కంపెనీ సెక్రటరీస్..కొత్త కోర్సులు | Company Secretaries New courses | Sakshi
Sakshi News home page

కంపెనీ సెక్రటరీస్..కొత్త కోర్సులు

Published Mon, Aug 29 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

కంపెనీ సెక్రటరీస్..కొత్త కోర్సులు

కంపెనీ సెక్రటరీస్..కొత్త కోర్సులు

పస్తుత పోటీ ప్రపంచంలో ఎంచుకున్న రంగంలో శరవేగంగా దూసుకెళ్లాలంటే మనలోని నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ ఉండాలి. ఈ మేరకు కొత్త కోర్సులను అభ్యసించాలి. ఇదే ఉద్దేశంతో కామర్స్‌లో అదనపు నైపుణ్యాలను సొంతం చేసే సరికొత్త సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా’ (ఐసీఎస్‌ఐ) ప్రవేశపెట్టింది.
 
 కలల కొలువులకు మార్గం వేసే కంపెనీ సెక్రటరీ కోర్సుకు ఐసీఎస్‌ఐ పెట్టింది పేరు. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కరిక్యులంలో నిరంతరం మార్పులు చేర్పులు చేస్తూ విద్యార్థులకు నిత్య నూతన నైపుణ్యాలను నేర్పిస్తున్న ఐసీఎస్‌ఐ.. తాజాగా నాలుగు షార్ట్ టర్మ్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్’ (ఎన్‌ఐఎఫ్‌ఎం) భాగస్వామ్యంతో రూపొందించిన ఈ కోర్సుల క్లాసులు సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. సీఏ, సీఎస్ చదువుతున్న విద్యార్థులతోపాటు ఈ రంగంలో పనిచేస్తున్న నిపుణుల కెరీర్ అభివృద్ధికి దోహదపడే నయా కోర్సుల గురించి మరిన్ని వివరాలు..
 
 సర్టిఫికెట్ కోర్స్ ఇన్ వ్యాల్యుయేషన్
 ‘యాడ్ వ్యాల్యూ టు స్కిల్స్’గా పేర్కొనే ఈ కోర్సును ప్రధానంగా కంపెనీ సెక్రటరీ విద్యార్థులను, ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. వివిధ సంస్థల విలువల మదింపులో కంపెనీ సెక్రటరీలదే కీలక పాత్ర. దీంతో వ్యాల్యుయేషన్‌లో వస్తున్న ఆధునిక పద్ధతులపై సదరు విద్యార్థులకు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు, ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీలకు తర్ఫీదునిచ్చేలా ఈ కోర్సుకు రూపకల్పన చేశారు. మూడు నెలల వ్యవధి గల ఈ కోర్సులో అభ్యర్థులకు ప్రతి వారాంతంలో వెబినార్స్ ద్వారా ఆన్‌లైన్ లెక్చర్స్ అందిస్తారు.
 
 కోర్సులో భాగంగా 90 గంటల సమయాన్ని సెల్ఫ్ స్టడీకి, మరో 90 గంటల సమయాన్ని వెబ్ బేస్డ్ ట్రైనింగ్‌కు కేటాయించారు. వ్యాల్యుయేషన్ అనాలిసిస్‌లో ప్రాథమిక సిద్ధాంతాలైన అనుకరణ, స్ట్రాటజీ అనాలసిస్, ప్రాస్పెక్టివ్ అనాలసిస్, డీసీఎఫ్ మోడలింగ్, ట్రేడింగ్ కంపారబుల్స్, ట్రాన్సాక్షన్ కంపారబుల్స్‌లో శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తై అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైతే సర్టిఫికెట్ అందిస్తారు. కోర్సులో ఒకసారి చేరిన తర్వాత దాన్ని పూర్తి చేసేందుకు గరిష్టంగా మూడు అవకాశాలు ఇస్తారు. ఈలోపు ఉత్తీర్ణత సాధించాలి. లేకపోతే రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. మళ్లీ చేరాలంటే మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ కోర్సుకు సీఎస్ ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు.
 
 డిప్లొమా ఇన్ ఇంటర్నల్ ఆడిట్
 కార్పొరేట్ రంగం సెల్ఫ్ గవర్నెన్స్, సెల్ఫ్ సఫీషియన్సీ దిశగా అడుగులేస్తుండటంతో సంస్థల ఆర్థిక వ్యవహారాలు, సంబంధిత అంశాలకు సంబంధించి ఇంటర్నల్ ఆడిట్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త కోర్సుకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ఇంటర్నల్ ఆడిట్‌లోని అంశాలు, అమలవుతున్న విధానాలపై శిక్షణ ఇస్తారు. మూడు నెలల వ్యవధి గల ఈ కోర్సులో మొత్తం 50 గంటల సమయాన్ని సెల్ఫ్ స్టడీకి, మరో 50 గంటల సమయాన్ని ఆన్‌లైన్ లెక్చర్స్‌కు కేటాయించారు. కోర్సు పూర్తిచేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ అందిస్తారు. ఈ కోర్సుకు కూడా సీఎస్ ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు. కోర్సు కరిక్యులంలోని ప్రధానాంశాలు..
 
  ‘లా అండ్ రెగ్యులేషన్స్ ఆన్ ఇంటర్నల్ ఆడిటింగ్-నేషనల్ అండ్ ఇంటర్నేషనల్  కార్పొరేట్/ఆర్గనైజేషనల్ గవర్నెన్స్ ప్రిన్స్‌పుల్స్, ఆడిట్ ప్రాక్టీసెస్ ఇన్ రిలేషన్ టు ది అకౌంటింగ్ సిస్టమ్  ప్లానింగ్ అండ్ మేనేజింగ్ ఇంటర్నల్ ఆడిట్ అండ్ ఇంటర్నల్ ఆడిట్ ప్రోగ్రామ్.
 
