మానవాళికి మరో సవాలు
ప్రపంచం ఆరోగ్యపరమైన మరో కొత్త సవాలును ఎదుర్కొంటోంది. ఎబోలా భయం నుంచి కోలుకుంటున్న ప్రపంచానికి జికా వైరస్ కలవరం కలిగిస్తోంది. జికా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తీవ్ర అంతర్జాతీయ విపత్తుగా పరిగణించి ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వ్యాధి ప్రబలిన లాటిన్ అమెరికన్ దేశాలకు ప్రయాణాలను మానుకోవాలని సూచించింది.
2013-15 మధ్య ఎబోలా వైరస్ కోరలకు చిక్కి పశ్చిమ ఆఫ్రికాలో పదకొండు వేల మందికి పైగా మృత్యువు వాతబడ్డారు. జికా అలాంటి ప్రాణాంతక వైరస్ కాదు. పైగా దోమల ద్వారా సోకేది. ఆ వైరస్ సోకిన వారిలో 80 శాతానికి వ్యాధి లక్షణాలే కనిపించవు. మిగతా వారిలో సైతం ఈ వైరస్ కొద్దిపాటి జ్వరం వంటి నిరపాయకరమైన లక్షణాలకే పరిమిత మవుతుంది.
ఆ వైరస్ సోకిన తల్లుల నుంచి గర్భస్త, నవజాత శిశువులకు మైక్రోసఫలీ అనే చికిత్సలేని నాడీసంబంధమైన రుగ్మత కలుగుతుందనే అనుమా నాలు బలంగా ఉన్నాయి. ఈ వైకల్యం వల్ల బిడ్డ తల చాలా చిన్నదిగా, విరూపమై ఉంటుంది. అలాంటి బిడ్డల భవితవ్యం ఏమిటో వైద్యులూ చెప్పలేరు.
మంద బుద్ధులు కావడం నుంచి చక్రాల కుర్చీకో, మంచానికో అంటిపెట్టుకుని గడపాల్సి రావడం వరకు వివిధ స్థాయిలలో నాడీమండల సంబంధ వైకల్యానికి గురి కావచ్చు. తల్లిదండ్రుల పాలిట పీడకలలాంటి మైక్రోసఫలీ కొత్తదేమీ కాదు. ఒక్క అమెరికాలోనే ఏటా 25,000 మైక్రోసఫలీ కేసులు నమోదవుతున్నాయి. ఇంత వరకు అంతుబట్టనిదిగా ఉన్న ఆ రుగ్మతకు కారణం జికా వైరస్ కావచ్చని ఇప్పుడు భావిస్తున్నారు.
గత ఏడాది మేలో బ్రెజిల్‌లో జికా వైరస్ ప్రబలినప్పటి నుంచి ఈ అనుమానాలు బలపడుతూ వస్తున్నాయే తప్ప ఇదమిత్థంగా నిర్ధారణ కాలేదు. ఆ కారణ ంగానే జికా సమస్యను భూతద్దాలలో చూపుతున్నారనే విమర్శలూ వినవస్తున్నాయి. ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్ ప్రబలే ముప్పు గురించి ఎంతో సమాచారం ముందుగానే పోగుపడి ఉన్నా, ఆ వ్యాధి విరుచు కుపడే వరకు పట్టించుకోని డబ్ల్యూహెచ్‌ఓ వంటి అంతర్జాతీయ సంస్థలు జికా వైరస్ గురించి అనవసర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయని వారి వాదన.
ఏది ఏమైనా ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే వ్యాధులను, ప్రత్యేకించి సంక్రమిత వ్యాధులను... అవి ఎంత హానికరమైనవనే దానితో నిమిత్తం లేకుండానే ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సమాజం అత్యుత్తమంగా సంసిద్ధం కావడ మెలాగనేదే అసలు సమస్య. మైక్రోసఫలీకి జికా కారణమనే భయం నిజమని తేలితే, ఆ వ్యాధి నిరోధక శక్తిని కలిగించే వాక్సిన్‌లను కనిపెట్టడం, అందరికీ అందుబాటులోకి తేవడమే శాశ్వత పరిష్కారం కావచ్చు.
కాని అందుకు సమయం పడుతుంది. అయితే జికా వైరస్ మనుషులకు సోకేది మాత్రం దోమల ద్వారానే. కాబట్టి ఇప్పటికైతే దోమలను నిర్మూలించడమే జికా వైరస్‌ను అరికట్టడానికి ఉన్న మార్గం. దోమల ద్వారా మనిషికి సంక్రమించిన జికా వైరస్ లైంగిక సంబంధం ద్వారా భాగస్వామికి కూడా సోకవచ్చని టెక్సాస్ పరిశోధకులు అంటున్నారు. అది రూఢి అయితే జికా సమస్య మరింత సంక్లిష్టంగా మారుతుంది.
హెచ్‌ఐవీ వైరస్ వ్యాప్తిని అదుపుచేయగలిగినా, పూర్తిగా నిర్మూలించలేకపోయాం. ప్రత్యేకించి మన దేశం వంటి అభివృద్ధిచెందుతున్న దేశాలలో ఆ వైరస్ ఇంకా ముఖ్య సమస్యగానే ఉంది. జికా అప్పుడు హెచ్‌ఐవీకి తోడు మరో పీడగా మారుతుంది. దోమలను నిర్మూలించిన అమెరికాలాంటి అభివృద్ధిచెందిన దేశాలకు కూడా జికా వైరస్ నుంచి పూర్తి రక్షణ ఉండదు.
జికా వైరస్‌ను వ్యాప్తి చేసే ఎడీజ్ ఎజిప్టీ దోమ సహా అన్ని రకాల దోమల వ్యాప్తికి, వాటితో పాటూ వ్యాధులు ప్రబలడానికి వేడి, తేమ పరిస్థితులు అనువైనవి. నేటి ప్రపంచీకరణ శకంలో వ్యాధులు కూడా ఖండఖండాంతరాలకు అతివేగంగా వ్యాపిస్తున్నాయి. లాటిన్ అమెరికా దేశాలకు ప్రయాణాలను మానుకోవడం జికా వైరస్ వ్యాప్తికి తాత్కాలిక నివారణేగానీ పరిష్కారం కాదు. ప్రపంచీకరణ ఫలితంగా కిక్కిరిసిన నగరాలు, మురికివాడలు అతి వేగంగా పెరిగి పోతున్నాయి. పట్టణీకరణ అంటేనే దట్టమైన పురాతన అరణ్యాలు అంతరించి పోవడంగా మారింది.
మారుమూల అటవీ ప్రాంతాలకు పరిమితమైన ప్రమా దకర వ్యాధి కారక వైరస్‌లు అక్కడి వృక్ష, జంతు జాతులతో పాటూ అంతరించి పోయేవి కావు. జనారణ్యాలు వాటి కొత్త ఆవాసాలవుతాయి. అడవులలో కంటే మరింత వేగంగా వృద్ధి చె ందే అనుకూల పరిస్థితులను కల్పిస్తాయి. హెచ్‌ఐవీ, డెంగ్యూ, చికెన్‌గున్యా, ఎబోలా అలా కొత్తవిగా మానవాళిని చుట్టుకుంటున్న పాత వైరస్‌లే. జికా వైరస్ కూడా ఉగాండాలోని జికా అడవులలో పరిశోధకులకు మొదట కనిపించిన వైరసే.
ప్రపంచీకరణ వల్ల భూతాపం అసాధారణంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతు న్నాయి. పట్టణీకరణతోపాటూ మురికివాడల విస్తరణ అనివార్యంగా మారింది. దీంతో కొత్త వ్యాధులు వృద్ధి చెందడానికి కావలసిన పరిస్థితులు పెంపొందు తున్నాయి. ప్రపంచ స్థాయిలో ఎప్పటికప్పుడు ఆరోగ్యపరమైన కొత్త సవాళ్లను ఎదుర్కోవడం అనివార్యంగా మారుతోంది. ఎబోలా, జికా వంటి వైరస్‌లు మానవ సృష్టి కాదు.
అనర్థదాయకమైన పురాతన హరిత వనాల హననం, హేతువిరుద్ధమైన పట్టణీకరణ, వాతావరణ మార్పుల వంటి మానవ తప్పిదాల వల్లనే అవి ప్రపంచ సమస్యలుగా మారుతున్నాయనే గుర్తింపు అవసరం. కొత్త, పాత వ్యాధుల నివారణ , చికిత్స, శిక్షణ, అత్యవసర సహాయక వ్యవస్థలను అంతర్జాతీయస్థాయిలో శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటు చేయడం ఆవశ్యకం. అంతర్జాతీయ సమాజానికి నేతృత్వం వహిస్తున్న అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు ఆ బాధ్యతను స్వీకరించాలి.