కుటుంబ నేపథ్యమే... స్ఫూర్తి | Chartered Accountancy Course | Sakshi
Sakshi News home page

కుటుంబ నేపథ్యమే... స్ఫూర్తి

Published Thu, Sep 4 2014 4:19 AM | Last Updated on Sat, Jul 28 2018 8:18 PM

కుటుంబ నేపథ్యమే... స్ఫూర్తి - Sakshi

కుటుంబ నేపథ్యమే... స్ఫూర్తి

 అక్క చార్టర్‌‌ అకౌంటెంట్.. నాన్న ఆడిటర్.. ఇలా కుటుంబ నేపథ్యం ఇచ్చిన స్ఫూర్తితో.. లక్ష్యం దిశగా కదిలింది.. లెక్కలు, పద్దులు అంటూ అంకెల సముద్రాన్ని తలపించే చార్టర్‌‌డ అకౌంటెన్సీ కోర్సును సులువుగా పూర్తి చేయడమేకాకుండా జాతీయ స్థాయిలో 42వ ర్యాంక్ సాధించింది.. అరవపల్లి హరిప్రియ.. ఈ దిశగా చేసిన కృషి, సీఏ ఔత్సాహికులకు విలువైన సూచనలతో హరిప్రియ సక్సెస్ స్పీక్..  స్వస్థలం గుంటూరు. నాన్న అరవపల్లి వెంకటేశ్వర్లు ట్యాక్స్ కన్సల్టెంట్‌లో ఆడిటర్. అమ్మ శశికళ గృహిణి. అక్క పుష్ప శిరీష చార్టర్‌‌డ అకౌంటెంట్. ప్రస్తుతం కరీంనగర్‌లో సొంతంగా సంస్థను నిర్వహిస్తుంది.
 
 కుటుంబమే స్ఫూర్తి:
 మొదటి నుంచి సైన్స్ సబ్జెక్ట్ అంటే ఆసక్తి. కాకపోతే పదో తరగతిలో ఉన్నప్పుడే అందరిలా మెడిసిన్, ఇంజనీరింగ్ కాకుండా భిన్నమైన కెరీర్‌ను ఎంచుకోవాలనుకున్నా. అదే సమయంలో నాన్న, అక్కల వృత్తి, విద్యా నేపథ్యం స్ఫూర్తిగా నిలిచింది. దాంతో  చార్టర్‌‌డ అకౌంటెన్సీ (సీఏ) కోర్సును చదవాలని నిర్ణయించుకున్నా. అంతేకాకుండా సీఏ కోర్సుకు ఉన్న డిమాండ్ ఈ దిశగా నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించింది. ఇంటర్మీడియెట్ ఎంఈసీ గ్రూపులో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ వచ్చింది. దాంతో ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యా.
 
 ఫైనల్ పరీక్షలకు:
 ఆర్టికల్‌షిప్ చేస్తూనే సీఏ ఫైనల్ పరీక్షలకు ప్రిపరేషన్ సాగించాను. ఇందుకోసం కోచిం గ్ కూడా తీసుకున్నా. సీఏ ఫైనల్లో మొత్తం 8 సబ్జెక్టులు ఉంటాయి. వీటిని గ్రూప్-1, గ్రూప్-2గా విభజించారు. గ్రూప్-1లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, కార్పోరేట్ అండ్ అలైడ్ లాస్ వంటి సబ్జెక్ట్‌లు ఉంటాయి. గ్రూప్-2లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్, ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్, డెరైక్ట్ ట్యాక్స్ లాస్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ లాస్ సబ్జెక్ట్‌లను చదవాలి. వీటిలో కాస్టింగ్ సబ్జెక్ట్ కొద్దిగా కష్టమనిపించింది. దాంతో ఆ సబ్జెక్‌కు మిగతా వాటి కంటే ఎక్కువ సమయం కేటాయించా. ఈ విషయంలో అక్క ఇచ్చిన సలహాలు, సూచనలు కూడా ఉపకరించాయి. గ్రూప్-1, గ్రూప్-2 సబ్జెక్టులను ఒకే సారి ప్రణాళిక ప్రకారం చదివా. 63.25శాతం మార్కులు వచ్చాయి.
 
 కారణాలనేకం:
 సీఏ పూర్తి చేయడం చాలా కష్టమని అందరూ భావిస్తుంటారు. కానీ ఆ అభిప్రాయం సరికాదు. ఎందుకంటే చాలా మంది కీలక సమయాల్లో కొన్ని మౌలిక తప్పులను చేస్తుంటారు. ఉదాహరణకు  ఆర్టికల్‌షిప్ చేస్తున్నప్పుడు చాలా మంది సీఏ ఫైనల్ పరీక్షలపై అంతగా శ్రద్ధ చూపకపోడం, తొలుత ఓ గ్రూపు, ఆ తర్వాత మరో గ్రూపు పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వడం, కేవలం మెటీరియల్ మీద మాత్రమే ఆధారపడి ప్రిపరేషన్ సాగించడం వంటివి.  వీటికి తోడు నిరంతరం సాధన చేయరు.  కాబట్టి ఈ అంశాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సీఏలో ఉత్తీర్ణత సాధించడం సులువే.
 
 నిరంతర మార్పులపై:
  చార్టర్‌‌డ అకౌంటెన్సీ కోర్సులో ఉండే సబ్జెక్టులంతా ఆర్థిక వ్యవస్థకు అనుబంధంగా ఉంటాయి. కాబట్టి ఆ వ్యవస్థలో ఎప్పటికప్పుడు పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు వస్తుంటాయి. దాంతో నూతన ఆర్థిక పోకడలు చోటు చేసుకుంటుంటాయి. అంటే మనం చదివే పుస్తకాల్లో అప్పటికున్న సబ్జెక్టుకు అదనంగా సమాచారాన్ని జోడించాలి. వీటిని పట్టించుకోకుండా ఎంత చదివినా వృథానే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను నోట్స్‌గా రాసుకోవడం, వాటిని సిలబస్ దృష్టి కోణంలో విశ్లేషించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతీ రోజూ చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆర్టికల్‌షిప్ చేస్తున్నప్పుడు కూడా ఒక్కో సబ్జెక్టుకు రోజుకు గంట సమయాన్ని కేటాయిస్తే తొలి ప్రయత్నంలోనే  సీఏలో ఉత్తీర్ణత సాధించవచ్చు.
 
 లక్ష్యం:
 మంచి అవకాశాలు వస్తే ఉద్యోగంలో చేరతాను. లేకపోతే సివిల్స్ దిశగా దృష్టి సారిస్త.
  అకడెమిక్ ప్రొఫైల్
 10వ తరగతి (2008): 550/600
 ఇంటర్ (ఎంఈసీ-2010): 968/1000
 సీఏసీపీటీ: 6వ ర్యాంక్ (జాతీయ స్థాయి)
 ఐపీసీసీ: 24వ ర్యాంక్ (జాతీయ స్థాయి)
 సీఏ ఫైనల్: 42వ ర్యాంక్ (జాతీయ స్థాయి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement