నరకాలవుతున్న నగరాలు | unfortunate consequence of the growth of the cities of the world | Sakshi
Sakshi News home page

నరకాలవుతున్న నగరాలు

Published Sun, Jul 13 2014 1:34 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

unfortunate consequence of the growth of the cities of the world

నగరాల పెరుగుదల అరిష్టదాయకమని, అది ప్రపంచానికే దురదృష్టకర పరిణామమని మహాత్మా గాంధీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. నగరాలు దోపిడీ వర్గాల దుర్గాలని... పెట్టుబడిదారుల స్వర్గాలని చాలామంది విశ్వసించేవారు. మోసం, దగా, స్వార్థంవంటి దుర్లక్షణాలకు అవి మారుపేరన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు రోజులు మారాయి... జనాభా నానాటికీ పెరుగుతూ, పల్లెసీమల్లో ఉపాధి కరువవుతున్న నేపథ్యంలో రోజు గడవాలన్నా, కనీస అవసరాలు తీరాలన్నా నగరాలకు వలస రావడం తప్ప మార్గంలేదని అనేకులు భావిస్తున్నారు. అందువల్లే భారతదేశం ఆత్మ గ్రామాల్లోనే ఉన్నదన్న మహాత్ముడి మాటలకు భిన్నంగా ఇప్పుడు పట్టణాలు, నగరాలు కిక్కిరిసిపోతున్నాయి. కుటుంబాలకు కుటుంబాలు వలసపోయి పల్లెటూళ్లు బావురుమంటున్నాయి. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ఆ సంగతినే మరోసారి ఘంటాపథంగా చెబుతున్నది. భారత్‌లో పట్టణాలు, నగరాలు శరవేగంతో వృద్ధి చెందుతున్నాయని వివరిస్తున్నది. ఈ వలసల తీరు ఏ స్థాయిలో ఉన్నదంటే దేశ రాజధాని ఢిల్లీ జనాభారీత్యా ప్రపంచంలోనే జపాన్ రాజధాని టోక్యో తర్వాత రెండో పెద్ద నగరంగా ఆవిర్భవించింది. ఇప్పుడక్కడ రెండున్నర కోట్లమంది నివసిస్తున్నారని సమితి నివేదిక లెక్కగట్టింది. అగ్రభాగాన ఉన్న టోక్యో జనాభా 3 కోట్ల 80 లక్షలు. అయితే, ఇక్కడొక ఆసక్తికరమైన అంశం ఉన్నది. టోక్యో జనాభాలో క్షీణత కనిపిస్తుంటే ఢిల్లీ మాత్రం వలసవస్తున్నవారిని రెండుచేతులా ఆహ్వానిస్తున్నది. జనాభా పెరుగుదల రేటు ఇదేవిధంగా ఉంటే 2030నాటికి ఢిల్లీ జనాభా 3 కోట్ల 60 లక్షలకు చేరుతుందని నివేదిక అంచనాకట్టింది. ఢిల్లీ తర్వాత జనాభారీత్యా శరవేగంతో విస్తరిస్తున్న మరో నగరం ముంబై. ప్రపంచంలో రెండు కోట్ల జనాభా దాటిన మెక్సికో, సావోపావ్‌లో వంటి ఆరు నగరాల్లో అదొకటి.
 ప్రపంచంలో సగానికి పైగా జనాభా...అంటే 54 శాతం నగరాలు, పట్టణాల్లోనే నివసిస్తున్నదని సమితి నివేదిక చెబుతున్నది. అంతక్రితం పల్లెటూళ్లలోనే అత్యధిక జనాభా ఉండేవారని, 2007 తర్వాత క్రమేపీ ఈ ధోరణి మారుతున్నదని తెలిపింది. 2050నాటికి నగరాలు, పట్టణాల జనాభా 66 శాతానికి చేరుకోవచ్చునని అంచనావేసింది. అయితే, వలసలన్నిటినీ ఒకే గాటన కట్టేయలేం. విద్యా, ఉద్యోగావకాశాల వేటలో నగరబాట పట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. అలాంటివారు స్థితిమంతులుగా మారితే జీవనప్రమాణాల స్థాయి పెరుగుతుంది. దాని ప్రభావం మళ్లీ పల్లెటూళ్లపై పడి వాటి అభివృద్ధికి దోహదపడుతుంది.

కానీ పల్లెటూళ్లను చిన్నచూపు చూడటం, అక్కడ కనీసావసరాల లభ్యత ఎలా ఉన్నదన్న సంగతే పట్టకపోవ డంవంటి కారణాలవల్ల గత్యంతరంలేని స్థితిలో పొట్టనింపుకోవడానికి నగరాలకు వలసలు కడుతున్నారని మన దేశంలోని పరిస్థితి చూస్తే అర్ధమవుతుంది. వ్యవసాయం గిట్టుబాటుకాక, చేతివృత్తులు దెబ్బతిని, కుటీరపరిశ్రమలు కుదేలై అందరూ పట్టణాలు నగరాలవైపే చూస్తున్నారు. ఊళ్లకు ఊళ్లు నగరాలకు చేరుకుంటున్నాయి. నగరాలు, పల్లెటూళ్లమధ్య అంతరాలను అంతకంతకు తగ్గించవలసిన ప్రభుత్వా లు అందుకు భిన్నంగా ఎంతసేపూ అభివృద్ధిని నగరాలకే పరిమితం చేస్తున్నాయి. ఇది ఏ స్థాయికి చేరుకున్నదంటే ఒకప్పుడు అంతో ఇంతో పచ్చగా వర్థిల్లిన పట్టణాలు సైతం వెలవెలబోతున్నాయి.

ప్రభుత్వాల అస్తవ్యస్థ విధానాల ఫలితంగా పెరుగుతున్న నగరాలు విసురుతున్న సవాళ్లు ఎన్నో! మురికివాడలు విస్తరించడం, పారిశుద్ధ్యం లోపించడం, పర్యావరణానికి హానికలగడం, వ్యాధుల బెడద పెరగడంవంటి  ప్రమాదాలుంటున్నాయి. మంచినీటి సరఫరా, రవాణా, మురుగునీటి పారుదల, రోడ్లు, ఆవాసం, వైద్యంలాంటి  సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టవలసివస్తుంది. వచ్చినవారందరికీ ఉపాధి దొరకదు గనుక నేర సంస్కృతి విస్తరించడంవంటి సమస్యలు ఉత్పన్న మవుతాయి. మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతపై అదనపు శ్రద్ధ అవసరమవుతుంది. ఇలా ఎదురయ్యే అనేక సమస్యల గురించి ఆలోచించకుండా, వాటి పరిష్కార మార్గాలను అన్వేషించ కుం డా నగరాలను విస్తరించుకుంటూ పోవడంవల్ల వలసవచ్చిన జనానికి నగరాలు నరకాలవుతున్నాయి. న్యూఢిల్లీ సంగతే తీసుకుంటే అక్కడి జనాభాలో 60 శాతంమంది అనధికార కాలనీల్లోనే నివసిస్తున్నారు. అనధికార కాలనీలు గనుక అక్కడ సగటు మనిషికి అవసరమయ్యే కనీస సౌకర్యాలూ ఉండవు. మౌలిక సదుపాయాలన్నీ అధికారగణం, సంపన్నులు నివసించే సెంట్రల్ ఢిల్లీకి మాత్రమే పరిమితం. జనాభాలో అత్యధిక భాగానికి అరకొరగా కూడా సౌకర్యాలు లభించవు. ఆ మహా నగరంపై పెరుగుతున్న జనాభా ఒత్తిడిని తగ్గించడానికి తీసుకున్న చర్యలు సైతం శాస్త్రీయత లోపించిన కారణంగా అక్కరకు రాకుండా పోయాయి. ఒకపక్క నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్) పేరిట శివారు పట్టణాలను నిర్మించి వాటన్నిటికీ విమానాశ్రయం మొదలుకొని రోడ్డు రవాణా సౌకర్యాలు, మార్కెట్ల వరకూ అన్నిటినీ ఉమ్మడిగా ఉంచడంవల్ల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. క్రీస్తుపూర్వంనాటి సింధులోయ నాగరికతలో కూడా నగరాలు ఇంతకన్నా మెరుగ్గా ఉన్నాయని పురావస్తు పరిశోధనలు చెబుతున్నాయి. మన నగరాలు చూస్తుంటే మనం మునుముందుకు పోతున్నామో...పలాయనం చిత్తగిస్తున్నామో అర్ధంకాదు.  పెరుగుతున్న నగరాలు మోసుకొచ్చే సమస్యలను కూడా ఐక్యరాజ్యసమితి నివేదిక ఏకరువుపెట్టింది. వాటిని విస్మరిస్తే ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో కూడా చెప్పింది. విని ఆచరించడం శ్రేయస్కరమని మన పాలకులు ఇప్పటికైనా గుర్తించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement