ఖరీదైన పరిహారం! | very costly paying thing to atmosphere | Sakshi
Sakshi News home page

ఖరీదైన పరిహారం!

Published Sat, Jul 4 2015 12:20 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

very costly paying thing to atmosphere

అభివృద్ధి పేరిట దేన్నీ లెక్కచేయకుండా తీసే పరుగులు అపురూపమైన మన భూగోళానికి ముప్పు తెస్తున్నాయని పర్యావరణవాదులు ఎంతకాలంనుంచో ఆందోళనపడుతున్నారు. అయినా లాభార్జన తప్ప మరేమీ పట్టని సంపన్న దేశాలూ, బహుళజాతి సంస్థలూ తమ దోవన తాము పోతున్నాయి. ప్రమాదాలు ముంచుకొచ్చినా, పర్యావరణం విధ్వంసమవుతున్నా బడుగు దేశాలు నిస్సహాయ స్థితిలో పడుతున్నాయి. కానీ, అలాంటి ప్రమాదమే సంపన్న దేశం ముంగిట జరిగితే ఏమవుతుందో తాజాగా బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) సంస్థ అమెరికా ప్రభుత్వం తోనూ, ఆ దేశానికి చెందిన అయిదు రాష్ట్రాలతోనూ కుదుర్చుకున్న ఒప్పందం వెల్లడిస్తున్నది. బీపీ సంస్థ బ్రిటన్‌కు చెందిన ఓ పెద్ద బహుళజాతి సంస్థ.

ముడి చమురు వెలికితీత దాని ప్రధాన వ్యాపకం. మెక్సికో జలసంధిలో బీపీ ఆధ్వర్యంలోని చమురు క్షేత్రంలో 2010లో భారీ పేలుడు సంభవించి 11 మంది మరణించారు. లక్షలాది టన్నుల చమురు సముద్ర జలాల్లో కలిసింది. దాదాపు రెండునెలలపాటు సముద్ర గర్భంనుంచి భారీయెత్తున ముడి చమురు ఎగజిమ్మింది. చమురు తెట్టుపై నుంచి వీచే గాలులవల్ల వేలాది మంది అస్వస్థులయ్యారు. మెక్సికో జలసంధి పొడవునా ఉన్న అలబామా, ఫ్లారిడా, లూసియానా, మిసిసిపి, టెక్సాస్ రాష్ట్రాలు దెబ్బ తిన్నాయి. సాగరజలాల్లోని చేపలు, తిమింగలాలు, తాబేళ్లు, పక్షులు, వన్యమృగాలు మృత్యువాత పడ్డాయి. ఈ రాష్ట్రాలన్నీ ప్రధానంగా మత్స్యసంపద, టూరిజంపైనే ఆధారపడి ఉంటాయి. ఆ రెండింటిపైనా జీవనం సాగించే వేలాది కుటుంబాలు ఇబ్బందులకు లోనయ్యాయి. తినే తిండిలో సైతం దీని దుష్ఫలితాలు ప్రవేశించాయి.

 బీపీ సంస్థ తన బాధ్యతనుంచి తప్పించుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. చమురు తెట్టువల్ల జీవనోపాధి కోల్పోయామని, అస్వస్థులమయ్యామని ఫిర్యాదు చేస్తే... ఈ ప్రమాదాన్ని అవకాశంగా తీసుకుని తమను దోచుకోవడానికి వచ్చారన్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు వ్యవహరించారు. నష్టాన్ని తగ్గించి చూపడానికీ, వీలైతే తప్పించుకోవడానికీ ప్రయత్నించారు. పర్యావరణవాదులు, స్థానికుల ఒత్తిడి తర్వాత అమెరికా అధ్యక్షుడు ఒబామా చివరకు బీపీ సంస్థపై న్యాయపరంగా గట్టి పోరాటమే జరపాలని నిర్ణయానికొచ్చాక పరిస్థితి కొంత మారింది. న్యాయస్థానంలో హోరాహోరీ పోరాటమే సాగింది.

చివరకు కోర్టు వెలుపల ఒప్పందానికి సంస్థ ముందుకొచ్చింది. సముద్రంలో ఒలికిన చమురులో దాదాపు 75 శాతం పూర్తిగా మాయమైంది కదా... ఇక దానివల్ల కలిగే ముప్పేమిటని ఆ సంస్థకు వత్తాసుగా కొందరు ప్రశ్నించారు. కానీ, అదంతా వివిధ రూపాల్లో మనిషి శరీరంలోకి వచ్చి చేరిందని పర్యావరణవేత్తలు దీటుగా జవాబిచ్చారు. తినే తిండీ, పీల్చే గాలీ అన్నీ కలుషితమైన తీరును వివరించారు. ఖర్చును సాధ్యమైనంత తగ్గించుకుని, అధిక లాభాలు సంపాదించడానికి సంస్థలు చేసే ప్రయత్నాల వల్ల... ఆ క్రమంలో అవసరమైన టెక్నాలజీని వినియోగించకపోవడంవల్ల ఎప్పుడో ఒకప్పుడు ప్రమా దాలు చోటుచేసుకుంటాయి. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం చూసినా గత నాలుగు దశాబ్దాల్లో పర్యావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటు న్నాయి. ఈ మార్పులవల్ల జలచరాలు, ఉభయచరాలు, క్షీరదాలు, సరీసృపాలు మూడోవంతుకు పడిపోయాయని ఆ గణాంకాలు వివరిస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే మనిషి మనుగడకు సైతం ముప్పువాటిల్లుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి దానికదే విధ్వంసకారి కాదు. లాభార్జన యావ దానికి తోడైనప్పుడే అది వికృతరూపం దాల్చుతుంది.  

 ప్రస్తుతం కుదిరిన ఒప్పందాన్ని న్యాయస్థానం లాంఛనంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఒప్పందం కింద అమెరికా ప్రభుత్వానికీ, అయిదు రాష్ట్ర ప్రభుత్వాలకూ, 400పైగా స్థానిక సంస్థలకూ బీపీ సంస్థ 1870 కోట్ల డాలర్లు(సుమారుగా రూ. 1,20,000 కోట్లు) చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని 18 సంవత్సరాలపాటు చెల్లించేలా అంగీకారానికి కుదరడం బీపీ సంస్థకు వచ్చిన వెసులుబాటు. అంటే ఏడాదికి వంద కోట్ల డాలర్లు అది చెల్లించవలసి ఉంటుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆ సంస్థ గడించిన లాభాలు 260 కోట్ల డాలర్లని (సుమారు రూ.16,640 కోట్లు) గుర్తుపెట్టుకుంటే ఏడాదికి వంద కోట్ల డాలర్లు చెల్లించ డం దానికి పెద్ద లెక్క కాదు. వాస్తవానికి ఒలికిన ప్రతి బ్యారెల్ చమురుకూ 4,300 డాలర్లు (సుమారుగా రూ.2,75,000) చెల్లించాలని వాదనల సందర్భంగా అమెరికా ప్రభుత్వం కోరింది.     
 అమెరికా చరిత్రలో ఇంత భారీయెత్తున పరిహారం చెల్లించడం ఇదే ప్రథమమని చెబుతున్నారు. అమెరికా చరిత్రలోనే మొదటిసారంటే అది ప్రపంచంలోనూ మొదటి సారే అయి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు.

వేరే దేశాల్లో బహుళజాతి సంస్థలు ఏనాడూ ఇంత భారీ స్థాయిలో పరిహారాన్ని చెల్లించిన దాఖలాలు లేవు. మన భోపాల్ విషవాయు దుర్ఘటననే తీసుకుంటే బాధితులకు ఈనాటికీ పరిహారం రాలేదు. 1984లో డిసెంబర్ 2-3 తేదీలమధ్య అర్థరాత్రి మిథైల్ ఐసోసైనేట్ విషవాయువు టన్నులకొద్దీ లీకై వెనువెంటనే దాదాపు 3,000 మంది మరణించారు. అనంతర కాలంలో ఆస్పత్రుల్లో 25,000 మంది మరణించారు. అర్ధరాత్రివేళ జరిగిందేమిటో అర్థంకాక వేలాదిమంది హాహాకారాలు చేస్తూ వీధుల్లో పరుగులు తీశారు. తల్లులు కావలసిన ఎందరో గర్భస్రావాలతో ఆస్పత్రులపాలయ్యారు. లక్షల మంది వికలాంగులయ్యారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో జన్యుపరమైన లోపాలతో శిశువులు జన్మిస్తున్నారు. ఈ దుర్ఘటనలో తమ బాధ్యతేమీ లేదని అమెరికాలోని మాతృ సంస్థ వాదించింది. ఆ సంస్థకు అప్పట్లో చైర్మన్‌గా ఉన్న వారెన్ ఆండర్సన్‌ను అరెస్టు చేసినట్టే చేసి కొన్ని గంటల్లోనే విమానం ఎక్కించి దేశం నుంచి పంపేశారు. ఆ తర్వాత ఆచూకీ లేకుండాపోయాడు. అతన్ని అరెస్టుచేసి అప్పగించాలని అమెరికా ప్రభుత్వానికి మన దేశం పంపిన అభ్యర్థనలు బుట్టదాఖలయ్యాయి. సీబీఐ చేతులెత్తేసింది.

చివరకు నిరుడు నవంబర్‌లో అతను అజ్ఞాతంలోనే మరణించాడు. మూడు దశాబ్దాలు గడుస్తున్నా బాధితులకు దక్కిన పరిహారం శూన్యం. భోపాల్ విషవాయు దుర్ఘటననూ, మెక్సికో జలసంధి చమురుతెట్టు ప్రమాదాన్ని పోల్చిచూస్తే వర్థమాన దేశాల దైన్యం కళ్లకు కడుతుంది. బహుళజాతి సంస్థల దృష్టిలో ఇక్కడి పౌరుల ప్రాణాలు ఎంత విలువలేనివో అర్థమవుతుంది. బీపీ సంస్థ ఇప్పుడు అమెరికాకు చెల్లించే పరిహారాన్ని గమనించాకైనా మన పాలకుల్లో కదలిక రావాలి. భోపాల్ బాధితులకు న్యాయం జరగడానికి ఏం చేయదల్చుకున్నారో చెప్పాలి.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement