కాంపిటీటివ్ కౌన్సెలింగ్: గ్రూప్ 1,2, సివిల్స్ | Competitive Counseling for civils, Group 1-Group2 | Sakshi
Sakshi News home page

కాంపిటీటివ్ కౌన్సెలింగ్: గ్రూప్ 1,2, సివిల్స్

Published Thu, Jul 10 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

కాంపిటీటివ్ కౌన్సెలింగ్: గ్రూప్ 1,2, సివిల్స్

కాంపిటీటివ్ కౌన్సెలింగ్: గ్రూప్ 1,2, సివిల్స్

గ్రూప్ 1,2, సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో ఎన్నికల సంస్కరణల గురించిన ప్రశ్నలు వస్తున్నాయా? ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది?   
- ఎస్.శ్రీకాంత్, ఖైరతాబాద్
 ‘భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు’ అనే అంశం  ప్రతి పోటీ పరీక్షలోనూ కీలకమే. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ముఖ్యంగా సివిల్స్ అభ్యర్థులు భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ రూపకల్పన, దాని విధులు,  ఎన్నికల ప్రక్రియ,  ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు చేపట్టిన సంస్కరణలు, చేసిన రాజ్యాంగ సవరణలు లాంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు ఎన్నికల ప్రధాన అధికారికి సంబంధించిన  కింది ప్రశ్నను పరిశీలించండి.
 ప్రశ్న:  ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించేది?(సివిల్స్-1994)
 1. రాష్ట్రపతి మాత్రమే
 2. భారత ప్రధాన న్యాయమూర్తి
 3. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంగా
 4. పదవీకాలం ముగియక ముందే తొలగించే అవకాశం లేదు
 సమాధానం: 3
 వివరణ:  324వ అధికరణ ప్రకారం భారత రాష్ర్టపతి నియమించే  ఎన్నికల ప్రధాన అధికారిని తొలగించాలంటే పార్లమెంట్‌లో 2/3వ వంతు మెజార్టీతో తీర్మానం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా  ఇతర కమిషనర్లను తొలగించే సందర్భంలో ప్రధాన కమిషనర్‌ను కొలీజియంగా సంప్రదించిన కేంద్ర క్యాబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు.
 
 అదే విధంగా పార్లమెంట్ సభ్యుల అనర్హతకు సంబంధించిన కింది ప్రశ్నను పరిశీలించండి.
 ప్రశ్న: పార్లమెంట్ సభ్యుల అనర్హతను నిర్ణయించేది?(సివిల్స్ - 1979)
 1. ఎన్నికల కమిషనర్ 2.భారత పార్లమెంట్
 3. రాష్ర్టపతి 4. సుప్రీంకోర్టు
 సమాధానం: 3
 రాజ్యాంగంలోని 103వ అధికరణ ప్రకారం పార్లమెంట్ సభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం కేవలం రాష్ట్రపతికే ఉంటుంది.  ఉదాహరణకు రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న జయాబచ్చన్‌ను  అప్పటి రాష్ట్రపతి ఎన్నికల కమిషన్‌ను సంప్రదించి అనర్హురాలిగా ప్రకటించారు. అందుకు కారణం... ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉండడంతో పాటు ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా  కొనసాగారు.   అందుకుగాను ఆమె పదివేల రూపాయల గౌరవ వేతనంతో పాటు  ఆ సంస్థ లక్నోలో కల్పించిన ఉచిత నివాస భవనాన్ని కూడా ఉపయోగించుకున్నారు.  
 
 ఇలాంటి సందర్భాల్లో భారత ఎన్నికల చరిత్రలో ఇంకేమైనా  ఉన్నాయో పరిశీలించి ఆయా సంఘటనలన్నింటినీ క్రోడీకరించుకోవాలి.  ఎన్నికల ప్రక్రియకు  సంబంధించిన ప్రతి అంశాన్నీ  భిన్న కోణాల్లో  అధ్యయనం చేయాలి. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా, ఎన్నికల సంఘం వెబ్‌సైట్స్ ద్వారా సమకూర్చుకోవాలి.  భారతదేశంలో ప్రస్తుతం ఉన్న  ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు అవసరమా? అవసరమైతే ఎలాంటి సంస్కరణలు చేపట్టాలి? వాటి వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి? లాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. అదేవిధంగా ఎన్నికల సంస్కరణల గురించి మరింత లోతైన అధ్యయనానికి కింది పుస్తకాలు ఉపయోగపడతాయి.
 
 1.ఎలక్టోరల్  రిఫార్మ్స్  ఇన్ ఇండియా - శాంతి భూషణ్
 2. జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఎలక్టోరల్ పాలిటిక్స్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ - ఎ.ఎల్. అహుజా
 3. ఎలక్టోరల్  రిఫార్మ్స్  ఇన్ ఇండియా - బి.వెంకటేష్ కుమార్
 
 ఇన్‌పుట్స్: డాక్టర్ జి.ప్రభాకర్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
 
 ఎస్‌బీఐ పీఓ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలపండి?
     - బి.రాగసుధ, అల్వాల్  
 ఎస్‌బీఐ పీవో పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో సాధారణంగా కాంప్రహెన్షన్ టెస్ట్; కామన్ ఎర్రర్స్; ఫిల్లింగ్ ద బ్లాంక్స్; జంబుల్డ్ సెంటెన్స్; జంబుల్డ్ వర్డ్స్; స్పెల్లింగ్ ఎర్రర్స్; ఫ్రేజ్ మీనింగ్; ఫ్రేజ్ రీప్లేస్‌మెంట్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడగొచ్చు. వీటిలో అధిక వెయిటేజీ అంటే దాదాపు 25 నుంచి 30 శాతం ప్రశ్నలు కాంప్రెహెన్షన్ నుంచే వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లిష్ విభాగంలో రాణించాలంటే గ్రామర్, వొకాబ్యులరీ మీద పట్టు తప్పనిసరి. స్పాటింగ్ ద ఎర్రర్స్ విభాగంలో విజయానికి గ్రామర్ నైపుణ్యమే మార్గం.
 
  సబ్జెక్ట్, వెర్బ్ ఒకదానికొకటి సమన్వయం ఉందా? లేదా? అనే విషయాన్ని పరిశీలించేలా చదవాలి. గ్రామర్‌పై పట్టుకోసం నిరంతర అధ్యయనమే ప్రధాన ఆయుధం. స్పీడ్ రీడింగ్ కూడా ఇంగ్లిష్‌లో రాణించడానికి దోహదపడుతుంది. వేగం నిమిషానికి 200 నుంచి 250 పదాలు చదివే విధంగా ఉండాలి. అంతేకాకుండా డిస్క్రిప్టివ్ పరీక్షలో కూడా ఇంగ్లిష్‌కే పెద్దపీట వేశారు. ఇందులో లెటర్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్, ఎస్సే రైటింగ్ వంటి అంశాలను చేర్చడం వల్ల ఇంగ్లిష్‌లో పూర్తి పట్టు సాధించడం తప్పనిసరి. ఇందుకోసం అభ్యర్థులు సెంటెన్స్ ఫార్మేషన్; వొకాబ్యులరీ; టెన్సెస్‌పై అవగాహన పొందాలి.
 
 రిఫరెన్స్ బుక్స్:
  ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ -హరిమోహన్ ప్రసాద్
  ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ - ఎ.కె. కపూర్
 ఇన్‌పుట్స్: కె.వి.జ్ఞానకుమార్, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement