Aeronautical Engineering
-
హైడ్రా ఎఫెక్ట్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేజీలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీంతో, కాలేజీలను కూల్చివేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ‘హైడ్రా’ ఫోకస్ పెట్టడంతో పలువురు అక్రమార్కుల గుండెల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటితోపాటు దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు అందాయి. చిన్న దామెరచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించినందుకు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక, మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువు ఆక్రమించారని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏడు రోజుల్లో నిర్మాణాలు తొలగించాలని.. లేకపోతే మేమే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు నోటీసుల్లో వెల్లడించారు. 489, 485, 458, 484, 492, 489 సర్వే నెంబర్లలో బిల్డింగ్స్, షెడ్స్, వెహికిల్ పార్కింగ్తో పాటు కాలేజీ రోడ్లు వేశారని రెవెన్యూ అధికారులు తెలిపారు. దీంతో, మరోసారి హైడ్రా కూల్చివేతల అంశంలో హాట్ టాపిక్ మారింది.మరోవైపు.. హైకోర్టులో దాఖలైన పిటిషన్లో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని 13 చెరువుల్లో కబ్జాల వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కలెక్టర్.. రెవెన్యూ అధికారులతో సర్వే చేయించారు. ఇదిలా ఉండగా.. నగరంలో ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మరోవైపు.. అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..‘ఒవైసీ, మల్లారెడ్డి అనేది చూడం. విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచిస్తాం. చెరువులను ఆక్రమించి కళాశాల భవనాలు కట్టడం వాళ్ల పొరపాటు అయి ఉండొచ్చు. ఎఫ్టీఎల్ అనేది ముఖ్యమైన అంశమే, దానికంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. ఒవైసీ, మల్లారెడ్డి లాంటి వ్యక్తుల కళాశాలలకు సమయం ఇస్తాం. పార్టీలకు అతీతంగా మా చర్యలు ఉంటాయి. ధర్మసత్రమైనా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చేస్తాం. హైడ్రా నోటీసులు ఇవ్వదు.. కూల్చడమే’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. వాటన్నింటినీ స్వీకరిస్తున్న కార్యాలయ సిబ్బంది అందులోని వివరాలను నమోదు చేసుకుంటున్నారు. పలు అక్రమ నిర్మాణాలపై దృష్టిసారిస్తున్నారు. ఇక, హైడ్రా ఆఫీసుకు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కూడా సెక్యూరిటీని పెంచారు. -
బెంగళూరులో.. ఏరోనాటికల్ ఇంజనీర్ విషాదం!
ఖమ్మం: మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన ఊడుగుల కృష్ణమూర్తి(44) బెంగళూరులోని హిందుస్తాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. పిండిప్రోలుకు చెందిన ఊడుగుల వెంకయ్య – మాణిక్యమ్మ మూడో కుమారుడు కృష్ణమూర్తి ఇరవై ఏళ్ల క్రితం బెంగళూరులోని హెచ్ఏఎల్లో ఇంజనీర్‌గా చేరి డిప్యూటీ మేనేజర్ స్థాయికి ఎదిగాడు.ఇటీవలే సొంత గ్రామంలో జరిగిన గ్రామ దేవత వేడుకకు కూడా హాజరయ్యాడు. ఈనెల 22న బెంగళూరులోని నివాసంలో బాత్రూమ్కు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందినట్లు తెలిసింది. ఆ సమయాన భార్య శిరీష, పిల్లలు ఖమ్మంలో ఉండడంతో కృష్ణమూర్తి మృతి విషయం రెండు రోజుల తర్వాత స్నేహితుల ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన బంధువులు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు బెంగళూరు వెళ్లారు. కాగా, కృష్ణమూర్తి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.గంటల వ్యవధిలోనే తల్లీ కుమారుడు...ముదిగొండ: గడ్డిమందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన రఘునాధపాలెం మండలం చిమ్మపూడికి చెందిన కణతల శేషగిరి(36) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి మృతిచెందాడు. కుటుంబ, ఆర్థిక స మస్యల కారణంగా చిమ్మపూడికి చెందిన తల్లీ,కుమారుడు కణతాల నర్సమ్మ(55), శేషగిరి(36) ముదిగొండ మండలం సువర్ణాపురం శివారులో ఈనెల 23న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే.వీరిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, సోమవారం ఉదయం నర్సమ్మ మృతి చెందింది. అలాగే, ఆమె కుమారుడు శేషగిరి అర్థరాత్రి దాటాక మృతి చెందగా, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదిగొండ ఎస్ఐ గజ్జెల నరేష్ తెలిపారు. కాగా, గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
ఏవియేషన్ రంగంలో కొలువుల జాతర, లక్ష ఉద్యోగాలు భర్తీ
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో దేశీ విమానయాన రంగం .. మరో లక్ష మందికి ప్రత్యక్షంగా కొలువులు కల్పించే అవకాశాలు ఉన్నాయని పార్లమెంటరీ అంచనాల కమిటీకి కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏవియేషన్, ఏరోనాటికల్ తయారీ రంగంలో సుమారు 2,50,000 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా ఉపాధి పొందున్నట్లు వివరించింది. వీరిలో పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఇంజినీర్లు, టెక్నీషియన్లు, కార్గో, రిటైల్, సెక్యూరిటీ గార్డులు మొదలైన వారు ఉన్నారు. ఈ సంఖ్య 2024 నాటికి 3,50,000కు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఏవియేషన్‌లో పరోక్ష, ప్రత్యక్ష ఉద్యోగాల నిష్పత్తి 4:8గా ఉన్నట్లు వివరించింది. లోక్‌సభకు సమర్పించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. చదవండి👉 రాకేష్ ఝున్ ఝున్ వాలా..'ఆకాశ ఎయిర్' సేవలు షురూ! -
హైదరాబాద్‌లో ఏరో, ఫార్మా వర్సిటీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏరోనాటికల్, ఫార్మా విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి. వీలైనంత త్వరగా హైదరాబాద్‌లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని ఇటీవల ప్రభుత్వం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చినట్టు ఉన్నత విద్య వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో దాదాపు 185 ఫార్మా కాలేజీలుండగా, ఇవి కేవలం బోధనకే పరిమితమవుతున్నాయి. అదీగాక, దేశంలో ఔషధ తయారీలో పరిశోధన చేసే వారి సంఖ్య కూడా తక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా సమయంలో హైదరాబాద్ టీకా తయారీలో కీలక భూమిక పోషించింది. ఇక్కడే వ్యాక్సిన్ తయారవ్వడం, అనేక కీలక పరిశోధనలకు భాగ్యనగరం వేదికగా నిలవడాన్ని కేసీఆర్ ప్రస్తావించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పరిశోధనకు ప్రత్యేకంగా వర్సిటీ ఉండాలన్నది కేసీఆర్ మనోభీష్టంగా అధికారులు భావిస్తున్నారు. యూనివర్సిటీ ఏర్పాటైతే పరిశోధకులను భారత్‌కు అందించడంతోపాటు, తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంటుందని సీఎం అన్నట్టు తెలిసింది. సరికొత్త అన్వేషణలు: ఏరోనాటికల్ విభాగంలో భారత్‌లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. భవిష్యత్‌లో ఈ సెక్టార్లో మరిన్ని ఆవిష్కరణలకు ఆస్కారం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచవ్యాప్తంగా ఏరోనాటికల్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలను పెంచాలని ముఖ్యమంత్రి ఉద్బోధించినట్టు ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. ఏరో, ఫార్మా రంగాలకు సంబంధించిన యూనివర్సిటీల ఏర్పాటుకు కావల్సిన మౌలిక వసతులు, తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించే పనిలో అధికారులున్నారు. ఇది పూర్తయిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రితో అధికారులు భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మంచి పరిణామమే ఫార్మా, ఏరోనాటికల్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ఆసక్తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన నివేదిక కూడా కోరారు. ఇవి రూపుదాలిస్తే తెలంగాణ మంచి పరిశోధన కేంద్రంగా గుర్తింపు పొందడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. వీలైనంత త్వరగా దీనిపై సమగ్ర వివరాలు సేకరించి నివేదిక రూపొందిస్తాం. ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి,ఉన్నత విద్యామండలి చైర్మన్ -
45 రోజుల్లో ఏడంతస్తుల భవనం
సాక్షి, బెంగళూరు: యుద్ధ విమానాల (అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఏఎంసీఏ) తయారీ కోసం బెంగళూరులో డీఆర్డీఓ 1.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఏడంతస్తుల భవనాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురువారం ప్రారంభించారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో డీఆర్డీఓ సొంతంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో కేవలం 45 రోజుల్లో విమాన నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదో తరం మీడియం వెయిట్ డీప్ పెన్ట్రేషన్ ఫైటర్ జెట్‌కు అవసరమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సదుపాయాలు ఇందులో ఉన్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. దేశ వైమానిక సామర్థ్యం మరింత పెంచేందుకు ఈ ఫైటర్ జెట్ అభివృద్ధి పథకం ఉపయోగపడుతుందన్నారు. ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.15 వేల కోట్లని తెలిపారు. ప్రధాని నేతృత్వంలోని భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ త్వరలోనే దీనికి ఆమోదం తెలపనుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై, డీఆర్డీఓ చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ భవనానికి 2021 నవంబర్ 22వ తేదీన శంకుస్థాపన జరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన వాస్తవ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అధికారులు చెప్పారు. సంప్రదాయ, ప్రీ ఇంజినీర్డ్ ప్రీ కాస్ట్ మెథడాలజీతో రికార్డు స్థాయిలో 45 రోజుల్లోనే డీఆర్డీవో ఈ భవనాన్ని నిర్మించిందని తెలిపారు. ఐఐటీ రూర్కీ, ఐఐటీ మద్రాస్‌కు చెందిన నిపుణులు డిజైన్‌కు సంబంధించి సహకారం అందించారన్నారు. -
‘తేజస్’లో విహారం అద్భుతం
సాక్షి, బెంగళూరు: రూ.35 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆయన శుక్రవారం కర్ణాటకలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌లో భాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ)ను సందర్శించారు. ఈ సందర్భంగా తేజస్ ఎల్సీఏ (లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్) విమానంలో విహరించారు. కాక్‌పిట్‌లో కూర్చున్న ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తేజస్ యుద్ధ విమానంలో విహరించడం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. యలహంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేషనల్ కాంక్లేవ్ ప్రారంభోత్సవానికి రాజ్‌నాథ్ హాజరయ్యారు. 1971 నాటి ఇండో–పాక్ యుద్ధం బ్రోచర్‌ను ఆవిష్కరించి.. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో శిక్షణ పూర్తి చేసుకున్న 1,185 మంది పైలెట్లను రాజ్‌నాథ్ అభినందించారు. -
కృష్ణ సాహి కలలకు రెక్కలొచ్చాయి
