పీఎస్‌ఎల్‌వీ–సీ 36 ప్రయోగం విజయవంతం | Competitive Guidance Current Affairs | Sakshi
Sakshi News home page

పీఎస్‌ఎల్‌వీ–సీ 36 ప్రయోగం విజయవంతం

Published Thu, Dec 15 2016 4:03 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM

Competitive Guidance Current Affairs

జాతీయం
 అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం
భారత్‌లోనే అతి పెద్ద చమురు శుద్ధి (రిఫైనరీ) కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)లు న్యూఢిల్లీలో జరిగిన పెట్రోటెక్‌ సదస్సులో డిసెంబర్‌ 7న సంతకాలు చేశాయి. ఈ రిఫైనరీని ఐఓసీ నాయకత్వంలోని కన్సార్షియం పశ్చిమ తీరంలో (మహారాష్ట్ర) 30 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) వ్యయంతో, 60 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో నిర్మిస్తోంది. ఇందులో ఐవోసీ వాటా 50 శాతం. కాగా.. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ చెరో 25 శాతం వాటాలను కలిగున్నాయి.

భారత్, వియత్నాం మధ్య కుదిరిన అణు ఒప్పందం
వియత్నాం జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు ఎన్‌గాయోన్‌ దచిన్‌గాన్‌ భారత్‌lపర్యటన సందర్భంగా న్యూఢిల్లీలో డిసెంబర్‌ 9న పౌర అణు సహకార ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. దీంతోపాటు వైమానిక సంబంధాల్ని పెంచుకోవడం, ఇంధన రంగంలో ఉమ్మడి కృషి, పార్లమెంటరీ సహకారానికి సంబంధించి మరో మూడు ఇతర ఒప్పందాలపైనా సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భారత్‌ తరఫున లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పాల్గొన్నారు.

ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో భారత్‌కు 7వ స్థానం
ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌ (ఐఈపీ) 2015 సంవత్సరానికి ఉగ్రవాద ప్రభావిత దేశాల సూచీని డిసెంబర్‌ 8న విడుదల చేసింది. ఇందులో ఇరాక్‌ మొదటి స్థానంలో నిలవగా, భారత్‌ 7వ స్థానంలో ఉంది. ఉగ్రవాదానికి అత్యధికంగా ప్రభావితం అవుతున్న మొదటి 10 దేశాల్లో ఆరు దేశాలు ఆసియాకు చెందినవే. ప్రపంచంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 20 శాతం ఇరాక్‌లోనే జరగ్గా, భారత్‌లో 7 శాతం, అఫ్గానిస్తాన్‌లో 14 శాతం, పాకిస్థాన్‌లో 8 శాతం దాడులు జరిగాయి.

 ఇండోనేసియా అధ్యక్షుడి భారత్‌ పర్యటన
ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో భారత్‌ పర్యటనలో భాగంగా డిసెంబర్‌ 12న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. చర్చల్లో భాగంగా రక్షణ, భద్రతా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

అంతర్జాతీయం
 అమెరికాకు పెద్ద రక్షణ భాగస్వామిగా భారత్‌
భారత్‌ను అమెరికాకు పెద్ద రక్షణ భాగస్వామిగా గుర్తించే బిల్లుకు ఆ దేశ సెనేట్‌ ఆమోదం లభించింది. సెనేట్‌లో డిసెంబర్‌ 8న జరిగిన ఓటింగ్‌లో 92–7 తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా దీనిపై సంతకం చేస్తే ఒప్పందం అధికారికంగా కార్యరూపం దాల్చుతుంది.

వెనెజువెలాలో పెద్ద నోట్ల రద్దు వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్‌ మదురో ఆ దేశంలో పెద్ద కరెన్సీ నోట్‌ అయిన 100 బొలివర్‌ను రద్దు చేస్తూ డిసెంబర్‌ 12న అత్యవసర  జారీ చేశారు.

అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షురాలు
దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్‌ గియోన్‌ హై అభిశంసనకు గురయ్యారు. దీంతో ఆమె తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పార్క్‌పై విపక్షాలు డిసెంబర్‌ 9న ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ లభించింది. ఆ దేశ పార్లమెంటులో 300 స్థానాలుండగా.. 234 మంది అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్ష స్థానాన్ని చేపట్టిన తొలి మహిళ పార్క్‌.

భూకంపంతో ఇండోనేసియాలో 100 మందికి పైగా మృతి
ఇండోనేసియాలోని అసె ప్రావిన్స్‌ (ఉత్తర సుమత్రా దీవులు)లో డిసెంబర్‌ 7న భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మృతి చెందగా, మరో 200 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.4గా నమోదైంది. భూకంపం ధాటికి ఇళ్లు, మసీదులు, దుకాణాలు కూలిపోయాయి. వాహనాలు ఒకదాని కింద ఒకటి ఇరుక్కుపోయాయి. 33 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం దాదాపు 836 కిలోమీటర్ల పరిధిలో ప్రభావం చూపించింది.

 కఫాలాను రద్దు చేసిన ఖతార్‌
ఆధునిక బానిసత్వంగా భావించే కఫాలా పని వ్యవస్థను సమూలంగా రద్దు చేయాలని ఖతార్‌ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని డిసెంబర్‌ 13 నుంచి అమల్లోకి తేనున్నట్లు ఖతార్‌ కార్మిక శాఖ మంత్రి ఇసా బిన్‌ సాద్‌ అల్‌ జఫాలి ప్రకటించారు.

వార్తల్లో వ్యక్తులు
 నూతన సీజేఐగా జస్టిస్‌ జగదీష్‌సింగ్‌ ఖేహర్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా జస్టిస్‌ జగదీష్‌సింగ్‌ ఖేహర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ పదవీకాలం 2017, జనవరి 3తో ముగియనుంది. 2017, జనవరి 4నlజస్టిస్‌ ఖేహర్‌ 44వ సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ఈ పదవిలో దాదాపు 8 నెలల పాటు (ఆగస్టు 27, 2017 వరకు) కొనసాగుతారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న తొలి సిక్కు వ్యక్తి జస్టిస్‌ ఖేహర్‌.

 సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు చో రామస్వామి కన్నుమూత ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి (82) డిసెంబర్‌ 6న చెన్నైలో మరణించారు. ఆయన తుగ్లక్‌ నాటకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. తుగ్లక్‌ పత్రికకు సంపాదకుడిగా, 1999–2005 మధ్య కాలంలో    రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. రామస్వామి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత     సన్నిహితుడు.

ఫ్రాన్స్‌ నూతన ప్రధానిగా బెర్నార్డ్‌ కజెనెవ్‌: ఫ్రాన్స్‌ నూతన ప్రధానిగా ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి బెర్నార్డ్‌ కజెనెవ్‌ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాని మాన్యుయెల్‌ వాల్స్‌ రాజీనామా చేయడంతో.. బెర్నార్డ్‌ను ఆ పదవిలో నియమిస్తున్నట్లు దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలండ్‌ డిసెంబర్‌ 6న ప్రకటించారు. రెండున్నరేళ్లపాటు ఫ్రాన్స్‌ ప్రధానిగా కొనసాగిన వాల్స్‌.. వచ్చే ఏడాది సోషలిస్ట్‌ పార్టీ తరఫున దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

టైమ్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ను డిసెంబర్‌ 7న టైమ్‌ మ్యాగజీన్‌ 2016 పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ప్రకటించింది. ఇందులో తొలి రన్నరప్‌గా హిల్లరీ క్లింటన్, రెండో రన్నరప్‌గా ఆన్‌లైన్‌ హ్యాకర్లు నిలిచారు. ఈ గౌరవానికి సంబంధించి బరిలో నిలిచిన తుది 11 మందిలో భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉన్నారు.

ఇటలీ ప్రధానిగా జెంటిలోని: డెమోక్రటిక్‌ పార్టీ నేత పాలో జెంటిలోని నేతృత్వంలో డిసెంబర్‌ 11న ఇటలీలో నూతన మంత్రివర్గం ఏర్పాటైంది. ప్రధాని పదవికి మతియో రెంజి రాజీనామా చేయడంతో జెంటిలోని కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు.
n న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా బిల్‌ ఇంగ్లిష్‌: న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా బిల్‌ ఇంగ్లిష్‌ డిసెంబర్‌ 12న వెల్లింగ్టన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న జాన్‌ కీ రాజీనామా చేయడంతో బిల్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు.

అమెరికా వ్యోమగామి జాన్‌ గ్లెన్‌ మృతి: భూమిని చుట్టి వచ్చిన తొలి అమెరికన్‌గా, అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వృద్ధుడిగా రికార్డు సృష్టించిన ప్రముఖ వ్యోమగామి సెన్‌ జాన్‌ గ్లెన్‌ (95) ఓహాయోలో డిసెంబర్‌ 8న మరణించారు.

ఐరాస సెక్రటరీ జనరల్‌గా గ్యుటెరస్‌ ప్రమాణస్వీకారం
ఐక్యరాజ్యసమితి నూతన సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్‌ మాజీ ప్రధాని ఆంటోనియో గ్యుటెరస్‌ డిసెంబర్‌ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ పదవీ కాలం డిసెంబర్‌ 31తో ముగియనుంది.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
పీఎస్‌ఎల్‌వీ–సీ 36 ప్రయోగం విజయవంతం∙
శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి డిసెంబర్‌ 7న చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ–36 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్‌ ద్వారా రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం రిసోర్స్‌శాట్‌–2ఏను కక్ష్యలోకి పంపారు. మన దేశం ప్రయోగించిన రిసోర్స్‌శాట్‌ ఉపగ్రహాల్లో ఇది మూడోది. రిసోర్స్‌శాట్‌–2 జీవిత కాలం ముగుస్తుండటంతో దాని స్థానంలో 1235 కిలోల బరువు గల రిసోర్స్‌శాట్‌–2ఏను ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం పంటల విస్తీర్ణం, దిగుబడులు, తెగుళ్లు, కరువు ప్రభావాలపై సమాచారం అందిస్తుంది. జల వనరులు, పట్టణ ప్రణాళిక, రక్షణ రంగాలకు కూడా తోడ్పడుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన ఈ ఉపగ్రహం జీవితకాలం ఐదేళ్లు. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 38వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ ఎత్తు 44.4 మీటర్లు. బరువు 321 టన్నులు. ఇస్రో 1994 నుంచి 2016 వరకు పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక ద్వారా 121 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులో మన దేశానికి చెందినవి 42 కాగా, విదేశాలకు చెందినవి 79 ఉన్నాయి.

వాతావరణ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
వాతావరణ ఉపగ్రహం ఫెంగ్యున్‌–4ను చైనా డిసెంబర్‌ 10న విజయవంతంగా ప్రయోగించింది. దీన్ని లాంగ్‌ మార్చ్‌–3బీ రాకెట్‌ ద్వారా ప్రయోగించింది. ఈ ఉపగ్రహం ద్వారా ఆ దేశ వాతావరణ పరిశీలనల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.

క్రీడలు
కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన కోహ్లి: భారత టెస్ట్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టీమిండియా కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత పరుగులు (235) చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. తాజాగా ముంబైలో ఇంగ్లండ్‌తో
జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు ధోనీ ఆస్ట్రేలియాపై 2013లో 224 పరుగులు, 1999లో సచిన్‌ న్యూజిలాండ్‌పై 217 పరుగులు, 1978లో సునీల్‌ గవాస్కర్‌ వెస్టిండీస్‌పై 205 పరుగులు చేశారు.

సింగపూర్‌ స్లామర్స్‌కు ఐపీటీఎల్‌–
2016 టైటిల్‌: ఇంటర్నేషనల్‌ ప్రీమియర్‌ టెన్నిస్‌ లీగ్‌ (ఐపీటీఎల్‌)–
2016 టైటిల్‌ను డిఫెండింగ్‌ చాంపియన్‌ సింగపూర్‌ స్లామర్స్‌ నిలబెట్టుకుంది. హైదరాబాద్‌లో డిసెంబర్‌ 11న జరిగిన ఫైనల్లో ఇండియన్‌ ఏసెస్‌ జట్టును ఓడించింది.
n పంకజ్‌ అద్వానీకి ప్రపంచ                బిలియర్డ్స్‌ టైటిల్‌: భారత్‌కు చెందిన పంకజ్‌ అద్వానీ క్యూ స్పోర్ట్స్‌ (బిలియర్డ్స్, స్నూకర్‌)లో 16వ ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్నాడు. బెంగళూరులో డిసెంబర్‌ 12న జరిగిన ప్రపంచ బిలియర్డ్స్‌ 150 అప్‌ ఫార్మాట్‌ ఫైనల్లో పీటర్‌ గిల్‌క్రిస్ట్‌ (సింగపూర్‌)పై గెలుపొందాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement