గ్రూప్-1 అయిదో పేపర్.. సబ్జెక్టు + సమకాలీనం | Group -1 fifth Paper | Sakshi
Sakshi News home page

గ్రూప్-1 అయిదో పేపర్.. సబ్జెక్టు + సమకాలీనం

Published Thu, Sep 3 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

గ్రూప్-1 అయిదో పేపర్.. సబ్జెక్టు + సమకాలీనం

గ్రూప్-1 అయిదో పేపర్.. సబ్జెక్టు + సమకాలీనం

 సబ్జెక్ట్... సమకాలీన అంశాలు కలయికగా ఉన్న పేపర్.. పేపర్-5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమకాలీన పరిణామాలపై అవగాహనను పరీక్షించే విధంగా సిలబస్ ఉండగా.. ఇదే పేపర్‌లో మూడో సెక్షన్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ అభ్యర్థుల్లోని విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని పరీక్షించేదిగా ఉంది.
 
 ఎస్ అండ్ టీ పాత్ర, ప్రభావం
 అయిదో పేపర్.. మొదటి సెక్షన్‌లో సామాజిక అభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర, ప్రభావం అని పేర్కొన్నారు. దీని ద్వారా దేశ అభివృద్ధికి ఈ రంగం చేస్తున్న కృషి, ఆవిష్కరణలపై అవగాహనను పరిశీలించే దిశగా సిలబస్ రూపొందించారు.సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రాచుర్యం పొందుతున్న అంశాలు, దేశంలో ప్రస్తుతం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నమోదవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు తాజా ఉపగ్రహ ప్రయోగాలు - వాటి ద్వారా కలిగే ఫలితాలు - అవి సామాజిక అభివృద్ధికి దోహద పడే తీరు వంటివి. అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పారిశ్రామిక అభివృద్ధి అంశాలను చదవాలి.
 
 సైన్స్ అండ్ టెక్నాలజీ రంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం నిరంతరం తీసుకుంటున్న చర్యలు, విధానాల్లో అవలంబిస్తున్న మార్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో విద్య, వైద్య, సామాజిక అభివృద్ధికి ఎంతో కీలకంగా మారుతున్న ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విధానంపై సంపూర్ణ అవగాహన అవసరం. వీటితోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రాథమిక నైపుణ్యాలు అందించే కంప్యూటర్ వినియోగం గురించి తెలుసుకోవాలి. అదే విధంగా రోబోటిక్స్, నానో టెక్నాలజీలు కూడా ఇటీవల కాలంలో ఎస్ అండ్ టీ రంగంలో ప్రాశస్త్యం పొందుతున్నాయి. వీటి గురించి తెలుసుకోవాలి. అభ్యర్థులు దృష్టి సారించాల్సిన మరో ముఖ్యాంశం.. భారత అంతరిక్ష విధానం. ఈ దిశగా భారత్ చేపడుతున్న కొత్త ఉపగ్రహ ప్రయోగాలు, కొత్త కార్యక్రమాలు (చంద్రయాన్, ఎడ్యూశాట్ తదితర) గురించి అవగాహన అవసరం.
 
 అంతరిక్ష సాంకేతికత ఆధారంగా సామాజిక అభివృద్ధి దిశగా చేపడుతున్న చర్యలు ముఖ్యంగా విద్య, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, వరదలు, తుఫానులు, సునామీలు, వాతావరణ మార్పులకు సంబంధించినవి తెలుసుకోవాలి.శాస్త్ర, సాంకేతిక రంగంలోనే భాగంగా అభ్యర్థులు దృష్టిసారించాల్సిన మరో ప్రధానాంశం.. శక్తి వనరులు. జల, అణు, న్యూక్లియర్ శక్తి వనరులు వాటి వినియోగం దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, స్థాపిస్తున్న సంస్థల గురించి అవగాహన పెంచుకోవాలి. పునరుత్పాదక ఇంధన వనరులుగా గుర్తింపు పొందుతున్న బయోమాస్; వ్యర్థాల ఆధారిత ఇంధన వనరుల ఉత్పత్తి; సౌర, పవన విద్యుత్ ఉత్పాదకాలు, వాటి కోసం ఏర్పాటు చేసిన సంస్థలు; అనువైన ప్రాంతాల గురించి సమాచారం తెలుసుకోవాలి. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో వీటి గురించి తప్పనిసరిగా అవగాహన పొందాలి.
 
 సెక్షన్-2.. వ్యాధుల నుంచి విత్తన శాస్త్రం వరకు:
 రెండో సెక్షన్ సైన్స్‌లో ప్రాథమిక అంశాల నుంచి తాజా పరిణామాల వరకు అన్నిటిపై అవగాహన పొందాల్సిన విధంగా సిలబస్ రూపొందించారు. ఈ క్రమంలో అభ్యర్థులు వివిధ వ్యాధులు, టీకాలు- సరికొత్త వ్యాక్సిన్ ఆవిష్కరణలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా బ్యాక్టీరియా, వైరస్‌లు వాటి కారకాలు స్వభావాలు - ప్రభావాల గురించి తెలుసుకోవాలి. హెచ్‌ఐవీ, స్వైన్‌ఫ్లూ, చికన్‌గున్యా తదితర వ్యాధులకు కారణమయ్యే వైరస్‌లు, వాటి నివారణలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అవగాహన అవసరం.
 
 ఫుడ్ బయోటెక్నాలజీకి సంబంధించి ఆహార భద్రత, ఈ దిశగా ప్రభుత్వం విధించిన నియమ నిబంధలు వాటి అమలు తీరు, డీ-ఫ్లోరైడేషన్ వంటి వాటిపై సమాచారం పొందాలి.ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న బయోటెక్నాలజీ గురించి విస్తృతంగా అధ్యయనం చేయాలి. హ్యూమన్ బయో టెక్నాలజీ, ప్లాంట్ బయో టెక్నాలజీ, ఫార్మ్ బయో టెక్నాలజీల్లోని ముఖ్యాంశాలు- వాటి పూర్వాపరాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి బయో టెక్నాలజీ పోషిస్తున్న పాత్రపై అధ్యయనం చేయా. ఉదాహరణకు బీటీ విత్తనాలు, వాటి ఫలితాలు.మొత్తంమీద సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మంచి మార్కులు పొందాలంటే.. అభ్యర్థులు అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగిస్తేనే సాధ్యం. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా అప్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో ముందుకు సాగాలి.
 
 డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్
 అభ్యర్థుల్లోని విశ్లేషణ నైపుణ్యాన్ని, నిర్ణయాత్మక సామర్థ్యాన్ని పరీక్షించే విభాగం.. డేటా ఇంటర్ ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. గణాంకాల రూపంలో, చార్ట్‌ల రూపంలో, గ్రాఫ్‌ల రూపంలో ఇచ్చిన డేటాను విశ్లేషించి పరిష్కారం కనుగొనాల్సి ఉంటుంది. ఇందుకోసం పట్టికలు, బార్ చిత్రాలు, గ్రాఫ్‌లు, పై చిత్రాలు, ఎక్స్-వై చిత్రాలు ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్‌లో పట్టు సాధించాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో భాగంగా అడిగే ప్రశ్నల కోసం నంబర్ సిరీస్, సగటులు, నిష్పత్తులు, లాభ-నష్టాల శాతాల వంటి బేసిక్ అర్థమెటిక్ అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు పని-సమయం, పని-కాలం, దూరం, సింపుల్ ఇంట్రస్ట్, అనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్ అంశాల కోసం కూడా అర్థమెటిక్ సబ్జెక్ట్‌లో నైపుణ్యం పొందాలి. దీనికోసం ఆరు నుంచి పదో తరగతి వరకు మ్యాథమెటిక్స్ పుస్తకాలు చదివితే సరిపోతుంది.
 
 డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్..:
 ఎలాంటి అకడమిక్ పరిజ్ఞానం అవసరం లేకుండా.. సమయస్ఫూర్తి, స్వీయ వివేచనతో సమాధానాలివ్వాల్సిన ప్రశ్నలు ఎదురయ్యే విభాగం డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైనా ఒక సంఘటన/సందర్భం/ సమస్యను పేర్కొని, దానికి సంబంధించి ఒక అధికారిగా ఎలా వ్యవహరిస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అనే తరహా ప్రశ్నలు ఈ విభాగంలో ఉంటాయి. దీనికోసం ప్రత్యేకంగా కసరత్తు చేయాల్సిన అవసరం లేకపోయినా.. వాస్తవ ప్రపంచంలో జరుగుతున్న సమస్యలు - వాటికి అధికారులు తీసుకున్న నిర్ణయాలు - ఫలితాలు వంటి వాటిని విశ్లేషించడం ద్వారా నైపుణ్యం లభిస్తుంది.
 
 ఉపయోగపడే పుస్తకాలు
 సైన్స్ అండ్ టెక్నాలజీ
 ఆరు నుంచి పదో తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు
 యోజన, సైన్స్ స్పెక్ట్రమ్
 
 డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్:
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - ఆర్.ఎస్.అగర్వాల్
 అడ్వాన్స్‌డ్ అప్రోచ్ టు డేటా ఇంటర్‌ప్రిటేషన్- ఆర్.ఎస్.అగర్వాల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement