సత్వర న్యాయం ఏది?
దాదాపు పాతికేళ్ల క్రితం ముంబై మహా నగరాన్ని భయోత్పాతంలో ముంచెత్తి 257మందికి పౌరుల ప్రాణాలను బలిగొన్న వరస పేలుళ్లకు సంబంధించిన మరో కేసులో ఎట్టకేలకు విచారణ పూర్తయి అయిదుగురు నిందితులకు శిక్షలు ఖరార య్యాయి. గత జూన్ 16నే ఈ అయిదుగురూ దోషులని ప్రత్యేక టాడా కోర్టు నిర్ధా రించగా గురువారం ఆ నిందితుల్లో తాహిర్ మర్చంట్, ఫిరోజ్‌ఖాన్‌లకు మరణ శిక్ష, రియాజ్ సిద్దిఖీకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది.
కీలక నేరగాడు అబూ సలేం, మరొక నేరగాడు కరీముల్లా ఖాన్‌లకు యావజ్జీవ శిక్ష విధించింది. అబూ సలేంను అప్పగించినప్పుడు 2005లో పోర్చుగల్ దేశంతో కుదిరిన ఒప్పందం కారణంగా అతడికి మరణశిక్ష విధించడం సాధ్యం కాలేదు. ఈ పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం, మరొక నేరస్తుడు టైగర్ మెమన్ ఇంకా పరారీలోనే ఉన్నారు. వారు పాకిస్తాన్‌లో తలదాచుకున్నట్టు మన ప్రభుత్వం దగ్గర ఖచ్చిత మైన సమాచారం ఉన్నా ఆ దేశం మాత్రం అది నిజం కాదని బుకాయిస్తోంది.
దేశ ఆర్ధిక రాజధానిగా వెలుగులీనుతున్న ముంబై నగరాన్ని ఉగ్రవాదులు దాడులకు లక్ష్యంగా ఎంచుకోవడం వెనక పెద్ద కుట్ర ఉంది. ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఈ మహా నగరాన్ని ధ్వంసం చేస్తే దేశ ప్రజల మనోస్థైర్యం దెబ్బతింటుందని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని వారు భావించారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ మార్గదర్శకత్వంలో దుబాయ్ కేంద్రంగా జరి గిన కుట్ర పర్యవసానంగానే ఈ స్థాయి విధ్వంసం జరిగింది. పాకిస్తాన్ సరఫరా చేసిన పేలుడు పదార్ధం ఆర్డీఎక్స్‌ను కంటెయినర్లలో దేశంలోకి తరలించి ముంబైలో అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కేంద్రాలను ఎన్నుకుని కార్లలో ఆర్డీఎక్స్ అమర్చి పేల్చారు. ఉగ్రవాద ఉదంతాల్లో ఆర్డీఎక్స్ వాడటం ప్రపంచంలో అదే తొలిసారి.
బొంబాయి స్టాక్ ఎక్ఛ్సేంజ్, ఎయిరిండియా భవనం, రెండు ఫైవ్‌స్టార్ హోటళ్లు, ఇతర వ్యాపార కేంద్రాలు ఉగ్రవాదుల లక్ష్యాలయ్యాయి. ఈ పేలుళ్లనాటికే ముంబై నగరం మాఫియాల గుప్పిట ఉండటం, వారిని చూసీ చూడనట్టుగా ఉండే పోలీసు యంత్రాంగం ఉగ్రవాదులకు వరంగా మారింది. మాఫియా డాన్‌గా వెలుగొందుతున్న దావూద్ ఇబ్రహీం తన ముఠా సభ్యులతో ఈ పేలుళ్లకు పథకం పన్నాడు. కేవలం రెండు గంటల వ్యవధిలో ముంబైలో 12 వేర్వేరు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. 257మంది మరణించగా, 700 మందికిపైగా జనం తీవ్రంగా గాయపడి ఆస్పత్రులపాలయ్యారు.
ముంబై మహానగరం 1993కు ముందు ఎప్పుడూ ఇంతటి బీభత్సాన్ని చవి చూడలేదు. 1992 డిసెంబర్‌లో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఈ నగరంలో ఉద్రిక్తతలు అలుముకుని హిందూ, ముస్లిం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల పోలీసు కాల్పులు జరిగాయి. 1993 జనవరి 5న మొదలై మూడురోజుల పాటు సాగిన అల్లర్లలో భారీయెత్తున కత్తిపోట్లు, దాడులు జరిగాయి. ముస్లింలు 575మంది, హిందువులు 275మంది చనిపోయారు. లక్షమందికిపైగా నిరాశ్ర యులయ్యారు. ఆ ఘటనలను ఆసరా చేసుకుని పాకిస్తాన్ కేంద్రంగా బాంబు పేలుళ్లకు పథక రచన సాగింది.
ఈ రెండు దురదృష్టకర ఉదంతాలపైనా నియ మించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ తన నివేదికలో ప్రభుత్వ యంత్రాంగం నిస్తేజంగా మిగిలిన తీరును నిశితంగా విమర్శించింది. ముంబై పేలుళ్ల ఉదం తానికి ఉపయోగించిన ఆర్డీఎక్స్, గ్రెనేడ్‌లు వగైరాలన్నీ పాకిస్తాన్ నుంచి నౌకల్లో అక్రమంగా గుజరాత్‌కు చేరడం, అక్కడి నుంచి వ్యానుల్లో ముంబై నగరానికి రావడం గమనిస్తే ఈ మాఫియా ముఠా వేర్వేరుచోట్ల ఎంతమంది అధికారుల, సిబ్బంది కళ్లు కప్పిందో అర్ధమవుతుంది. దర్యాప్తు సాగిన మొదటి కొన్ని నెలల్లో పోలీసులకు అబూ సలేం పేరే వెల్లడికాలేదు. దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందిన ఒకరిద్దరు చాన్నాళ్ల తర్వాత పట్టుబడినప్పుడు దావూద్ అనుచరుడు బాబా చౌహాన్ పేరు బయటకొచ్చింది. అతని ద్వారా అబూ సలేం పేరు వెల్లడైంది.
అయితే అప్పటికే సలేం ఢిల్లీకి పారిపోయి అక్కడినుంచి తన స్వస్థలమైన యూపీలోని ఆజాంగఢ్ చేరుకుని ఆ తర్వాత దుబాయ్ వెళ్లిపోయాడు. దావూద్ ముఠానుంచి విడిపోయి ఆ తర్వాత పోర్చుగల్ వెళ్లి అక్కడి పోలీసులకు దొరికిపోయాడు. ముంబైలో బాంబు పేలుళ్లతోపాటు రైఫిళ్లతో, గ్రెనేడ్‌లతో దాడులు చేయాలని తొలుత పథకం వేశారు. కానీ చివరకు కారు బాంబులు మాత్రమే వినియోగించారు. రైఫిళ్లు, గ్రెనేడ్లు ఉపయోగించి ఉంటే ముంబైలో ప్రాణనష్టం మరింత ఎక్కువ జరిగేది. ఈ మొత్తం వ్యవహారంలో 193 మంది నిందితులుంటే వారిలో దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ సహా 35 మంది ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారు. వీరిలో పలువురు ఇప్పటికీ పాక్‌లో తల దాచుకుంటున్నారు.
క్రిమినల్ కేసుల్లో సాగే ఎడతెగని జాప్యం నేరస్తులకు ధైర్యాన్నిస్తుందని అంటారు. సాధారణ నేరాల సంగతలా ఉంచి కనీసం ఉగ్రవాద కేసుల్లోనైనా సత్వర విచారణ సాధ్యపడని దురవస్థ మన దగ్గర ఉంది. ముంబై పేలుళ్ల కేసులకు సంబంధించి 2006లో తొలిసారి టాడా కోర్టు యాకూబ్ మెమన్ సహా 12మందికి మరణశిక్ష, మరో 20 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. యాకూబ్ మెమన్‌కు రెండేళ్లక్రితం ఉరిశిక్ష అమలు కాగా ఆ పేలుళ్లకు సంబంధించి వేరే కేసుల్లో మళ్లీ ఇన్నాళ్లకు శిక్షలు పడ్డాయి.
దానికన్నా ముందు జరిగిన ముంబై అల్లర్లలో అయితే కేవలం ముగ్గురికి మాత్రమే స్వల్పంగా శిక్షలు పడ్డాయి. నేరాలు జరగకుండా చూడటం ఒక ఎత్తయితే... కనీసం అవి జరిగాకైనా చురుగ్గా వ్యవహరించి దర్యాప్తు జరిపి పకడ్బందీ సాక్ష్యాధారాలతో నేరగాళ్లకు శిక్ష పడేలా చూడటం పోలీసు యంత్రాంగం బాధ్యత. తిరుగులేని సాక్ష్యాధారాలుంటే న్యాయస్థానాల్లో విచారణ నిరాటంకంగా సాగుతుంది. వెంటవెంటనే శిక్షలుపడే స్థితి నేరగాళ్లలో భయం రేపు తుంది. ఈ విషయంలో ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం మాత్రమే కాదు... న్యాయవ్యవస్థ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది.