హేగ్‌లో మూడో అణుభద్రత సదస్సు | 3rd Nuclear Security Summit The Hague | Sakshi
Sakshi News home page

హేగ్‌లో మూడో అణుభద్రత సదస్సు

Published Wed, Dec 31 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

3rd Nuclear Security Summit The Hague

-    జనవరి 1న లాత్వియా యూరోను తన దేశ ఆధికారిక కరెన్సీగా స్వీకరించింది. ఉత్తర ఐరోపాలోని బాల్టిక్ ప్రాంతంలో రిపబ్లిక్ ఆఫ్ లాత్వియా ఉంది. దీని విస్తీర్ణం 64,589 చ.కి.మీ.
 
 -    బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా (అవామీలీగ్ పార్టీ) జనవరి 12న ప్రమాణ స్వీకారం చేశారు. హసీనా ప్రధాని పదవిని చేపట్టడం ఇది వరుసగా రెండోసారి, మొత్తం మీద మూడోసారి.
 
 -    నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ కొయిరాలా(75) ఆ దేశ ప్రధాన మంత్రిగా ఫిబ్రవరి 10న ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఆయనకు మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మెజార్టీ లభించింది. 2008లో నేపాల్‌లో రాజరికం రద్దయ్యాక సుశీల్ కొయిరాలా ఆరో ప్రధానమంత్రి.
 
 -    ఇటలీ ప్రధానమంత్రిగా మటెనోరెంజీ ఫిబ్రవరి 22న ప్రమాణ స్వీకారం చేశారు. 39 ఏళ్ల రెంజీ ఇటలీకి అత్యంత పిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. రెంజీ గతంలో ఫ్లోరెన్‌‌స గవర్నర్‌గా పనిచేశారు.
 
 -    మయన్మార్ రాజధాని నేపితాలో మూడో బిమ్స్‌టెక్ సదస్సు మార్చి 4న ముగిసింది. ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలు, మాదక ద్రవ్యాల రవాణాపై ఉమ్మడిగా పోరాటం జరపాలని ఏడు దేశాల బిమ్స్‌టెక్ కూటమి నేతలు అంగీకరించారు. బిమ్స్‌టెక్ తొలి సెక్రటరీ జనరల్‌గా శ్రీలంకకు చెందిన సుమిత్ నకందల నియమితులయ్యారు. కూటమిలో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్, నేపాల్ సభ్యదేశాలుగా ఉన్నాయి.
 
 -    రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం విషయంలో భారత్ ప్రపంచంలో 73వ స్థానంలో నిలిచింది. ‘ద ఉమెన్స్ ఇన్ పాలిటిక్స్ మ్యాప్-2014’ అనే పేరుతో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ), యూఎన్ ఉమెన్ సంస్థలు మార్చి 16న విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మహిళల భాగస్వామ్యం విషయంలో నికరాగువా మొదటి స్థానంలో నిలిచింది.
 
 -    క్రిమియా.. ఉక్రెయిన్ నుంచి మార్చి 17న స్వాతంత్య్రం ప్రకటించుకుంది. రష్యాలో క్రిమియాను విలీనం చేసే ఒప్పందంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మార్చి 18న సంతకం చేశారు. దీంతో రష్యా సమాఖ్యలో క్రిమియా చేరినట్లయింది.
 
 -    ఇంగ్లిష్ భాషలో అత్యధికంగా వాడుకలో ఉన్న పదం ఓకే (OK)కి 175 వసంతాలు పూర్తయ్యాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ గల నాటి పత్రిక ద బోస్టన్ మార్నింగ్ పోస్ట్‌లో ఓకే పదం తొలిసారిగా 1839, మార్చి 23న ప్రచురితమైంది.
 
 -    మూడో అణుభద్రత సదస్సు (న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్) నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో మార్చి 24-25 తేదీల్లో జరిగింది. 58 దేశాలకు చెందిన నేతలు ఇందులో పాల్గొన్నారు. అణు భద్రతను పటిష్టం చేయడం, అణు ఉగ్రవాద ముప్పును తగ్గించడం, 2010 వాషింగ్టన్ సదస్సు తర్వాత సాధించిన పురోగతిపై ప్రధానంగా చర్చించారు. మొదటి అణు భద్రత సదస్సు (2010) వాషింగ్టన్‌లో, రెండో సదస్సు (2012) సియోల్‌లో జరిగాయి. నాలుగో సదస్సు 2016లో అమెరికాలో జరగనుంది.
 
 -    భారత్ నుంచి దిగుమతి అయ్యే ఆల్ఫోన్సో రకం
 మామిడి కాయలపై ఐరోపా యూనియన్ దేశాలు ఏప్రిల్ 28న తాత్కాలిక నిషేధం విధించాయి. వంకాయ, చేమ, కాకర, దోసకాయలపై కూడా ఈ నిషేధం ఉంటుంది. 2013లో భారత్ నుంచి దిగుమతైన పండ్లు, కూరగాయల్లో హానికర కీటకాలు ఉన్నట్లు గుర్తించడంతో యూరోపియన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
 
 -    ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికలలో మాజీ సైన్యాధిపతి అబ్దుల్ ఫతా అల్ సిసీ (59) ఘన విజయం సాధించారు. మే 29న ప్రకటించిన ఎన్నికల ఫలితాలలో ఆయనకు 96 శాతం ఓట్లు రాగా ప్రత్యర్థి హమ్ దీన్ నబ్బాహీకి 4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
 
 -    జీ-7 సదస్సు జూన్ 4,5 తేదీల్లో బ్రస్సెల్స్‌లో జరిగింది. ఇందులో కెనడా,ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునెటైడ్ కింగ్‌డమ్, అమెరికా దేశాల నాయకులతోపాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఉక్రెయిన్ సంక్షోభం, రష్యా ప్రతిస్పందనపై ప్రధానంగా దృష్టి సారించారు.
 
-    స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ 2013 సంవత్సరపు అధికారిక గణాంకాలను జూన్ 22న విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో అక్రమంగా నిల్వ ఉన్న సంపద గల దేశాల జాబితాలో భారత్ 58వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో 20 శాతం వాటాతో యునెటైడ్ కింగ్‌డమ్, తరువాత స్థానాల్లో అమెరికా, వెస్టిండీస్, జర్మనీ ఉన్నాయి.
 
 -    భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్ పర్యటనలో సెప్టెంబర్ 1న ఆ దేశ ప్రధాని షింజో అబేతో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య రక్షణ, కాలుష్య రహిత ఇంధనం, రహదారుల నిర్మాణం, ఆరోగ్యం, మహిళా సంక్షేమ రంగాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి.
 
 -    భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 15, 16 తేదీల్లో భూటాన్‌లో పర్యటించారు. ప్రధానమంత్రి ఇరు దేశాల సంబంధాలను‘బీ4బీ’(భూటాన్ కోసం భారత్, భారత్ కోసం భూటాన్)గా ఆయన అభివర్ణించారు.
 
 -    థాయ్‌లాండ్ సైనికాధిపతి ప్రయూత్ చాన్-ఓచా ఆగస్టు 21న ఆ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. 197 మంది సభ్యులున్న నేషనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 191 మంది మద్దతు ఆయనకు లభించింది.
 
-    ప్రపంచ జల రవాణా చరిత్రలో కీలక మైలురాయిగా భావించే పనామా కాలువ ఆగస్టు 15 నాటికి వందేళ్లు పూర్తిచేసుకుంది. 1914, ఆగస్టు 15న ఈ కాలువను అట్లాంటిక్- పసిఫిక్ మహా సముద్రాలను కలుపుతూ ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య ఉన్న పనామా దేశంలో నిర్మించారు. దీని ద్వారా అమెరికా పశ్చిమ తీరానికి, ఐరోపా తీరానికి మధ్య వేల మైళ్ల దూరం తగ్గింది.
 
 -    స్కాట్లాండ్‌లో నిర్వహించిన రెఫరెండమ్‌లో గ్రేట్ బ్రిటన్ నుంచి విడిపోయేందుకు ప్రజలు తిరస్కరించారు. సెప్టెంబర్ 18న నిర్వహించిన రెఫరెండంలో 55.3 శాతం మంది స్కాట్లాండ్ వాసులు బ్రిటన్‌తో కలిసి ఉండేందుకు ఓటు వేశారు. 44.7 శాతం మంది స్వతంత్రంగా ఉండేందుకు మొగ్గు చూపారు.
 
 -    న్యూజిలాండ్ ప్రధానిగా జాన్‌కీ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆయనకు చెందిన నేషనల్ పార్టీ 121 స్థానాలకు గాను 61 సీట్లను గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం లేబర్‌పార్టీ రెండో స్థానంలో నిలిచింది.
 
 -    ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27న ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాడాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. భద్రతామండలిని 2015 నాటికి ప్రజాస్వామ్యయుతంగా, ప్రాతినిధ్య వేదికలా మార్చేందుకు సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
 
-    అఫ్గానిస్థాన్‌లోని బమియాన్ పట్టణాన్ని 2015 సార్క్ సాం స్కృతిక రాజధానిగా సెప్టెంబర్ 25న న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో సార్క్ సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. 2016-17 సంవత్సరానికి ఢాకాను సాంస్కృతిక రాజధానిగా ప్రకటించారు. 2016-17ను సార్క్ సాంస్కృతిక వారసత్వ సంవత్సరంగా సదస్సు నిర్ణయించింది.
 
 -    పాలస్తీనా ప్రాంతాన్ని అధికారికంగా గుర్తించిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా స్వీడన్ నిలిచింది. ఇప్పటివరకు 130 ఇతర దేశాలు పాలస్తీనాను అధికారికంగా గుర్తించాయి.
 
 -    చారిత్రక బెర్లిన్ గోడ కూల్చివేత ఘట్టానికి పాతికేళ్లు నిండాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కమ్యూనిస్టుల పాలనలోని నాటి తూర్పు జర్మనీ ప్రభుత్వం 1961లో దీన్ని నిర్మించింది. ఆ తర్వాత 1989 నవంబరు 9న తూర్పు జర్మనీ ప్రభుత్వం పశ్చిమ జర్మనీ వెళ్లేందుకు తమ పౌరులను అనుమతించింది. దీంతో ఆ రోజున వేలమంది జర్మన్లు బెర్లిన్ గోడను కూల్చేశారు. ఆ పరిణామమే జర్మనీ ఏకీకరణకు దారితీసింది.
 
 -    చైనా రాజధాని బీజింగ్‌లో 22వ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార(అపెక్) సదస్సు నవంబరు 11-12 తేదీల్లో జరిగింది. ఆసియా పసిఫిక్ బాగస్వామ్యంతో భవిష్యత్ ఆవిష్కరణ అనేది సదస్సు ఇతివృత్తం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రతిపాదించిన స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం ఏర్పాటుకు సభ్యదేశాలు అంగీకరించాయి. భారత్ ఇందులో సభ్యదేశం కాదు. 2015 అపెక్ సదస్సు ఫిలిప్పైన్స్‌లో జరగనుంది.
 
 -    నవంబరు 15-16 తేదీల్లో జరిగిన తొమ్మిదో జీ-20 సదస్సుకు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ వేదికైంది. సభ్య దేశాలు వచ్చే ఐదేళ్లలో 2.1 లేదా అంతకంటే ఎక్కువ వృద్ధిని ఉమ్మడిగా, వేర్వేరుగా సాధించేందుకు తీర్మానించాయి. భారతీయులు విదేశాల్లో అక్రమంగా దాచిన నల్లధనాన్ని తిరిగి తెప్పించేందుకు ప్రపంచ దేశాలు సహకరించాలని సదస్సులో ప్రధాని మోదీ కోరారు. బ్రిస్బేన్‌లోని రోమా వీధిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. పదో జీ-20 సదస్సు (2015) టర్కీలో జరగనుంది.
 
 -    ఆసియాన్ 25వ సదస్సు నవంబరు 12న మయన్మార్‌లోని నేపితాలో జరిగింది. ‘శాంతి యుత, సౌభాగ్య వంతమైన సమాజం కోసం ఐక్యతతో ముందుకు’ అనే ఇతివృత్తంతో సదస్సు సాగింది. మయన్మార్ అధ్యక్షుడు థీన్‌సేన్ దీనికి అధ్యక్షత వహించారు. ఇందులో పాల్గొన్న భారత ప్రధాని మోదీ భారత ఆర్థిక ప్రగతిలో ఆగ్నేయాసియా దేశాలు భాగస్వాములు కావాలని కోరారు.
 
 -    ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నవంబరు 18న ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఓ భారత ప్రధాని ప్రసంగించడం ఇదే తొలిసారి. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంతోపాటు ఉగ్రవాదంపై ప్రసంగించారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌తో చర్చలు జరిపారు. నవంబరు 19న ఫిజీ దేశంలో మోదీ పర్యటించారు.
 
 -    స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో నాలుగో స్మార్ట్‌సిటీ ప్రపంచ సదస్సు జరిగింది. దీన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. వచ్చే 20 ఏళ్లలో భారత పట్టణ రంగంలో సుమారు 8.64 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముందని వెంకయ్య నాయుడు అన్నారు.
 
 -    దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) 18వ సదస్సు నేపాల్ రాజధాని ఖాట్మండులో నవంబరు 26-27 తేదీల్లో జరిగింది. ఉమ్మడి, ఆర్థిక ద్రవ్య వ్యవస్థగా సౌత్ ఆసియా ఎకనమిక్ యూనియన్ ఏర్పాటుతో పాటు, సార్క్ అభివృద్ధి నిధిని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు సదస్సు ప్రకటించింది.
 19వ సదస్సు పాకిస్తాన్‌లో జరగనుంది.
 
 -    భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, రష్యా దేశాల కూటమి (బ్రిక్స్) ఆరో సదస్సు బ్రెజిల్‌లోని ఫోర్టలెజాలో జూలై 15-16 తేదీల్లో జరిగింది. సమ్మిళిత వృద్ధి, సుస్థిర పరిష్కారాలు అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించారు. సదస్సు అనంతరం 72 అంశాలతో ఫోర్టలెజా నివేదికను వెల్లడించారు. ఇందులో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ పేరుతో బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటును ప్రకటించారు. 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసే ఈ బ్యాంక్ షాంఘై (చైనా) ప్రధాన కేంద్రంగా పని చేస్తుంది. ఈ బ్యాంక్‌కు తొలుత భారత్ అధ్యక్షత వహిస్తుంది. 2015లో జరిగే ఏడో సదస్సుకు రష్యాలోని ఊఫా నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.
 
 -    ఆయుధ వాణిజ్య ఒప్పందం (ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ-ఏటీటీ).. డిసెంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం ఆయుధ వ్యాపారం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా కొనసాగాలి. ఈ ఒప్పందంపై 130 దేశాలు సంతకం చేశాయి.
 
 -    ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన మలేసియాకు చెందిన ఎయిర్‌ఆసియా క్యూజెడ్ 8501 ఎయిర్‌బస్ డిసెంబర్ 27న గల్లంతైంది. ఇందులో 162 మంది ఉన్నారు.
 
 -    అఫ్గానిస్థాన్‌లో నాటో తన యుద్ధాన్ని డిసెంబరు 28న లాంఛనంగా ముగించింది. 13 ఏళ్లుగా సాగిన ఈ పోరాటాన్ని ముగించే కార్యక్రమాన్ని కాబూల్‌లోని నాటో కార్యాలయంలో రహస్యంగా నిర్వహించారు.
 
 చైనా రాజధాని బీజింగ్‌లో జూన్‌లో పంచశీల 60వ వార్షికోత్సవం జరిగింది. దీనికి భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతోపాటు చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్, మయన్మార్ అధ్యక్షుడు యూ థీన్‌సేన్ హాజరయ్యారు. భారత్, చైనాల మధ్య ఉన్న విభేదాలను తగ్గించుకుంటూ పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని, ఇది  పంచశీలకు ఎంతగానో దోహదపడుతుందని అన్సారీ అన్నారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ మేరకు భారతదేశం ప్రతిపాదించిన తీర్మానానికి డిసెంబర్ 11న ఐరాస సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. భారత రాయబారి అశోక్ ముఖర్జీ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement