‘హోరాహోరీ’ వాదనలకు తెర | Supreme Court Closed Hearing On Ayodhya Dispute | Sakshi
Sakshi News home page

‘హోరాహోరీ’ వాదనలకు తెర

Published Thu, Oct 17 2019 4:52 AM | Last Updated on Thu, Oct 17 2019 4:52 AM

Supreme Court Closed Hearing On Ayodhya Dispute - Sakshi

అయోధ్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానంలో దాదాపు 40 రోజులపాటు ఏకబిగిన కొనసాగిన వాదప్రతివాదాలు బుధవారం ముగిశాయి. వచ్చే మూడు రోజుల్లో లిఖితపూర్వక నివేదనలు దాఖలు చేయాలని అన్ని పక్షాలనూ  అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ వచ్చే నెల 17న పదవీ విరమణ చేస్తున్నందువల్ల ఆలోగా తీర్పు వెలువడుతుంది. సహజంగానే ఆ తీర్పు కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తు న్నారు. 2.77 ఎకరాల నిడివి ఉన్న స్థలంపై ఈ వివాదమంతా కేంద్రీకృతమై ఉంది. రామజన్మభూమి అనేది ఈ దేశ పౌరుల విశ్వాసానికి సంబంధించిన అంశమని, దాన్ని న్యాయస్థానాలు ఇష్టానుసారం నిర్ణయిస్తామంటే కుదరదని హిందూత్వ సంస్థలు వాదించగా... అది బాబ్రీ మసీదు స్థలమనీ, దాన్ని తమకు అప్పగించాలని ముస్లిం వక్ఫ్‌ బోర్డు వగైరాలు వాదించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. న్యాయస్థానం ఏ తీర్పునిచ్చినా దానికి కట్టుబడి ఉంటామని దాదాపు అన్ని పక్షాలూ చెబుతున్నాయి. అయితే కోట్లాదిమంది భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాలని ఒకరు, తమ అధీనంలో ఉండిన ప్రాంతం గనుక మళ్లీ తమకే అప్పగించాలని మరొకరు కోరుకుంటున్నారు. ఇది సహజమే.  దేశ చరిత్రలో రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించి తీర్పు వెలువడిన కేశవా నంద భారతి  కేసు విచారణ తర్వాత ఇంత సుదీర్ఘకాలం విచారణ కొనసాగిన కేసు ఇదే.

అయోధ్య అనగానే కోట్లాదిమంది హిందువులకు రాముడు గుర్తుకొస్తాడు. భక్తకోటి హృద యాల్లో రాముడు, అయోధ్య అంతగా పెనవేసుకుపోయాయి. కానీ ఇరవైయ్యేడేళ్లుగా అయోధ్య అన గానే పెను వివాదం కూడా గుర్తుకురావడం మొదలైంది. కొందరిలో ఆవేశకావేశాలు కట్టుదాటి, ఉద్వే గాలు ఒక్కసారిగా పెల్లుబికి ఆ పట్టణంలోని బాబ్రీ మసీదును కూల్చటం ఇందుకు కారణం. వాస్తవా నికి ఆ వివాదం అంతకు నాలుగు దశాబ్దాల క్రితానిదే అయినా, ఆ కూల్చివేత ఉదంతం వివాదాన్ని కీలక మలుపు తిప్పింది. అనంతరం దేశవ్యాప్తంగా పలుమార్లు జరిగిన విషాద ఘటనల పరంపర ఈ దేశ పౌరుల శ్రేయస్సును కోరేవారందరినీ కలవరపెట్టింది. పలువురిలో ఒక రకమైన నిర్లిప్తత, నిర్వే దం అలుముకున్నాయి. సామరస్యం మళ్లీ చివురిస్తుందా అన్న సందేహం ఏర్పడింది. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే రాజకీయ నాయకులు ఈ పరిస్థితినుంచి లబ్ధి పొందుదామని చూశారు. బాధ్యతారహితంగా ప్రవర్తించారు. కానీ ‘కాలం మారుతుంది... చేసిన గాయాలు మాన్పు తుంది’ అని ఒక కవి అన్నట్టు అనంతరకాలంలో క్రమేపీ పరిస్థితి మారింది. సంయ మనం వెల్లివిరి యడం ప్రారంభమైంది. అయినప్పటికీ ఆ చేదు జ్ఞాపకాల నేపథ్యంలో అయోధ్యపై వివిధ కోర్టుల్లో తీర్పులు వెలువడిన ప్రతి సందర్భంలోనూ... ఇంకా చెప్పాలంటే ఆ తీర్పులు ఫలానా తేదీన వెలువడ తాయని ప్రకటించిననాటినుంచీ ప్రభుత్వాలు అప్రమత్తం కావడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకో వడం రివాజుగా మారింది.  అయితే అదృష్టవశాత్తూ ప్రజలెప్పుడూ సంయమనం తోనే ఉంటున్నారు.

దశాబ్దాల తరబడి న్యాయస్థానాల్లో నానుతూ మొదట్లో స్థానికంగా, అనంతరకాలంలో దేశ వ్యాప్తంగా ఉద్రిక్తతలకు కారణమవుతున్న ఈ వివాదానికి న్యాయబద్ధమైన పరిష్కారం అన్వేషించా లని, దీనికొక ముగింపు పలకాలని సర్వోన్నత న్యాయస్థానం సంకల్పించడం మెచ్చుకోదగింది. అది ఎల్లకాలమూ వివాదంగానే మిగిలిపోవాలని ఆశిస్తున్న శక్తులకు ఈ ధోరణి నచ్చలేదు. దానికి తగినట్టే విచారణక్రమంలో సమస్యలూ ఎదురయ్యాయి. ఇలా ఎన్నో అవాంతరాలను, అభ్యంతరాలను అధిగ మించి విచారణ పూర్తయింది. ఈ విచారణ సమయంలో భిన్న పక్షాల తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాదులు సైతం ఎలా సంయమనం కోల్పోయారో, కోపతాపాలు ప్రదర్శించారో అందరూ చూశారు. ఆఖరికి విచారణ తుది ఘట్టానికి వచ్చిందనుకున్న దశలో కోర్టు హాల్‌లో ఉద్వేగాలు చోటు చేసుకోవడంతో ఆగ్రహించిన ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ ఇలాగైతే తాము నిష్క్ర మించాల్సివస్తుందని హెచ్చరించవలసి వచ్చింది. వివాదం అత్యంత సంక్లిష్టమైనది, జటిల మైనది అయినప్పుడు ఇవన్నీ సహజమే. వివాదంలో హిందువులంతా ఒకపక్కా, ముస్లింలంతా ఒకపక్కా ఉన్నారనుకోవడం పొరపాటు. రెండుచోట్లా వైరిపక్షాలున్నాయి. ఈ వివాదం తమదంటే, తమదని చెప్పుకునేవారున్నారు. ఈ వివాదంలో శ్రీశ్రీ రవిశంకర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఖలీఫుల్లా వంటివారి ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం కూడా నడిచింది. వారిచ్చిన నివేదికపై ధర్మాసనం పరిశీలిం చాల్సి ఉంది.

మొత్తానికి 1994లో పీవీ నరసింహారావు హయాంలో ఈ వివాదాన్ని రాష్ట్రపతి ద్వారా నివేదిం చినప్పుడు దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం అనంతరకాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వివాదాన్ని స్వీకరించక తప్పలేదు. 2010లో అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలు చేసి ముగ్గురికి పంచాలన్న వెలువరించిన తీర్పు ఏ ఒక్కరినీ సంతృప్తిపరచలేకపోయింది. కక్షిదారులెవరూ కోరని కొత్త కోణంలో ఈ తీర్పునిచ్చారంటూ సుప్రీంకోర్టు ఆక్షేపించి దాన్ని నిలిపేయడం అనంతర చరిత్ర. ఆ తర్వాత వివాదం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఇరుపక్షాలూ పెద్ద మనసు చేసుకుని, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించి ఉంటే ఈ వివాదం ఎప్పుడో ముగిసేది. కానీ లక్నో బెంచ్‌ న్యాయమూర్తి ఒకరు ఇచ్చిన తీర్పులో చెప్పినట్టు ‘ఇక్కడ దేవతలు సైతం నడయాడటానికి భయపడే స్థాయిలో చిన్న స్థలంలో భారీగా మందు పాతరలు న్నాయి’. తాము తీర్పు ఇవ్వడానికి చాలా ముందే అన్ని పక్షాలూ సామరస్యంతో వ్యవ హరించి సమస్యను పరిష్కరించుకుంటాయని బలంగా ఆకాంక్షిస్తున్నట్టు అప్పట్లో సుప్రీంకోర్టు తెలి పింది. కానీ అది జరగలేదు. కాకపోతే ఉన్నంతలో ఉద్వేగాలు ఉపశమించాయి. ఇప్పుడు తీర్పు వెలువడ్డాక కూడా అదే సంయమనం అందరూ పాటించి, ఆ తీర్పును శిరసావహించగలవని దేశ ప్రజలంతా కోరు కుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement