
ముద్దుల మూట కడుతున్న ఈ ఫోటోలోని పాప ఇక లేదు. నిండుగా, హాయిగా ఎదగాల్సిన ఈ చిన్నారి ఊపిరి అర్థాంతరంగా ఆగిపోయింది. ఒక చిన్న నిర్లక్ష్యం పాప ప్రాణాలను బలి తీసుకుంది. ప్లాస్టిక్ ఆటవస్తువులతో ఆడుకుంటూ పొరపాటున ఒక టోయ్ మింగేసింది. దురదృష్టవశాత్తూ అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఈ చిన్నితల్లి కన్నుమూసింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపడమేకాదు..పలువురిని మనసుల్ని కలచి వేస్తున్న ఘటన ఇది.
పాప తండ్రి ప్రతీష్ వోరా ప్రముఖ టీవీ నటుడు. ప్రస్తుతం ఆయన ‘ప్యార్ కే పాపడ్’ అనే టీవీ (స్టార్ భారత్) షోలో నటిస్తున్నారు. అనుకోని ప్రమాదంలో తన రెండేళ్ల పాపను కోల్పోవడంతో ఆయన కన్నీటి పర్యంత మవుతున్నారు. తీరని దుఃఖంతో పాప అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
చిన్నపిల్లల విషయలో ప్లాస్టిక్ మూతలు, ప్లాస్టిక్ వస్తువులు లాంటివి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. వాటిని నోట్లో పెట్టుకోవడం..పొరపాటున అది గొంతులో ఇరుక్కుని పసిపిల్లల ఉసురు తీస్తున్న ఘటనలు గతంలో అనేకం. కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపుతున్న ఇలాంటి సంఘటనల పట్ల ఇకనైనా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు పసిసిల్లల పరిసరాల్లో ఉన్నవాళ్లు కూడా వారిని ఒక కంట కనిపెడుతూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment