‘‘ఉన్నతమైన కలలు కనాలి.. వాటి సాకారానికి అకుంఠిత దీక్షతో కృషి చేయాలి’’.. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్న మాటలు ఆమె పుణికి పుచ్చుకుంది. అందుకే చిన్నప్పటి నుంచి ఆమె ఆలోచనలు.. ఆశయాలు.. లక్ష్యాలు అన్నీ సమున్నతంగానే సాగాయి. తనను తాను మలుచుకుంటూ ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి ఎదగాలని పట్టుదలతో పరిశ్రమించింది. ఓ మహిళగా దేశంలోనే ఎవరూ అందుకోలేని సమున్నత శిఖరాన్ని అధిరోహించింది. యుద్ధ విమానాల తయారీ రంగంలోకి తొట్టతొలి మహిళగా అడుగు పెట్టింది. దేశ రక్షణరంగానికి సేవ చేయాలన్నదే తమ ఆశయమని ఆమె చెబుతుంటే తెలుగు వారందరికీ గర్వంగా అనిపిస్తుంది. నేటియువతరానికి స్ఫూర్తిని నింపే ఈ కథనం సాక్షికి ప్రత్యేకం.
గుజ్జర్లమూడి కృష్ణ సాహి... కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి చెందిన ఈమె తల్లిదండ్రులిరువురూ ఉపాధ్యాయులే. తల్లి సుజాత గూడురులో జిల్లా పరిషత్ స్కూల్‌లో పనిచేస్తుంటే, తండ్రి రామకృష్ణ మచిలీపట్నంలోనే రాంజీ హైస్కూల్‌లో చేస్తున్నారు. తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ అందరూ ఉపాధ్యాయరంగానికి చెందినవారే. వారిలా తాను ఉపాధ్యాయురాలిగా కాకుండా ఎవరూ సాధించనిది ఏదైనా సాధించాలని చిన్నప్పటి నుంచి తపన పడేది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుంది. పట్టుదలగా చదివింది. అకుంఠిత దీక్షతో ఆ దిశగా అడుగులు వేసింది. అన్నింటిలోనూ మెరిట్ సాధిస్తూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ తనను తాను మలుచుకుంది. టెన్త్‌లో 92 శాతం మార్కులతో జాతీయస్థాయి మెరిట్ స్కాలర్‌షిప్ పొందింది. అదే స్కాలర్‌షిప్‌తో ఇంటర్, బీటెక్ పూర్తిచేసింది. ఇంటర్‌లో 95 శాతం మార్కులతో ఎంసెట్‌లో 2000వ ర్యాంక్ సాధించింది.
మెకానికల్ వద్దన్నా వినలేదు...
స్నేహితులందరూ ఈఎస్‌ఈ, సీఎస్‌సీ బ్రాంచ్‌లు తీసుకుంటే తాను మాత్రం మెకానికల్ తీసుకుంది. ఎస్వీ యూనివర్శిటీలో 2012లో 76.3 శాతం మార్కులతో బీటెక్ పూర్తి చేసింది. ఇలా బీటెక్ పూర్తి కాగానే అలా సెయింట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీలో ఏరోస్పేస్ ఇంజనీర్ గా జాబ్ వచ్చింది. అక్కడ పనిచేస్తూనే ఏరోనాటికల్ ఇంజనీర్‌గా శిక్షణ పొందింది. 2015 ఏప్రిల్‌లో యూకేలో ఎయిర్‌బస్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఆఫ్‌సైట్‌లో తొమ్మిది నెలలు పనిచేసింది. 2016లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఎ)లో ఏరో నాటికల్ ఇంజనీర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసింది. యూపీఎస్‌సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షల్లో ఒకే ఒక్క మార్క్ తేడాతో వెయిటింగ్ లిస్ట్‌లో అవకాశం తప్పిపోయింది. అయినా పట్టువదల్లేదు. ఆ వెంటనే అంతర్జాతీయస్థాయిలో పేరొందిన బోయింగ్ ఏరోస్పేస్ ఇన్ ఇండియా కంపెనీలో ఛాన్స్ దక్కించుకుంది. దేశంలోనే తొలి మహిళా ఏరోనాటికల్ ఇంజనీర్‌గా పనిచేసే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ పోస్టుకి 800 మంది ఇంటర్వూ్యకు హాజరైతే నలుగురు ఎంపికయ్యారు. వారిలో ఒక్కరు... తెలుగింటి ఆడపడచు కావడం సంతోషకరం. – పంపాన వరప్రసాదరావు, సాక్షి, మచిలీపట్నం
యుద్ధ విమానాల తయారీలో ‘బోయింగ్’
బోయింగ్ ఏరోస్పేస్ ఇన్ ఇండియా... ఇది అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ, ఇండియాకు చెందిన టాటా గ్రూప్ కొలాబరేషన్‌తో డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసే సంస్థ. హైదరాబాద్‌లోని ఆదిభట్లలో 2013–14లో ప్రారంభించిన ఏకైక యూనిట్ ఇది. దీంట్లో అగస్తా వెస్ట్‌లాండ్ అపాచీ వార్ హెలికాప్టర్‌లు తయారు చేస్తారు. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే విడిభాగాలను తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేస్తారు. అంతేకాదు, మల్టిఫుల్ ఎయిర్ క్రాప్ట్స్ ఇక్కడ తయారవుతాయి. ప్రస్తుతం ఇక్కడ ఎహెచ్–64 అపాచీ వార్ ఎయిర్‌క్రాఫ్ట్స్ తయారవుతున్నాయి. ఇక్కడ బోయింగ్ కంపెనీ తరవున తొమ్మిది మంది సిబ్బంది, టాటా తరపున నాలుగు వేల మంది వరకు పనిచేస్తుంటారు. అలాంటి ప్రతిష్టాత్మక కంపెనీలో కృష్ణ సాహి బోయింగ్ తరపున ప్రొడక్టు రివ్యూ ఇంజనీర్‌గా సెలక్ట్ అవడం సంతోషకరం.
ఆనందానికి అవధుల్లేవు
యుద్ధ విమానాల తయారీ కంపెనీలో నెం.1 గా ఉన్న బోయింగ్ సంస్థలో ఏరోనాటికల్ ఇంజినీర్‌గా చేరతానని కలలో కూడా ఊహించలేదు. ‘యూ ఆర్ సెలక్టెడ్ ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా యాజ్ ఏరోనాటికల్ ఇంజనీర్ ఇన్ అవర్ ప్రెస్టేజియస్ ఇనిస్టిట్యూషన్’ అని ఆ కంపెనీ నుంచి అపాయింట్‌మెంట్ ఆర్డర్ రాగానే ఆనందానికి అవధుల్లేవు. వెంటనే∙బందరు నుంచే వర్చ్యువల్ జాయినింగ్ రిపోర్టు ఇచ్చా. ఈ సోమవారం విధుల్లో చేరబోతున్నాను. గుజ్జర్లమూడి కృష్ణ సాహి తొలి మహిళా ఏరోనాటికల్ ఇంజనీర్
‘నో రిజర్వేషన్’ అంది
మా అమ్మాయి చిన్నప్పటి నుంచి బాగా చదువుకునేది. మేమిద్దరం టీచర్లమైనప్పటికీ మా నుంచి ఏదీ కోరుకోలేదు. మాకు ఎస్సీ రిజర్వేషన్ ఉన్నా ఒక్కసారి కూడా ఉపయోగించుకోలేదు. అన్నిటిలోనూ మెరిట్. తన కాళ్లమీద తాను నిలబడాలనే తపనతో ముందుకు సాగింది. ఎవరూ సాధించనిది తాను సాధించాలని కలలు కనడమే కాదు, అనుకున్నది సాధించింది. దేశంలోనే తొలి మహిళా ఏరోనాటికల్ ఇంజనీర్‌గా సెలక్ట్ అవడం కృష్ణ సాహి తల్లిదండ్రులుగా మాకు చాలా గర్వకారణం. మా కుటుంబాలలో ఈ స్థాయికి ఎదిగిన మా అమ్మాయిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. – జి.సుజాత, కృష్ణ సాహి తల్లి
Comments
Please login to add a commentAdd a comment