అయోధ్య రామాలయం, బాబ్రీ మసీదుల పేరిట దేశవ్యాప్తంగా జరిగిన మారణకాండ, హత్యలూ, మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు ఎంతో బరువుతో తాజా తీర్పును వెలువరించవలసి వచ్చింది. సుప్రీం తీర్పు కన్నా ముందే రామాలయ నిర్మాణం అయోధ్యలో 2020 జనవరిలో మకర సంక్రాంతికి ప్రారంభమయి, 2024లో పూర్తవుతుందని విశ్వ హిందూ పరిషత్తు చెప్పడం బహుశా ‘దివ్యజ్ఞాన స్వరూపుల’కే సాధ్యమవుతుందేమో మనకు తెలియదు. బౌద్ధాన్ని నిర్మూలించడానికి బౌద్ధ ఆలయాలను కూల్చడమో, మార్చడమో చేసింది. జైన మతాన్ని నాశనం చేయడానికి శైవ కాకతీయులు రక్తపాతం సాగించారు. రాజరాజ నరేంద్రుడు జైనులు రచించిన ఆంధ్రభారతాన్ని తగలబెట్టించాడు. ఇవన్నీ రాజకీయ రాక్షసాలే!
‘‘ఒక నిర్మాణం శిథిలాలను బట్టి ఆ నిర్మాణాన్ని ఎవరో కూల్చిన దాని ఆనవాలు అనలేం. మొగలాయీ పాలకుల చర్యలపై జరిగే వాదోపవాదాలను బట్టి ఆ చర్యలపై అంచనాకు రాజాలం. అ లాంటి వాదాలకు సమాధానం న్యాయ చట్టమూ కాదు. అంతే గాదు, ఒక కట్టడం కింద మరొక కట్టడ నిర్మాణ శిథిలాలున్నట్టుగా చెప్పే భావన ఆ అట్టడుగు కట్టడం పునాదులను కూల్చివేసిన తర్వాతనే కొత్త కట్టడం (మసీదు) వెలిసిందేనని చెప్పడానికి నిదర్శనం కాదు’’ – అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన 1045 పేజీల తీర్పులో భాగం (9–11–2019)
‘‘సుప్రీంకోర్టు తీర్పుకు ప్రాధాన్యముంది. ఇక ముందు భవిష్యత్తులో ఎవరూ, గతించిన శతాబ్దాలలో ఎవరెవరో పాలకులు హిందూ దేవాలయాలను కూల్చేసి ఇతర, మత సంస్థల కట్టడాలను నిర్మించారని ఉత్తరోత్తరా వాదించకుండా నిరోధించేందుకు సుప్రీం చేసిన తాజా నిర్ణయానికి ప్రాధాన్యముంది’’ – ‘ది హిందూ’ లీగల్ కరస్పాండెంట్ (11–11–2019)
స్వాతంత్య్రానంతరం గడచిన ఏడు దశాబ్దాలలో కాంగ్రెస్, బీజేపీ (ఆర్‌ఎస్‌ఎస్) పాలక వర్గాలు ఏదో రూపంలో ప్రత్యక్ష, పరోక్ష మార్గాల ద్వారా మత ప్రాతిపదికపై అనుసరిస్తూ వచ్చిన పాలనా విధానాల ఫలితంగా క్రమంగా దేశానికి వాటిల్లిన ప్రమాదకర పరిణామాలను తనకున్న పరిధిలో దేశ అత్యున్నత న్యాయస్థానం అనుసరించిన పరిష్కార మార్గం అతి సునిశితమైనదిగా, నిక్కచ్చి అయినదిగా కనిపించకపోయినా రాజకీయ పాలకులు స్వార్థ ప్రయోజనాల కొద్దీ దేశంపై రుద్దిన విషమ పరిణామానికి ఉన్నంతలో ఒక విరుగుడుగా భావించాలి. పాలకులు రాను రాను ఏ పరిస్థితికి దేశాన్ని, ప్రజలను నెడుతూ వచ్చారంటే – బహుళ మత విశ్వాసాలు, విభిన్న భాషా, సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలతో కూడిన దేశాన్ని, లౌకిక రాజ్యాంగ(సెక్యులర్) వ్యవస్థను పరమ సంకుచిత స్థాయికి దిగజా ర్చారు. తనకు వీలైనంతలో ఒక ఉన్నత స్థాయి నైతిక సూత్రాన్ని, మతాతీతమైన గుణపాఠాన్ని అందించే బాధ్యతను అత్యున్నత ధర్మా సనం (సుప్రీంకోర్టు) తన భుజస్కంధాలపై మోపుకొనవలసి వచ్చింది.
అయోధ్య పేరిట రామాలయం, బాబ్రీ మసీదుల పేరిట దేశవ్యాప్తంగా జరిగిన మారణకాండ, హత్యలూ, మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు ఎంతో బరువుతో తాజా తీర్పును వెలువరించవలసి వచ్చింది. ఈ క్రమంలో అది దేశం ముందుగతిని, భవిష్యత్తు ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈ తీర్పునకు సాహసించింది. అయితే ఏ రకమయిన అన్యాయాన్నైనా చరిత్ర క్షమించదు, లిఖిస్తూనే ఉంటుంది. అందుకే ఘటనల లోతుపాతులకు వెళ్లి గాయాలను తుడిచే ప్రయత్నంలో వర్తమాన, భవిష్యత్తు భారత ప్రజా బాహుళ్యం విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొన్నందువల్లనే, రక్తచరిత్రకు ముగింపు పలికే విశాల దృష్టితో తాజా తీర్పు చెప్పవలసి వచ్చిందని మరవరాదు. ఈ సందర్భంగా ‘‘గాలిపటాలు’’ సినిమాలో మాధవపెద్ది పాడిన పాట గుర్తుకొస్తోంది. ‘‘తెలుపు నలుపుల చదరంగంలో/మానవులంతా పావులురా/తెలిసి చేసినా తెలియక చేసినా/తప్పు ఒప్పుగా మారదురా!’’ దేశ పాలకులైన వారు కొంటెవాళ్లుగా వ్యవహరించకూడదు.
దేశం ప్రశాంతంగా ఉండాలని మనసారా ఆశించిన ఏ ధర్మాసనమైనా నేటి తరంతో పాటు ముందు తరాలను కూడా దృష్టిలో పెట్టుకునే సామాజిక శాంతి కోసం తీర్పు చెబుతుందిగానీ, జరిగిన జరుగుతోన్న పాలక వర్గాల ప్రజావ్యతిరేక చర్యలకు ‘‘తాతాచార్ల ముద్రలు’’ వేయదు సుమా! అలాగే, బాబ్రీ మసీదు కూల్చివేతను దృష్టిలో పెట్టుకుని నవంబర్ 9 నాటి సుప్రీం తీర్పును రెండో ప్రపంచ యుద్ధంలో బెర్లిన్ పతనంతో పోల్చిన నాయకులున్న దేశం మనది! సుప్రీం తీర్పు కన్నా మూడురోజుల ముందే (నవంబర్ 6న) రామాలయ నిర్మాణం అయోధ్యలో 2020జనవరిలో సంక్రాంతికి ప్రారంభమయి, 2024లో అదే రోజున పూర్తవుతుందని విశ్వ హిందూ పరిషత్తు కరాఖండీగా చెప్పడం బహుశా ‘దివ్యజ్ఞాన స్వరూపుల’కే సాధ్యమవుతుందేమో మనకు తెలియదు. ఏతా వాతా దేవాలయ నిర్మాణం పూర్తయ్యే సంవత్సరాన్ని 2024గా ‘అంజనం’ వేసినట్టు ప్రకటించడంలో ఔచిత్యమంతా ‘ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒకే నేత’ అన్న సూత్రంలో ఉండి ఉండాలి! పైగా బాబ్రీ మసీదు కట్టడం కింద ఏదో కట్టడముందని తోస్తోందని జాతీయ పురావస్తుశాఖ ఒక నివేదికలో జోస్యం చెప్పింది, కానీ ఇలా ఉబుసుపోని నిర్ణయాలకు రావడం సరైంది కాదని సుప్రీం చెప్పింది! ఏతా వాతా భారతదేశ సుదీర్ఘ చారిత్రక నేపథ్యాన్ని, సెక్యులర్ రాజ్యాంగ వ్యవస్థ విలువనూ బాబ్రీ విధ్వంసం తరువాత పక్కనే మిగిలిన కేవలం 2.77 ఎకరాల కొండ్రకు, దాని సంకుచిత వైశాల్యానికీ కుదించిన దుర్దశకు చేరుకున్నాం! దేశం పరువు ప్రతిష్ఠలు శిలా ప్రతిమలతో ముగిసిపోవు, వీటి వైభవ ప్రాభవాలకు వాటిని ఆదరించే మనుషులు, వారి విభిన్న అభిరుచులే శాశ్వత చిహ్నాలు! అందుకే సుప్రీం తన తీర్పులో ‘‘1992 డిసెంబర్ 6న 16వ శతాబ్దినాటి మసీదును కూల్చేయటం పరమ మూఢత్వంతో కూడిన చర్యే కాదు, ప్రజల ప్రార్థనా స్థలాన్ని పనిగట్టుకుని మరీ నాశనంచేసిన దుర్మార్గమ’’ని అభిశంసించవలసి వచ్చింది. అందుకే రాజ్యాంగం పౌరులందరినీ సమ దృష్టితో చూస్తుంది. అన్నిరకాల వ్యక్తిగత విశ్వాసాలు, ప్రార్థనలు, పూజలు, పురస్కారాలు అన్ని మతాలకూ సమాన ధర్మాలేనని కోర్టు తీర్పులో స్పష్టం చేయవలసి వచ్చింది! అంతే గాదు 16వ శతాబ్ది చరిత్రను పరిశీలిస్తే బాబర్ కాలంలో నిర్మించిన మసీదును తరువాతి కాలంలో సందర్శించిన ప్రసిద్ధ చైనా తీర్థయాత్రికుడు హుయాన్‌త్సాంగ్ గాని, అదే కాలం నాటి ‘‘రామచరిత మానస’’ సృష్టికర్త తులసీదాస్ గాని తమ రచనలలో మాటమాత్రంగానైనా రామాలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారన్న ప్రస్తావన చేసి ఉండేవారు.
కాని అలాంటి దాఖలాలు లేకపోగా తులసీదాస్ తన రామాయణ కావ్యాన్ని నాటి స్థానిక భాష ‘‘అవధి’’లో రచించినందుకు ఛాందస సంస్కృత పండితులు ఆ గ్రంథాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించారు. వారినుంచి తప్పించుకునేందుకు వారణాసి, సాకేతల మధ్య అజ్ఞాతంగా తిరుగుతూ ఒక ముస్లిం స్నేహితుడి ఇంట్లో తన రచనను భద్రంగా దాచుకున్నాడు తులసీదాస్! అంతకుముందు బాబ్రీ కింది భాగంలో బలమైన స్తంభాలతో కూడిన శిథిల ‘‘కట్టడం ఏదో ఉన్నట్టు ఉంది’’ అని 2003 లో అనుమానం వ్యక్తం చేసిందే గాని రుజువు చూపలేకపోయింది! దీన్ని ఇతర పురావస్తు పరిశోధకులు ‘‘రుజువుకు అందని, పరస్పర విరుద్ధమైన’’ భావంతో కూడిన నివేదిక అని ఖండించారు. కాగా ప్రసిద్ధ భారత చరిత్రకారులలో ఒకరైన డాక్టర్ డి.ఎన్. ఝా ‘‘అయోధ్య వివాదం విశ్వాసానికి హేతు వాదానికి మధ్య సాగుతూ వచ్చిన యుద్ధం’’ అని వర్ణించారు. బాబ్రీ మసీదు కింద దేవాలయ నిర్మాణమే లేదన్నారు! అంతేకాదు, మరో ఇద్దరు ప్రసిద్ధ పురావస్తు శాస్త్రజ్ఞులు సుప్రియావర్మ, జయమీనన్ అసలు పురావస్తుశాఖ అనుసరిస్తున్న పద్ధతులు... దేశీయ పరిశోధకులపై విధిస్తున్న ముందస్తు షరతులను దుయ్యబడుతూ... ‘‘ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ’’ (2010)లో తాము పురావస్తుశాఖ పరిశోధనా పద్ధతుల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామో వెల్లడించాల్సి వచ్చింది.
అందుకే ఈ సందర్భంగా, సుప్రసిద్ధ సాహితీవేత్త సారస్వత హరి విల్లు, నాలుగు వేదాలను ఒక్క చేతిమీదుగా వాచకంలో అందించిన రుషి డాక్టర్ దాశరధి రంగాచార్య రామాయణం గురించి రాసిన వాక్యాలను ఒకసారి పాఠకుల వివేచనార్థం యిక్కడ నివేదిస్తున్నాను:
‘‘రామాయణం నేల చెక్కమాత్రం కాదు, అది ఒక ఆదర్శం, ఒక శీలం, ఒక సభ్యత, ఒక నాగరికత, ఒక సంస్కృతి, రాజకీయానికి అధికారకాంక్ష తప్ప అన్యం తెలియదు, వేదంలో, ఉపనిషత్తులో, రామాయణ, భారతాల్లో ఆలయం లేదు. విగ్రహం లేదు, అర్చనలు లేవు, అలా అని దైవం లేదని కాదు, ఆ స్వామి సర్వత్రా ఉన్నాడు. అందుకే చీమను పూజించినా, స్వామిని పూజించినా ఒకటే అన్నారు. అసలు వాస్తవం – భారత భూమిలో ఆలయ సంప్రదాయం జైనులు, బౌద్ధుల గురించి మొదలైంది. అయోధ్యలోని ప్రస్తుతం రామజన్మభూమి స్థలంలో తొలుత జైన మందిరం ఉండేదట! భారత తాత్వికత ఏకశిల కాదు. ఇది ఆలోచనల, సిద్ధాంతాల నిరంతర ప్రధాన వాహిక. సమన్వయం భారత విధానం. అయినా సిద్ధాంతాల కలహాలు, హింసా రాజకీయం తప్పలేదు! సనాతన ధోరణి బౌద్ధాన్ని నిర్మూలించడానికి బౌద్ధ ఆలయాలను కూల్చడమో, మార్చడమో చేసింది. జైన మతాన్ని నాశనం చేయడానికి శైవ కాకతీయులు రక్తపాతం సాగించారు. రాజరాజ నరేంద్రుడు జైనులు రచించిన ఆంధ్రభారతాన్ని తగలబెట్టించాడు. ఇవన్నీ రాజకీయ రాక్షసాలే! ఏ సిద్ధాంతము, ఏ మతమూ ద్వేషాన్ని, హింసను బోధించదు, ప్రోత్సహించదు. అందువల్ల అయోధ్యను రాజకీయం చేయడం కేవలం కళేబర పూజ– వానర ఆచారం.
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment