Unfortunate
-
ఆడుకుంటూ.. అనంత లోకాలకు.. తీవ్ర విషాదం!
హైదరాబాద్: భవనంపై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు 3వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకార.. ఖమ్మం జిల్లాకు చెందిన మూర్తమ్మ కొన్ని సంవత్సరాలుగా సూరారం రాజీవ్ గృహకల్ప 29/27వ బ్లాక్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు తులసీనాథ్ (13) ఉన్నాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు సెలవు కావడంతో తులసీనాథ్ రాజీవ్ గృహకల్ప 27వ బ్లాక్‌లోని భవనంపైన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ తగాదాలతో బాలుడి తండ్రి కనకరత్నం కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. తల్లి మూర్తమ్మ టైలరింగ్ చేస్తూ కుమారుడిని పోషిస్తోంది. -
టీవీ నటుడి ఇంట్లో తీరని విషాదం
ముద్దుల మూట కడుతున్న ఈ ఫోటోలోని పాప ఇక లేదు. నిండుగా, హాయిగా ఎదగాల్సిన ఈ చిన్నారి ఊపిరి అర్థాంతరంగా ఆగిపోయింది. ఒక చిన్న నిర్లక్ష్యం పాప ప్రాణాలను బలి తీసుకుంది. ప్లాస్టిక్ ఆటవస్తువులతో ఆడుకుంటూ పొరపాటున ఒక టోయ్ మింగేసింది. దురదృష్టవశాత్తూ అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఈ చిన్నితల్లి కన్నుమూసింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపడమేకాదు..పలువురిని మనసుల్ని కలచి వేస్తున్న ఘటన ఇది. పాప తండ్రి ప్రతీష్ వోరా ప్రముఖ టీవీ నటుడు. ప్రస్తుతం ఆయన ‘ప్యార్ కే పాపడ్’ అనే టీవీ (స్టార్ భారత్) షోలో నటిస్తున్నారు. అనుకోని ప్రమాదంలో తన రెండేళ్ల పాపను కోల్పోవడంతో ఆయన కన్నీటి పర్యంత మవుతున్నారు. తీరని దుఃఖంతో పాప అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. చిన్నపిల్లల విషయలో ప్లాస్టిక్ మూతలు, ప్లాస్టిక్ వస్తువులు లాంటివి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. వాటిని నోట్లో పెట్టుకోవడం..పొరపాటున అది గొంతులో ఇరుక్కుని పసిపిల్లల ఉసురు తీస్తున్న ఘటనలు గతంలో అనేకం. కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపుతున్న ఇలాంటి సంఘటనల పట్ల ఇకనైనా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు పసిసిల్లల పరిసరాల్లో ఉన్నవాళ్లు కూడా వారిని ఒక కంట కనిపెడుతూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. -
భారత మహిళకు భద్రత చాలా అవసరం
వాషింగ్టన్: కశ్మీర్‌లోని కఠువాలో బాలికపై హత్యాచార ఘటనను అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ దురదృష్టకరంగా అభివర్ణించారు. దీన్ని నిరసిస్తూ భారత్‌లో జరుగుతున్న నిరసనలపై స్పందిస్తూ ‘భారత్‌తో జరుగుతున్న ఆందోళనలు ప్రతిఘటనకు సూచన. భారత అధికారులు, ప్రధాని మోదీ దీనిపై దృష్టి సారిస్తారని భావిస్తున్నాను. భారత మహిళకు భద్రత చాలా అవసరం’ అని ఆమె అన్నారు. భారత్‌లో కొనసాగుతున్న సంస్కరణ జోరు వచ్చే ఎన్నికల సంవత్సరంలో కొనసాగటం కష్టమేనని తెలిపారు. ‘భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంస్కరణ వేగం వచ్చే కొద్ది నెలల్లో ఇలాగే కొనసాగుతుం దని చెప్పలేం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సంస్కరణలు తగ్గుతాయి’ అని గురువారం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో జరిగిన సమావేశంలో ఆమె తెలిపారు. జీఎస్టీ, దివాళా చట్టం వంటివి చాలా గొప్ప సంస్కరణలని ఆమె ప్రశంసించారు. -
విగ్రహాల ధ్వంసంపై స్పందించిన అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన విగ్రహాల ధ్వంసంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా స్పందించారు. ఇలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం అని అన్నారు. ఈ ధ్వంసానికి పాల్పడిన వారిలో తమ పార్టీ వ్యక్తి ఉన్నా మరే పార్టీ వ్యక్తి ఉన్నా కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సంఘటనలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని, తమిళనాడు పెరియార్ విగ్రహాన్ని కొంతమంది కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం పెద్ద మొత్తంలో ఘర్షణలు చెలరేగాయి. వీటి ధ్వంసానికి బీజేపీనే కారణం అని పలుచోట్ల చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అమిత్ షా తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘విగ్రహాల ధ్వంసం అనేది చాలా దురదృష్టకరం. ఒక పార్టీగా ఇలాంటి సంఘటనలకు ఏమాత్రం మద్దతు ఇవ్వబోం. తమిళనాడు, త్రిపురలోని మా పార్టీ కార్యకర్తలతో సంఘాలతో నేను మాట్లాడాను. ఒక వేళ ఎవరైనా బీజేపీకి సంబంధించిన వ్యక్తి విగ్రహాల ధ్వంసంలో ఉన్నట్లు తెలిస్తే వారిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అమిత్‌షా హెచ్చరించారు. -
ఫిల్మ్ నగర్ ఘటన దురదృష్టకరం
-
సల్మాన్ వ్యాఖ్యలపై అమీర్ ఏమన్నారంటే..
ముంబై : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవలి రేప్ వుమెన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్యక్రమంగా పెరుగుతోంది. తాజాగా సల్మాన్ వివాదాస్పద వ్యాఖ్యలపై మరో ఖాన్ స్పందించారు. సల్మాన్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్న స్టార్ హీరో అమిర్ ఖాన్..ఈ వ్యవహారంలో ఆయనకు సలహా ఇవ్వడానికి మాత్రం నిరాకరించారు. సల్మాన్ వ్యాఖ్యలను ప్రత్యక్షంగా తాను వినలేదనీ..మీడియా ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. సల్మాన్ అలాంటి కఠిన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మీరేమైనా సల్మాన్ కు సలహా ఇస్తారా అని ప్రశ్నించినపుడు సల్మాన్ కు సలహా ఇవ్వడానికి తానెవ్వర్ని అంటూ తప్పించుకున్నారు. దంగల్ ఫిల్మ్ పోస్టర్ విడుదల సందర్భంగా ఆమిర్ ఖాన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. కాగా సుల్తాన్ ఫిల్మ్‌లో రెజ్లర్ గా నటిస్తున్న సల్మాన్ తన పాత్ర గురించి ప్రస్తావిస్తూ షూటింగ్ ముగిసిన తర్వాత తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా ఉందని వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు అలా విభిన్నంగా స్పందించారు. అలా నోరు జారడం మంచిది కాదని ఒకరంటే.. మీడియా అనవసర రాద్దాంతం చేస్తోందని మరికొందరు వ్యాఖ్యానించారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్,ఇతర మహిళా సంఘాలు సీరియస్ గా స్పందించాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన సల్మాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. అయితే సారీ చెప్పేందుకు సల్మాన్ నిరాకరించి లైట్ తీసుకున్న సంగతి తెలిసిందే. -
వారి తీరు దురదృష్టకరం
న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రవర్తన తీరు దురదృష్టకరమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. లలిత్ మోదీ వ్యవహారంపై విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంటులో ప్రకటన చేస్తారని చెప్పిన కూడా వారు వినకుండా సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలనీ సుష్మా చెప్తూనే ఉన్నారని, దానికి సంబంధించే ఓ స్పష్టమైన వివరణ ఇస్తానని చెప్తున్నా వినకుండా విపక్షాలు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా దురదృష్టమే అని పార్లమెంటు వెలుపల విలేకరులతో చెప్పారు. మరోపక్క, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాధిత్య సిందియా మాట్లాడుతూ తమ పార్టీ ఇతర పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీవంటివన్నీ కూడా లలిత్ మోదీ వ్యవహారంలో అవినీతికి పాల్పడిన మంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం తప్ప తాము ఇంకే కోరడం లేదని అన్నారు. మొత్తం విపక్షమంతా కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా కోరుతున్నాయని అన్నారు. -
ప్చ్.. నా దురదృష్టం.. మళ్లీ చేస్తాలే
ముంబై: ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రంలో నటించలేకపోతున్నందుకు తెగబాధపడిపోతోంది బాలీవుడ్ నటి కృతిసనన్. హీరో పాంటీ చిత్రంతో బాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు తెలుగులో మహేశ్ బాబుతో కలిసి వన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అనంతరం బాలీవుడ్ మీదే కన్నేసిన సనన్.. కొన్ని కారణాలవల్ల సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రంలో నటించే అవకాశం కోల్పోయింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ అమ్మడు చిత్రంలో అవకాశం కోల్పోవడంపై స్పందిస్తూ.. 'నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. వాస్తవానికి ఆ చిత్రంలో నటించాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. కానీ దురదృష్టం కొద్ది అది జరగలేదు. అయితే, రాబోయే రోజుల్లో ఏదో ఒక రోజు ప్రభుదేవా, అక్షయ్‌తో కలిసి తప్పకుండా నటిస్తాను' అంటూ చెప్పుకొచ్చింది సనన్. -
నరకాలవుతున్న నగరాలు
నగరాల పెరుగుదల అరిష్టదాయకమని, అది ప్రపంచానికే దురదృష్టకర పరిణామమని మహాత్మా గాంధీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. నగరాలు దోపిడీ వర్గాల దుర్గాలని... పెట్టుబడిదారుల స్వర్గాలని చాలామంది విశ్వసించేవారు. మోసం, దగా, స్వార్థంవంటి దుర్లక్షణాలకు అవి మారుపేరన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు రోజులు మారాయి... జనాభా నానాటికీ పెరుగుతూ, పల్లెసీమల్లో ఉపాధి కరువవుతున్న నేపథ్యంలో రోజు గడవాలన్నా, కనీస అవసరాలు తీరాలన్నా నగరాలకు వలస రావడం తప్ప మార్గంలేదని అనేకులు భావిస్తున్నారు. అందువల్లే భారతదేశం ఆత్మ గ్రామాల్లోనే ఉన్నదన్న మహాత్ముడి మాటలకు భిన్నంగా ఇప్పుడు పట్టణాలు, నగరాలు కిక్కిరిసిపోతున్నాయి. కుటుంబాలకు కుటుంబాలు వలసపోయి పల్లెటూళ్లు బావురుమంటున్నాయి. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ఆ సంగతినే మరోసారి ఘంటాపథంగా చెబుతున్నది. భారత్‌లో పట్టణాలు, నగరాలు శరవేగంతో వృద్ధి చెందుతున్నాయని వివరిస్తున్నది. ఈ వలసల తీరు ఏ స్థాయిలో ఉన్నదంటే దేశ రాజధాని ఢిల్లీ జనాభారీత్యా ప్రపంచంలోనే జపాన్ రాజధాని టోక్యో తర్వాత రెండో పెద్ద నగరంగా ఆవిర్భవించింది. ఇప్పుడక్కడ రెండున్నర కోట్లమంది నివసిస్తున్నారని సమితి నివేదిక లెక్కగట్టింది. అగ్రభాగాన ఉన్న టోక్యో జనాభా 3 కోట్ల 80 లక్షలు. అయితే, ఇక్కడొక ఆసక్తికరమైన అంశం ఉన్నది. టోక్యో జనాభాలో క్షీణత కనిపిస్తుంటే ఢిల్లీ మాత్రం వలసవస్తున్నవారిని రెండుచేతులా ఆహ్వానిస్తున్నది. జనాభా పెరుగుదల రేటు ఇదేవిధంగా ఉంటే 2030నాటికి ఢిల్లీ జనాభా 3 కోట్ల 60 లక్షలకు చేరుతుందని నివేదిక అంచనాకట్టింది. ఢిల్లీ తర్వాత జనాభారీత్యా శరవేగంతో విస్తరిస్తున్న మరో నగరం ముంబై. ప్రపంచంలో రెండు కోట్ల జనాభా దాటిన మెక్సికో, సావోపావ్లో వంటి ఆరు నగరాల్లో అదొకటి. ప్రపంచంలో సగానికి పైగా జనాభా...అంటే 54 శాతం నగరాలు, పట్టణాల్లోనే నివసిస్తున్నదని సమితి నివేదిక చెబుతున్నది. అంతక్రితం పల్లెటూళ్లలోనే అత్యధిక జనాభా ఉండేవారని, 2007 తర్వాత క్రమేపీ ఈ ధోరణి మారుతున్నదని తెలిపింది. 2050నాటికి నగరాలు, పట్టణాల జనాభా 66 శాతానికి చేరుకోవచ్చునని అంచనావేసింది. అయితే, వలసలన్నిటినీ ఒకే గాటన కట్టేయలేం. విద్యా, ఉద్యోగావకాశాల వేటలో నగరబాట పట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. అలాంటివారు స్థితిమంతులుగా మారితే జీవనప్రమాణాల స్థాయి పెరుగుతుంది. దాని ప్రభావం మళ్లీ పల్లెటూళ్లపై పడి వాటి అభివృద్ధికి దోహదపడుతుంది. కానీ పల్లెటూళ్లను చిన్నచూపు చూడటం, అక్కడ కనీసావసరాల లభ్యత ఎలా ఉన్నదన్న సంగతే పట్టకపోవ డంవంటి కారణాలవల్ల గత్యంతరంలేని స్థితిలో పొట్టనింపుకోవడానికి నగరాలకు వలసలు కడుతున్నారని మన దేశంలోని పరిస్థితి చూస్తే అర్ధమవుతుంది. వ్యవసాయం గిట్టుబాటుకాక, చేతివృత్తులు దెబ్బతిని, కుటీరపరిశ్రమలు కుదేలై అందరూ పట్టణాలు నగరాలవైపే చూస్తున్నారు. ఊళ్లకు ఊళ్లు నగరాలకు చేరుకుంటున్నాయి. నగరాలు, పల్లెటూళ్లమధ్య అంతరాలను అంతకంతకు తగ్గించవలసిన ప్రభుత్వా లు అందుకు భిన్నంగా ఎంతసేపూ అభివృద్ధిని నగరాలకే పరిమితం చేస్తున్నాయి. ఇది ఏ స్థాయికి చేరుకున్నదంటే ఒకప్పుడు అంతో ఇంతో పచ్చగా వర్థిల్లిన పట్టణాలు సైతం వెలవెలబోతున్నాయి. ప్రభుత్వాల అస్తవ్యస్థ విధానాల ఫలితంగా పెరుగుతున్న నగరాలు విసురుతున్న సవాళ్లు ఎన్నో! మురికివాడలు విస్తరించడం, పారిశుద్ధ్యం లోపించడం, పర్యావరణానికి హానికలగడం, వ్యాధుల బెడద పెరగడంవంటి ప్రమాదాలుంటున్నాయి. మంచినీటి సరఫరా, రవాణా, మురుగునీటి పారుదల, రోడ్లు, ఆవాసం, వైద్యంలాంటి సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టవలసివస్తుంది. వచ్చినవారందరికీ ఉపాధి దొరకదు గనుక నేర సంస్కృతి విస్తరించడంవంటి సమస్యలు ఉత్పన్న మవుతాయి. మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతపై అదనపు శ్రద్ధ అవసరమవుతుంది. ఇలా ఎదురయ్యే అనేక సమస్యల గురించి ఆలోచించకుండా, వాటి పరిష్కార మార్గాలను అన్వేషించ కుం డా నగరాలను విస్తరించుకుంటూ పోవడంవల్ల వలసవచ్చిన జనానికి నగరాలు నరకాలవుతున్నాయి. న్యూఢిల్లీ సంగతే తీసుకుంటే అక్కడి జనాభాలో 60 శాతంమంది అనధికార కాలనీల్లోనే నివసిస్తున్నారు. అనధికార కాలనీలు గనుక అక్కడ సగటు మనిషికి అవసరమయ్యే కనీస సౌకర్యాలూ ఉండవు. మౌలిక సదుపాయాలన్నీ అధికారగణం, సంపన్నులు నివసించే సెంట్రల్ ఢిల్లీకి మాత్రమే పరిమితం. జనాభాలో అత్యధిక భాగానికి అరకొరగా కూడా సౌకర్యాలు లభించవు. ఆ మహా నగరంపై పెరుగుతున్న జనాభా ఒత్తిడిని తగ్గించడానికి తీసుకున్న చర్యలు సైతం శాస్త్రీయత లోపించిన కారణంగా అక్కరకు రాకుండా పోయాయి. ఒకపక్క నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) పేరిట శివారు పట్టణాలను నిర్మించి వాటన్నిటికీ విమానాశ్రయం మొదలుకొని రోడ్డు రవాణా సౌకర్యాలు, మార్కెట్ల వరకూ అన్నిటినీ ఉమ్మడిగా ఉంచడంవల్ల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. క్రీస్తుపూర్వంనాటి సింధులోయ నాగరికతలో కూడా నగరాలు ఇంతకన్నా మెరుగ్గా ఉన్నాయని పురావస్తు పరిశోధనలు చెబుతున్నాయి. మన నగరాలు చూస్తుంటే మనం మునుముందుకు పోతున్నామో...పలాయనం చిత్తగిస్తున్నామో అర్ధంకాదు. పెరుగుతున్న నగరాలు మోసుకొచ్చే సమస్యలను కూడా ఐక్యరాజ్యసమితి నివేదిక ఏకరువుపెట్టింది. వాటిని విస్మరిస్తే ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో కూడా చెప్పింది. విని ఆచరించడం శ్రేయస్కరమని మన పాలకులు ఇప్పటికైనా గుర్తించాలి.