లోక్‌సభలో మొదటి ప్రతిపక్ష నాయకుడు?
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
ప్రకరణ 89 ప్రకారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని ఏర్పరచారు. ఈయన పదవీకాలం ఆరేళ్లు. డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక కావాలంటే రాజ్యసభలో సభ్యుడై ఉండాలి. రాజ్యసభ సభ్యులే మెజార్టీ ప్రాతిపదికపై ప్రత్యక్షంగా డిప్యూటీ ౖచైర్మన్‌ను ఎన్నుకుంటారు. అలాగే రాజ్యసభ సభ్యులే ఒక తీర్మానం ద్వారా ఈయనను తొలగించవచ్చు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్‌కు అందిస్తారు. రాజ్యసభ చైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడు, అలాగే ఉప రాష్ట్రపతి.. రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు డిప్యూటీ చైర్మన్ రాజ్యసభకు అధ్యక్షత వహిస్తారు.
పార్లమెంటు సచివాలయం:
ప్రకరణ 98 ప్రకారం, పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభలకు ప్రత్యేక సచివాలయ సిబ్బంది ఉంటారు.
లోక్‌సభ కార్యదర్శిని లోక్‌సభ సెక్రటరీ జనరల్ అని, రాజ్యసభ కార్యదర్శిని రాజ్యసభ సెక్రటరీ జనరల్ అని అంటారు.
సభా నాయకుడు
సాధారణంగా ప్రధానమంత్రి లోక్‌సభ సభానాయకుడిగా వ్యవహరిస్తారు. అయితే, ప్రధానమంత్రికి లోక్‌సభలో సభ్యత్వం లేనప్పుడు, లోక్‌సభలో సభ్యత్వం కలిగిన మంత్రిని సభా నాయకుడిగా నియమిస్తారు. అలాగే రాజ్యసభలో కూడా ఆ సభలో సభ్యత్వం ఉన్న మంత్రి ఒకరు సభా నాయకుడిగా వ్యవహరిస్తారు.
పార్లమెంటు – ప్రతిపక్ష నాయకుడు
ప్రతిపక్ష నాయకుడి ప్రస్తావన రాజ్యాంగంలో లేదు. అయితే లోక్‌సభ మొదటి స్పీకర్ జి.వి. మౌలాంకర్ రూపొందించిన నియమావళి ప్రకారం లోక్‌సభలో కనీసం 1/10వ వంతు సభ్యులు కలిగిన, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి హోదా పొందుతారు. రాజ్యసభలోనూ ఇదే విధానం వర్తిస్తుంది. ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ హోదా ఉంటుంది.
గమనిక: 1977లో ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం ప్రకారం లోక్‌సభ లేదా రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు అనే హోదాకు మొదటిసారిగా చట్టబద్ధత కల్పించారు.ప్రత్యేక సమాచారం: ఈ చట్టం ప్రకారం గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష నేత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు చెందిన వై.బి. చవాన్ (6వ లోక్‌సభ). రాజ్యసభలో గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష నాయకుడు కమలాపతి త్రిపాఠీ.మొదటి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు లేరు. అలాగే రెండో, మూడో, ఐదో, ఏడో లోక్‌సభలు కూడా ప్రతిపక్ష నాయకుడు లేకుండానే ముగిశాయి. కారణం నిర్ణీత సంఖ్యలో సభ్యులు లేకపోవడమే.
శాసన నిర్మాణ ప్రక్రియ– బిల్లులు– రకాలు
బిల్లు అంటే చట్టం చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదన లేదా ముసాయిదా. చట్టం మొదటి దశే బిల్లు. శాసన నిర్మాణ ప్రక్రియను బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఉభయ సభల్లో అనేక దశలు ఎదుర్కోవాలి.
ప్రవేశపెట్టే వారి ఆధారంగా బిల్లులను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి..
1. ప్రభుత్వ బిల్లు 2. ప్రైవేటు మెంబర్ బిల్లు
ఒక బిల్లును మంత్రి ప్రవేశపెడితే దాన్ని ప్రభుత్వ బిల్లు అంటారు. ప్రతిపక్ష సభ్యులతో సహా మంత్రి కాని ఏ సభ్యుడైనా బిల్లును ప్రతిపాదిస్తే దాన్ని ప్రైవేటు మెంబర్ బిల్లు అంటారు.
ప్రత్యేక సమాచారం: పదహారో లోక్‌సభ వరకు (2015) పార్లమెంటులో 14 ప్రైవేట్ మెంబర్ బిల్లులు ఆమోదం పొందాయి. 1956లో ఆరు ప్రైవేటు బిల్లులను ఆమోదించారు. 15వ లోక్‌సభలో 264 ప్రైవేటు మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. కానీ ఏ ఒక్కటీ ఆమోదం పొందలేదు.
బిల్లులోని అంశాలు, ప్రక్రియల ఆధారంగా బిల్లును కింది రకాలుగా వర్గీకరిస్తారు రాజ్యాంగంలో ప్రకరణ 107 నుంచి 122 వరకు శాసన నిర్మాణంలో అనుసరించాల్సిన ప్రక్రియను పొందుపర్చారు. బిల్లులను కింది విధంగా వర్గీకరించవచ్చు.
1.సాధారణ బిల్లు (ప్రకరణ 107)
2.ఆర్థిక బిల్లు (ప్రకరణ 117)
3.ద్రవ్య బిల్లు (ప్రకరణ 110)
4.రాజ్యాంగ సవరణ బిల్లు (ప్రకరణ 368)
సాధారణ బిల్లులు – ప్రక్రియ
సాధారణ బిల్లుకు ప్రత్యేక నిర్వచనం లేదు. ప్రకరణ 107 ప్రకారం – ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు కానిది సాధారణ బిల్లు. సాధారణ బిల్లును ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ బిల్లును ప్రవేశపెట్టదలచుకున్న సభ్యుడు ఒక నెల ముందుగా నోటీసుతో తన సంకల్పాన్ని లిఖితపూర్వకంగా ఆయా సభాధ్యక్షులకు తెలపాలి. సభ్యుడి విజ్ఞాపన అందగానే సభాపతి ఒక తేదీ నిర్ణయిస్తారు. ఏ సభ్యుడైనా బిల్లు ప్రవేశాన్ని వ్యతిరేకిస్తే అతడి అభిప్రాయాలను వినిపించేందుకు అనుమతిస్తారు. సాధారణ బిల్లులో కింది దశలుంటాయి.
1. ప్రవేశ దశ (మొదటి పఠనం)
2. రెండో పఠనం (పరిశీలన దశ)
3. మూడో పఠనంలేదా ఆమోద పరిశీలన దశ
4. రెండో సభలోకి బిల్లు పంపడం
5. రాష్ట్రపతి ఆమోదం
ప్రవేశ దశ (మొదటి పఠనం) ఒక బిల్లును సభలో ప్రవేశపెడుతున్న సభ్యుడు, ఆ బిల్లు పేరును, ఆవశ్యకతను ప్రాధాన్యతను వివరిస్తాడు. ఈ దశలో ఎలాంటి చర్చ జరగదు.రెండో పఠనం: బిల్లు మొదటి దశ పూర్తయ్యాక ముద్రించిన బిల్లుల ప్రతులను సభ్యులకు అందిస్తారు. ఈ దశలో బిల్లుపై విస్తృత చర్చ జరుగుతుంది. ఈ దశలో కింది ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
బిల్లును చర్చించి, వెంటనే ఆమోదించాలని అడగవచ్చు. బిల్లును సెలక్ట్ కమిటీకి లేదా రెండో సభ అంగీకారంతో సంయుక్త సెలక్ట్ కమిటీకి నివేదించవచ్చు.బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని అడగవచ్చు. అంటే బిల్లుకు విస్తృత ప్రచారాన్ని కల్పించాలని కోరడం.కమిటీ దశ–వివరణ: అత్యంత ప్రాముఖ్యమైన లేదా వివాదాస్పద, రాజ్యాంగ పరమైన వ్యాఖ్య అవసరమున్న బిల్లులను సెలక్ట్ కమిటీ అభిప్రాయానికి పంపుతారు. సెలక్ట్ కమిటీ సభ్యులను ఆయా సభాధ్యక్షులు నియమిస్తారు.
సాధారణంగా వీరి సంఖ్య 20 నుంచి 30 వరకు ఉంటుంది. ఉభయ సభల సభ్యులతో కలిపి ఏర్పాటు చేస్తే జాయింట్ సెలక్ట్ కమిటీ అంటారు. ఈ కమిటీ సూచించిన సవరణ, ప్రతిపాదనలను సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.మూడో పఠనం లేదా ఆమోద పరిశీలన దశ: ఇది కేవలం ఆమోద దశ మాత్రమే. ఇందులో బిల్లుపై పరిమిత చర్చకు సభ్యులకు అనుమతి లభిస్తుంది. బిల్లును అంగీకరించడం/నిరాకరించడానికి మాత్రమే చర్చ పరిమితం అవుతుంది. హాజరైన వారిలో మెజారిటీ సభ్యులు అంగీకరిస్తే ఆ బిల్లును సభ ఆమోదించినట్లు సభాపతి ప్రకటిస్తారు. దీంతో ప్రవేశపెట్టిన సభలో బిల్లు ప్రక్రియ పూర్తవుతుంది.రెండో సభలోకి బిల్లు వెళ్లడం: బిల్లు శాసనంగా మారాలంటే ఉభయ సభలు ఆమోదం తెలపాలి. ప్రవేశపెట్టిన సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రెండో సభ ఆమోదానికి పంపుతారు. ఇందులోనూ మూడు దశలుంటాయి.
బిల్లును రెండో సభ పూర్తిగా తిరస్కరించవచ్చు.
బిల్లులో కొన్ని సవరణలు ప్రతిపాదించి, ప్రవేశపెట్టిన సభ పునఃపరిశీలనకు పంపవచ్చు. ఒకవేళ రెండో సభ చేసిన సవరణను మొదటి సభ అంగీకరిస్తే ఆ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందినట్లు అవుతుంది. రెండో సభ సవరణను మొదటి సభ వ్యతిరేకిస్తే ఆ బిల్లు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది.