సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఇరాన్‌లోని మూడు ప్రాంతాలపై దాడులకు ఆదేశించానని, ఇంకో పదినిమిషాల్లో దాడులు జరుగుతాయనంగా ఉత్తర్వులను ఉపసంహరించుకున్నానని, ఆ దాడుల్లో 150 మందిదాక మరణించే అవకాశం ఉండిదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతర్జాతీయ జలాల్లో గత గురువారం నాడు అమెరికాకు చెందిన పైలట్ రహిత డ్రోన్ విమానాన్ని కూల్చినందుకు ప్రతీకారంగా ఇరాన్ ప్రాంతాలపై ఆయుధాలను ఎక్కుపెట్టామని ట్రంప్ స్వయంగా ట్వీట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇరు దేశాల మధ్య కవ్వింపు చర్యలు కొనసాగాయి. అమెరికా 15 ఏళ్ల క్రితం ఇరాక్‌తో యుద్ధం చేయడం ద్వారా చేసిన చారిత్రిక తప్పిదనానికి మళ్లీ పాల్పడుతుందా? అబద్ధపు ఆరోపణలతో మరోసారి యుద్ధం చేస్తుందా? అంటూ ప్రపంచ దేశాలు ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇరు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా వెలువడుతున్న ప్రకటనలను చూస్తుంటే పరిమిత యుద్ధమైన జరుగుతుందని ప్రపంచ దేశాలు భావించాయి. ఒమన్‌లోని రెండు చమురు బావులపై ఇరాన్ దాడులు చేసిందని అమెరికా జూన్ 13వ తేదీన ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. గురువారం నాడు అమెరికాకు చెందిన పైలట్‌రహిత గూఢచారి విమానాన్ని ఇరాన్ భద్రతా దళాలు కూల్చివేయడంతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. తమ గగనతలంలోకి ప్రవేశించినందునే తాము కూల్చివేశామని ఇరాన్ సైనిక వర్గాలు ప్రకటించాయి. అది తప్పని అంతర్జాతీయ జలాలపై ఎగురుతున్న డ్రోన్‌ను పేల్చివేశారని ట్రంప్ వాదిస్తున్నారు.
యుద్ధాన్ని ఎవరు కోరుకుంటున్నారు?
మీడియాలో వచ్చిన వార్తా కథనాల ప్రకారం ప్రాథమికంగా ట్రంప్ పార్టీలోని రిపబ్లికన్లు, ఆయన అధికార యంత్రంగంలోని కొంత మంది, ఆయన భద్రతా సలహాదారు జాన్ బోల్టన్, ఆయన భద్రతా సిబ్బంది మొత్తం, విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఇరాన్‌తో యుద్ధాన్ని కోరుకున్నారు. అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టి తనకు సానుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది ట్రంప్ ముఖ్య ఉద్దేశం. 2003లో ఇరాక్‌పై అమెరికా యుద్ధం చేయడానికి జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌యే కారణం. ఇరాక్ వద్ద న్యూక్లియర్ ఆయుధాలున్నాయని, వాటివల్ల ప్రపంచానికే ముప్పుందంటూ బోల్టన్ ప్రచారం చేశారు. అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ బుకాయించారు. ఇరాన్‌లో ప్రభుత్వం మారితే అమెరికాకు అన్ని సమస్యలు తీరిపోతాయని ఆయన భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని కోరుకుంటున్న ఇజ్రాయెల్, సౌదీ అరేబియా దేశాలు కూడా ఇరాన్‌పై అమెరికా యుద్ధాన్ని కోరుకుంటున్నాయి.
2003లో ఇరాక్‌తో యుద్ధం చేయడానికి అమెరికా దౌత్య వర్గాలు 40 దేశాల మద్దతును కూడగట్టాయి. అమెరికా యుద్ధానంతర పరిణామాలను చూశాక ఆ దేశాలు కూడా అమెరికా యుద్ధాన్ని సమర్థించలేకపోయాయి. మధ్యప్రాచ్యంలో మరో యుద్ధమంటే ఏ దేశమైన సాహసించలేని పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ట్రంప్ కూడా యుద్ధానికి వ్యతిరేకే. ఆయన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇరాక్‌తో యుద్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచం తరఫున అమెరికా ఇంకెంత మాత్రం పోలీసు పాత్రను నిర్వహించదని కూడా ఆయన స్పష్టం చేశారు. తనను ఎక్కడ ప్రజలు బలహీనుడని అనుకుంటారనే ఆందోళనతోనే ఆయన ఇరాన్‌తో పరిమిత దాడులకు సిద్ధపడి ఉంటారని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.
యుద్ధ మేఘాలకు ఎవరు బాధ్యులు?
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కృషి, అంతకుముందు నుంచి ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న చర్చల ఫలితంగా ఇరాన్ అణ్వస్త్రాలను తగ్గించుకుంటానంటూ అమెరికా, రష్యా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా దేశాలతో ఒప్పందానికి వచ్చింది. దాంతో ఇరాన్‌పై ఆంక్షలను ఆయా దేశాలు తొలగించాయి. ట్రంప్ అధికారంలోకి రాగానే ఒప్పందం నుంచి అమెరికాను బయటకులాగి తిరిగి ఇరాన్‌పై ఆంక్షలు విధించారు. దాంతో ఆగ్రహించిన ఇరాన్ మళ్లీ అణ్వస్త్రాలను తయారు చేస్తానంటూ హెచ్చరికలు చేసింది. ఆంక్షలను తొలగిస్తే ఇప్పటికీ ఒప్పందానికి కట్టుబడి ఉంటానని చెబుతూ వస్తోంది. అమెరికా యుద్ధం చేసినప్పుడు ఇరాక్ బలహీనంగా ఉంది. అప్పటి ఇరాక్ కన్నా ఇప్పుడు ఇరాన్ ఎన్నో రెట్లు రాజకీయంగాను, సైనికంగానూ బలంగా ఉంది.
భారత్‌కు వచ్చే నష్టం ఏమిటీ?
అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల వల్ల భారత్ ఇప్పటికే ఎంతో నష్టపోయింది. ఒకప్పుడు ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకున్న అతిపెద్ద దేశం భారత్. అమెరికా ఆంక్షల కారణంగా దిగుమతులను తగ్గించుకుంటూ వచ్చింది. ఆ మేరకు దాని ఇరుగు, పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. యుద్ధమే కనుక వస్తే తన భూభాగం నుంచి భారత్‌కు దిగుమతులను ఇరాన్ అనుమతించదు. పైగా అరేబియా ద్వీపకల్పంలో 70 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. కువైట్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ, ఒమన్‌లలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఆ కారణంగా ఇరాన్ సైనిక దళాలు వాటిపై దాడులకు పాల్పడితే ఆయా దేశాల్లో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులకు ముప్పు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment