కష్టపడితేనే లక్ష్య సాధన! | Devineni Tulaja bhavani success story of the week | Sakshi
Sakshi News home page

కష్టపడితేనే లక్ష్య సాధన!

Published Thu, Feb 5 2015 10:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

కష్టపడితేనే లక్ష్య సాధన!

కష్టపడితేనే లక్ష్య సాధన!

సక్సెస్ స్టోరీ: అందరిలా ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులను కాకుండా కామర్స్ కోర్సులను కెరీర్ లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. క్లిష్టతరమైన చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) రెండింటినీ విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) 2013లో నిర్వహించిన సీఎంఏ పరీక్షలో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు, మహిళల్లో మొదటి ర్యాంకు సాధించిన దేవినేని తులజా భవానీ సక్సెస్ స్టోరీ...
 
 స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. నాన్న చంద్రశేఖర్ వ్యాపారి. అమ్మ తారావాణి గృహిణి. నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే నాన్న కారు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి అమ్మ కష్టపడి పెంచింది. శ్రద్ధగా చదువుకునేలా నన్ను ప్రోత్సహించేది. పదో తరగతిలో 555 మార్కులు సాధించాను. తర్వాత అకౌంటెన్సీపై ఆసక్తితో ఇంటర్మీడియెట్‌లో ఎంఈసీ గ్రూపును ఎంచుకున్నాను. 2009లో 966 మార్కులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచాను.
 
 మొదటి ర్యాంకు:
 ఇంటర్మీడియెట్ పూర్తికాగానే సీఏ శిక్షణ తీసుకున్నాను. సీపీటీ, ఇంటర్, ఫైనల్ కోర్సుల్లో మంచి మార్కులతో సీఏ పూర్తి చేశాను. సీఏ ఇంటర్ పరీక్షలు రాసినప్పుడే ఐసీడబ్ల్యూఏ ఇంటర్ పరీక్ష రాశాను. సీఏ పాసయ్యాక తొలిసారిగా కొత్త సిలబస్‌తో నిర్వహించిన సీఎంఏ (గతంలో సీడబ్ల్యూఏ) ఫైనల్‌ను డిసెంబర్ 2013లో రాశాను. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకును, మహిళల్లో మొదటి ర్యాంకు సాధించాను. మార్చిలో జరిగే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ కన్వకేషన్‌లో నాలుగు బంగారు పతకాలు, రెండు నగదు బహుమతులు అందుకోనున్నాను.
 
 సీఎంఏ గురించి...
 చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్) పరీక్షల మాదిరిగానే కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) నూతన పరీక్షా విధానంలో ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ కోర్సులున్నాయి. సీఎంఏ ఫౌండేషన్‌లో నాలుగు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 50 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులుకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు. ఇంటర్మీడియెట్ కోర్సులో ఒక్కో దానిలో నాలుగు పేపర్ల చొప్పున రెండు గ్రూపుల్లో కలిపి మొత్తం ఎనిమిది పేపర్లు. ఫైనల్ కోర్సులోనూ ఎనిమిది పేపర్లు ఉంటాయి. సీఎంఏ కోర్సులోనూ సీఏ మాదిరిగానే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. సీఏలో రెండున్నరేళ్లు ఆర్టికల్ చేస్తేనే ఫైనల్ పరీక్షకు అర్హత అనే నిబంధన సీఎంఏలో లేదు. కోర్సు రెండోదశగా పేర్కొనే ఇంటర్మీడియెట్ తర్వాత ఆరు నెలలు తొలి దశ ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను పూర్తి చేస్తే.. ఫైనల్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది. ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక తప్పనిసరిగా మూడేళ్లపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేయాలి. అప్పుడే సంస్థ నుంచి స్టూడెంట్‌షిప్ లభిస్తుంది.
 
 ప్రిపరేషన్:
 సీఏ పూర్తయ్యాక ఐసీడబ్ల్యూఏ (సీఎంఏ) చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నా. సీఏతోపాటు సీఎంఏ పూర్తి చేస్తే అన్ని అంశాలపై అవగాహన ఏర్పడుతుందని భావించా. రెండు వేర్వేరు కోర్సులే అయినప్పటికీ ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్‌ను కొనసాగించాను. ఏ రోజు బోధించిన అంశాలను ఆ రోజే రివిజన్ చేశాను. ఫలితంగా సీఏలో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించా. తర్వాత సీఎంఏ లక్ష్యంగా నిర్దేశించుకున్నా ను. సీఏ, సీఎంఏలో కొన్ని సబ్జెక్టులు కామన్‌గా ఉండడంతో మిగిలిన వాటిపై దృష్టి కేంద్రీకరించాను.
 
 సీఏ కెరీర్‌లోనే కొనసాగుతా:

 సీఏ, సీఎంఏ నిర్వహణ సంస్థల నిబంధనల మేరకు ఏదో ఒక విభాగంలో కొనసాగాలి. కాబట్టి సొంతంగా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉన్న సీఏ కెరీర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నా.
 
 సలహా:
 కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) నిపుణులకు సాఫ్ట్‌వేర్‌తోపాటు వివిధ పరిశ్రమల్లో అవకాశాలుంటాయి. ప్రధానంగా నగరాల్లోని పరిశ్రమల్లో వీరికి డిమాండ్ ఎక్కువ. సీఏ, సీఎంఏ కోర్సులు అందరూ పేర్కొనే విధంగా కష్టతరంగానే ఉంటాయి. ఒక్క సబ్జెక్టులో ఒక్క మార్కు తగ్గినా ఫలితం ఉండదు. కష్టపడితేనే విజయం వరిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement