అమెరికా ఏకపక్షంగా ఇరాన్‌పై విధించిన ఆంక్షలు సోమవారం నుంచి మొదలయ్యాయి. తమ దేశంలో మధ్యంతర ఎన్నికల తేదీకి ఒక రోజు ముందు ఇవి అమల్లోకొచ్చేలా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కావాలనే ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు. ఇది మధ్యంతర ఎన్నికల్లో ఓటేయడానికొచ్చే వారిని ప్రభావితం చేసి తన బలాన్ని పెంచుతుందని ఆయన నమ్మిక. తమ దేశంపై అమెరికా ప్రారంభించిన ఈ ఆర్థిక యుద్ధానికి దీటైన జవాబివ్వడమెలాగో తెలుసునని ఇరాన్ ప్రకటించింది. గత ఆంక్షల సమయంలో అమెరికాతో కలిసి అడుగేసిన యూరప్ దేశాలు ఇప్పుడు దానితో విభేది స్తున్నాయి. 2015లో కుదిరిన ఒప్పందానికి కట్టుబడి తాము ఇరాన్‌తో లావాదేవీలు యధాతథంగా కొనసాగిస్తామని చెబుతున్నాయి. అయితే మున్ముందు అమెరికా ప్రతీకార చర్యలకు సిద్ధపడితే ఇవి ఏం చేస్తాయన్నది చూడాల్సి ఉంది. దీన్నంతటినీ అమెరికా పౌరులు ఎలా అర్ధం చేసుకుంటారన్న సంగతలా ఉంచి, అంతర్జాతీయంగా ఆ దేశం మాత్రం ఏకాకైంది. నిజానికి అంతర్జాతీయ ఒప్పందా లను బేఖాతరు చేసి, ఇష్టానుసారం ప్రవర్తించే దేశాలపై ఆంక్షలు అమలు కావాలి. కానీ ట్రంప్ దీన్ని తలకిందులు చేశారు.
తనకు ముందు పనిచేసిన అధ్యక్షుడు బరాక్ ఒబామా మరో అయిదు దేశా లను కలుపుకుని సుదీర్ఘ చర్చల అనంతరం ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకుంటే, రకరకాల సాకులతో దాన్నుంచి ఏకపక్షంగా వైదొలగి దేశానికి కొద్దో గొప్పో ఉండే విశ్వసనీయతను చేజేతులా ధ్వంసం చేశారు. అయితే తాను విధించిన ఆంక్షలు వెనువెంటనే అమలు కాకుండా ‘దయదల్చి’ 8 దేశాలకు ట్రంప్ మినహాయింపు ఇచ్చారు. అందులో మన దేశం కూడా ఉంది. ఇదంతా తాత్కాలి కమే. ఈ దేశాలు ఇరాన్‌నుంచి క్రమేపీ చమురు కొనడం తగ్గిస్తూ ఆరు నెలల వ్యవధిలో పూర్తిగా ఆపేయాలి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మన దేశం ఇరాన్ నుంచి 2.26 కోట్ల టన్నుల చమురు దిగుమతి చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీన్లో మూడోవంతు తగ్గించుకుంటానని అమె రికాకు మన దేశం హామీ ఇచ్చింది. మనతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఇతర చమురు ఉత్పత్తి దేశాల మాదిరిగా కాక మనకు ఇరాన్ 60 రోజుల క్రెడిట్ సదుపాయం కల్పిస్తోంది.
నిజానికి ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందానికి బోలెడు నేపథ్యం ఉంది. దశాబ్దాల తరబడి కొనసాగించిన ఆంక్షల పర్యవసానంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడటం వాస్తవమే అయినా... దానితో సమానంగా తాను, యూరప్ దేశాలు సైతం తీవ్రంగా నష్టపోతున్నామని అమె రికా గ్రహించింది. ఈ ఆంక్షలు ఇరాన్ అణ్వాయుధ శక్తిగా ఎదిగేందుకు అవరోధం కాలేకపోయా యని, అది రూపొందిస్తున్న బాలిస్టిక్ క్షిపణులకు అణ్వస్త్రాన్ని మోసుకుపోగల సత్తా ఉన్నదని తేటతెల్లమైంది. దాంతో విధి లేక ఇరాన్‌ను అక్కడితో నిలువరించడానికి సిద్ధపడింది. ఆ దేశంతో చర్చలు జరపడానికి అందరినీ ఒప్పించింది. ఏడెనిమిది నెలలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాక, ఈ చర్చల నుంచి తప్పుకుంటానని పలుమార్లు ఇరాన్ హెచ్చరించాక తప్పనిసరి పరిస్థితుల్లో పట్టు విడుపులు ప్రదర్శించి, ఆ దేశం అభివృద్ధి సాధించడానికి దోహదపడతామని హామీ ఇచ్చి ఈ దేశాలు ఇరాన్‌ను తమ దోవకు తెచ్చుకున్నాయి. చర్చల సమయంలో ఇరాన్ ఒకసారి అణ్వాయుధా లను మోసుకుపోగల సత్తా ఉన్న బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడంతో అమెరికా, యూరప్ దేశాలు బెంబేలెత్తాయి. అయితే అవి సంయమనం ప్రదర్శించి ఇరాన్‌ను ఒప్పించాయి. తన అణు కేంద్రాల తనిఖీకి ఆ దేశం అంగీకరించింది. దానికి అనుగుణంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) ఇరాన్ అణు కేంద్రాల్లో అణువణువూ గాలించి అంతా సవ్యంగా ఉన్నదని తేల్చి చెప్పాక ఒప్పందం సాకారమైంది.
ట్రంప్ దీన్నంతటినీ ఒక్క వేటుతో తెగనరికారు. గత మే నెలలో ఒప్పందం నుంచి తప్పుకుం టున్నట్టు ఏకపక్షంగా ప్రకటించారు. తనతో కలిసి నడిచేందుకు నిరాకరించిన యూరప్ దేశాలు కాలక్రమంలో వైఖరి మార్చుకుంటాయని... అనంతరం ఇరాన్ పాదాక్రాంతమవుతుందని, ఒప్పం దాన్ని సవరించడానికి అంగీకరిస్తుందని ఆయన అంచనా. అయితే అదంత సులభం కాదు. ఆ దేశం నాలుగు దశాబ్దాల సుదీర్ఘకాలం అమెరికా విధించిన ఆంక్షల్ని చవిచూసింది. 2010లో వీటికి అద నంగా వచ్చిచేరిన ఐక్యరాజ్యసమితి ఆంక్షలతో అది మరింత సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంది. ఆంక్షల పేరుచెప్పి ఔషధాలు, వైద్య పరికరాలపై సైతం నిషేధం పెట్టడంతో లక్షలమంది పిల్లలు, వృద్ధులు, ప్రాణాంతక రోగాల బారినపడినవారు మెరుగైన వైద్యం అందక, ఔషధాలు దొరక్క కన్నుమూశారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి అవసరమైన ఉత్పత్తుల్ని, ముడి సరు కుల్ని పొందడానికి ఏఏ మార్గాలు అనుసరించాలో ఇరాన్ అప్పడు బాగా గ్రహించింది. అంతర్జాతీ యంగా సాగే అనుమానాస్పద బ్యాంకు లావాదేవీల్ని పసిగట్టి అందులో పాలుపంచుకున్న సంస్థల్ని, దేశాల్ని అమెరికా ఎప్పటికప్పుడు బెదిరించినా ఇవి ఆగలేదు.
ఇరాన్ తన మౌలిక అవసరాలకు దేశంలోని చమురు ఉత్పత్తుల్ని, బంగారాన్ని వినియోగించుకుంది. వ్యాపార లావాదేవీలు నిర్వ హించే దేశానికి చెందిన స్థానిక కరెన్సీలో తనకు చెల్లింపులుండేలా చూసుకుంది. ఆ కరెన్సీ నిల్వను మరోచోట వినియోగించుకుంది. అయితే ఇరాన్ పౌరులు మరోసారి సంక్షోభంలో చిక్కు కుంటార నడంలో సందేహం లేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆన్‌లైన్ నిఘా బాగా పెరిగింది. మానవతా దృక్పథం కింద ఆహారం, ఔషధాలు వగైరా వాణిజ్యానికి ఆటంకాలుండవని చెబుతున్నా, బ్యాంకు లపై ఉన్న నిషేధాల కారణంగా వాటి ధరలు అమాంతం పెరుగుతాయి. ఇరాన్ ఎక్కడ తిరుగులేని శక్తిగా మారి ముప్పు కలిస్తుందోనని హడలెత్తుతున్న దాని ఇరుగుపొరుగు దేశాలు బహ్రెయిన్, ఈజిప్టు, సౌదీ అరేబియాలు ఈ ఆంక్షలతో సంబరపడుతున్నాయి. అయితే మన దేశం మాత్రం ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాలి. కీలకసమయాల్లో మనకు అండగా నిలి చిన ఇరాన్‌తో బంధం సడలకుండా దౌత్యపరంగా, రాజకీయపరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలి.
ఇరాన్‌కు మళ్లీ కష్టకాలం
Published Wed, Nov 7 2018 12:25 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment