కొలువుదీర్చే... కోర్సులు | Engineering Medicine Courses in students | Sakshi
Sakshi News home page

కొలువుదీర్చే... కోర్సులు

Published Thu, Apr 10 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

కొలువుదీర్చే... కోర్సులు

కొలువుదీర్చే... కోర్సులు

దారులు వేరైనా చేరుకోవాల్సిన గమ్యం ఒకటే!  చేరిన కోర్సు ఏదైనా ‘కొలువు’దీరడమే తుది లక్ష్యం.  విద్యార్థి చదువుల ప్రయాణంలో 10+2 కీలక మజిలీ.  ఇక్కడి నుంచి వేసే ప్రతి అడుగూ భావి కెరీర్‌కు పునాది రాయి! అందుకే ఆ అడుగులో స్పష్టత ఉండాలి..  విశ్వాసం తొణికిసలాడాలి! చాలా మంది ఇంటర్  తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులవైపు  మొగ్గుచూపుతారు. వీటికి ప్రత్యామ్నాయాలుగా, 
 కోర్సు పూర్తయిందే తడవు ఉద్యోగాన్ని  చేజిక్కించే కోర్సులూ ఉన్నాయి. వాటిపై స్పెషల్ ఫోకస్..
 
 డిజైనింగ్
 గుండు సూది నుంచి గోడ గడియారం వరకు.. చల్లటి నీటిని అందించే మట్టి కుండ నుంచి మొబైల్ ముచ్చట్ల కు కొత్త సొబగులు అద్దే బ్లూటూత్ వరకు ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రతిదాంట్లోనూ కొత్తదనం ఉట్టిపడాలి.. అప్పుడే వినియోగదారుడు వాటి వెంటపడతాడు! ఇలా అన్ని రకాల వస్తువులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, వినూత్నంగా రూపొందించడం ఎలాగో తెలిపేదే డిజైనింగ్. ప్రస్తుత మేధో ఆర్థిక వ్యవస్థలో మార్కెట్లోకి వచ్చే ప్రతి వస్తువు వెనుకా ఓ డిజైనర్ పాత్ర ఉంటుంది. ఈ క్రమంలోనే నిపుణులైన డిజైనర్లకు డిమాండ్ పెరుగుతోంది.
 
 కోర్సులు: దేశంలో డిజైన్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) కీలకంగా ఉంది. దీనికి అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరులో క్యాంపస్‌లు ఉన్నాయి. అహ్మదాబాద్ క్యాంపస్‌లో నాలుగేళ్ల కాల వ్యవధి గల గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైన్ (జీడీపీడీ) కోర్సును అందిస్తోంది. ఇందులో ప్రోడక్ట్ డిజైన్; ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్; సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్; గ్రాఫిక్ డిజైన్; యానిమేషన్ ఫిల్మ్ డిజైన్; ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్ డిజైన్; ఎగ్జిబిషన్ డిజైన్; టెక్స్‌టైల్ డిజైన్ స్పెషలైజేషన్లున్నాయి. అర్హత: 10+2 లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ) ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
 
 వెబ్‌సైట్:www.nid.edu
 గౌహతి ఐఐటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజైన్.. బ్యాచిలర్స్ ఇన్ డిజైన్ (ఆ.ఈ్ఛట) కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇంటర్/ తత్సమాన అర్హత ఉండాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్-2014 ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
  
 వెబ్‌సైట్: www.iitg.ac.in
 నోయిడాలోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు దేశవ్యాప్తంగా ఎనిమిది క్యాంపస్‌లు ఉన్నాయి.  ఇవి డిజైనింగ్‌కు సంబంధించి బ్యాచిలర్ కోర్సులను అందిస్తున్నాయి. కెరీర్: కోర్సులో ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా టెక్స్‌టైల్ సంస్థలు, ఆటోమొబైల్ సంస్థలు, జీవనశైలి ఉత్పత్తుల తయారీ సంస్థలు తదితరాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నిపుణులైన డిజైనర్లకు రూ.లక్షల ప్యాకేజీలతో అవకాశాలిచ్చే జాతీయ, బహుళజాతి సంస్థలున్నాయి. 
 
 పారా మెడికల్ కోర్సులు
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు చిన్నచిన్న పట్టణాలకు సైతం తమ శాఖలను విస్తరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులకు తలలో నాలుకలా వ్యవహరిస్తూ, రోగికి చికిత్స అందడంలో సహాయసహకారాలు (రక్త పరీక్షలు, మలమూత్ర పరీక్షల నిర్వహణ వంటివి) అందించే పారా మెడికల్ నిపుణులకు డిమాండ్ పెరిగింది. పారా మెడికల్ కోర్సులు చేసిన వారికి మార్కెట్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
 
 కోర్సులు:
 పారామెడికల్ కోర్సులకు ఇంటర్మీడియెట్ బైపీసీలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. వీరిలో ప్రవేశాలకు తగినంతమంది అభ్యర్థులు లేకపోతే ఎంపీసీ ఉత్తీర్ణులకు, ఆ తర్వాత మిగిలిన గ్రూపుల వారికి అవకాశమిస్తారు. పారామెడికల్ విభాగంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆప్టోమెట్రీ టెక్నీషియన్, హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (పురుషులు), ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, పర్‌ప్యూషన్ టెక్నీషియన్, రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్ వంటి కోర్సులున్నాయి.
 
 రాష్ట్రంలో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇంటర్ గ్రూప్ సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి. రాష్ర్ట వ్యాప్తంగా 14 ప్రభుత్వ సంస్థలు (సీట్లు-1462), 514 ప్రైవేట్ (సీట్లు-23,080) ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
 
 కెరీర్: 
 పారామెడికల్ కోర్సులు చేసిన వారికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అపార అవకాశాలున్నాయి. డాక్టర్లకు వీరు ప్రతి చికిత్సలో వెన్నంటి సహకరించాల్సిందే. నేడు వివిధ ఆస్పత్రులు ఓ మాదిరి పట్టణాల్లో సైతం తమ శాఖలను ఏర్పాటు చేస్తుండటంతో ఈ కోర్సులు చేసినవారికి ఉపాధి ఖాయం. విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలు (యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్)లోనూ మంచి అవకాశాలున్నాయి. ఆస్పత్రుల్లో పనిచేయడం ఇష్టం లేనివారు సొంతంగా డయాగ్నొస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవచ్చు.
 
 వేతనాలు: 
 ప్రారంభంలో రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు లభిస్తాయి. ఆ తర్వాత పనిలో అంకితభావం, కష్టించే స్వభావం, అనుభవం ద్వారా మరింత ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. లేదంటే సొంత డయాగ్నొస్టిక్ కేంద్రం ఉంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించొచ్చు.
 
 ఫ్యాషన్ కోర్సులు
 మనిషి అభిరుచుల్లో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు వస్తుంటాయి. కాళ్లకు వేసుకునే చెప్పులు దగ్గర నుంచి తలకు పెట్టుకునే టోపీ వరకూ అన్నిటిలోనూ ‘ఫ్యాషన్’ కొట్టొచ్చినట్లు కనిపించాలని కోరుకుంటాడు. దీంతో డిజైనింగ్ వస్త్రాలకు, యాక్సెసరీస్‌కు డిమాండ్ బాగా పెరిగింది. వీటికి అనుగుణంగానే ఫ్యాషన్ డిజైనింగ్, టెక్నాలజీ కోర్సులు చేసిన వారికి ఉన్నత అవకాశాలు చేతికందుతున్నాయి. 
 
 కోర్సులు:
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్).. ఆఫర్ చేస్తున్న బ్యాచిలర్ కోర్సుల్లో యాక్సెసరీస్ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, లెదర్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్ కోర్సులున్నాయి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు.  నిఫ్ట్‌కు దేశవ్యాప్తంగా 15 క్యాంపస్‌లు ఉన్నాయి.
 
 అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 10+2 ఉత్తీర్ణత. ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
 నిఫ్ట్.. అపరెల్ ప్రొడక్షన్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సును అందిస్తోంది. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. గుర్తింపు పొంది న బోర్డ్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత ఉన్నవారు ప్రవేశాలకు అర్హులు. వెబ్‌సైట్: www.nift.ac.in
 
 ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫ్యాషన్ టెక్నాలజీలో బీఎస్సీ(ఆనర్స్) కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు.  అర్హతలు: ఇంటర్మీడియెట్ (10+2)లో ఉత్తీర్ణత. ఇంటర్మీడియెట్‌లో వొకేషనల్ కోర్సులు చేసిన వారు, పాలిటెక్నిక్‌లో హోంసైన్స్ సంబంధిత కోర్సులు చేసిన వారు కూడా అర్హులే. అర్హత కోర్సుల్లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఫ్యాషన్ డిజైనింగ్, టెక్నాలజీకి సంబంధించి ప్రైవేటు సంస్థలు డిప్లొమా, గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. 
 
 వేతనాలు: 
 ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టిన వారికి ప్రారంభంలో రూ.15 వేల నుంచి రూ.26 వేల వరకూ ఉంటుంది. సృజనాత్మక ఆలోచనలతో మంచి పనితీరు కనబరిచే వారు ఫ్యాషన్ రంగంలో త్వరగా ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు.
 
 మెరవడానికి సృజన ప్రధానం
 ప్రపంచీకరణ నేపథ్యంలో ఫ్యాషన్ డిజైనింగ్, టెక్నాలజీ రంగాలలో అవకాశాలు విస్తృతమవుతున్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఆసక్తి, సృజనాత్మకత ప్రధానం. ‘ఫ్యాషన్’లో బ్యాచిలర్ కోర్సులు పూర్తిచేసిన వారికి వస్త్ర, తోలు ఉత్పత్తులు, ఆభరణాల తయారీ పరిశ్రమల్లో ఎగ్జిక్యూటివ్‌లుగా, ఫ్యాషన్ డిజైనర్లుగా, ఇల్లుస్ట్రేటర్లుగా ఉద్యోగాలు పొందొచ్చు. ఎగుమతి సంస్థలు, వస్త్ర మిల్లులు, బోటిక్‌ల్లోనూ అవకాశాలుంటాయి.
 -డాక్టర్ ఎన్.జె.రాజారామ్, 
 డెరైక్టర్, నిఫ్ట్, హైదరాబాద్.
 
 ఇంటర్ అర్హతతో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీఆర్‌వో, రైల్వేజాబ్స్, పోలీసు కానిస్టేబుల్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, గ్రూప్-4.. ఇలా వివిధ ఉద్యోగాలను సరైన ప్రిపరేషన్‌తో సొంతం చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తూనే దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. ఇవేకాకుండా..  ఇంకా ఎన్నో కోర్సులు, కెరీర్స్, అవకాశాలు ఇంటర్మీడియెట్ పూర్తిచేసుకున్న విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే ఆయా కోర్సుల గురించి నిశితంగా తెలుసుకొని, కొంత విశ్లేషణ చేసుకొని, నిపుణుల సలహాలు తీసుకొని విద్యార్థులు తమకు ఏది సరిపోతుందో దాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి..!
 
 యానిమేషన్
  అధునాతన కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బొమ్మలను కదిలిస్తూ సినిమాలు, గేమ్‌లు, ప్రకటనలు వంటి వాటిని రూపొందించడాన్ని యానిమేషన్ అంటాం. బ్లాక్ బస్టర్ చిత్రాలైన కుంగ్ ఫు పాండా, ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా, వాల్-ఈ, ఐస్ ఏజ్ వంటి చిత్రాలతో పాటు చిన్నారులకు సుపరిచితమైన మిక్కీమౌస్, డొనాల్డ్ డక్, టామ్ అండ్ జెర్రీ వంటివన్నీ యానిమేషన్ నుంచి పుట్టిన కళాఖండాలే! ఔత్సాహికులను యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్(గఊగీ) రంగంలో రాణించేలా తీర్చిదిద్దేందుకు మార్కెట్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 
 
 కోర్సులు:
 ఓ అభ్యర్థిని యానిమేషన్ రంగానికి సరిపడే విధంగా తీర్చిదిద్దేందుకు పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 10+2 అర్హతతో డిగ్రీ, డిప్లొమా కోర్సులో ప్రవేశించొచ్చు. ప్రైవేటు సంస్థలు బీఎస్సీ (మల్టీమీడియా), బీఎఫ్‌ఏ-యానిమేషన్, గఊగీ వంటి కోర్సులను అందిస్తున్నాయి. బేసిక్ స్కెచింగ్ నైపుణ్యాలు, ఆసక్తి ఉంటే ఎవరైనా ఈ కోర్సులు చేసి, ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ యానిమేషన్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. కాల వ్యవధి నాలుగేళ్లు. అర్హత: 10+2/ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. ఎంట్రన్స్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.   కోర్సులు పూర్తిచేసిన వారికి సినీ స్టూడియోలు, అడ్వర్‌టైజింగ్ కంపెనీలు, టీవీ చానళ్లు, గేమింగ్ ఇండస్ట్రీ తదితరాల్లో యానిమేటర్, గేమ్ డిజైనర్, లేఅవుట్ ఆపరేటర్, స్కానర్ ఆపరేటర్, 2డీ యానిమేటర్, 3డీ యానిమేటర్, రిగ్గింగ్ ఆర్టిస్టు వంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. 
 
 మార్కులు కాదు.. స్కిల్స్ ప్రధానం
 ‘‘ప్రస్తుత ఐటీ యుగంలో యానిమేషన్ వినియోగం లేని రంగాన్ని ఊహించుకోలేం. యానిమేషన్ కోర్సులు పూర్తిచేసిన వారికి అపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి కోర్సుల్లో చేరిన వారు తొలి రోజు నుంచి నిజాయితీగా కష్టపడాలి. ఎంతగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచి ఫలితం ఉంటుందని గుర్తించాలి. ఇలాంటి రంగంలో మార్కులు ప్రధానం కాదు.. నైపుణ్యం ముఖ్యం. అదిచూసి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారు. రెండు, మూడు స్పెషలైజేషన్లతో కోర్సులు పూర్తిచేసిన వారికి మిగిలిన వారితో పోల్చితే మంచి అవకాశాలుంటాయి. కోర్సులు పూర్తిచేసిన వారు సొంత ప్రాజెక్టులు, ఫ్రీలాన్స్ సర్వీస్ ద్వారా అధిక మొత్తంలో ఆర్జించవచ్చు. ఎప్పటికప్పుడు పరిశ్రమలో వస్తున్న మార్పులను ఒంటబట్టించుకొని, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే దేశీయ సంస్థలతో పాటు విదేశాల్లోనూ ఉన్నత ఉద్యోగాలను సంపాదించొచ్చు.’’
 - వి.కృష్ణకుమార్, సీనియర్ ఫ్యాకల్టీ, 
 పికాసో యానిమేషన్ కాలేజ్, హైదరాబాద్.
 
 ఆతిథ్య రంగం
 దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఆతిథ్య రంగం ఒకటి. దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో అదే స్థాయిలో ఆతిథ్య రంగం కుర్రకారు ఉజ్వల భవితకు ఆసరా ఇస్తోంది. దీంతో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ను కెరీర్‌గా ఎంపిక చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కోర్సు పూర్తికాగానే ఉద్యోగంలో చేరాలనుకునే వారికి, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారికి ఈ రంగంలో ఉపాధి అవకాశాలకు కొదవ లేదు. పర్యాటక రంగ విస్తరణతో పాటు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్న హోటళ్లు, రిసార్టుల కారణంగా మానవ వనరులకు డిమాండ్ ఏర్పడుతోంది. కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం దేశంలో ఏటా 2.03 లక్షల సుశిక్షితులైన హాస్పిటాలిటీ మానవ వనరులకు డిమాండ్ ఉంటోంది.
 
 కోర్సులు:
 జాతీయ స్థాయిలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ). దీన్ని ఏటా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 21 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, 16 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, 15 ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లలో మూడేళ్ల వ్యవధి ఉన్న బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అభ్యసించొచ్చు. ఈ సంస్థల్లో మొత్తం 7,454 సీట్లున్నాయి. దీనికి ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలలో ఉత్తీర్ణులు అర్హులు.
 
 అవకాశాలు:
 హోటల్ మేనేజ్‌మెంట్‌లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్(ఎఫ్ అడ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్‌లో స్థిరపడొచ్చు. ఈ క్రమంలో హోటల్/హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలో మేనేజ్‌మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్‌మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ సేల్స్, గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో స్థిర పడొచ్చు. ప్రభుత్వరంగంలో కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల్లోనూ అవకాశాలుంటాయి. సొంతంగా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ స్థిరపడొచ్చు. హోటల్‌మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసిన వారికి విదేశాల్లోనూ అవకాశాలు అనేకం. వేతనాలు: కెరీర్ ప్రారంభంలోనే ఐదంకెల జీతాన్ని సొంతం చేసుకోవచ్చు. మేనేజ్‌మెంట్ ట్రైనీగా అతే రూ. 15 నుంచి రూ. 18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా రూ. 30,000 నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. 
 
 ఉపాధికి కొదవలేని కోర్సులు
 ‘‘దేశంలో ఉపాధి పరంగా వ్యవసాయ రంగానిదే మొదటి స్థానం. ఇప్పుడు ఉపాధి కల్పనలో టూరిజం, హాస్పిటాలిటీ రంగం రెండో స్థానంలో నిలుస్తుండటం విశేషం. దీన్నిబట్టి చూస్తే హాస్పిటాలిటీ రంగంలో సుశిక్షితులైన వారికి ఉపాధికి కొదవ లేదనేది నిస్సందేహం. హోటల్ మేనేజ్‌మెంట్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేస్తే మంచి అవకాశాలుంటాయి. కోర్సు పూర్తయ్యాక ప్రారంభ వేతనం గురించి ఆలోచించకుండా ఆఫర్ ఇచ్చిన సంస్థ ప్రాధాన్యతను గుర్తిస్తే చక్కటి భవిష్యత్తు సొంతమవుతుంది. ఈ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులకు 24ఁ7 వాతావరణంలో పనిచేసే సహజ లక్షణం ఉండాలి. అప్పుడే ఆశించిన స్థాయికంటే ఉన్నత హోదాలు అందుకోగలరు.’’
 - డాక్టర్ పి.నారాయణరెడ్డి, డెరైక్టర్, 
 డాక్టర్ వైఎస్‌ఆర్ నిథమ్, హైదరాబాద్.
 
 టీచింగ్
 ఆహ్లాదకరమైన పని వాతావరణం, భావి భారత పౌరులను తీర్చిదిద్దే సువర్ణావకాశం ఉపాధ్యాయవృత్తితో లభిస్తుంది. ప్రస్తుతం చిన్న పట్టణాల్లో సైతం కార్పొరేట్ స్కూళ్లు, ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. రానున్న రోజుల్లో బహుళజాతి సంస్థలు కూడా పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీచింగ్ కోర్సులు పూర్తిచేసినవారికి మంచి అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. 2012 డీఎస్సీ ద్వారా ఎస్‌జీటీకి ఎంపికైన వారు ప్రస్తుతం రూ.22 వేలకు పైనే అందుకుంటున్నారు. ఇలా ఆకర్షణీయమైన వేతనాలతో పాటు చక్కని పని వాతావరణం ఉన్న టీచర్ కొలువులపై యువత మొగ్గు చూపుతోంది.
 
 కోర్సులు: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి చక్కని మార్గం డీఈడీ (డిప్ల్లొమా ఇన్ ఎడ్యుకేషన్). ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో టీచర్‌గా స్థిరపడొచ్చు. అంతేకాకుండా సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులను కేవలం డీఈడీ అభ్యర్థులతోనే భర్తీ చేస్తుండడంతో ఈ కోర్సు చేసిన వారికి ప్రభుత్వ కొలువు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. స్పెషల్ ఎడ్యుకేషన్: విజువల్, హియరింగ్ ఇంపెయిర్‌మెంట్, స్పీచ్ థెరపీ, ఆటిజం అండ్ స్పెక్ట్రమ్, రిహాబిలిటేషన్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ విభాగంలో పలు డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ పూర్తిచేసిన వారు వీటిలో చేరేందుకు అర్హులు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్వచ్ఛంద సంస్థలు, సర్వశిక్షా అభియాన్ పాఠశాలలు, ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లలో అవకాశాలు లభిస్తాయి. 
 
 ఫిజికల్ ఎడ్యుకేషన్: అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(యూజీడీపీఈడీ)కు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులు అర్హులు. ఈ కోర్సులో ప్రవేశాలకు మన రాష్ర్టంలో పీఈసెట్ రాయాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తిచేసిన వారు డీఎస్సీ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలను పొందొచ్చు. ప్రైవేటు పాఠశాలల్లోనూ వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉద్యోగావకాశాలు ఉంటాయి.
 
 డిప్లొమా ఇన్ ఫార్మసీ
 అర్హత: ఇంటర్మీడియెట్ (ఎంపీసీ/బైపీసీ)
 ప్రవేశం: ఇంటర్మీడియెట్ మార్కులాధారంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ జూలై/ఆగస్టులలో వెలువడుతుంది. మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని దాదాపు 62 సంస్థలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. అవకాశాలు: ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఫార్మాస్యూటికల్, సంబంధిత కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని హాస్పిటల్స్‌లో ఫార్మాసిస్ట్‌గా స్థిరపడొచ్చు. ప్రారంభంలో నెలకు రూ. 8 నుంచి 10 వేల వరకు వేతనం లభిస్తుంది. డి.ఫార్మసీ తర్వాత ఉన్నత విద్య పరంగా బీ. ఫార్మసీ చేయవచ్చు.
 
 10+2 తర్వాత కోర్సులంటే ఎక్కువ మందికి గుర్తొచ్చేవి.. ఇంజనీరింగ్, మెడిసిన్, సంప్రదాయ డిగ్రీ కోర్సులు. ఇవి కాకుండా అనేక జాబ్ ఓరియెంటెడ్ కోర్సులున్నాయి. అయితే ఈ కోర్సులలో చేరింది మొదలు పరిశ్రమ అవసరాలకు తగినట్లు నైపుణ్యాలు సొంతం చేసుకుంటే కోర్సులు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇవి కాకుండా మల్టీమీడియా, కంప్యూటర్ డీటీపీ ఆపరేటర్ తదితరాల్లో స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి.
 - ప్రొఫెసర్ టి.పార్థసారథి, ఉస్మానియా యూనివర్సిటీ.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement