కొత్తరకం ‘కొలీజియం’ | The newer 'Collegium' system | Sakshi
Sakshi News home page

కొత్తరకం ‘కొలీజియం’

Published Wed, Aug 13 2014 12:23 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

The newer 'Collegium' system

న్యాయమూర్తుల ఎంపిక కోసం ఇప్పుడనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థ స్థానంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తహతహలాడుతున్న వేళ న్యాయవ్యవస్థకు ఇరకాట పరిస్థితులు ఏర్ప డుతున్నాయి. యాదృచ్ఛికమే కావొచ్చుగానీ... కొలీజియం వ్యవస్థ రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టిన సోమవారమే ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం. లోథా ఆ వ్యవస్థను గట్టిగా సమర్ధించుకున్నారు. అంతేకాదు... ప్రజల్లో న్యాయవ్యవస్థను అపఖ్యాతిపాలు చేయడానికి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అయితే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ మార్కండేయ కట్జూ ఈమధ్య వెల్లడించిన కొన్ని అంశాలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. అవినీతిపరులుగా ముద్రపడినవారిని కాపాడటానికి ఫలానా ప్రధాన న్యాయమూర్తి ప్రయత్నించారని జస్టిస్ కట్జూ చెబుతుంటే జనం ఆశ్చర్యపోతున్నారు. ఆయన వ్యాఖ్యల్లోని మర్మం, ఇంతకాలం వాటిని ఎందుకు దాచివుం చారన్నది పక్కనబెడితే న్యాయవ్యవస్థ పనితీరు ఈ స్థాయిలో ఉన్నదా అని దిగ్భ్రాంతిచెందుతున్నారు.

 ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తున్న బీజేపీకి న్యాయవ్యవస్థ పనిచేస్తున్న తీరుపై చాలాకాలంగా అభ్యంతరాలు న్నాయి. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ రెండేళ్లక్రితం ఒక సదస్సులో మాట్లాడుతూ కొందరు న్యాయమూర్తులు నైతికంగా రాజీపడి, రిటైర య్యాక వచ్చే పదవులకు ఆశపడి అందుకనుగుణంగా తీర్పులు రాస్తు న్నారని ఆరోపించారు. మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇంకాస్త ముందుకెళ్లారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్రం సీబీఐ తోపాటు న్యాయవ్యవస్థను కూడా ఉపయోగించుకుంటున్నదని వ్యా ఖ్యానించారు. రిటైరైన రెండేళ్ల వరకూ న్యాయమూర్తులెవరూ ఎలాంటి పదవులూ తీసుకోరాదన్న సూచన కూడా చేశారు.2008 మొదలుకొని రిటైరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యధిక శాతంమందికి వివిధ కమిషన్ల లోనూ, ట్రిబ్యునళ్లలోనూ అవకాశాలు రావ డాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. స్వాతంత్య్రం వచ్చాక తొలి నాలుగు దశాబ్దాలూ న్యాయమూర్తుల నియామకంలో ఎగ్జిక్యూ టివ్ ఆధిపత్యమే కొనసాగింది. ఈ కాలంలో నియమితులైన చాలా మంది న్యాయమూర్తులు తమ సచ్ఛీలతనూ, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నారు. అందులో సందేహం లేదు. కానీ, 1973లో అప్పటి కేంద్రమంత్రి మోహనకుమార మంగళం చేసిన ఒక వ్యాఖ్య తదుపరి ఆ నియామకాల ప్రక్రియ భ్రష్టుపట్టడం ప్రారంభమైంది. న్యాయమూ ర్తుల నియామకం సమయంలో ఆయా వ్యక్తుల సామాజిక తాత్విక తను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రతిపాదించారు.

మన రాజ్యాంగానికుండే సామాజిక తాత్వికతను మాత్రమే కాదు... ప్రభుత్వానికుండే సామాజిక తాత్వికతను కూడా ఒంటబట్టించుకున్న వారినే ఎంపిక చేయాలన్నది ఆయన మాటల్లోని అంతరార్ధం. మొదట్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మోహన కుమార మంగళం సూచనను పట్టించుకోలేదుగానీ... తన ఎన్నిక చెల్లదన్న తీర్పు వెలువ డ్డాక ఇలాంటి ‘అంకితభావం’ ఉన్న న్యాయమూర్తుల ‘అవసరం’ ఎంత ఉన్నదో ఆమె గ్రహించారు. ఎమర్జెన్సీ కాలంలో అలాంటివారిని ఏరి కోరి నియమించారు. ఆ తర్వాత చాలాకాలానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ పుణ్యమా అని ఈ దుస్థితి తప్పింది. కొలీజియం వ్యవస్థను ప్రవేశపెట్టింది ఆయనే. కానీ, ఆ వ్యవస్థ సైతం లోపాలమయం అయిందని అనంతర కాలంలో ఆవేదన వ్యక్తంచేసిందీ ఆయనే. ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా పనిచేస్తేనే ఏ వ్యవస్థ అయినా అర్ధవంతంగా ఉంటుంది. ప్రజాస్వామ్యానికీ, రహ స్యానికీ ఎప్పుడూ చుక్కెదురే.  గోప్యత కారణంగానే కొలీజియం వ్యవ స్థ విమర్శలను ఎదుర్కొన్నది. ఈ విమర్శలను పరిగణనలోకి తీసుకుని లోపాన్ని చక్కదిద్దివుంటే ఇప్పుడున్న పరిస్థితి ఏర్పడేది కాదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత అయినా, నిష్పాక్షికత అయినా...అవి న్యాయమూ ర్తులకుండే ప్రైవేటు హక్కులు కాదు, ప్రజలకుండే హక్కులని గుర్తించి వుంటే కొలీజియం వ్యవస్థ ప్రక్షాళనకు చిన్న ప్రయత్నమైనా జరిగేది.

 ఇప్పుడు కేంద్రం తీసుకొస్తున్న కొత్త బిల్లు కొలీజియం వ్యవస్థకు మంగళం పాడదల్చుకున్నది. న్యాయమూర్తులే తమ సహచరులను ఎంపిక చేసుకునే కొలీజియంకు బదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో జాతీయ న్యాయ నియా మకాల కమిషన్‌ను ఏర్పాటుచేయాలని తాజా బిల్లు ప్రతిపాదిస్తున్నది. ఇందులో కేంద్ర న్యాయ శాఖ మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తు లిద్దరు, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉండాలని మరో ప్రతిపాదన. ప్రముఖ వ్యక్తుల ఎంపికకు ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి, విపక్ష నేతలతో కూడిన మరో కొలీజియం ఉంటుంది. కమిషన్ లోని ఇద్దరు సభ్యులు కాదంటే న్యాయమూర్తిగా నియామకం కుద రదు. ఈ కమిషన్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ, పదోన్నతులు వగైరాలను చూస్తుంది. ఈ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే మరో బిల్లు కూడా సిద్ధమైంది. అయితే, ఎంపిక కోసం పరిశీలిస్తున్నవారి పేర్లు, ఇతర వివరాలు వెల్లడించకుండా సాగించే ఎలాంటి నియామక ప్రక్రియ అయినా ఆచరణలో కొలీ జియం తరహాలోనే విమర్శలకు లోనవుతుందని గుర్తించాలి. నియామ కాల్లో ఎగ్జిక్యూటివ్ ఆధిపత్యాన్ని ప్రతిష్టించే ప్రయత్నానికి బదులు అందులో పారదర్శకతకు చోటిచ్చి, పరిశీలనలో ఉన్నవారి గుణదో షాలపై విస్తృత చర్చకు వీలు కల్పిస్తే మెరుగైన ఫలితాలు వచ్చేందుకు అవకాశాలుంటాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement