు చేయడం లేదా అదృశ్యం చేయడం వంటి దురంతాలతో ముబారక్ భయానక వాతావరణాన్ని సృష్టించాడు. ఎన్నికలను ప్రహసనప్రా యంగా మార్చి, అడ్డగోలు ఆర్థిక సంస్కరణలతో సామాన్యుల బతుకును దుర్భరం చేశాడు. ప్రపంచీకరణ తర్వాత దేశంలో ఆదాయ వ్యత్యాసాలు ఎక్కువై... అధిక ధరలు, నిరుద్యోగం ప్రబలి ముబారక్ పాలనపై సామాన్యుల్లో అసంతృప్తి దావానలంలా వ్యాపించింది.

వాటన్నిటి పర్యవసానమే తెహ్రీర్ స్క్వేర్ ఉద్యమం. అయితే, సరైన సిద్ధాంతమూ, దానికి దీటుగా నాయకత్వమూ లేని ఉద్యమం ఏమవుతుందో చెప్పడానికి అది ప్రబల నిదర్శనం. స్పష్టమైన రాజకీయార్థిక ఎజెండాతో ఉద్యమాన్ని సరైన తోవన నడపవలసిన నాయకత్వం దాన్ని తలో మూలకూ లాగింది. దేశాన్ని దివాలా తీయించిన పాశ్చాత్య ప్రపంచంతో వైరం తెచ్చుకోకూడదన్న నోబెల్ గ్రహీత ఎల్ బరాడీ వంటి నేతల వైఖరి ఆ ఉద్యమానికి శాపమైంది.
 
నాయకులు సరైన దిశా నిర్దేశం చేయలేక పోయినా సామాన్య జనం ఆగ్రహ భార్గవులై విరుచుకుపడి ముబారక్ అధికార నివాసాన్ని ముట్టడించడానికి ముందుకు దూసుకొస్తున్న వేళ గత్యంతరం లేక అతన్ని అరెస్టు చేస్తున్నట్టు ఆనాడు సైన్యం ప్రకటించింది. ఎమర్జెన్సీని ఎత్తేసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని సైనిక పాలకులు హామీ ఇచ్చారు.

ప్రజాస్వామ్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉదారవాద ఇస్లామిస్ట్ సంస్థ ముస్లిం బ్రదర్‌హుడ్ 2012 జూన్‌లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి మహమ్మద్ మోర్సీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినా దాన్ని సరిగా కొనసాగనీయలేదు. మోర్సీ ప్రభుత్వం వరసబెట్టి చేసిన తప్పులు, వాటిపై ఈజిప్టు ప్రజానీకంలో ఏర్పడిన అసంతృప్తిని ఆసరా చేసుకుని మళ్లీ సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది.
 
మొన్న మే నెలలో జరిగిన ఎన్నికల ప్రహసనంలో 96 శాతం ఓట్లు తెచ్చుకుని గద్దెనెక్కిన అధ్యక్షుడు అబ్దెల్ అల్ ఫతా సిసీ ముబారక్ హయాంలో సైనిక జనరల్‌గా పనిచేసినవాడే. ఆయన ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, సలహాదార్లు గతంలో ముబారక్ సహచరులే. సిసీ ప్రభుత్వం ప్రసారమాధ్యమాలపై విరుచు కుపడి, వాటిని అనుకూలంగా మార్చుకోవడమే కాదు...లొంగిరాని పాత్రికేయు లను జైలుపాలు చేస్తున్నది. ఇంత జరుగుతున్నా పాశ్చాత్య ప్రపంచానికి సిసీ దేశాధ్యక్షుడైన క్రమంపైగానీ, ఆయన పాలిస్తున్న తీరుపైగానీ అభ్యంతరాలు లేవు.

అచ్చం ముబారక్ పరిపాలనాకాలంలో వలే తమ ప్రయోజనాలను సిసీ పరిరక్షిస్తుండటమే అందుకు కారణం. కనుకనే ఈజిప్టు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపైనా అవి నోరు మెదపలేదు. సైన్యం ఇద్దరిని కాల్చిచంపినా స్పందించ లేదు. అయితే ఈజిప్టు ప్రజలు మాత్రం తమ కళ్లముందు సాగుతున్న ఈ పరిణా మాలపై మౌనంగా ఉండిపోరు.  

నియంతలు రూపం మార్చుకున్నా వారిని పోల్చుకోగల సమర్థత...గుణపాఠం నేర్పగల తెగువ ఆ ప్రజలకున్నాయి.  ముబారక్‌పై తీర్పు వెలువడిన కొద్దిసేపటికే సైన్యం సృష్టించిన అడ్డంకులన్నిటినీ అధిగమించి... గర్జిస్తున్న తుపాకులను సైతం లెక్కచేయక తెహ్రీర్ స్క్వేర్ వద్దకు చేరుకున్న వేలాదిమంది జనమే అందుకు సాక్ష్యం. ఈజిప్టు మళ్లీ ఉద్యమిస్తుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement