ఆర్థికాంశాలు, ఫలితాలే దిక్సూచి..! | Ayodhya verdict big positive for market, economy Statistics | Sakshi
Sakshi News home page

ఆర్థికాంశాలు, ఫలితాలే దిక్సూచి..!

Published Mon, Nov 11 2019 4:49 AM | Last Updated on Mon, Nov 11 2019 4:49 AM

Ayodhya verdict big positive for market, economy Statistics - Sakshi

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్‌) ఫలితాల ప్రకటనలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–చైనా వాణిజ్య చర్చల వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో ఈవారంలో వెల్లడికానున్న పలు కంపెనీల ఫలితాలు సైతం మార్కెట్లో సానుకూలతను నింపేందుకు ఆస్కారం ఉందనేది మార్కెట్‌ వర్గాల మాట. దీపావళి నుంచి ఇప్పటివరకు 4%, సెప్టెంబర్‌ 20 నుంచి 13 శాతం ర్యాలీ చేసిన ప్రధాన సూచీలు.. ఇదే జోరును కొనసాగించవచ్చని విశ్లేషిస్తున్నాయి.

‘లార్జ్, బ్లూ–చిప్‌ షేర్ల వాల్యుయేషన్స్‌ మళ్లీ ప్రీమియం స్థాయికి చేరుకున్నాయి. ఇది మార్కెట్‌ ట్రెండ్‌పై ప్రభావం చూపొచ్చు. అయితే, దీర్ఘకాలిక లాభాల కోసం మార్కెట్‌ అవుట్‌లుక్‌ మెరుగుపడింది.  సంస్కరణలు, ఉద్దీపనలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల, వర్షాలు ఆశాజనకంగా ఉండటం, వడ్డీ రేట్లు తగ్గించడం వంటి సానుకూల అంశాల ప్రభావాన్ని ప్రస్తుత కంపెనీల ఫలితాల వెల్లడి సీజన్‌ అద్ధం పడుతోంది. ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో ఎర్నింగ్స్‌ వృద్ధి బాగుండవచ్చనే సంకేతాలు ఇస్తుంది’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు. ఈ వారంలో వెల్లడికానున్న ఆర్థిక గణాంకాల ఆధారంగా ట్రెండ్‌ ఉంటుందని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు.  

స్థూల ఆర్థికాంశాలు..
సెప్టెంబర్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, తయారీ రంగ ఉత్పత్తి డేటా నవంబర్‌ 11న (సోమవారం) వెల్లడికానున్నాయి. ఇక మంగళవారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం, గురువారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు రానున్నాయి.

2,700 కంపెనీల ఫలితాలు..
ఈ వారంలో 2,700 కంపెనీలు రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి లార్జ్‌క్యాప్స్‌లో కోల్‌ ఇండియా, హిందాల్కో, బ్రిటానియా ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, భారతి ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, మదర్సన్‌ సుమి సిస్టమ్స్, ఆయిల్‌ ఇండియా వంటివి ఉన్నాయి.

ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులే..
గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా మంగళవారం (12న) దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితమైంది. బుధవారం (13న)  మార్కెట్‌ యథావిధిగా ప్రారంభంకానుంది.

అయోధ్యపై సుప్రీం తీర్పు ప్రభావం...
అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు శనివారం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. రామజన్మభూమి న్యాస్‌కే ఈ వివాదాస్పద భూమి చెందుతుందని, రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని సూచించింది. రెండున్నర దశాబ్దాల  వివాదాస్పదానికి తెరపడిన నేపథ్యంలో ఈ అంశంపై మార్కెట్‌ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని కేఆర్‌ చోక్సి ఇన్వెస్ట్‌మెంట్‌ ఎండీ దేవాన్‌ చోక్సి అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్తర ప్రదేశ్‌ కీలక పాత్ర పోషిస్తుందని, వివాదం ముగియడంతో ఈ రాష్ట్ర వాటా మెరుగుపడొచ్చని ప్రముఖ ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా విశ్లేషించారు. అయితే, తీర్పు ప్రభావం మార్కెట్‌పై పెద్దగా ఉండకపోవచ్చని ట్రేడింగ్‌ బెల్స్‌ సీనియర్‌ విశ్లేషకులు సంతోష్‌ మీనా అన్నారు.

నవంబర్‌లో ఎఫ్‌పీఐ నిధులు రూ. 12,000 కోట్లు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటిదాకా మన క్యాపిటల్‌ మార్కెట్లో రూ. 12,000 కోట్లను  కుమ్మరించారు. నవంబర్‌ 1–9 కాలంలో వీరు స్టాక్‌ మార్కెట్లో రూ. 6,434 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ. 5,673 కోట్లు ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీల డేటా పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement