ఏ సంస్థలోనైనా ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ)ది ప్రధాన పాత్ర.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సీఏ నిపుణులకు డిమాండ్ ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామికీకరణ, సేవ, ఉత్పత్తి రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుండడంతో సీఏ నిపుణులకూ విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న వయసులోనే సమాజంలో హోదా, గౌరవంతోపాటు మంచి వేతనం అందుకోవచ్చు.
సీఏ కోర్సు విధానం:
సీఏ కోర్సును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. ఇందులో కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ), ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్‌స కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి. ఈ కోర్సు మొత్తం పూర్తి చేయడానికి ఇంటర్మీడియెట్ తర్వాత కనీసం 4 ఏళ్లు పడుతుంది. సీఏ అభ్యసించాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
సీపీటీ:
ఇంటర్మీడియెట్ తర్వాత విద్యార్థి సీపీటీ పరీక్ష రాయాలి. ఏటా జూన్, డిసెంబర్‌ల్లో దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో అకౌంట్స్ 60 మార్కులకు, మర్కంటైల్ లా 40 మార్కులకు, ఎకనమిక్స్ 50 మార్కులకు, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ కలిపి 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టులో కనీసం 30 శాతం మార్కులు సాధిస్తూ నాలుగు సబ్జెక్టులు కలిపి కనీసం 50శాతం మార్కులు అంటే 100కి పైగా మార్కులు సాధించాలి. సీపీటీ పూర్తి చేసిన విద్యార్థులు 9 నెలల తర్వాత ఐపీసీసీ పరీక్ష రాయాలి. డిగ్రీ, పీజీ అర్హతతో సీపీటీ రాయకుండానే నేరుగా ఐపీసీసీలో ప్రవేశించొచ్చు.
ఐపీసీసీ:
ఏటా మే, నవంబర్‌ల్లో ఐపీసీసీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. గ్రూప్-1లో అకౌంట్స్ 100 మార్కులు, లా, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ 100మార్కులు, ఇన్‌కమ్ టాక్స్, సర్వీస్ టాక్స్, వ్యాట్ 100మార్కులు, కాస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్-2లో అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్ 100 మార్కులు, ఆడిటింగ్ 100 మార్కులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి గ్రూపులో ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు సాధించాలి. అలాగే గ్రూపు మొత్తం మీద 50 శాతం మార్కులు అంటే కనీసం 150 మార్కులు సాధించాలి. అభ్యర్థులు తమ వీలును బట్టి రెండు గ్రూపులను ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయొచ్చు. తర్వాత ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులోనూ ఉత్తీర్ణత సాధించాలి.
ఆర్టికల్‌షిప్‌తో స్టైపెండ్:
ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 లేదా 2 గ్రూప్స్ పూర్తిచేసిన విద్యార్థులు ప్రొఫెషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ వద్ద మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తిచేయాలి. ఈ సమయంలో విద్యార్థులకు ప్రతి నెల స్టైపెండ్ లభిస్తుంది. ఆర్టికల్‌షిప్ పూర్తవడానికి ఆర్నెల్ల ముందు సీఏ ఫైనల్ పరీక్ష రాయాలి.
ఫైనల్:
సీఏ ఫైనల్ కూడా గ్రూప్-1, గ్రూప్-2లుగా ఉంటుంది. ప్రతి ఏటా మే, నవంబర్‌ల్లో సీఏ ఫైనల్ పరీక్షలు జరుగుతాయి. గ్రూప్-1లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ 100 మార్కులకు, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ 100 మార్కులకు, అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ 100 మార్కులకు, కార్పొరేట్ అండ్ ఎలైడ్ లాస్ 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్-2లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ 100 మార్కులకు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్ 100 మార్కులకు, డెరైక్ట్ టాక్స్ 100 మార్కులకు, ఇన్‌డెరైక్ట్ టాక్స్ 100 మార్కులకు ఉంటాయి. ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులోనూ 40 మార్కులు, ప్రతి గ్రూప్‌లో లేదా రెండు గ్రూపులు కలిపి 50 శాతం మార్కులు సాధించాలి.
విస్తృత అవకాశాలు!
టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సాఫ్ట్‌వేర్‌తో పాటు వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాలతోపాటు సీఏ కోర్సునభ్యసించిన వారికి దేశ, విదేశాల్లోనూ అవకాశాలున్నాయి. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ప్రతిభ, అనుభవం ఆధారంగా అధిక వేతనాలు అందుకోవచ్చు.
అకౌంటింగ్ టెక్నీషియన్ కోర్సు:
సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తి చేయలేను అని భావిస్తే ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తిచేసి, ఏడాదిపాటు సీఏ దగ్గర ఆర్టికల్ షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లభిస్తుంది. దాంతో ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థల్లో అకౌంటెంట్‌గా చేరి నెలకు కనీసం రూ.30వేలు సంపాదించొచ్చు. ఉద్యోగం చేస్తూనే ఐపీసీసీ 2వ గ్రూపులో కూడా ఉత్తీర్ణత సాధించి చార్టర్ట్ అకౌంటెంట్ హోదాను పొందొచ్చు.
2016 కొత్త సిలబస్‌లో ముఖ్య మార్పులు
సీఏ కోర్సులోని ఐపీసీసీని విద్యార్థులు కష్టంగా భావిస్తున్నారు కాబట్టి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ఐసీఏఐ 9నెలలు ఉన్న ఐపీసీసీ కోర్సు కాలవ్యవధిని 12నెలలకు పెంచింది.సీఏ కోర్సులోని ప్రతిదశలో కమ్యూనికేషన్ స్కిల్స్‌కు పెద్దపీట వేశారు.విద్యార్థులు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్న ఐపీసీసీలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ అనే పేర్లను పూర్తిగా తొలగించారు.
పాత సిలబస్‌లో సీఏ-ఐపీసీసీలోని కాస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ రెండు సబ్జెక్ట్‌ల సిలబస్ కేవలం 100 మార్కులకే కేటాయించడం వల్ల స్టూడెంట్స్ ఒత్తిడిని ఎదుర్కొనేవారు. కానీ కొత్త సిలబస్ ప్రకారం వీటిని 200 మార్కులకు పెంచారు. అలాగే డెరైక్ట్ టాక్సెస్ అండ్ ఇండెరైక్ట్ టాక్సెస్ రెండు సబ్జెక్టుల మార్కులను 100 నుంచి 200 మార్కులకు పెంచారు.
సీఏ ఫైనల్‌లో ఇంటర్నేషనల్ టాక్సేషన్ అనే సబ్జెక్టును ప్రవేశపెట్టారు. తద్వారా సీఏ పూర్తిచేసిన అభ్యర్థులకు విదేశాల్లోనూ ఉద్యోగాలు ఎక్కువగా లభించే అవకాశం ఏర్పడుతుంది.సీఏ కోర్సులోని మొదటి దశ సీఏ-సీపీటీ ఇప్పటివరకు కేవలం ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇకపై 50 శాతం డిస్క్రిప్టివ్, 50శాతం ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇది విద్యార్థుల్లో కాన్సెప్ట్ అర్థం చేసుకుని పరీక్ష రాసే అలవాటు పెంపొందించుకుంటారు. అంతేకాకుండా డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే ఐపీసీసీ, ఫైనల్ పరీక్షలకు మరింత మెరుగ్గా సన్నద్ధం అయ్యేందుకు తోడ్పడుతుంది.
సీఏ కోర్సులోని సీపీటీ, ఐపీసీసీ దశల పేర్లను వరుసగా ఫౌండేషన్, ఇంటర్మీడియెట్‌లుగా మార్చారు.
కొత్త సిలబస్‌ను ఐసీఏఐ అమల్లోకి తీసుకురాలేదు.
త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్
విడుదల చేసే అవకాశం ఉంది.
చార్టర్డ్ అకౌంటెంట్.. ఎవర్‌గ్రీన్ కెరీర్!
Published Wed, Jun 10 2015 11:35 PM | Last Updated on Sat, Jul 28 2018 8:18 PM
Advertisement
Advertisement