 ఫ్రాడ్ రిస్క్ అండ్ కంట్రోల్స్  ఇంటర్నల్ ఆడిట్ ఆఫ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్, రిస్క్ అవేర్‌నెస్   ఇంటర్నల్ ఆడిట్ టూల్స్ అండ్ టెక్నిక్స్  ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్స్
 
 ఇ-లెర్నింగ్ మాడ్యూల్ ఆన్ బ్యాంకింగ్ టెక్నాలజీస్
 బ్యాంకింగ్‌లో టెక్నాలజీ ఆధారిత సేవలు, కార్యకలాపాలు పెరుగుతుండటంతో ఈ రంగంలో కొలువుల వేటలో ముందంజలో ఉండాలనుకునేవారికి, అలాగే ఈ రంగంలో ఇప్పటికే విధులను నిర్వర్తిస్తున్నవారికి సరికొత్త నైపుణ్యాలను అందించేలా ఈ కోర్సును రూపొందించారు. ముఖ్యంగా కామర్స్, సీఎస్, సీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణులకు బ్యాంకింగ్ రంగంలోని టెక్నికల్ అంశాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కోర్సుకు రూపకల్పన చేశారు. బ్యాంకింగ్ రంగంలో టెక్నికల్ టెర్మినాలజీ, టెక్నికల్ ఎనేబుల్డ్ ఆపరేషన్స్‌పై నైపుణ్యాలను అందించేలా కరిక్యులాన్ని తీర్చిదిద్దారు. ఈ కోర్సులో బోధనంతా స్వీయ అభ్యసన విధానంలో కొనసాగుతుంది. అభ్యర్థులకు నిర్ణీత అంశాలపై అవగాహన కలిగేలా మెటీరియల్ అందిస్తారు. మొత్తం 17 సెషన్లలో 8 గంటల వ్యవధిలో ఆన్‌లైన్ లెక్చర్స్/సెల్ఫ్ స్టడీ ఉంటుంది. ఈ కోర్సుకు దరఖాస్తు చేసేందుకు గడువు విధించలేదు. ఏడాది పొడవునా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.
 
 కోర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ట్యాక్సేషన్
 ప్రస్తుతం మన దేశంలో పలు బహుళ జాతి సంస్థలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. దీంతోపాటు మన దేశంలోని వివిధ సంస్థలతో సంయుక్త వ్యాపార వ్యవహారాలను జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్ ప్రొఫెషనల్స్‌కు అంతర్జాతీయ పన్ను విధానాలు, ఎఫ్‌డీఐలు, డబ్ల్యుటీఓ విధానాలు తదితర అంశాలపై తర్ఫీదునిచ్చే ఉద్దేశంతో ఈ కొత్త కోర్సును రూపొందించారు. దీన్ని పూర్తిచేసిన అభ్యర్థులు ఎంఎన్‌సీల ట్యాక్స్ ప్రిన్స్‌పుల్స్, ఇతర అంశాలపై పూర్తిస్థాయి నైపుణ్యం సాధిస్తారు. కోర్సు క్లాసులు మొత్తం 15 రోజుల వ్యవధిలో ఆన్‌లైన్ విధానంలో ఉంటాయి. ఈ కోర్సుకు కూడా రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఎలాంటి కాలపరిమితి లేదు. ఏడాది పొడవునా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
 ఈ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం
 ఔత్సాహిక అభ్యర్థులు ఐసీఎస్‌ఐ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి.
 
  హోం పేజ్‌లో ఆయా కోర్సులకు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
 
 సర్టిఫికెట్ కోర్స్ ఇన్ వ్యాల్యుయేషన్, డిప్లొమా ఇన్ ఇంటర్నల్ ఆడిట్ కోర్సులకు ఒక్కో బ్యాచ్‌కు ఎంత మందిని ఎంపిక చేస్తారనే విషయాన్ని పేర్కొనలేదు. అయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ప్రాధాన్యత ఉంటుందని మాత్రం స్పష్టం చేశారు.
 వెబ్‌సైట్: వివరాలకు ఠీఠీఠీ.జీఛిటజీ.్ఛఛీఠ చూడొచ్చు.
 
 వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్‌కు అదనపు ప్రయోజనం
 ఐసీఎస్‌ఐ రూపొందించిన నాలుగు షార్ట్‌టర్మ్ కోర్సులు వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌లకు కెరీర్‌పరంగా అదనపు నైపుణ్యాలు పొందడానికి ఉపకరిస్తాయి. ఈ కోర్సులన్నింటినీ సెల్ఫ్ స్టడీ విధానంలో అభ్యసించే వీలుంది. అందువల్ల సమాయాభావం అనే సమస్య తలెత్తదు. అన్ని రంగాల మాదిరిగానే కార్పొరేట్ రంగంలో కూడా రోజురోజుకీ కొత్త విధానాలు ఆవిష్కృతమవుతున్నాయి. వాటిని అందిపుచ్చుకుంటేనే కెరీర్‌పరంగా ఉన్నతి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఐసీఎస్‌ఐ.. ఎన్‌ఐఎఫ్‌ఎం భాగస్వామ్యంతో వీటికి రూపకల్పన చేసింది.
 - ఆర్. రామకృష్ణ గుప్తా సెక్రటరీ, ఐసీఎస్‌ఐ-ఎస్‌ఐఆర్‌వో.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement