సంకల్పమే సగం విజయం | Institute of Chartered Accountants | Sakshi
Sakshi News home page

సంకల్పమే సగం విజయం

Published Thu, Aug 28 2014 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM

సంకల్పమే సగం విజయం

సంకల్పమే సగం విజయం

  సీఏ (ఛార్టర్డ్ అకౌంటెంట్)  పాసవ డమంటే మాటలా... ఓ భగీరథ ప్రయత్నం.. అందరికీ సాధ్యం కాదు. అసాధారణ ప్రతిభ ఉంటే తప్ప ఉత్తీర్ణులు కాలేరు.. ఇది సీఏ గురించి సర్వ సాధారణ అభిప్రాయం. అయితే అనుకున్న లక్ష్యం దిశగా సాగితే సీఏ పాసవడం బ్రహ్మ విద్యేమీ కాదని చాటి చెప్పాడు లక్ష్మీశ్రీనివాసరెడ్డి చిలకల. సీఏ పరీక్షలో జాతీయస్థాయిలో 24వ ర్యాంకర్‌గా నిలిచాడు. శ్రీనివాసరెడ్డి సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే..మాది గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామం. నాన్న గురవారెడ్డి. అమ్మ పూర్ణమ్మ.
 
 సలహా:
 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్ తీసుకోవాలి? ఏం చదవాలి? అనే సంశయం. ఆ సమయంలో అక్క లక్ష్మీకుమారి, బావ శ్రీనివాసరెడ్డి సలహా మేరకు సీఏ చేయాలని నిర్ణయించుకున్నా. ఆ క్రమం లోనే ఇంటర్‌లో ఎంఈసీ ఎంచుకున్నాను. చాలా మంది సీఏ చేయడం కష్టమన్నారు. కానీ నేను చేయగలనని వారు ప్రోత్సహించారు. ఎందులోనైనా కష్టపడనిదే ముందు కు సాగలేం. ఇదే స్ఫూర్తితో సీఏ కోర్సును కొనసాగించాను.
 
 24 ర్యాంక్ సాధ్యమైందెలా?
 ర్యాంక్ గురించి ఎప్పుడూ అంతగా ఆలోచించలేదు. కానీ మంచి మార్కులు తెచ్చుకోవాలి, మొదటి ప్రయత్నంలో సీఏలో ఉత్తీర్ణత సాధించాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. ఓ వైపు ఆర్టికల్‌షిప్ చేస్తూ నే ఉదయం, సాయంత్రం తరగతులకు హాజరయ్యే వాణ్ని. ఖాళీ సమయాన్ని పక్కా ప్రణాళికతో సద్వినియోగపరచుకున్నాను. మొత్తం 526 మార్కులు సాధించాను. దేశం మొత్తం మీద 42వేల మంది పరీక్ష రాయగా అందులో 7 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
 
 నాలుగు సబ్జెక్టులకే కోచింగ్:
 మొత్తం 8 సబ్జెక్టులను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-1, 2లలో చెరో నాలుగు సబ్జెక్టులుంటాయి. నాలుగు సబ్జెక్టులను సొంతంగానే చదివాను. ఫైనాన్షియల్ రిపోర్టింగ్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, కార్పోరేట్ లాస్, అడ్వాన్స్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ (కాస్టింగ్) సబ్జెక్టుల కోసం మాత్రం కోచింగ్ తీసుకున్నాను. అయితే కోచింగ్ తీసుకున్న సబ్జెక్టుల కంటే, సొంతంగా ప్రిపేరయిన వాటిలోనే ఎక్కువ మార్కులు వచ్చాయి. సీఏ ఫైనల్ పరీక్షల సయమంలో ఓ వైపు ఆర్టికల్‌షిప్ చేస్తూ, అన్ని సబ్జెక్టులను ఒకే విడతలో పూర్తి చేయాలనే లక్ష్యంతో సుదీర్ఘ ప్రణాళికతో సాగినప్పటికీ పరీక్షల సమయంలో కొంత ఒత్తిడికి గురయ్యాను. అయితే ఇది ఫలితంపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు.
 
 కోచింగ్ కొంతమేరకే:
 కోచింగ్ తీసుకోవడం ప్రయోజనకరమే. కానీ అక్కడ అధ్యాపకులు చెప్పే అంశాలే ప్రామాణికం కాదనే విషయాన్ని గమ నించాలి. వాటిపైనే ఆధారపడొద్దు. కోచిం గ్ తరగతుల్లో చెప్పేది కొంతమేర పరీక్షలకు ఉపయోగపడుతుంది. కాబట్టి సబ్జెక్ట్ అంశాలను అవగాహనతో విశ్లేషించుకునే సామర్థ్యం అలవరచుకోవాలి. ఆ దిశగా అధ్యయనం సాగించాలి.
 
 ఆర్టికల్‌షిప్ చేయాలనుకునే:
 ఐపీసీసీ పూర్తి చేసిన తర్వాత మూడేళ్లపాటు ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్‌షిప్ కోసం పెద్ద తరహా ఫర్మ్‌లను కాకుండా మధ్య స్థాయి ఫర్మ్‌లనుఎంచుకుంటేనే ప్రయోజనం ఎక్కువ. ఎందుకంటే వీటిలో సీఏ ఫైనల్ పరీక్షలకు దోహదపడే అన్ని అంశాలపైనా అవగాహన, అనుభవం ఏర్పడుతుంది. అదే పెద్ద తరహా ఫర్మ్‌ల్లో ఆర్టికల్‌షిప్ చేస్తే ఏదో ఒక సబ్జెక్‌కే పరిమితమవ్వాల్సి వస్తుంది.
 
 క్యాంపస్ ఇంటర్వ్యూకు సిద్ధం:
 ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) క్యాంపస్ ఇంటర్వూలను చేపట్టనుంది. అందులో మంచి ప్యాకేజీతో ఎంపికవుతాననే నమ్మకం ఉంది.
 
 లక్ష్యం:
 జీవితంలో స్థిరపడ్డాక ఓ ఫౌండేషన్ నెలకొల్పి పేద పిల్లలకు ఉచిత విద్య అందిస్తాను. అంతేకాకుండా సొంత ఊరికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నాను.
 
 అకడమిక్ ప్రొఫైల్:
 పదోతరగతి: 530 (2008)
 ఇంటర్: 965 (3వ ర్యాంకర్-2010)
 సీఏసీపీటీ: 8వ ర్యాంక్ (జూన్ 2010)
 ఐపీసీసీ: 29వ ర్యాంక్ (మే 2011)
 సీఏ ఫైనల్: 24వ ర్యాంక్ (మే 2014)
 సీఎంఏ ఇంటర్: 28వ ర్యాంక్ (2012)
 సీఎంఏ ఫైనల్: 17వ ర్యాంక్ (2013)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement