సంపాదకీయం
అలవాటైన ప్రాణం ఊరకే ఉండలేదు. అందుకే చేసిన బాసల్ని, ఇచ్చిన హామీల్ని గాలికొదిలి అగ్ర రాజ్యం అమెరికా మరోసారి ఇరాక్‌పై వైమానిక దాడులను ప్రారంభించింది. ఈసారి దానికి దొరికిన సాకు... ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మిలిటెంట్ల దుస్సాహసం. ఈ మిలిటెంట్లు గత రెండు నెలలుగా అడ్డూ ఆపూ లేకుండా దూసుకెళ్తూ అనేక పట్టణా లనూ, నగరాలనూ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఇలా ఉత్తర ఇరాక్ లోని చాలా భూభాగాన్ని గుప్పిట బంధించి... కుర్దుల స్వయంపాలిత ప్రాంతంవైపుగా అడుగులేస్తుండగా అమెరికాలో కదలిక వచ్చింది. కుర్దుల రాజధాని నగరం ఇర్బిల్‌కు కేవలం అరగంట ప్రయాణ దూరంలో వారుండగా ‘జనహననాన్ని’ ఆపడానికి వైమానిక దాడులు ప్రారంభించినట్టు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. సరిగ్గా పుష్కరకాలం క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ ఇలాంటి కబుర్లే చెప్పారు. రసాయన ఆయుధాల గుట్టలున్న ఇరాక్‌ను నిరా యుధం చేయడం, అక్కడ ప్రజాతంత్రాన్ని ప్రతిష్టించడం తమ కర్తవ్య మంటూ ఇరాక్ దురాక్రమణకు తెగబడ్డారు.
ఈ ముసుగులో అక్కడ సాగింది అక్షరాలా జనహననమే. మూడేళ్లనాడు తమ దళాలు అధికారి కంగా ఇరాక్‌ను వదిలిపోయిననాడు ఒబామా ఏమన్నారు? మళ్లీ ఈ గడ్డపై యుద్ధం కోసం అడుగుపెట్టబోమన్నారు. ఇన్నాళ్లకు ఐఎస్‌ఐఎస్ మిలిటెంట్ల సాకుతో మళ్లీ పాత కథ మొదలుబెట్టారు. ఇది ఒబామా చెబుతున్నట్టు ‘అమాయక పౌరుల’ రక్షణకు కాదు. కుర్దిష్ ప్రాంతంలో తమకున్న విలువైన చమురు బావులను, ఇతర ఆస్తులను రక్షించుకోవ డానికి మాత్రమే.
ఇరాక్‌లో గత రెండునెలలుగా ఏం జరుగుతున్నదో మీడియా అంతా కోడై కూస్తున్నది. ఐఎస్ మిలిటెంట్లు ఇరాక్‌లో పెద్ద రాష్ట్రమైన అల్ అంబర్ రాజధాని రమాదీతో మొదలుపెట్టి ఫలూజా, మొసుల్, తిక్రిత్ వంటి అనేక పట్టణాలనూ, నగరాలనూ స్వాధీనం చేసుకు న్నారు. ఇరాక్-సిరియా సరిహద్దుల పొడవునా ఉన్న అనేక ప్రాంతాలు వారి వశమయ్యాయి. మౌలికంగా ఐఎస్ సంస్థ సున్నీలదన్న పేరేగానీ దాని తీరుని ప్రశ్నించిన వారెవరినైనా ఆ మిలిటెంట్లు ఊచకోత కోశారు. అందులో షియాలు సరేసరి... సున్నీలున్నారు, క్రైస్త వులున్నారు. ఇతర మైనారిటీవర్గాలవారున్నారు. మిలిటెంట్ల ధాటికి జడిసి మైనారిటీ యాజిదీ క్రైస్తవులు ప్రాణాలరచేతబట్టుకుని సింజార్ కొండల్లో తలదాచుకున్నారు. ఈమధ్యకాలంలో మాట వినని ఇరాక్ అధ్యక్షుడు అల్-మాలికీని దారికి తెచ్చుకునేందుకు ఈ ఐఎస్ మిలి టెంట్ల బెడద తనకు ఉపయోగపడుతుందని అమెరికా తలపోసింది. కానీ, ఇది మరింత ముదిరి కుర్దిష్ ప్రాంతానికి విస్తరించడంతో దానికి ముచ్చెమటలు పట్టాయి. అక్కడ అమెరికా సంస్థల చమురు బావులుం డటమే కాక వందలాదిమంది అమెరికా దౌత్య నిపుణులు, మిలిటరీ సిబ్బంది, వారి కార్యాలయాలు ఉన్నాయి. అందువల్లే అమెరికా తాజా దాడులకు తెరతీసింది. జనహననం సాగుతున్నప్పుడు తాము కళ్లు మూసుకుని ఉండలేమని చెబుతున్న ఒబామాకు గాజాలో సాగిన ఇజ్రాయెల్ ఊచకోత సమయంలో ఈ జ్ఞానోదయం ఎందుకు కలగలేదో అర్ధంకాదు.
వైమానిక దాడులతో మొదలైన తాజా అంకం అక్కడితో ఆగుతుం దన్న గ్యారెంటీ లేదు. ఐఎస్ మిలిటెంట్లను అదుపుచేయడానికి మా త్రమే ఈ దాడులు పరిమితమవుతాయని, భూతల దాడులకు దిగేది లేదని ఒబామా చెప్పే మాటలు నమ్మశక్యంకానివి. ఈ దాడుల వెనక ఒబామాకు స్వీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నవంబర్‌లో రా నున్న మధ్యంతర ఎన్నికలు, రిపబ్లికన్లనుంచి నిత్యం వస్తున్న రాజకీయ ఒత్తిళ్లు, ముఖ్యంగా ఐఎస్ మిలిటెంట్లపై చర్యకు వెనకాడుతున్నారన్న విమర్శలనుంచి బయటపడటానికి ఈ వైమానిక దాడులు ఉపయోగప డతాయని ఒబామా అంచనావేస్తున్నారు. ఆయనకొచ్చే ప్రయోజనాల సంగతలా ఉంచితే, అమెరికా ఇలా మతిమాలిన చర్యలకు పాల్పడిన ప్పుడల్లా ఉగ్రవాదం మరింతగా విస్తరిస్తున్నది. అంతక్రితం అఫ్ఘాన్ లోనూ, అటు తర్వాత ఇరాక్‌లోనూ, ఆపై లిబియా, సిరియాల్లోనూ రుజువైంది ఇదే. లిబియాలో గడాఫీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి వివిధ తెగలకు అందజేసిన ఆయుధాలు, డాలర్లు ఇప్పటికీ ఆ దేశాన్ని భగ్గున మండిస్తున్నాయి. ఇక సిరియాలో అల్ కాయిదాతో సంబంధ మున్న భిన్న వర్గాలకు సైతం అమెరికా నుంచి ఆయుధాలు, డబ్బు ప్రవాహంలా వచ్చాయి. ఐఎస్ మిలిటెంట్లు ఆ సంతతివారే. ఇలా అమె రికా వ్యూహం వికటించి మొత్తం పశ్చిమాసియాకే పెనుముప్పుగా మా రింది. ఇప్పుడు దీన్నుంచి కాపాడటానికంటూ ప్రారంభించిన తాజా వైమానిక దాడులు కూడా అందుకు భిన్నమైన ఫలితాలను తీసుకొచ్చే అవకాశం లేదు. ఈ దాడులు పూర్తిస్థాయి దురాక్రమణ యుద్ధంగా మా రడానికి ఎంతో కాలం పట్టదు. ఐఎస్ మిలిటెంట్లు అమెరికా దాడులకు ప్రధాన లక్ష్యంగా మారిన మరుక్షణంనుంచీ వారికి ఇస్లామిక్ ప్రపంచం నుంచి మద్దతు మరింత పెరుగుతుంది. అమెరికా జారవిడిచే బాం బులు ఎందరు మిలిటెంట్లను మట్టుబెడతాయో, ఆ పేరిట ఎందరు అమాయకులను పొట్టనబెట్టుకుంటాయో తెలియదుగానీ... మిలిటెంట్ల బలాన్ని మాత్రం రోజురోజుకూ పెంచుతాయి. పాదం మోపిన చోటల్లా మిలిటెన్సీకి ప్రాణం పోస్తూ, దాన్ని ఇంతకింతా పెంచుతున్న అమెరికా ఇప్పటికైనా తన తప్పిదాన్ని గ్రహించాలి. ఐఎస్ మిలిటెంట్ల వల్లో, మరొకరి వల్లో సమస్య తలెత్తితే దాన్ని పరిష్కరించడానికి ఐక్యరాజ్యస మితి వంటి అంతర్జాతీయ సంస్థలున్నాయని గ్రహించాలి. ఏ సమస్య నైనా ఆయా దేశాల్లోని ప్రజాస్వామిక శక్తుల చొరవకు, పరిష్కారానికి వదిలిపెట్టాలి. లేని పెద్దరికాన్ని నెత్తినెత్తుకుని ప్రపంచాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే చర్యలకు ఇకనైనా స్వస్తి పలకాలి.
మతిమాలిన చర్య!
Published Sun, Aug 10 2014 12:04 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement