ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌తో కఠినంగా వ్యవహరించాలని, భారత్‌కు ప్రాధాన్యమిచ్చేలా దక్షిణాసియా విధానానికి రూపకల్పన చేయాలని అమెరికా నిర్ణయించినట్టు కథనాలు హోరెత్తుతుండగా ఆ దేశ విదేశాంగమంత్రి రెక్స్ టిల్లర్ సన్ తొలిసారి మన దేశంలో రెండురోజులు పర్యటించారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఆ దేశం నుంచి వచ్చిన రెండో ఉన్నతస్థాయి నేత టిల్లర్‌సన్. గత నెలలో అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ వచ్చారు. ఇరు దేశాలకూ ఉమ్మడి లక్ష్యాలుండటం, ఇవి రెండూ మరింత సాన్నిహిత్యం కావాలని కోరుకోవడం మొత్తంగా ప్రపంచానికీ, ప్రత్యేకించి ఆసియాకూ ప్రయోజనకర మని ప్రధాని నరేంద్రమోదీ, టిల్లర్‌సన్‌లు అభిప్రాయపడ్డారు.
అమెరికా నుంచి గత కొంతకాలం నుంచి వెలువడుతున్న అనుకూల సంకేతాల ప్రభావంవల్ల కావొచ్చు మన పాలకులకు ఆశావహ దృక్పథం ఏర్పడింది. అంతక్రితం మాటెలా ఉన్నా రెండు దశాబ్దాల నుంచి మన దేశంపై అమెరికా సానుకూల వైఖరితోనే ఉంటున్నది. అయితే పాకిస్తాన్ విషయానికొచ్చేసరికి మాత్రం ఎంతో కొంత అటు వైపే మొగ్గు ఉంటోంది. అంతకు అనేక దశాబ్దాల ముందు నుంచి పాకిస్తాన్‌తో ముడిపడి ఉన్న బంధమే ఇందుకు కారణం. డోనాల్డ్ ట్రంప్ రాకతో ఇదంతా మారిపోతుందన్న అభిప్రాయం మన పాలకులకు కలిగింది.
అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన పాకిస్తాన్ పోకడలపై విరుచుకుపడటమే ఇందుకు కారణం. దానికి కొనసాగింపుగా మొన్న ఆగస్టులో పాకిస్తాన్‌ను తీవ్రంగా తప్పు బడుతూ ట్రంప్ మాట్లాడారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐపై నిప్పులు చెరి గారు. ఉగ్రవాద ముఠాలకు ఆశ్రయం ఇవ్వడం మానుకోనట్టయితే చర్యలు తప్ప వని హెచ్చరించారు. అయితే రెండు నెలలు గడవకముందే ఉగ్రవాదుల విష యంలో పాకిస్తాన్ సహకారానికి పొంగిపోతూ వ్యాఖ్యానాలు చేశారు. ఆ వెంటనే వైట్‌హౌస్ చీఫ్ జాన్ కెల్లీ పాక్ గొప్ప భాగస్వామ్య దేశమని ప్రశంసిస్తే... టిల్లర్ సన్ దక్షిణాసియా సుస్థిరతలో పాకిస్తాన్‌ది కీలక పాత్ర అన్నారు. అమెరికా ఇలా పరస్పర విరుద్ధమైన వైఖరులను ప్రదర్శిస్తున్న దశలో టిల్లర్‌సన్ భారత్ పర్య టనకు ప్రాముఖ్యముంది.
మన దేశం వచ్చే ముందు ఆయన అఫ్ఘానిస్తాన్ వెళ్లారు. అటునుంచి పాకిస్తాన్ వెళ్లి అక్కడి నేతలతో మాట్లాడారు. దక్షిణాసియాలోనే కాదు...ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో సైతం భారత్ పాత్ర అత్యంత కీలకమైనదని టిల్లర్‌సన్ భావిస్తున్నారు. నిబంధనల చట్రంలో, ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తూ భారత్ బాధ్యతాయుతంగా ఎదిగితే... ఆ పక్కనున్న చైనా ఆ స్థాయి బాధ్యతను ప్రదర్శించకుండా, అప్పు డప్పుడు అంతర్జాతీయ విధానాలకు, నిబంధనలకు విరుద్ధంగా ఎదిగిందని గతవారం వాషింగ్టన్‌లో టిల్లర్‌సన్ ఒక సెమినార్‌లో చెప్పారు. అలాగే భద్రతకు సంబంధించి భారత్‌కున్న ఆందోళన, ఆత్రుత తమవి కూడానని అభయ మిచ్చారు.
ఇవి యధాలాపంగానో, యాదృచ్ఛికంగానో చెప్పిన మాటలు కాదు. మన దేశం పర్యటించే ముందు ఉద్దేశపూర్వకంగా చెప్పినవే. అమెరికా దృష్టిలో మనకెంత ప్రాధాన్యమున్నదో, అది మన నుంచి ఆశిస్తున్నదేమిటో చెప్పడమే ఆయన ప్రసంగం సారాంశం. గతంలో తనకూ, ఇతర పాశ్చాత్య దేశాలకుండే ఉగ్రవాద బెడదను ఒకరకంగా...మన దేశానికుండే ఉగ్రవాద బెడదను మరోలా చూసే వైఖరితో ఉన్న అమెరికా ఇప్పుడు ఆ రెండింటినీ ఒకేలా చూస్తున్నట్టు చెప్పడం కొత్త పరిణామం. పాకిస్తాన్ చైనాకు దగ్గరవుతున్నదన్న అనుమానాలు, అఫ్ఘాన్ భద్రత, పునర్నిర్మాణం అంశాల్లో ఇకపై భారత్ ప్రమేయం కూడా పెంచా లన్న అభిప్రాయంవంటివి ఇందుకు దోహదపడ్డాయి. పైగా చైనాను కట్టడి చేయా లన్న తన వ్యూహంలో భారత్ కీలక పాత్ర పోషించవలసి ఉంటుందని అది లెక్కే స్తున్నది. అందుకే భారత్ వచ్చేముందు పాకిస్తాన్ వెళ్లిన టిల్లర్‌సన్ ఆ దేశ ప్రధాని అబ్బాసీతో నిష్కర్షగానే మాట్లాడారు.
పాకిస్తాన్‌తోనూ, చైనాతోనూ భారత్‌కున్న సమస్యల నేపథ్యంలో అమెరికా తాజా వైఖరి సహజంగానే మనకు ఆశావహంగా అనిపిస్తుంది. రెండు దశా బ్దాలుగా పాకిస్తాన్ తీరుతెన్నుల గురించి మనం ఎంతగా చెబుతున్నా ఖాతరు చేయని అమెరికాలో ఈ మార్పు రావడం మంచి పరిణామమేనన్న అభిప్రాయం విశ్లేషకుల్లో కూడా ఉంది. అయితే దక్షిణాసియాలోగానీ, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోగానీ పూర్తిగా స్వీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవ హరించడమే మన దేశానికి అన్నివిధాలా శ్రేయస్కరం. ఈ విషయంలో అమెరికాయే మనకు ఆదర్శం. ఆర్థిక సంస్కరణల అనంతరం రెండు దశా బ్దాలుగా మన దేశంతో ఆర్ధిక, వాణిజ్య రంగాల్లో ఎంతో సన్నిహితంగా ఉంటున్నా, మన మార్కెట్ల వల్ల అపారంగా లాభపడుతున్నా ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో మన దేశానికి అది ఏనాడూ పెద్దగా సహకరించలేదు. ముఖ్యంగా 2008లో ముంబై నగరంపై జరిగిన ఉగ్రవాద దాడి వెనక ఉన్న కుట్రను వెలికితీయడంలో అది సాయపడలేదు.
కనీసం తనకు పట్టుబడిన లష్కరే తొయిబా ఏజెంట్ డేవిడ్ హెడ్లీని దర్యాప్తు నిమిత్తం మన దేశానికి అప్ప గించేందుకు సిద్ధపడలేదు. తమ దేశం వచ్చి తమ అధికారుల సమక్షంలో ప్రశ్నించడానికి మాత్రమే వీలుకల్పించింది. పైగా ఏదో ఒక కారణం చూపి ఆ దేశానికి ఆయుధ సామగ్రి అమ్ముకుంటూనే ఉంది. చిరకాల మిత్రదేశం పాకిస్తాన్‌కు ఆగ్రహం తెప్పించరాదన్నదే దీని వెనకున్న ఉద్దేశం. మన దేశం కూడా అదే తరహాలో ఇప్పుడు స్వీయ ప్రయోజనాల సాధనకు కృషి చేయాలి. మన ఇరుగుపొరుగు దేశాలతో సమస్యలున్నప్పుడు వాటితో చర్చించడం, పరిష్కారానికి కృషి చేయడంతోపాటు అమెరికాతో సహా అందరి మద్దతూ కూడగట్టుకోవడం ముఖ్యమే. అయితే ఈ క్రమంలో మన భద్రత, మన ప్రయోజనాలే గీటురాళ్లుగా స్వీయ విధానాన్ని రూపొందించుకోవాలి. ఆచితూచి అడుగేయాలి.
Comments
Please login to add a commentAdd a comment