అవకాశాలయానం..ఏరోనాటికల్ ఇంజనీరింగ్ | Aeronautical Engineering | Sakshi
Sakshi News home page

అవకాశాలయానం..ఏరోనాటికల్ ఇంజనీరింగ్

Published Thu, Jul 3 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

అవకాశాలయానం..ఏరోనాటికల్ ఇంజనీరింగ్

అవకాశాలయానం..ఏరోనాటికల్ ఇంజనీరింగ్

 శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఏవియేషన్ ఒకటి.. ఆకాశమే హద్దుగా విస్తరిస్తున్న రంగం.. పెరుగుతున్న అవసరాలు.. పోటీని తట్టుకోవాలంటే సాంకేతికంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావల్సిన పరిస్థితులు.. ఈ నేపథ్యంలో సంబంధిత రంగంలో భద్రత ప్రమాణాలను పర్యవేక్షించడం, నిరంతరంగా వస్త్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడం, విమానాలు అన్ని విధాలుగా సురక్షితంగా ఉన్నాయో? లేవా? పరీక్షించడం వంటి అంశాలను నిర్వహించడం కోసం నిపుణులు అవసరం.. అటువంటి మానవ వనరులను తీర్చిదిద్దే కోర్సు.. ఏరోనాటికల్ ఇంజనీరింగ్.
 
 
 ఇంజనీరింగ్ విద్యార్థుల సామర్థ్యానికి సవాలుగా నిలిచే బ్రాంచ్‌లలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఒకటి. భిన్నంగా ఆలోచించే వారికి సరిగ్గా సరిపోయే కెరీర్ ఇది. గతంలో సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ వంటి సంప్రదాయ బ్రాంచ్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆ తర్వాత సీఎస్‌ఈ, ఐటీ, మెటలర్జీ వంటి స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లను ప్రవేశ పెట్టారు. ఆయా రంగాలపై సంపూర్ణ అవగాహ కల్పించడమే లక్ష్యంగా ఈ బ్రాంచ్‌లను ప్రారంభించారు. అదే కోవలో ఏరోనాటికల్ రంగానికి సంబంధించి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను రూపొందించారు.
 
 బ్యాచిలర్ నుంచి మొదలు:
 బీటెక్/బీఈ స్థాయి నుంచి ఏరోనాటికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌గా వ్యవహరిస్తారు. ఈ కోర్సుల్లో చేరడానికి 10+2/తత్సమానం (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) పూర్తిచేసి ఉండాలి. అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల మాదిరిగానే..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) ద్వారానే ఏరోనాటికల్ బ్రాంచ్‌లో ప్రవేశం కల్పిస్తారు.  
 
 జాతీయ స్థాయిలో:
 జాతీయ స్థాయిలో ఐఐటీ, నిట్‌లు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్నాయి.
 వివరాలు..
 ఐఐటీ-మద్రాస్
 కోర్సులు: బీటెక్ ( ఏరోస్పేస్ ఇంజనీరింగ్), బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ ఎంటెక్ ఇన్ అప్లయిడ్ మెకానిక్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్), బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ
 ఐఐటీ-బాంబే
 కోర్సు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్)
     ఐఐటీ-కాన్పూర్
     కోర్సు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్)
     ఐఐటీ-ఖరగ్‌పూర్.
     కోర్సులు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్), బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ
     ఐఐఎస్‌టీ-తిరువనంతపురం
     కోర్సులు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియెనిక్స్)
 
 ప్రవేశం: జేఈఈ-అడ్వాన్స్‌డ్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
 నిట్-త్రిచి, సూరత్‌కల్, రూర్కెలా తదితర ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా ఈ కోర్సు అందుబాటులో ఉంది. వీటిలో జేఈఈ-మెయిన్ ఆధారంగా ప్రవేశం పొందొచ్చు.
 
 బోధించే అంశాలు:
 ఈ కోర్సులో విమానాల నిర్మాణం, స్పేస్ వెహికల్స్ డిజైన్‌ను కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించి ఎలా డిజైన్ చేయాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇందులో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మెకానిక్స్, డ్రాయింగ్, ఇంజనీరింగ్ వర్క్‌షాప్, థర్మోడైనమిక్స్, మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఎయిరోడైనమిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ, ఏరోస్పేస్ వెహికిల్ స్ట్రక్చర్, స్పేస్ టెక్నాలజీ, ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, క్యాడ్/క్యామ్, న్యూమరికల్ మెథడ్స్, హెలికాప్టర్ ఇంజనీరింగ్ తదితర అంశాలను బోధిస్తారు.
 
 ఉన్నత విద్య:
 ఉన్నత విద్యా విషయానికొస్తే.. బీఈ/బీటెక్ తర్వాత ఆయా స్పెషలైజేషన్స్‌తో ఎంఈ/ఎంటెక్ పూర్తి చేయవచ్చు. పీజీలో ఏరోస్పేస్ స్ట్రక్చర్స్, ఏరోడైనమిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఏరో థర్మోడైనమిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్, కంప్యుటేషనల్ మెకానిక్స్ సాలిడ్స్, ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్, ఏరోడైనమిక్స్ అండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్/క్యాడ్, రాకెట్ ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్ అండ్ కంబూషన్, కాంపోజిట్ మెటీరియల్స్ అండ్ ఎయిర్‌క్రాఫ్ట్ మెటీరియల్స్, ఏరోఫాయిల్ డిజైన్, ఆర్బిటాల్ మెకానిక్స్, గెడైన్స్ అండ్ కంట్రోల్ వంటి స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉంటాయి. తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కూడా చే యవచ్చు.
 
 నైపుణ్యాలు:
 ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియెట్ స్థాయిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లలో మంచి పట్టు ఉండాలి. దాంతోపాటు ఈ రంగంలో రాణించాలంటే కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. అవి..
     సృజనాత్మకత, బాధ్యతాయుతంగా వ్యవహరించే గుణం
     తక్కువ కాలంలోనే స్పందించాల్సి ఉంటుంది కాబట్టి వేగం-కచ్చితత్వంతో పనిచేసే నైపుణ్యం
     మ్యానువల్, టెక్నికల్, మెకానికల్ ఆప్టిట్యూడ్
     ఏకాగ్రత, జట్టుగా పని చేసే సామర్థ్యం
     శారీరకంగా ఫిట్‌తోపాటు చక్కటి కంటి చూపు ఉండాలి.
 
 విధులు:
 దేశంలోనేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏరోనాటికల్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఉంది. వీరు సాధారణంగా డిజైన్, మాన్యుఫాక్చరింగ్ సంబంధిత విధులను నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో వీరు ఒక సీనియర్ సూపర్‌వైజర్ పర్యవేక్షణలో జట్టుగా పని చేస్తారు. ఏవియేషన్‌కు సంబంధించి నూతన టెక్నాలజీ ఆవిష్కరణ, ఎయిర్‌క్రాఫ్ట్‌ల డిజైనింగ్, కన్‌స్ట్రక్షన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్, ఆపరేషన్, సంబంధిత పరికరాల నిర్వహణ వంటి కార్యకలాపాల్లో వీరు పాలుపంచుకుంటారు. ఈ క్రమంలో ఉండే జాబ్ ప్రొఫైల్స్.. అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, ఏరోస్పేస్ డిజైన్ చెకర్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్, ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్ మేనేజర్, థర్మల్ డిజైన్ మేనేజర్ తదితరాలు.
 
 అవకాశాలు:
 ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం మంచి ప్రగతిని

 కనబరుస్తోంది. ఎయిర్‌ట్రాఫిక్ పెరగడం, అంతేకాకుండా రక్షణ రంగంలో పెట్టుబడులు పెరుగుతుండడం, ఈ రంగంలోని ప్రైవేటు కార్యకలాపాలకు పరిమితంగా అవకాశం ఇవ్వడం కూడా ఏరోనాటికల్ ఇంజనీర్లకు డిమాండ్‌ను పెంచింది. ప్రైవేటు రంగంతో సమానంగా ప్రభుత్వ రంగంలో అవకాశాలు ఉండడం ఈ బ్రాంచ్ ప్రత్యేకత. ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి విమానయాన సంస్థల్లో, విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ఏవియేషన్ పరిశ్రమ, అంతరిక్ష పరిశోధన సంస్థలు, హెలికాప్టర్ కంపెనీలు, శాటిలైట్ మాన్యుఫాక్చరింగ్, రక్షణ దశాలు, ఏవియేషన్ సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు, జాతీయ-అంతర్జాతీయ సంస్థల్ల్లో అవకాశాలు ఉంటాయి. విమానయాన సంస్థల్లో, విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ఏవియేషన్ పరిశ్రమలో డిజైన్ అండ్ డెవలప్‌మెంట్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వ, రక్షణ, స్పేస్ ఏజెన్సీలు భవిష్యత్‌లో ఫ్లైయింగ్ వెహికల్, సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఏరోనాటికల్ ఇంజనీర్లకోసం చూస్తున్నాయి.
 
 వేతనాలు:
 వేతనాల విషయానికొస్తే.. ఏరోనాటికల్ ఇంజనీర్లకు సాధారణంగా కెరీర్ ప్రారంభంలో కనీసం రూ.2.75 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు పేప్యాకేజ్ లభిస్తుంది. అత్యధికంగా రూ. 10 లక్షల వరకు ఆఫర్ చేసే కంపెనీలున్నాయి.
 
 విదేశాల్లో:
 విదేశాల్లో కూడా ఏరోనాటికల్ ఇంజనీర్లకు చక్కటి అవకాశాలు ఉంటాయి. హోనీవెల్, రాక్ వెల్ కోలీన్స్, ఎయిర్‌బస్, బోయింగ్ తదితర విదేశీ కంపెనీలు ఏరోనాటికల్ ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా స్టాన్‌ఫర్డ్, ఎంఐటీ, జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కార్నెల్, ఫ్లోరిడా తదితర యూనివర్సిటీల నుంచి ఎంఎస్ అవకాశం కూడా ఉంది.
 
 తేడాలేదు
 చాలా మంది ఏయిరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ రెండు వేర్వేరు బ్రాంచ్‌లనే భావనలో ఉంటారు. కానీ వాస్తవానికి ఈ రెండు బ్రాంచ్‌ల సిలబస్ ఒక్కటే. ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, మిస్సైల్స్ తదితరాల నిర్మాణం, డిజైన్ వంటి అంశాలు ఉంటాయి. అవసరాల మేరకు ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఏవిధంగా రూపొందించాలో ఇందులో వివరిస్తారు. అదేవిధంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో కూడా ఎయిర్‌క్రాఫ్ట్‌ల రూపకల్పన ప్రధానం అంశంగా ఉంటుంది.
 
 టాప్ ఇన్‌స్టిట్యూట్‌లు
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్
 టెక్నాలజీ-తిరువనంతపురం
     వెబ్‌సైట్: www.iist.ac.in
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -మద్రాస్
     వెబ్‌సైట్: www.iitm.ac.in
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే
     వెబ్‌సైట్: www.iitb.ac.in
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు
     వెబ్‌సైట్: www.iisc.ernet.in
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్
     వెబ్‌సైట్: www.iitk.ac.in
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్‌పూర్
     వెబ్‌సైట్: www.iitkgp.ac.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement