
భవనం ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్, సీఎం బొమ్మై, సతీశ్‌రెడ్డి
సాక్షి, బెంగళూరు: యుద్ధ విమానాల (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఏఎంసీఏ) తయారీ కోసం బెంగళూరులో డీఆర్‌డీఓ 1.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఏడంతస్తుల భవనాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురువారం ప్రారంభించారు. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో డీఆర్‌డీఓ సొంతంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో కేవలం 45 రోజుల్లో విమాన నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఐదో తరం మీడియం వెయిట్ డీప్ పెన్‌ట్రేషన్ ఫైటర్ జెట్‌కు అవసరమైన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సదుపాయాలు ఇందులో ఉన్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. దేశ వైమానిక సామర్థ్యం మరింత పెంచేందుకు ఈ ఫైటర్ జెట్ అభివృద్ధి పథకం ఉపయోగపడుతుందన్నారు. ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.15 వేల కోట్లని తెలిపారు. ప్రధాని నేతృత్వంలోని భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ త్వరలోనే దీనికి ఆమోదం తెలపనుందని ఆయన చెప్పారు.
కార్యక్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై, డీఆర్‌డీఓ చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ భవనానికి 2021 నవంబర్ 22వ తేదీన శంకుస్థాపన జరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన వాస్తవ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అధికారులు చెప్పారు. సంప్రదాయ, ప్రీ ఇంజినీర్డ్ ప్రీ కాస్ట్ మెథడాలజీతో రికార్డు స్థాయిలో 45 రోజుల్లోనే డీఆర్‌డీవో ఈ భవనాన్ని నిర్మించిందని తెలిపారు. ఐఐటీ రూర్కీ, ఐఐటీ మద్రాస్‌కు చెందిన నిపుణులు డిజైన్‌కు సంబంధించి సహకారం అందించారన్నారు.