‘‘ఉన్నతమైన కలలు కనాలి.. వాటి సాకారానికి అకుంఠిత దీక్షతో కృషి చేయాలి’’.. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్న మాటలు ఆమె పుణికి పుచ్చుకుంది. అందుకే చిన్నప్పటి నుంచి ఆమె ఆలోచనలు.. ఆశయాలు.. లక్ష్యాలు అన్నీ సమున్నతంగానే సాగాయి. తనను తాను మలుచుకుంటూ ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి ఎదగాలని పట్టుదలతో పరిశ్రమించింది. ఓ మహిళగా దేశంలోనే ఎవరూ అందుకోలేని సమున్నత శిఖరాన్ని అధిరోహించింది. యుద్ధ విమానాల తయారీ రంగంలోకి తొట్టతొలి మహిళగా అడుగు పెట్టింది. దేశ రక్షణరంగానికి సేవ చేయాలన్నదే తమ ఆశయమని ఆమె చెబుతుంటే తెలుగు వారందరికీ గర్వంగా అనిపిస్తుంది. నేటియువతరానికి స్ఫూర్తిని నింపే ఈ కథనం సాక్షికి ప్రత్యేకం. గుజ్జర్లమూడి కృష్ణ సాహి... కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి చెందిన ఈమె తల్లిదండ్రులిరువురూ ఉపాధ్యాయులే. తల్లి సుజాత గూడురులో జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేస్తుంటే, తండ్రి రామకృష్ణ మచిలీపట్నంలోనే రాంజీ హైస్కూల్లో చేస్తున్నారు. తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ అందరూ ఉపాధ్యాయరంగానికి చెందినవారే. వారిలా తాను ఉపాధ్యాయురాలిగా కాకుండా ఎవరూ సాధించనిది ఏదైనా సాధించాలని చిన్నప్పటి నుంచి తపన పడేది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుంది. పట్టుదలగా చదివింది. అకుంఠిత దీక్షతో ఆ దిశగా అడుగులు వేసింది. అన్నింటిలోనూ మెరిట్ సాధిస్తూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ తనను తాను మలుచుకుంది. టెన్త్‌లో 92 శాతం మార్కులతో జాతీయస్థాయి మెరిట్ స్కాలర్షిప్ పొందింది. అదే స్కాలర్‌షిప్‌తో ఇంటర్, బీటెక్ పూర్తిచేసింది. ఇంటర్లో 95 శాతం మార్కులతో ఎంసెట్‌లో 2000వ ర్యాంక్ సాధించింది. మెకానికల్ వద్దన్నా వినలేదు... స్నేహితులందరూ ఈఎస్ఈ, సీఎస్సీ బ్రాంచ్‌లు తీసుకుంటే తాను మాత్రం మెకానికల్ తీసుకుంది. ఎస్వీ యూనివర్శిటీలో 2012లో 76.3 శాతం మార్కులతో బీటెక్ పూర్తి చేసింది. ఇలా బీటెక్ పూర్తి కాగానే అలా సెయింట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీలో ఏరోస్పేస్ ఇంజనీర్ గా జాబ్ వచ్చింది. అక్కడ పనిచేస్తూనే ఏరోనాటికల్ ఇంజనీర్‌గా శిక్షణ పొందింది. 2015 ఏప్రిల్‌లో యూకేలో ఎయిర్‌బస్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఆఫ్‌సైట్‌లో తొమ్మిది నెలలు పనిచేసింది. 2016లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఎ)లో ఏరో నాటికల్ ఇంజనీర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసింది. యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షల్లో ఒకే ఒక్క మార్క్ తేడాతో వెయిటింగ్ లిస్ట్‌లో అవకాశం తప్పిపోయింది. అయినా పట్టువదల్లేదు. ఆ వెంటనే అంతర్జాతీయస్థాయిలో పేరొందిన బోయింగ్ ఏరోస్పేస్ ఇన్ ఇండియా కంపెనీలో ఛాన్స్ దక్కించుకుంది. దేశంలోనే తొలి మహిళా ఏరోనాటికల్ ఇంజనీర్‌గా పనిచేసే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ పోస్టుకి 800 మంది ఇంటర్వూ్యకు హాజరైతే నలుగురు ఎంపికయ్యారు. వారిలో ఒక్కరు... తెలుగింటి ఆడపడచు కావడం సంతోషకరం. – పంపాన వరప్రసాదరావు, సాక్షి, మచిలీపట్నం యుద్ధ విమానాల తయారీలో ‘బోయింగ్’ బోయింగ్ ఏరోస్పేస్ ఇన్ ఇండియా... ఇది అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ, ఇండియాకు చెందిన టాటా గ్రూప్ కొలాబరేషన్‌తో డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసే సంస్థ. హైదరాబాద్‌లోని ఆదిభట్లలో 2013–14లో ప్రారంభించిన ఏకైక యూనిట్ ఇది. దీంట్లో అగస్తా వెస్ట్‌లాండ్ అపాచీ వార్ హెలికాప్టర్లు తయారు చేస్తారు. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే విడిభాగాలను తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేస్తారు. అంతేకాదు, మల్టిఫుల్ ఎయిర్ క్రాప్ట్స్ ఇక్కడ తయారవుతాయి. ప్రస్తుతం ఇక్కడ ఎహెచ్–64 అపాచీ వార్ ఎయిర్‌క్రాఫ్ట్స్ తయారవుతున్నాయి. ఇక్కడ బోయింగ్ కంపెనీ తరవున తొమ్మిది మంది సిబ్బంది, టాటా తరపున నాలుగు వేల మంది వరకు పనిచేస్తుంటారు. అలాంటి ప్రతిష్టాత్మక కంపెనీలో కృష్ణ సాహి బోయింగ్ తరపున ప్రొడక్టు రివ్యూ ఇంజనీర్‌గా సెలక్ట్ అవడం సంతోషకరం. ఆనందానికి అవధుల్లేవు యుద్ధ విమానాల తయారీ కంపెనీలో నెం.1 గా ఉన్న బోయింగ్ సంస్థలో ఏరోనాటికల్ ఇంజినీర్‌గా చేరతానని కలలో కూడా ఊహించలేదు. ‘యూ ఆర్ సెలక్టెడ్ ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా యాజ్ ఏరోనాటికల్ ఇంజనీర్ ఇన్ అవర్ ప్రెస్టేజియస్ ఇనిస్టిట్యూషన్’ అని ఆ కంపెనీ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ రాగానే ఆనందానికి అవధుల్లేవు. వెంటనే∙బందరు నుంచే వర్చ్యువల్ జాయినింగ్ రిపోర్టు ఇచ్చా. ఈ సోమవారం విధుల్లో చేరబోతున్నాను. గుజ్జర్లమూడి కృష్ణ సాహి తొలి మహిళా ఏరోనాటికల్ ఇంజనీర్ ‘నో రిజర్వేషన్’ అంది మా అమ్మాయి చిన్నప్పటి నుంచి బాగా చదువుకునేది. మేమిద్దరం టీచర్లమైనప్పటికీ మా నుంచి ఏదీ కోరుకోలేదు. మాకు ఎస్సీ రిజర్వేషన్ ఉన్నా ఒక్కసారి కూడా ఉపయోగించుకోలేదు. అన్నిటిలోనూ మెరిట్. తన కాళ్లమీద తాను నిలబడాలనే తపనతో ముందుకు సాగింది. ఎవరూ సాధించనిది తాను సాధించాలని కలలు కనడమే కాదు, అనుకున్నది సాధించింది. దేశంలోనే తొలి మహిళా ఏరోనాటికల్ ఇంజనీర్‌గా సెలక్ట్ అవడం కృష్ణ సాహి తల్లిదండ్రులుగా మాకు చాలా గర్వకారణం. మా కుటుంబాలలో ఈ స్థాయికి ఎదిగిన మా అమ్మాయిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. – జి.సుజాత, కృష్ణ సాహి తల్లి -
చేతికి అందిన కల
ఆకాశంలో చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెట్టేటప్పుడు ఆ అమ్మ తన బిడ్డ కలలు ఆకాశంలో విహరిస్తున్నాయని ఊహించనైనా ఊహించలేదు. అప్పుడే కాదు, మనదేశం చంద్రయాన్ ప్రయోగాలు చేస్తున్నప్పుడు కూడా ఆ అమ్మానాన్నకు తమ కూతురు ఆలోచనలు అంతరిక్షంలో ఉన్నాయని తెలియదు. ‘తను అంత పెద్ద కలలు కంటోందని మేము ఊహించనే లేదు’ అంటున్నారు లలిత తల్లిదండ్రులు! కర్నాటక రాష్ట్రం, చిత్రదుర్గ జిల్లా హరియూర్ పట్టణం ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. లలిత అనే ఇరవై రెండేళ్ల అమ్మాయి సాధించిన స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో హరియూర్‌తోపాటు లలిత అమ్మానాన్న.. రాజేంద్ర, చిత్రలు కూడా సెలబ్రిటీలయ్యారు. బెలగావిలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్న లలిత ఫైనల్ పరీక్షల్లో 9.7 గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించింది! ఈ పర్సెంటేజ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు. వారం రోజులుగా చిత్రదుర్గ జిల్లా మొత్తం ఈ సంబరాన్ని ఆస్వాదిస్తోంది. ‘ఏటా ఎవరో ఒకరు ఫస్ట్ ర్యాంకు సాధిస్తూనే ఉంటారు కదా’ అనే ప్రశ్న మామూలే. కానీ లలితది.. అమ్మానాన్నలు అరచేతుల్లో నడిపించి మరీ చదివించిన నేపథ్యం కాదు. హరియూర్ మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో జీవనం గడుపుతున్న కుటుంబం వాళ్లది. ముగ్గురమ్మాయిలను పట్టుదలగా స్కూలుకు పంపించారు. వాళ్ల పెద్దమ్మాయే లలిత. తల్లిదండ్రుల కష్టం తెలిసిన అమ్మాయిలు కావడంతో ఇప్పటికీ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి మార్కెట్‌కు కూరగాయల చేరవేతలో తండ్రికి సహాయంగా ఉంటున్నారు. ఇంటి పనులు ముగించుకుని తల్లి వచ్చి మార్కెట్లో కూర్చునే లోపు కూతుళ్లలో ఎవరో ఒకరు దుకాణంలో ఉంటారు. ఆ తర్వాత కాలేజీలకు వెళ్తారు. అలా లలిత కూడా మార్కెట్‌కు వెళ్లేటప్పుడు కూరగాయలతోపాటు పుస్తకాలు కూడా పట్టుకెళ్లేది. ఆ అమ్మాయి దుకాణంలో కూర్చుని చదువుకుంటూ, బేరం వచ్చినప్పుడు కూరగాయలమ్మడం ఆ మార్కెట్లో తోటి వ్యాపారులకే కాదు, కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్లకు కూడా పరిచిత దృశ్యమే. లలిత స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అని తెలియగానే ఇప్పుడు ఆమెను తెలిసిన వాళ్లందరూ తమ ఇంటి బిడ్డ సాధించిన విజయంగా సంతోషపడుతున్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం ఆమెకు బంగారు పతకాన్ని బహూకరించారు.లలిత ఆ ఇంట్లో తొలి గ్రాడ్యుయేట్. వేడుక చేసుకోవడానికి అదే పెద్ద సందర్భం అనుకుంటే.. స్టేట్ ఫస్ట్‌ర్యాంకుతో పాస్ కావడం, బంగారు పతకం అందుకోవడంతో రాజేంద్ర, చిత్రల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లలిత మాత్రం ‘‘మమ్మల్ని చదివించడానికి అమ్మానాన్న పడిన కష్టం తెలుసు. వాళ్లు గర్వపడేలా ఎదుగుతాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఇస్రో చైర్మన్ శివన్ నాకు ఆదర్శం. అంతరిక్ష పరిశోధన చేయడం నా కల’’ అంటోంది. -
కారు ఇంజన్ తో హెలికాప్టర్
తిరువళ్లూరు: తిరువళ్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎంజీఆర్ నగర్ ప్రాంతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ తయారు చేస్తున్న హెలికాప్టర్ కలకలం రేపింది. తిరువళ్లూరు మున్సిపాలి టీ పరిధిలోని ఎంజీఆర్ నగర్‌కు చెందిన మోహన్ జయా ఇంజనీరింగ్ కళాశాలలోని ఏరోనాటికల్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఏరోనాటికల్ విభాగంలో చదివే విద్యార్థులకు నాలుగో సంవత్సరంలో విమానం, హెలికాప్టర్ పనితీరును నేరుగా తెలుసుకోవాల్సి ఉంది. ఇందు లో భాగంగా జయా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఉపయోపడే విధం గా హెలికాప్టర్‌ను తయారు చేయాలని నిర్ణయించిన కళాశాల యాజమాన్యం నిర్ణయించింది. అయితే అప్పటికే హెలికాప్టర్ తయారీలో ఆసక్తి వున్న మోహన్‌కు బాధ్యతలు అప్పగించారు. దీంతో మోహన్ హెలికాప్టర్ తయారీ పనులను ఇంటి వెనుక భాగంలో రెండు వారాల నుంచి కొనసాగిస్తున్నారు. అయితే శనివారం సాయంత్రం రెక్కలు అమర్చే పని వుండడంతో హెలికాప్టర్‌ను వీధిలోకి తెచ్చి పనులను నిర్వహించడం ప్రారంభించారు. హెలికాప్టర్ వీధిలోకి రావడంతో ఆశ్చర్యపోయిన స్థానికులు తిరువళ్లూరు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు వర్గాలూ కలవరపాటుకు గురయ్యూరు. విషయం తెలుసుకున్న టౌన్ ఇన్స్పెక్టర్ పొన్రాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే మోహన్ తయారు చేస్తున్న హెలికాప్టర్‌కు ఎగిరే సామర్థ్యం లేదని, కేవలం ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధన కోసమే తయారు చేస్తున్నారని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసమే తాము హెలికాప్టర్‌ను తయారు చేస్తున్నట్టు ప్రొఫెసర్ మోహన్ వివరించారు. తాము తయారు చేస్తున్న హెలికాప్టర్‌కు ఎగిరే సామర్థ్యం లేదని, తాము ఏరోనాటికల్ శాఖను అనుమతి కోరి నప్పడు సైతం ఇదే అంశాన్ని వారు గుర్తు చేశారని ఆయన వివరించారు. తాము తయారు చేసిన హెలికాప్టర్ పెట్రోల్‌తో నడుస్తుందని, కేవలం ఒక్కరు మాత్రమే ఇందులో ప్రయాణించే అవకాశం వుంటుందని వివరించారు. తాము తయారు చేస్తున్న హెలికాప్టర్ వలన ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ వుండదన్నారు. తమకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే హెలికాప్టర్‌ను తయారు చేస్తామని వివరించారు. ప్రస్తుతం తయారు చేసిన హెలికాప్టర్ కారు ఇంజన్‌తో పరుగెత్తుతుందని మోహన్ తెలిపారు. -
ఆకాశయానంలో అవకాశాలెన్నో...
భారత్‌లో ఆర్థిక సంస్కరణల ప్రవేశంతో విమానయాన రంగంలో అభివృద్ధి ఊపందుకుంది. ప్రస్తుతం ఉన్న సంస్థలతోపాటు మరికొన్ని ఈ రంగంలో అడుగుపెట్టనున్నాయి. ఇందులో డిమాండ్‌కు తగిన స్థాయిలో నిపుణులు లేరు. నగరంలో ఈ రంగానికి అవసరమైన కోర్సులను అందించే విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్, పెలైట్ ట్రైనింగ్, కేబిన్ క్రూ శిక్షణకు హైదరాబాద్ పేరుగడించింది. మనదేశంలో వచ్చే పదేళ్లలో.. ఏవియేషన్ రంగంలో ‘పెలైట్ మొదలు.. టికెట్ కౌంటర్ స్టాఫ్’ వరకు పలు విభాగాల్లో దాదాపు 30 లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో విమానయానంలో అవకాశాలపై ఫోకస్.. ఎన్నో విభాగాల్లో కొలువులు విమానయాన రంగం అంటే.. కేవలం పెలైట్లు మాత్రమే కాదు. ఇంకా ఎన్నో విభాగాల ఉద్యోగాలు ఉంటాయి. కో పెలైట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు (ఏటీసీ), ఏరోనాటికల్ ఇంజనీర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయిన్టెనెన్స్ ఇంజనీర్లు, ఏవియేషన్ మేనేజ్మెంట్ నిపుణులు, ఎయిర్ టికెటింగ్, ఎయిర్‌హోస్టెస్/ఫ్లైట్ స్టీవార్డ్, ఇతర టెక్నీషియన్స్.. ఇలా ఎంతోమంది సమాహారమే ఏవియేషన్. ఎయిర్‌క్రాఫ్ట్/ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విమానయాన రంగంలో మరో ముఖ్య విభాగం ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్. విమానాల్లో తలెత్తే సాంకేతిక లోపాలను సరిదిద్ది వాటిని సక్రమంగా ఉంచడమే ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగం ప్రధాన విధి. దీంతోపాటు డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ విధులను కూడా ఈ సిబ్బందే నిర్వర్తిస్తారు. నిర్దేశిత మార్కులతో ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసినవారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్/ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ కోర్సులు చేయొచ్చు. వీరికి ప్రారంభంలో నెలకు రూ.40,000 వేతనం ఉంటుంది. సంస్థలు: ఐఐటీ ఖరగ్‌పూర్, మద్రాస్, బాంబే, కాన్పూర్; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, డెహ్రాడూన్; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం. వీటితోపాటు హైదరాబాద్‌లోని వివిధ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలలు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సులను బోధిస్తున్నాయి. ఎయిర్ టికెటింగ్ విమానాల వేళలు, ప్రయాణికుల అవసరాలను రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటూ.. వీటిని అనుసంధానం చేసుకుంటూ టికెట్లను ఖరారు చేసి అందించే కోర్సే ఎయిర్‌లైన్ టికెటింగ్. ఈ కోర్సులో పలు రకాల పద్ధతులు (ఆన్లైన్, ఆఫ్‌లైన్, ఏజెంట్ నెట్వర్క్, కౌంటర్) ద్వారా విమాన టికెట్ల బుకింగ్, రిజర్వేషన్ వంటి అంశాల్లో శిక్షణనిస్తారు. ప్రస్తుతం ఎయిర్‌లైన్ టికెటింగ్ విభాగంలో రెండు నెలల నుంచి ఏడాది వ్యవధిలో పలు రకాల కోర్సులు అందుబాటు లో ఉన్నాయి. ఎయిర్ టికెటింగ్ సిబ్బందికి ప్రారంభంలో నెలకు రూ.25,000 నుంచి కెరీర్ ఆరంభమవుతుంది. తర్వాత పనితీరు, అనుభవం ఆధారంగా నెలకు రూ.50,000 వరకు సంపాదించొచ్చు. కోర్సులను అందిస్తున్న సంస్థలు: ద ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ), ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్, ఇగ్నో. గ్రౌండ్ డ్యూటీ బస్సు, రైలు వంటి రవాణా పద్ధతులతో పోల్చితే.. విమాన ప్రయాణాల విషయంలో కొన్ని ప్రత్యేక సందర్భాలు (చెక్-ఇన్, చెక్-అవుట్, బ్యాగేజ్ కలెక్షన్ తదితర) ఎదురవుతాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులకు తమ సేవల ద్వారా సహకరించే సిబ్బందే గ్రౌండ్ స్టాఫ్. ప్రతి ఎయిర్‌లైన్ సంస్థ.. తమ విమాన సర్వీసుల ప్రయాణికుల సౌకర్యం కోసం ఆయా విమానాశ్రయాల్లో ఈ గ్రౌండ్ స్టాఫ్ విభాగాన్ని ఏర్పాటు చేస్తాయి. వాస్తవానికి ఒక విమానయాన సంస్థకు పేరు ప్రతిష్టలు తీసుకురావడంలో గ్రౌండ్ స్టాఫ్‌దే కీలక పాత్ర. వీరి పనితీరును బట్టే సంస్థకు ప్రయాణికుల ఆదరణ లభిస్తుంది. గ్రౌండ్ డ్యూటీ స్టాఫ్‌కు విమానయాన సంస్థను బట్టి ప్రారంభంలో నెలకు రూ.25,000 వరకు వేతనం లభిస్తుంది. రెండు, మూడేళ్ల పని అనుభవంతో నెలకు రూ.50,000కు పైగానే పొందొచ్చు. కోర్సులను అందిస్తున్న సంస్థలు: ఐరావత్ ఏవియేషన్ అకాడమీ -ముంబై, ఆప్టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ అకాడమీ-కోల్‌కతా, ఫ్లై ఎయిర్ ఏవియేషన్ అకాడమీ - చెన్నై. డెవలప్మెంట్, టీచింగ్ రంగాల్లోనూ.. ఎయిర్లైన్స సంస్థల్లో వివిధ విభాగాల్లో అవకాశాలుంటాయి. ఏరోనాటికల్ ఇంజనీర్లకు డిజైన్, డెవలప్‌మెంట్‌తోపాటు మేనేజ్మెంట్, టీచింగ్ రంగాల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్లలో, ఏవియేషన్ రంగంలోని డిజైన్ యూనిట్లలో వీరికి మంచి డిమాండ్ ఉంది. ఇస్రో, డీఆర్డీవో వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో... ప్రైవేటు రంగంలో ఏవియేషన్, ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్‌లైన్, శాటిలైట్, డిఫెన్స్ ఇండస్ట్రీతోపాటు వాటి అనుబంధ రంగాల్లోనూ ఉపాధి పొందొచ్చు. గ్రౌండ్ స్టాఫ్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆయా విమానయాన సంస్థల్లో ఎయిర్పోర్ట్ ఇన్ఫర్మేషన్ డెస్క్, ఫేర్స్ అండ్ టికెటింగ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్, కార్గో హ్యాండ్లింగ్ వంటి విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. అనుబంధ ఉద్యోగాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. విమానయాన రంగంలో అవకాశాలకు ఆకాశమే హద్దు ‘‘ఏవియేషన్‌లో పెలైట్లతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ మెయిన్టెనెన్స్ ఇంజనీర్స్, గ్రౌండ్ డ్యూటీ, కేబిన్ క్రూ, ఎయిర్ హోస్టెస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. విమానయానం చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం దానికి అనుగుణంగానే కొత్తగా ఏర్పాటవుతున్న ఆధునాతన ఎయిర్‌పోర్టులు, సరికొత్త విమానాల వృద్ధే దీనికి నిదర్శనం. తాజాగా ఏవియేషన్ రంగంలో ఫారిన్ డెరైక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ (ఎఫ్‌డీఐ)లకు ఆస్కారం ఏర్పడడంతో ఈ రంగం మరింత పుంజుకోనుంది. కొత్తగా ఎయిర్ ఆసియా, టాటా సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ కోస్టా తదితర విమానయాన సంస్థల రంగ ప్రవేశంతో ఏవియేషన్‌లో మరిన్ని ఉద్యోగాలకు అవకాశం ఏర్పడింది. ఇప్పటికే ఎయిర్ ఆసియా, ఎయిర్ కోస్టా విమానయాన సేవలను ప్రారంభించాయి. ఎయిర్ ఇండియా కూడా తన సేవల పరిధిని క్రమంగా పెంచడానికి ప్రయత్నిస్తోంది. ప్రపంచాన్ని చుట్టేస్తూ, ఆకర్షణీయ వేతనం అందుకోవాలనుకునేవారు పెలైట్లుగా కెరీర్ ప్రారంభించొచ్చు’’ - కెప్టెన్ ఎస్.ఎన్. రెడ్డి, సెక్రటరీ అండ్ సీఈఓ, ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ, హైదరాబాద్ పెలైట్ ‘విమానం ఎగిరినప్పటి నుంచి జాగ్రత్తగా నిర్దేశిత గమ్యస్థానంలో దించేవరకు పెలైట్దే ప్రధాన బాధ్యత. పదో తరగతి ఉత్తీర్ణులు స్టూడెంట్ పెలైట్ లెసైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్.పి.ఎల్. సాధించాక ప్రైవేట్ పెలైట్ లెసైన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దశలో కనీసం 60 గంటలపాటు ఫ్లైయింగ్ అనుభవం సంపాదిస్తే లెసైన్స్ లభిస్తుంది. దీంతోపాటు డీజీసీఏ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ప్రైవేట్ పెలైట్ లెసైన్స్ కూడా సాధిస్తే.. చివరి దశ కమర్షియల్ పెలైట్ లెసైన్స్ కోసం ప్రయత్నించాలి. ఈ కోర్సు వ్యవధి 18 నెలలు. ఈ దశలో 200 గంటలు విమానాన్ని నడిపిన అనుభవం సొంతం చేసుకుంటే పరిపూర్ణ పెలైట్‌గా పరిగణిస్తారు. పెలైట్‌కు క్షణాల్లో సరైన నిర్ణయాలు తీసుకొనే సత్తా ఉండాలి. ఎలాంటి సవాల్‌కైనా సిద్ధంగా ఉండాలి. పెలైట్లకు ప్రారంభంలో ఏడాదికి రూ. 15 లక్షల నుంచి వేతనాలు ఉంటాయి. సీనియర్ పెలైట్లు ఏడాదికి రూ. 65 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆర్జించొచ్చు. పైలట్ శిక్షణనిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ, హైదరాబాద్; రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ, హైదరాబాద్; ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ, సికింద్రాబాద్; బాంబే ఫ్లైరుుంగ్ క్లబ్; గవర్నమెంట్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, భువనేశ్వర్; గవర్నమెంట్ ఫ్లైరుుంగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కోల్‌కతా; గవర్నమెంట్ ఫ్లైరుుంగ్ ట్రైనింగ్ స్కూల్, బెంగళూరు; రాజీవ్‌గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీ, తిరువనంతపురం కేబిన్ క్రూ ఆకట్టుకునే రూపం.. ఎదుటివారిని ఒప్పించే నేర్పు ఉంటే అద్భుత అవకాశాలందించే విభాగం కేబిన్ క్రూ. ఎయిర్ హోస్టెస్, ఫ్లైట్ స్టీవార్డ్, ఫ్లైట్ అటెండెంట్ హోదాలు ఈ విభాగంలో లభిస్తాయి. ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్, 18 ఏళ్ల వయసు ఉంటే చాలు.. కేబిన్ క్రూలో కెరీర్‌ను అన్వేషించవచ్చు. వీరికి సమయస్ఫూర్తి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. విదేశీ భాషల్లో పట్టు అవసరం. కేబిన్ క్రూ అభ్యర్థులు ప్రారంభంలో రూ.50,000 అందుకోవచ్చు. రెండు, మూడేళ్ల అనుభవంతో నెలకు రూ.80,000కు పైగా పొందొచ్చు. కోర్సులను అందిస్తున్న సంస్థలు: కేబిన్ క్రూకు సంబంధించి శిక్షణనిచ్చే సంస్థలు ప్రభుత్వ రంగంలో లేవు. ప్రైవేట్ రంగంలో ఎన్నో ఉన్నాయి. ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడెమీ - సికింద్రాబాద్, ఫ్రాంక్ఫిన్ - ముంబై, కింగ్‌ఫిషర్ ట్రైనింగ్ అకాడెమీ - ముంబై వంటి ప్రైవేటు సంస్థలు కేబిన్ క్రూ కోర్సుల్లో శిక్షణనిస్తున్నాయి. -
అవకాశాలయానం..ఏరోనాటికల్ ఇంజనీరింగ్
శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఏవియేషన్ ఒకటి.. ఆకాశమే హద్దుగా విస్తరిస్తున్న రంగం.. పెరుగుతున్న అవసరాలు.. పోటీని తట్టుకోవాలంటే సాంకేతికంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావల్సిన పరిస్థితులు.. ఈ నేపథ్యంలో సంబంధిత రంగంలో భద్రత ప్రమాణాలను పర్యవేక్షించడం, నిరంతరంగా వస్త్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడం, విమానాలు అన్ని విధాలుగా సురక్షితంగా ఉన్నాయో? లేవా? పరీక్షించడం వంటి అంశాలను నిర్వహించడం కోసం నిపుణులు అవసరం.. అటువంటి మానవ వనరులను తీర్చిదిద్దే కోర్సు.. ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ విద్యార్థుల సామర్థ్యానికి సవాలుగా నిలిచే బ్రాంచ్‌లలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఒకటి. భిన్నంగా ఆలోచించే వారికి సరిగ్గా సరిపోయే కెరీర్ ఇది. గతంలో సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ వంటి సంప్రదాయ బ్రాంచ్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆ తర్వాత సీఎస్ఈ, ఐటీ, మెటలర్జీ వంటి స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లను ప్రవేశ పెట్టారు. ఆయా రంగాలపై సంపూర్ణ అవగాహ కల్పించడమే లక్ష్యంగా ఈ బ్రాంచ్‌లను ప్రారంభించారు. అదే కోవలో ఏరోనాటికల్ రంగానికి సంబంధించి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను రూపొందించారు. బ్యాచిలర్ నుంచి మొదలు: బీటెక్/బీఈ స్థాయి నుంచి ఏరోనాటికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌గా వ్యవహరిస్తారు. ఈ కోర్సుల్లో చేరడానికి 10+2/తత్సమానం (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) పూర్తిచేసి ఉండాలి. అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల మాదిరిగానే..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) ద్వారానే ఏరోనాటికల్ బ్రాంచ్‌లో ప్రవేశం కల్పిస్తారు. జాతీయ స్థాయిలో: జాతీయ స్థాయిలో ఐఐటీ, నిట్లు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్నాయి. వివరాలు.. ఐఐటీ-మద్రాస్ కోర్సులు: బీటెక్ ( ఏరోస్పేస్ ఇంజనీరింగ్), బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ ఎంటెక్ ఇన్ అప్లయిడ్ మెకానిక్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్), బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ఐఐటీ-బాంబే కోర్సు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్) ఐఐటీ-కాన్పూర్ కోర్సు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్) ఐఐటీ-ఖరగ్‌పూర్. కోర్సులు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్), బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ఐఐఎస్టీ-తిరువనంతపురం కోర్సులు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియెనిక్స్) ప్రవేశం: జేఈఈ-అడ్వాన్స్డ్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. నిట్-త్రిచి, సూరత్కల్, రూర్కెలా తదితర ఇన్స్టిట్యూట్లలో కూడా ఈ కోర్సు అందుబాటులో ఉంది. వీటిలో జేఈఈ-మెయిన్ ఆధారంగా ప్రవేశం పొందొచ్చు. బోధించే అంశాలు: ఈ కోర్సులో విమానాల నిర్మాణం, స్పేస్ వెహికల్స్ డిజైన్‌ను కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించి ఎలా డిజైన్ చేయాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇందులో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మెకానిక్స్, డ్రాయింగ్, ఇంజనీరింగ్ వర్క్‌షాప్, థర్మోడైనమిక్స్, మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఎయిరోడైనమిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ, ఏరోస్పేస్ వెహికిల్ స్ట్రక్చర్, స్పేస్ టెక్నాలజీ, ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, క్యాడ్/క్యామ్, న్యూమరికల్ మెథడ్స్, హెలికాప్టర్ ఇంజనీరింగ్ తదితర అంశాలను బోధిస్తారు. ఉన్నత విద్య: ఉన్నత విద్యా విషయానికొస్తే.. బీఈ/బీటెక్ తర్వాత ఆయా స్పెషలైజేషన్స్‌తో ఎంఈ/ఎంటెక్ పూర్తి చేయవచ్చు. పీజీలో ఏరోస్పేస్ స్ట్రక్చర్స్, ఏరోడైనమిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఏరో థర్మోడైనమిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్, కంప్యుటేషనల్ మెకానిక్స్ సాలిడ్స్, ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్, ఏరోడైనమిక్స్ అండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్/క్యాడ్, రాకెట్ ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్ అండ్ కంబూషన్, కాంపోజిట్ మెటీరియల్స్ అండ్ ఎయిర్‌క్రాఫ్ట్ మెటీరియల్స్, ఏరోఫాయిల్ డిజైన్, ఆర్బిటాల్ మెకానిక్స్, గెడైన్స్ అండ్ కంట్రోల్ వంటి స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉంటాయి. తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్డీ కూడా చే యవచ్చు. నైపుణ్యాలు: ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియెట్ స్థాయిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లలో మంచి పట్టు ఉండాలి. దాంతోపాటు ఈ రంగంలో రాణించాలంటే కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. అవి.. సృజనాత్మకత, బాధ్యతాయుతంగా వ్యవహరించే గుణం తక్కువ కాలంలోనే స్పందించాల్సి ఉంటుంది కాబట్టి వేగం-కచ్చితత్వంతో పనిచేసే నైపుణ్యం మ్యానువల్, టెక్నికల్, మెకానికల్ ఆప్టిట్యూడ్ ఏకాగ్రత, జట్టుగా పని చేసే సామర్థ్యం శారీరకంగా ఫిట్తోపాటు చక్కటి కంటి చూపు ఉండాలి. విధులు: దేశంలోనేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏరోనాటికల్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఉంది. వీరు సాధారణంగా డిజైన్, మాన్యుఫాక్చరింగ్ సంబంధిత విధులను నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో వీరు ఒక సీనియర్ సూపర్వైజర్ పర్యవేక్షణలో జట్టుగా పని చేస్తారు. ఏవియేషన్‌కు సంబంధించి నూతన టెక్నాలజీ ఆవిష్కరణ, ఎయిర్‌క్రాఫ్ట్‌ల డిజైనింగ్, కన్స్ట్రక్షన్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఆపరేషన్, సంబంధిత పరికరాల నిర్వహణ వంటి కార్యకలాపాల్లో వీరు పాలుపంచుకుంటారు. ఈ క్రమంలో ఉండే జాబ్ ప్రొఫైల్స్.. అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, ఏరోస్పేస్ డిజైన్ చెకర్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్, ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్ మేనేజర్, థర్మల్ డిజైన్ మేనేజర్ తదితరాలు. అవకాశాలు: ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం మంచి ప్రగతిని కనబరుస్తోంది. ఎయిర్‌ట్రాఫిక్ పెరగడం, అంతేకాకుండా రక్షణ రంగంలో పెట్టుబడులు పెరుగుతుండడం, ఈ రంగంలోని ప్రైవేటు కార్యకలాపాలకు పరిమితంగా అవకాశం ఇవ్వడం కూడా ఏరోనాటికల్ ఇంజనీర్లకు డిమాండ్‌ను పెంచింది. ప్రైవేటు రంగంతో సమానంగా ప్రభుత్వ రంగంలో అవకాశాలు ఉండడం ఈ బ్రాంచ్ ప్రత్యేకత. ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి విమానయాన సంస్థల్లో, విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ఏవియేషన్ పరిశ్రమ, అంతరిక్ష పరిశోధన సంస్థలు, హెలికాప్టర్ కంపెనీలు, శాటిలైట్ మాన్యుఫాక్చరింగ్, రక్షణ దశాలు, ఏవియేషన్ సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు, జాతీయ-అంతర్జాతీయ సంస్థల్ల్లో అవకాశాలు ఉంటాయి. విమానయాన సంస్థల్లో, విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ఏవియేషన్ పరిశ్రమలో డిజైన్ అండ్ డెవలప్మెంట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వ, రక్షణ, స్పేస్ ఏజెన్సీలు భవిష్యత్‌లో ఫ్లైయింగ్ వెహికల్, సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఏరోనాటికల్ ఇంజనీర్లకోసం చూస్తున్నాయి. వేతనాలు: వేతనాల విషయానికొస్తే.. ఏరోనాటికల్ ఇంజనీర్లకు సాధారణంగా కెరీర్ ప్రారంభంలో కనీసం రూ.2.75 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు పేప్యాకేజ్ లభిస్తుంది. అత్యధికంగా రూ. 10 లక్షల వరకు ఆఫర్ చేసే కంపెనీలున్నాయి. విదేశాల్లో: విదేశాల్లో కూడా ఏరోనాటికల్ ఇంజనీర్లకు చక్కటి అవకాశాలు ఉంటాయి. హోనీవెల్, రాక్ వెల్ కోలీన్స్, ఎయిర్‌బస్, బోయింగ్ తదితర విదేశీ కంపెనీలు ఏరోనాటికల్ ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా స్టాన్‌ఫర్డ్, ఎంఐటీ, జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కార్నెల్, ఫ్లోరిడా తదితర యూనివర్సిటీల నుంచి ఎంఎస్ అవకాశం కూడా ఉంది. తేడాలేదు చాలా మంది ఏయిరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ రెండు వేర్వేరు బ్రాంచ్‌లనే భావనలో ఉంటారు. కానీ వాస్తవానికి ఈ రెండు బ్రాంచ్‌ల సిలబస్ ఒక్కటే. ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, మిస్సైల్స్ తదితరాల నిర్మాణం, డిజైన్ వంటి అంశాలు ఉంటాయి. అవసరాల మేరకు ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఏవిధంగా రూపొందించాలో ఇందులో వివరిస్తారు. అదేవిధంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో కూడా ఎయిర్‌క్రాఫ్ట్‌ల రూపకల్పన ప్రధానం అంశంగా ఉంటుంది. టాప్ ఇన్స్టిట్యూట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ-తిరువనంతపురం వెబ్సైట్: www.iist.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -మద్రాస్ వెబ్సైట్: www.iitm.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే వెబ్సైట్: www.iitb.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు వెబ్సైట్: www.iisc.ernet.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్ వెబ్సైట్: www.iitk.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్‌పూర్ వెబ్సైట్: www.iitkgp.ac.in